కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సవాల్
మలప్పురం(కేరళ): స్వాతంత్రోద్యమ వేళ దేశాన్ని ఒకతాటి మీదకు తెచి్చన జాతీయస్థాయి నినాదాలు పురుడుపోసుకోవడంలో ముస్లింల పాత్ర కూడా ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. సంఘ్ పరివార్ శ్రేణుల్లో ఎప్పుడూ ప్రతిధ్వనించే రెండు నినాదాలను వాస్తవానికి ముస్లింలు తొలిసారిగా ఎలుగెత్తి చాటారని విజయన్ అన్నారు. వివాదాస్పద పౌరసత్వ(సవరణ)చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) నేతృత్వంలో నాలుగురోజులుగా జరుగుతున్న ర్యాలీలో విజయన్ పాల్గొని ప్రసంగించారు.
ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే మలప్పురం జిల్లాలోనే ఈ సభ జరగడం గమనార్హం. ‘‘ముస్లిం పాలకులు, సాంస్కృతిక సారథులు, ముస్లింలు ఉన్నతాధికారులు ఎందరో దేశ చరిత్ర, స్వతంత్ర సంగ్రామంలో పాలుపంచుకున్నారు. వీటిపై ఏమాత్రం అవగాహన లేని సంఘ పరివార్ నేతలు ఇక్కడికొచ్చి భారత్ మాతాకీ జై అని నినదించాలని డిమాండ్లుచేస్తున్నారు. వాస్తవానికి భారత్ మాతాకీ జై, జైహింద్ అని నినదించింది ముస్లింలని సంఘ్ పరివార్‌కు తెలీదనుకుంటా.
తెలిస్తే ఆ నినాదాలను ఇవ్వడం సంఘ్ పరివార్ మానుకుంటుందా? అజీముల్లా ఖాన్ భారత్ మాతాకీ జై అంటే, అబిద్ హసన్ అనే భారత దూత ‘జై హింద్’ అని నినదించారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తనయుడు దారా షికోహ్ సంస్కృతంలో ఉన్న 50 ఉపనిషత్తులను పర్షియన్‌లోకి తర్జుమాచేశారు. అలా భారతీయ రచనలు విశ్వవ్యాప్తమయ్యేలా తన వంతు కృషిచేశారు. ఇవేం తెలియని సంఘ్ నేతలు భారత్‌లోని ముస్లింలను పాకిస్తాన్‌కు పంపేయాలని మొండిపట్టు పడుతుంటారు.
సీఏఏతో ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని మోదీ సర్కార్ కుట్ర పన్నింది. వీటిని కేరళ పౌరులు సహించరు’’ అన్నారు. సీఏఏ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేయంపై కాంగ్రెస్‌కు పెద్దగా ఆసక్తి లేదని ఆరోపించారు. హిట్లర్ నియంతృత్వ పోకడల నుంచే ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలు పురుడుపోసుకున్నాయని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు దేశ అంతర్గత శత్రువులని ఆర్‌ఆర్‌ఎస్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన ఎంఎస్ గోల్వాల్కర్ గతంలో ఒక పుస్తకంలో వ్యాఖ్యానించారని విజయన్ గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment