చెన్నై: తమిళనాడు తేని జిల్లా కుములి పర్వత ప్రాంత మార్గంలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. కేరళ శబరిమల దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న ఓ కారు అదుపుతప్పి 50 అడుగుల లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 8 మంది భక్తులు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా కలెక్టర్ కేవీ మురళీధరన్ తెలిపారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఇద్దరిలో ఏడేళ్ల బాలుడున్నాడు.
తేని జిల్లా షన్ముగసుందరాపురం గ్రామానికి చెందిన 10 మంది రెండు రోజుల క్రితం శబరిమల వెళ్లారు. దర్శనం చేసుకుని ఇంటికి తిరిగివస్తుండగా ఘాట్‌రోడ్డులో కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డ వెంట ఉన్న నీటి పైప్‌లైన్‌ను ఢీకొట్టి లోయలోకి దూసుకెళ్లింది. రాత్రి 11 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
సమాచారం అందిన వెంటనే తేని, కేరళ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే చీకటి, చలి కారణంగా సహాయక చర్యలకు ఆలస్యమైంది. చివరకు క్రేన్ల సాయంతో కారును లోయలోనుంచి బయటకు తీశాయి. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment