head constable died
-
ఏవండీ.. ఇంటికి త్వరగా వెళ్లండి..
కొత్తగూడెంటౌన్: ‘ఏవండీ ఇంటికి త్వరగా వెళ్లండి. త్వరగా భోజనం చేయండి. నేను కేటీఆర్ పర్యటన పూర్తికాగానే సాయంత్రం తొందరగా ఇంటికి వస్తాను’ అని చెప్పి వెళ్లిన శ్రీదేవి తిరిగిరాలేదంటూ భర్త రామారావు గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి తిరిగి వస్తుందనుకున్న అమ్మ ఇక రాకపోవడంతో కూతురు, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బందోబస్తు విధులకు వెళ్లి ప్రమాదవశాత్తు డ్రెయినేజీలో పడి మహిళా హెడ్‌కానిస్టేబుల్ పల్లపు శ్రీదేవి(49) మృతి చెందింది. 1995లో పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన ఆమె జిల్లాలోని వివిధ ఠాణాల్లో పనిచేసింది. హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందింది. ఇటీవల వరకు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో పనిచేయగా, 15 రోజుల క్రితమే కొత్తగూడెం వన్‌టౌన్‌లో విధుల్లో చేరింది. ఆమె భర్త రామారావు కూడా ఎస్బీ విభాగంలో కొత్తగూడెంలోనే కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం మంత్రి కేటీఆర్ భద్రాచలం పర్యటన ఉన్న నేపథ్యంలో ఆమెకు బందోబస్తు విధులు కేటాయించారు. ఉదయం ఇంటి నుంచి బయల్దేరేటప్పుడు సమాయానికి భోజనం చేయడంటూ జాగ్రత్తలు చెప్పి వెళ్లింది. మంత్రి పర్యటన రద్దుకాగా ఆమె శ్రీసీతారామ చంద్రస్వామివారిని దర్శించుకుని, అన్నదాన సత్రంలో భోజనం చేసి వస్తోంది. అప్పటికే భారీ వర్షం కురవగా డ్రెయిన్లు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాన కాస్త తెరపి ఇవ్వగా ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తున్న ఆమె మురుగు కాల్వలో పడి కొట్టుకుపోయింది. అనంతరం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టగా మృతదేహం లభించింది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉండగా ఇద్దరికీ వివాహాలు చేశారు. మృతదేహాన్ని న్యూగొల్లగూడెంలో ఇంటికి తీసుకురాగా, ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. వన్‌టౌన్ సీఐ కరుణాకర్, ఎస్సై విజయ, ఇతర సిబ్బంది మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. కలివిడిగా ఉండే శ్రీదేవి మృతి చెందడంతో తోటి సిబ్బంది, స్థానికులు కంటనీరు పెట్టుకున్నారు. శ్రీదేవి భర్త రామారావుది నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి కావడంతో ఆ గ్రామంలో కూడా విషాదం నెలకొంది. కాగా శ్రీదేవి మృతిపట్ల నిర్భయ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, మహిళా న్యాయవాది మల్లెల ఉషారాణి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి భద్రాచలం: మంత్రి కేటీఆర్ పర్యటన బందోబస్తుకు భద్రాచలం వచ్చి ప్రమాదవశాత్తు మరణించిన హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య డిమాండ్ చేశారు. శనివారం ఆయన శ్రీదేవి మరణించిన డ్రెయినేజీలు, స్లూయీస్‌ల ప్రాంతాన్ని పరిశీలించారు. రామాలయం చుట్టపక్కల స్లూయీస్‌లు, డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేదని అన్నారు. ఉద్యోగి మృతి బాధాకరమని, ప్రభుత్వ అలసత్వమే ఇందుకు కారణమని ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం అభివృద్ధికి హామీ ఇచ్చి అమలు చేయని కేసీఆర్, కేటీఆర్ పర్యటనకు వాతావరణంతో పాటు భద్రాద్రి రామయ్య సైతం సహకరించలేదని, ఇప్పటికై నా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సూచించారు. -
విషాదం: పీఎస్‌లో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం
సాక్షి, భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడేం జిల్లాలోని ఇల్లెందు మండలం కాచనపల్లిలో పోలీసు స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్లో తుపాకీ మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ సంతోష్ అక్కడికక్కడే మృతి చెందారు. నైట్‌డ్యూటీలో ఉన్న సంతోష్ శనివారం తెల్లవారుజామున ఆయుధాలను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. సంతోష్ మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలో సంతోష్ మృతదేహన్ని జిల్లా ఏఎస్పీ శ్రీనివాస్ సందర్శించారు. -
కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్ మృతి
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో పోలీసు హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి, మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీలో నివసించే ఈశ్వరయ్య(45) ప్రస్తుతం శంషాబాద్ పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి విధులు పూర్తి చేసుకొని తన వాగన్ఆర్ కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఈశ్వరయ్య వాహనం కూకట్పల్లి ఫోరం మాల్ వంతెనపై ఎదురుగా ఉన్న టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈశ్వరయ్యకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం ఈశ్వరయ్య మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు, కారు -
సీఏఏ రగడ : హెడ్ కానిస్టేబుల్ మృతి
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలతో దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. గోకుల్‌పురి ప్రాంతంలో ఆదివారం జరిగిన రాళ్లదాడిలో తీవ్ర గాయాలైన ఢిల్లీ హెడ్‌కానిస్టేబుల్ రతన్ లాల్ మరణించగా, డీసీపీ షహ్దారా, అమిత్ శర్మలకు గాయాలయ్యాయని పోలీస్ ఉన్నతాధికారి నిర్ధారించారు. రతన్ లాల్ ఢిల్లీ ఎస్పీ కార్యాలయంలో రీడర్ విధులు నిర్వహిస్తున్నాడని ఏసీపీ వెల్లడించారు. పరస్పర రాళ్ల దాడులు, ఘర్షణల్లో 37 మందికి గాయాలయ్యాయి. అల్లరి మూకలు షాపులు, ఇళ్లు, వాహనాలను ధ్వంసం చేశాయి. ఆందోళనకారులు భజన్‌పురాలో పెట్రోల్ పంపు వద్ద నిలిచిన కారును, అగ్నిమాపక యంత్రాన్ని దగ్ధం చేశారు. మరోవైపు దేశ రాజధానిలో సోమవారం సైతం సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. మౌజ్‌పూర్, కర్దాంపురి, చాంద్‌బాగ్, దయాళ్‌పూర్ ప్రాంతాల్లో రాళ్ల దాడులతో పాటు ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. కర్ధాంపురిలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. చదవండి : సీఏఏ సెగ: మెట్రోకు బ్రేక్ -
అయ్యో మల్లికార్జునా!.. ఎంత పనిచేశావయ్యా!
సాక్షి, కాజీపేట: దైవదర్శనం చేసుకుని... మొక్కలు చెల్లించుకున్నారు.. కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ ఇళ్లకు బయలుదేరారు.. మధ్యలో కాసేపు విరామం తీసుకుని భోజనం పూర్తిచేశా రు.. ఆ తర్వాత వాహనంలో బయలుదేరిన వారికి అదే చివరి ప్రయాణం అవుతుందని తెలియదు.. ఒక్కసారి మృత్యువు రూపంలో దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న పగడాల దుర్గాప్రసాద్‌తో పాటు ఆయన భార్య, చిన్నకుమారుడు, అక్కా, బావలు కన్నుమూశారు.. రెప్పపాటులో జరిగిన ఈ ఘోరంతో ఆ కుటుంబంలో దుర్గాప్రసాద్ తల్లి, మరో కుమారుడు మాత్రమే మిగలడం విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ వద్ద జరిగిన ఈ ఘటనలో మృతి చెందిన దుర్గాప్రసాద్ కాజీపేట వాసి కాగా.. మట్టెవాడ పోలీసుస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రహమత్‌నగర్‌కు చెందిన దుర్గాప్రసాద్ మట్టెవాడ పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.. శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు భార్య, కుమారుడు, అక్కాబావలతో కలిసి ఆదివారం వెళ్లాడు.. దైవదర్శనం అనంతరం అక్కడే బస చేసిన వారు సోమవారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు.. అయితే, అదే చివరి ప్రయాణమవుతుందని వారికి తెలియదు.. మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా అమనగల్లు వద్ద భోజనం చేసి వస్తుండగా ఒక్కసారిగా రోడ్డుపైకి లారీ దూసుకొచ్చింది. ఆ లారీని వీరు వెళ్తున్న ఇన్నోవా వేగంగా ఢీకొట్టింది.. ఈ ఘటనలో దుర్గాప్రసాద్, ఆయన భార్య, విజయలక్ష్మి, కుమారుడు శంతన్కుమార్తో పాటు అక్కాబావలు పద్మ, రాజు సైతం మృతి చెందారు.. వీరు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జు కాగా.. మృతదేహాలు అందులో చిక్కుకుపోయాయి.. ప్రమాదంలో దుర్గాప్రసాద్, ఆయన సతీమణి, కుమారుడు మృతి చెందగా అనారోగ్యంతో ఇక్కడే ఉండిపోయిన తల్లి, ఆస్ట్రేలియాలో ఉంటున్న మరో కుమారుడు శ్రయాజ్ మాత్రం కుటుంబంలో మిగిలినట్లయింది.. విషయం తెలియగానే ఆయన నివాసముండే రహమత్నగర్తో పాటు పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లన్న దర్శనం కోసం.. కాజీపేట 52వ డివిజన్ రహమత్‌నగర్ కాలనీకి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పగడాల దుర్గాప్రసాద్ (50) తన భార్య విజయలక్ష్మి(46), చిన్నకొడుకు శంతన్‌కుమార్(25), హైదరాబాద్ కు చెందిన బావ రాజు, అక్క పద్మతో కలిసి ఆదివారం ఉదయం కర్నూల్ జిల్లా శ్రీశైలంలో మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్లారు. రాత్రి అక్కడే బసచేసిన వారు దైవదర్శనం అనంతరం సోమవారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఓ హోటల్లో భోజ నం చేశారు. ఈమేరకు రంగారెడ్డి జిల్లా ఆమనగ ల్లు మండలం మేడిగడ్డతండా గేటు వద్ద హైదరా బాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎదురుగా వస్తున్న లారీ కుడివైపున ఉన్న శ్రీలక్ష్మీ గణపతి వే బ్రిడ్జి వద్దకు ఒక్కసారిగా మళ్లింది. దీంతో వేగంగా వస్తున్న ఇన్నోవా లారీ ముందు భాగంలోకి దూసుకు పోయింది. ఈ ఘటనలో దుర్గాప్రసాద్, శంతన్, రాజు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మి, పద్మజ ఆమనగల్లు ప్రభుత్వాçస్పత్రికి తరలించగా.. చికిత్స ప్రారం భించేలోపే కన్నుమూశారు. ఇన్నోవా డ్రైవర్ ఖలీల్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. పోలీసు అధికారుల పర్యవేక్షణ ఆమన్‌గల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుర్గప్రసాద్ కుటుంబ సభ్యుల మృతదేహాలకు త్వరగా పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కాజీపేటకు తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లను సీపీ డాక్టర్ విశ్వనా«థ్ రవీందర్ పర్యవేక్షిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉన్నతాధికారులతో చర్చించి సోమవారం రాత్రిలోగా పోస్టుమార్టం పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఈ మేరకు మృతదేహాలు మంగళవారం తెల్లవారుజాము వరకు కాజీపేటకు చేరుకుంటాయని తెలిసింది. కాజీపేట సీఐ అజయ్‌తోపాటు పోలీసు సిబ్బంది మృతుడి ఇంటికి చేరుకుని అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. దుర్గాప్రసాద్ పెద్దకుమారుడు శ్రయా జ్ ఆస్ట్రేలియా నుంచి బయలుదేరగా మంగళవారం మధ్యాహ్నంలోగా హైదరాబాద్ చేరుకుంటాడని తెలిసింది. ఆయన కాజీపేటకు రాగానే పోలీసులాంఛనలతో అంత్యక్రియలు జరగనున్నాయి. కేసుల ఛేదనలో దిట్ట ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు పోలీసు స్టేషన్లలో పనిచేసిన దుర్గాప్రసాద్‌కు ఉన్నతాధికారుల వద్ద మంచి పేరు ఉంది. ఎక్కువగా క్రైం విభాగంలో పనిచేసిన ఆయన కేసుల ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించేవాడని చెబుతున్నారు. ఈ మేరకు ఆయన పనితీరును మెచ్చిన అధికారులు ఎక్కువగా నగరం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇచ్చేవారని తెలిసింది ఇదీ కుటుంబ నేపథ్యం రైల్వేలో లోకో ఇన్స్పెక్టర్గా పనిచేసే పుల్లయ్య 1971లో రహమత్‌నగర్‌లో సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు. పుల్లయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఆమన్‌గల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూతురు పద్మ, అల్లుడు రాజు, కొడుకు దుర్గాప్రసాద్, కోడలు విజయలక్ష్మి, మనవడు శంతన్‌కుమార్ మృతి చెందారు. కొద్దికాలం క్రితం పుల్లయ్య మరణించడంతో తల్లి పూలమ్మ వృద్ధాప్యంతో బాధపడుతూ చికిత్స పొందుతోంది. ఇక దుర్గాప్రసాద్ కుమారుడు శంతన్‌కుమార్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా దుర్గాప్రసాద్ మట్టెవాడ పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. పెద్దకుమారుడు శ్రయాజ్ ఆస్ట్రేలియాలో ఎమ్మెస్సీ పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్నట్లుగా సమాచారం. దైవభక్తి ఎక్కువ దుర్గా ప్రసాద్‌కు మొదటి నుంచి దైవభక్తి ఎక్కువ. 2018లో పదోన్నతి వచ్చిన తరక్వాత పలు దేవాలయాలకు వస్తానని మొక్కుకున్నట్లు సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఇటీవలే వేములవాడ, కొండగట్లు ఆలయాలను కుటుంబ సభ్యులతో సందర్శించుకోని మొక్కులు తీర్చుకున్నట్లు తెలిసింది. శనివారం విధులు నిర్వర్తించిన దుర్గాప్రసాద్ ఆది, సోమవారం రెండు రోజుల పాటు సెలవు పెట్టి శ్రీశైలం వెళ్లాడు. అక్కడ దైవ దర్శనం చేసుకుని వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించడం అందరినీ కలిచివేసింది. అధికారుల సంతాపం వరంగల్ క్రైం/రామన్నపేట: హెడ్ కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ మృతి పట్ల వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్, సెంట్రల్ జోన్ డీసీపీ నరసింహ, ఏసీపీ నర్సయ్య, మట్టెవాడ ఇన్స్పెక్టర్ జీవన్‌రెడ్డి, ఎస్సైలు వెంకటేశ్వర్లు, దీపక్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్ తదితరులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి ప్రకటించి సంతాపం తెలిపారు. ఉద్యోగుల దిగ్భ్రాంతి వరంగల్ క్రైం: మట్టెవాడ పోలీసుస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న దుర్గాప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలియగానే సహచర ఉద్యోగులు, పోలీసు అధికారులు తీవ్ర దిగ్భ్రాం తికి గురయ్యారు. 1990 బ్యాచ్‌కి చెందిన దుర్గాప్రసాద్ మొగుళ్లపల్లి, మడికొండ, స్టేషన్ఘున్పూర్, సుబేదారి, మట్టెవాడ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. 2014 డిసెంబర్లో జరిగిన బదిలీల్లో మట్టెవాడ వెళ్లారు. అక్కడే ఆయనకు 2018 ఫిబ్రవరిలో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి వచ్చింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లి తీర్ధయాత్రలకు వెళ్లిన తన కొడుకు, కుమార్తెల కుటుంబాలు కన్నుమూశాయన్న విషయం తెలుసుకున్న దుర్గప్రసాద్ తల్లి పూలమ్మ బోరున విలపిస్తున్నారు. ఆమె ఒక్కగానొక్క కుమారుడు, పెద్దకూతురు, అల్లుడితో పాటు భార్య, కోడలు ప్రమాదంలో చనిపోయారని ఇంటి పక్కల వారు చెప్పడంతో తల్లి ఆచేతనంగా మారిపోయింది. మాట రాకుండా మంచంలోనే పడిపోవడం చూపరులను కలిచివేసింది. ఉన్నతాధికారుల పరిశీలన ఆమనగల్లు:ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఆమనగల్లు ఎస్ఐ మల్లీశ్వర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇన్నోవా వాహనంలో చిక్కుకున్న మతదేహాలను, గాయపడిన వారిని బయటకు తీశారు. ఇక ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఘటన స్థలాన్ని సోమవారం సాయంత్రం శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ ప్రసాద్‌రావ్, షాద్‌నగర్ ట్రాఫిక్ సీఐ సునీల్, ఆమనగల్లు సీఐ నర్సింహారెడ్డి పరిశీలించారు. అందరితో కలివిడిగా.. రోడ్డు ప్రమాదంలో మరణించిన దుర్గాప్రసాద్ కుటుంబం రహమత్‌నగర్‌లో అందరితో కలివిడిగా ఉండేవారు. పండుగలు, పబ్బలకు హాజరవుతూ చిన్నాపెద్ద తేడా లేకుండా కలిసిపోయే వారు. వినాయక చవితి, శ్రీరామనవమి, ఉగాది వేడుకలను కాలనీవాసులతో కలిసి ఘనంగా రుపుకోవడానికి ప్రాధాన్యతనివ్వడమే కాకుండా నిర్వహణకు చేయూతనిచ్చేవారు. సహచర మిత్రుల్లో ఎవరికి కష్టం వచ్చినా ముందుండి పరిష్కరించేవాడనే పేరుంది. -
సీఎం పర్యటన బందోబస్తు.. కానిస్టేబుల్ మృతి
సాక్షి, భూపాలపల్లి : రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె.చంద్రశేఖరరావు తన తొలి అధికార పర్యటనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. దానిలో భాగంగానే జయశంకర్ భూపాలపల్లిలో కేసీఆర్ సోమవారం పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఓ విషాదం చోటుసుకుంది. తీవ్ర అస్వస్థతకు గురైన ఓ పోలీసు ప్రాణాలు విడిచాడు. వివరాలు.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కన్నెపల్లి పంప్‌హౌజ్ వద్ద బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వజ్జ నారాయణ (ఏ ర్ హెచ్ సి 521)కు గుండెపోటు వచ్చింది. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జయశంకర్ జిల్లా ఎస్పీ భాస్కరన్ కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించారు. (కన్నెపల్లి పంపుహౌస్ పనులను పరిశీలించిన కేసీఆర్) -
సెక్రటేరియట్లో సర్వీస్ రివాల్వర్‌తో..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సెక్రటేరియట్లో శుక్రవారం ఉదయం డ్యూటీలో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఢిల్లీ సెక్రటేరియట్‌లోని వీఐపీ పార్కింగ్ ప్రదేశంలో ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని 35 సంవత్సరాల హెడ్ కానిస్టేబుల్ సొహన్వీర్గా గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడిన ప్రదేశంలో సూసైడ్ నోట్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సమస్యలతోనే హెడ్ కానిస్టేబుల్ ఈ తీవ్ర చర్యకు ఒడిగట్టినట్టు ప్రాధమికంగా వెల్లడైందన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.విధి నిర్వహణలో ఒత్తిళ్లతో ఇటీవల పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు పలు చోట్ల చోటుచేసుకుంటున్నాయి. -
రెండు కార్లు ఢీ: అయ్యప్ప భక్తులు సహా నలుగురు మృతి
సేలం (తమిళనాడు): తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నామక్కల్-తిరుచెంగోడు జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెరుదురుగా ఢీకొన్న సంఘటనలో ఒక హెడ్‌కానిస్టేబుల్, ముగ్గురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉంది. నామక్కల్ జిల్లా తిరుచెంగోడు సమీపంలోని పిలిక్కల్ పాళయం ప్రాంతానికి చెందిన సెంథిల్ కుమార్ (43) మద్యం నిషేధ విభాగంలో హెడ్ కానిస్టెబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తన కారు (షిఫ్ట్ డిజైర్)లో తిరుచెంగోడుకు బయలుదేరారు. ఈ క్రమంలో పనక్కాడు వద్ద ఎదురుగా వస్తున్న మారుతీ కారు అదుపుతప్పి ఈయన కారును ఢీకొంది. దీంతో సెంథిల్‌కుమార్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కారణమైన కారులో శబరిమల వెళుతున్న అయ్యప్ప భక్తులు కుమారపాళ్యంకు చెందిన మురుగన్ (45), అతని స్నేహితుడు (శబరిమలై వెళ్లేందుకు దుబాయ్ నుంచి వచారు) శరవణన్ (45)లు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. వీరి కారును నడిపిన డ్రైవర్ వెంకటేశన్ (45) తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. అదే కారులో ఉన్న వెంకటేశన్ కుమారుడు హర్షిత్ (12), దుబాయ్‌లో నాలుగో తరగతి చదువుతున్న శరవణన్ కుమార్తె ప్రియదర్శిని (9) తీవ్రంగా గాయపడ్డారు. వారిని తిరుచెంగోడు రూరల్ పోలీసులు ఈరోడ్ ఆస్పత్రికి తరలించారు. -
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
మట్టెవా(వరంగల్ జిల్లా): ఆర్ఫీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రాజు(52) గుండెపోటుతో మృతిచెందాడు. మహారాష్ట్రలోని బల్లార్ష నుంచి స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం రాత్రి వస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. రైల్వే అధికారులు పెద్దపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. హెడ్ కానిస్టేబుల్ రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా కేంద్రంలోని పెరకవాడ. రాజు మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
పోలీసు కాల్పుల్లో మరో పోలీసు మృతి
మద్యం మత్తులో ఓ హెడ్‌కానిస్టేబుల్ మరో హెడ్‌కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపాడు. ఖమ్మం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా ధర్మపేట బేస్‌క్యాంప్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ధర్మపేట బేస్‌క్యాంప్‌లోని పోలీసులంతా హోలీ వేడుకలు చేసుకుని మద్యం తాగారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ ఆర్ముడ్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ రమేశ్‌ఛత్రీ మరో హెడ్‌కానిస్టేబుల్ అయోధ్యప్రసాద్ దేశ్‌ముఖ్ (45) మధ్య ఘర్షణ తలెత్తింది. తీవ్ర కోపోద్రిక్తుడైన రమేశ్‌ఛత్రీ.. ప్రసాద్‌పై తుపాకీతో కాల్పులు జరపగా అతడు అక్కడికక్కడే మృతిచెందాడని పోలీస్‌వర్గాలు తెలిపాయి.