Sangh Parivar
-
విజయదశమి రోజున ప్రారంభమై.. విజయదశమి నాడే 100వ ఏట ప్రవేశం!
RSS: హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా, భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను రక్షించటం ఆశయంగా డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ (డాక్టర్ జీ) 1925లో విజయ దశమి రోజున రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్)ను నాగపూర్‌లో స్థాపించారు. ఆ సంస్థ ఈ విజయదశమి రోజున 100వ ఏట ప్రవేశిస్తోంది. ఎటువంటి సభ్యత్వ నమోదు, ఐడెంటిటీ కార్డులు వంటివి లేకుండా ఒక సంస్థను వందేళ్లు దిగ్విజయంగా నడపడం మాటలు కాదు. దాదాపు 80 లక్షల మంది స్వయం సేవకులు కలిగిన 45 లక్షల సంఘస్థాన్ శాఖలు నడుపుతూ ఎటువంటి అంతర్గత కలహాలకూ తావు లేకుండా కొనసాగుతోంది ఆరెస్సెస్.నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్ హెడ్గే వార్ని 1921లో విదర్భలోని అకోలా జైలులో ఒక సంవత్సరం రోజులు నిర్బంధించారు. నాడు జైలులోని దేశభక్తుల మధ్య జరిగిన చర్చోపచర్చలలో డాక్టర్ హెడ్గేవార్ మదిలో పురుడు పోసుకున్నదే ఆరెస్సెస్. 1925 నుంచి 1940 వరకు డాక్టర్ హెడ్గేవార్, 1940 నుండి 1973 వరకు మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ), 1973 నుంచి 1993 వరకు మధుకర్ దత్తాత్రేయ దేవరస్లు సర్ సంఘ చాలకులుగా పనిచేసి ఆర్ఎస్ఎస్ను ఒక మహా వృక్షం మాదిరిగా యావత్ భారతదేశం అంతటా విస్తరించడానికి తమ జీవితాలను ధారపోశారు. ఆరెస్సెస్ సంఘ శాఖలలో మొదటగా ధ్వజారోహణము, ఆసనములు, యోగ, క్రీడలు, ఆటలు, కర్రసాము, సమాజ హిత సూచనలు, భారతీయ చరిత్ర–సంస్కృతి–సంప్రదాయాలను తెలియజేసే ప్రసంగాలు, ఒకరితో ఒకరు సత్సంబంధాలు పెంచుకోవడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. చివరగా ప్రార్థన వంటి విషయాలు నిత్యం జరుగుతూ ఉంటాయి.సమాజంలోని రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, న్యాయవాదులు, డాక్టర్లు, వెనుకబడిన, అణగారిన వర్గాలకు ప్రాతి నిధ్యం వహించే విధంగా భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహాసంఘ్, ఆరోగ్య భారతి, విద్యా భారతి, స్వదేశీ జాగరణ మంచ్, వనవాసి కళ్యాణ ఆశ్రమం, సంస్కార భారతి, భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, రాష్ట్రీయ సేవికా సమితి వంటి అనుబంధ సంస్థలను కలిపి ‘సంఘ్ పరివార్’గా భావిస్తారు. ఈ సంస్థలు అన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఆయా రంగాలలో అవి పని చేసుకుని పోతున్నప్పటికీ అవసరమైన సందర్భాలలో ఆర్ఎస్ ఎస్ నుంచి సలహాలు, సూచనలు ప్రేరణ అందుతాయి.చదవండి: చేగువేరా టు సనాతని హిందూ!1947– 48 మధ్య దేశ విభజన సమయంలో, 1962లో భారత్ – చైనా యుద్ధ సమయంలో, 1972లో భారత్ – పాకిస్తాన్ యుద్ధ సమయంలో, భూకంపం, తుపానులు, కరోనా వంటి విపత్తులు, రైలు ప్రమాదాలు, కరవు కాట కాలు, కరోనా వంటి విపత్తుల సమయంలో ఆరెస్సెస్ చేపట్టిన సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. భారత్ – చైనా యుద్ధ సమయంలో ఆరెస్సెస్ సేవలను గుర్తించిన నాటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ 1963లో రిపబ్లిక్ డే కవాతులో ఆరెస్సెస్‌ను పాల్గొనమని ఆహ్వానించడం గమనార్హం. దాదాపు 4 వేల మంది ఆరెస్సెస్ ప్రచారకులుగా (పూర్తి సమయ కార్యకర్తలుగా) కుటుంబ బంధాలకు దూరంగా దేశ, విదేశాల్లో పనిచేస్తూ తమ త్యాగ నిరతిని చాటుతున్నారు.– ఆచార్య వైవి రామిరెడ్డిశ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి (నేడు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం) -
ఆ నినాదాలను త్యజించే దమ్ము సంఘ్ పరివార్‌కు ఉందా?
