
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలతో దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. గోకుల్‌పురి ప్రాంతంలో ఆదివారం జరిగిన రాళ్లదాడిలో తీవ్ర గాయాలైన ఢిల్లీ హెడ్‌కానిస్టేబుల్ రతన్ లాల్ మరణించగా, డీసీపీ షహ్దారా, అమిత్ శర్మలకు గాయాలయ్యాయని పోలీస్ ఉన్నతాధికారి నిర్ధారించారు. రతన్ లాల్ ఢిల్లీ ఎస్పీ కార్యాలయంలో రీడర్ విధులు నిర్వహిస్తున్నాడని ఏసీపీ వెల్లడించారు. పరస్పర రాళ్ల దాడులు, ఘర్షణల్లో 37 మందికి గాయాలయ్యాయి. అల్లరి మూకలు షాపులు, ఇళ్లు, వాహనాలను ధ్వంసం చేశాయి.
ఆందోళనకారులు భజన్‌పురాలో పెట్రోల్ పంపు వద్ద నిలిచిన కారును, అగ్నిమాపక యంత్రాన్ని దగ్ధం చేశారు. మరోవైపు దేశ రాజధానిలో సోమవారం సైతం సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. మౌజ్‌పూర్, కర్దాంపురి, చాంద్‌బాగ్, దయాళ్‌పూర్ ప్రాంతాల్లో రాళ్ల దాడులతో పాటు ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. కర్ధాంపురిలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు.
Comments
Please login to add a commentAdd a comment