సేలం (తమిళనాడు): తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నామక్కల్-తిరుచెంగోడు జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెరుదురుగా ఢీకొన్న సంఘటనలో ఒక హెడ్‌కానిస్టేబుల్, ముగ్గురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉంది. నామక్కల్ జిల్లా తిరుచెంగోడు సమీపంలోని పిలిక్కల్ పాళయం ప్రాంతానికి చెందిన సెంథిల్ కుమార్ (43) మద్యం నిషేధ విభాగంలో హెడ్ కానిస్టెబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తన కారు (షిఫ్ట్ డిజైర్)లో తిరుచెంగోడుకు బయలుదేరారు. ఈ క్రమంలో పనక్కాడు వద్ద ఎదురుగా వస్తున్న మారుతీ కారు అదుపుతప్పి ఈయన కారును ఢీకొంది. దీంతో సెంథిల్‌కుమార్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కారణమైన కారులో శబరిమల వెళుతున్న అయ్యప్ప భక్తులు కుమారపాళ్యంకు చెందిన మురుగన్ (45), అతని స్నేహితుడు (శబరిమలై వెళ్లేందుకు దుబాయ్ నుంచి వచారు) శరవణన్ (45)లు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. వీరి కారును నడిపిన డ్రైవర్ వెంకటేశన్ (45) తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. అదే కారులో ఉన్న వెంకటేశన్ కుమారుడు హర్షిత్ (12), దుబాయ్‌లో నాలుగో తరగతి చదువుతున్న శరవణన్ కుమార్తె ప్రియదర్శిని (9) తీవ్రంగా గాయపడ్డారు. వారిని తిరుచెంగోడు రూరల్ పోలీసులు ఈరోడ్ ఆస్పత్రికి తరలించారు.