మలప్పురం(కేరళ): స్వాతంత్రోద్యమ వేళ దేశాన్ని ఒకతాటి మీదకు తెచి్చన జాతీయస్థాయి నినాదాలు పురుడుపోసుకోవడంలో ముస్లింల పాత్ర కూడా ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. సంఘ్ పరివార్ శ్రేణుల్లో ఎప్పుడూ ప్రతిధ్వనించే రెండు నినాదాలను వాస్తవానికి ముస్లింలు తొలిసారిగా ఎలుగెత్తి చాటారని విజయన్ అన్నారు. వివాదాస్పద పౌరసత్వ(సవరణ)చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) నేతృత్వంలో నాలుగురోజులుగా జరుగుతున్న ర్యాలీలో విజయన్ పాల్గొని ప్రసంగించారు. ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే మలప్పురం జిల్లాలోనే ఈ సభ జరగడం గమనార్హం. ‘‘ముస్లిం పాలకులు, సాంస్కృతిక సారథులు, ముస్లింలు ఉన్నతాధికారులు ఎందరో దేశ చరిత్ర, స్వతంత్ర సంగ్రామంలో పాలుపంచుకున్నారు. వీటిపై ఏమాత్రం అవగాహన లేని సంఘ పరివార్ నేతలు ఇక్కడికొచ్చి భారత్ మాతాకీ జై అని నినదించాలని డిమాండ్లుచేస్తున్నారు. వాస్తవానికి భారత్ మాతాకీ జై, జైహింద్ అని నినదించింది ముస్లింలని సంఘ్ పరివార్‌కు తెలీదనుకుంటా. తెలిస్తే ఆ నినాదాలను ఇవ్వడం సంఘ్ పరివార్ మానుకుంటుందా? అజీముల్లా ఖాన్ భారత్ మాతాకీ జై అంటే, అబిద్ హసన్ అనే భారత దూత ‘జై హింద్’ అని నినదించారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తనయుడు దారా షికోహ్ సంస్కృతంలో ఉన్న 50 ఉపనిషత్తులను పర్షియన్లోకి తర్జుమాచేశారు. అలా భారతీయ రచనలు విశ్వవ్యాప్తమయ్యేలా తన వంతు కృషిచేశారు. ఇవేం తెలియని సంఘ్ నేతలు భారత్‌లోని ముస్లింలను పాకిస్తాన్‌కు పంపేయాలని మొండిపట్టు పడుతుంటారు. సీఏఏతో ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని మోదీ సర్కార్ కుట్ర పన్నింది. వీటిని కేరళ పౌరులు సహించరు’’ అన్నారు. సీఏఏ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేయంపై కాంగ్రెస్‌కు పెద్దగా ఆసక్తి లేదని ఆరోపించారు. హిట్లర్ నియంతృత్వ పోకడల నుంచే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు పురుడుపోసుకున్నాయని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు దేశ అంతర్గత శత్రువులని ఆర్ఆర్ఎస్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన ఎంఎస్ గోల్వాల్కర్ గతంలో ఒక పుస్తకంలో వ్యాఖ్యానించారని విజయన్ గుర్తుచేశారు. -
TS: సంఘ్ పెద్దలతో బీజేపీ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంతో.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఎన్నికల సమన్వయంపై ఆ పార్టీ నేతలు సంఘ్ పెద్దలతో మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికల సహ ఇంఛార్జ్ సునీల్ బన్సల్‌తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కే.లక్ష్మణ్, బండి సంజయ్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో సంఘ్ పరివార్ కీలకంగా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలోనే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీపరంగా వెంటనే చేయాల్సిన పనులేంటో ఈ సందర్భంగా సంఘ్ పెద్దలు తెలంగాణ బీజేపీ నేతలకు సూచించారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. -
ఈ వైఫల్యంలో పరివార్ బాధ్యత లేదా?
కరోనా మహమ్మారి తొలిదశలో వైరస్ వ్యాప్తికి.. ఢిల్లీలో మతపరమైన కార్యక్రమానికి హాజరైన తబ్లిగి జమాత్ ముస్లిం గ్రూప్ కారణమని ఆరెస్సెస్–బీజేపీ నాయకత్వం ఆరోపించింది. అది నిజమే అయితే, ఈ ఏడు వైరస్ వ్యాప్తికి ఆరెస్సెస్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది. ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ముందస్తుగా నిర్వహించిన కుంభమేళా కార్యక్రమంలో ఆరెస్సెస్ పాత్ర లేదా? లక్షలాది ప్రజలు హాజరైన కుంభమేళా నుంచి వైరస్ దేశంలోని గ్రామాలన్నింటికీ వ్యాపించిన ఘటనకు ఎవరు బాధ్యత వహించాలి? కనీవినీ ఎరుగని ఈ విధ్వంసంలో తమ పాత్ర ఎంత అనే విషయంలో ఇప్పటికైనా సంఘ్ పరివార్, మోహన్ భాగవత్ నోరు విప్పాల్సి ఉంది. తప్పించుకు తిరగడం అనేది జాతీయవాదం కానే కాదు. భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న కోవిడ్– 19 విషాదానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రాథమికంగా బాధ్యత వహించాలా? కోవిడ్–19 తొలి వేవ్ తర్వాత భారత ప్రభుత్వం, పాలనా యంత్రాంగం, భారత ప్రజలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని స్వయంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అదినేత మోహన్ భాగవత్ మే 15న ప్రకటించారు. అంతే.. భారతదేశంలో కరోనా మృతుల సునామీ విరుచుకుపడటానికి బాధ్యులైనవారిలో ప్రధాని మోదీని కూడా బీజేపీ మాతృసంస్థ చేర్చివేసిందని ప్రతిపక్షం, మీడియా వెంటనే విమర్శలు మొదలెట్టేశాయి. కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఆరెస్సెస్ బాధ్యత ఏమిటి? తనకు రాజకీయాలతో సంబంధం లేనే లేదని ఆరెస్సెస్ చెప్పుకుంటున్నప్పటికీ బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఆరెస్సెస్ చేయగలిగినంతా చేసింది. సరిహద్దుల్లోని భారత శత్రువులతో పోరాడటానికి కొద్ది రోజుల వ్యవధిలోనే తమ సంస్థ సిద్ధంగా ఉంటుందంటూ గతంలో మోహన్ భాగవత్ సంచలన ప్రకటన చేశారు. కానీ ఇంత శక్తివంతమైన సంస్థ కూడా ప్రస్తుతం నెలకొన్న వైద్యపరమైన సంక్షోభాన్ని, దేశవ్యాప్త కల్లోలాన్ని ఎందుకు పసిగట్టలేకపోయింది? బీజేపీని, ఆ పార్టీ ప్రధాని మోదీని తగు చర్యలు చేపట్టాల్సిందిగా ఆరెస్సెస్ ఎందుకు ఆదేశించలేకపోయింది? ప్రధాని మోదీ దశాబ్దాలపాటు రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్తగా గడిపారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2002లో మారణకాండ చోటు చేసుకున్న తర్వాత హిందువులు బాధితులవుతున్నారనే భావనను బలోపేతం చేసే అవకాశాన్ని ఆరెస్సెస్, మోదీ సమర్థవంతంగా అందిపుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మోదీకి ప్రమోషన్ లభించి న్యూఢిల్లీకి తరలివెళ్లారు. ‘నేను నిన్ను ఉపయోగించుకుంటాను, నువ్వు నన్ను ఉపయోగించుకో’ అనే భావజాలాన్ని ఆరెస్సెస్, మోదీ పరస్పరం పంచుకున్నారు. వీరిద్దరి ఉమ్మడి శత్రువు అయిన ముస్లింలు స్థిరంగా ఉంటూండగానే, వీరిద్దరూ పరస్పరం వాడేసుకున్నారు. అదే సమయంలో భారత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే ఎజెండా వీరిద్దరికీ లేదు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం విషయంలో కానీ, మానవ సమానత్వంలో కానీ వీరికి ఏమాత్రం విశ్వాసం లేదు. దానికి మించి ప్రజాస్వామ్య మూలసూత్రాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను వీరు ఎన్నడూ విశ్వసించలేదు. 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ ఆవిర్భవించిన తర్వాత ఆ సంస్థకు ఆధిపత్యం వహించిన సర్ సంచాలక్లలోకెల్లా మోహన్ భాగవత్ అత్యంత శక్తివంతమైనవారు అన్నది స్పష్టమే. భారత ప్రభుత్వంపై, పౌర సమాజంపై ఇంతటి ప్రభావం చూపగలుగుతున్న వారిని మునుపెన్నడూ చూసి ఎరుగం. ప్రత్యేకించి హిందూ పౌర సమాజంపై మోహన్ భాగవత్ వేసిన ప్రభావం అంతాఇంతా కాదు. ఇది ఎలా సాధ్యమయిందంటే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ గెలవడానికి ముందు, ఆరెస్సెస్, బీజేపీలు ఢిల్లీపై కానీ, దేశంలోని చాలా రాష్ట్రాల్లో కానీ ఎన్నడూ పట్టు సాధించిన పాపాన పోలేదు. చివరకు 1999–2004 సంవత్సరాల మధ్య నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కూడా ఢిల్లీలో, బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రభుత్వంపై ఆ పార్టీకి పరిమితమైన పట్టు మాత్రమే ఉండేది. అప్పట్లో బీజేపీ నియంత్రణలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఉండేవి. దీని పర్యవసానంగానే 2000 సంవత్సరం నుంచి ఆరెస్సెస్ చీఫ్‌గా ఉండిన కేఎస్ సుదర్శన్ నేటి మోహన్ భాగవత్ కంటే చాలా తక్కువ పలుకుబడి కలిగి ఉండేవారు. కరోనా మహమ్మారి తొలిదశలో అంటే 2020 మార్చిలో, కరోనా వ్యాప్తి చెందడానికి.. ఢిల్లీలో అంతర్జాతీయ మతపరమైన కార్యక్రమంలో భాగంగా హాజరైన తబ్లిగి జమాత్ ముస్లిం గ్రూప్ కారణమనే భావనను ఆరెస్సెస్–బీజేపీ బలంగా ముందుకు తీసుకొచ్చింది. నిజానికి లాక్ డౌన్ ప్రకటించడానికి ముందే ఈ మత కార్యక్రమం మొదలైంది. తబ్లిగి జమాత్‌పై ఆ ఆరోపణలు నిజమే అయినట్లయితే, ఈ సంవత్సరం కరోనా వైరస్ వ్యాప్తికి ఆరెస్సెస్ మరింత బాధ్యత వహించాల్సి ఉంది. ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు సంవత్సరం ముందస్తుగా నిర్వహించిన కుంభమేళా భారీ కార్యక్రమానికి ఆరెస్సెస్ బాధ్యత వహించదా? లక్షలాదిమంది ప్రజలు హాజరైన కుంభమేళా నుంచి వైరస్ దేశంలోని గ్రామాలన్నింటికీ వ్యాపించిన ఘటనకు, గంగానది పొడవునా సామూహికంగా వైరస్ ప్రభావ మరణాలు సంభవించడానికి ఎవరు బాధ్యత వహించాలి? అదే సమయంలో అయిదురాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రధాని మోదీ ఇతర బీజేపీ జాతీయ స్థాయి నాయకుల బహిరంగ సమావేశాలకు భారీ స్థాయిలో ప్రజలను తరలించడంలో ఆరెస్సెస్ పాత్ర లేనే లేదా? ఈ క్రమంలో ఇంటింటికీ, గ్రామం నుంచి గ్రామానికీ, నగరం నుంచి నగరానికి ఆరెస్సెస్ కార్యకర్తలతో పాటు వైరస్ తోడుగా ప్రయాణించలేదా? ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఆరెస్సెస్ అదినేత మోహన్ భాగవత్ కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రి పాలయ్యారని వార్త కూడా వచ్చింది. అటు పిమ్మట సైతం ఆయన ఎన్నికలను వాయిదా వేయాలని బహిరంగంగా సూచించలేకపోయారు. కొందరు హిందుత్వ మద్దతుదారులు చెబుతున్నట్లుగా మోహన్ భాగవత్ కచ్చితంగా ఆవు మూత్రాన్ని, ఆవు పేడను కరోనా చికిత్సకోసం ఉపయోగించి ఉండరని నేను గట్టిగా చెప్పగలను. మరోవైపున ఈ ’బూటకపు’ వైద్య శాస్త్రాన్ని విమర్శించడానికి కూడా ఆరెస్సెస్ అధినేత ముందుకు రాలేదు. అన్నిటికంటే మించి మోహన్ భాగవత్, మోదీ ఒకే సంస్థ నీడలో సుదీర్ఘకాలంలో ఎదిగి వచ్చారన్నది మనం గ్రహించాలి. మోదీ ప్రధాని అయ్యేంతవరకు, రాష్ట్రీయ స్వయం సేవక్ అఖిల భారత యంత్రాంగంపై కానీ, దాని విశాలమైన సంస్థాగత యంత్రాంగంపై గానీ ఆయనకు ఏమాత్రం నియంత్రణ కూడా లేదు. సంఘ్ పరివార్ లోని కుల సాంస్కృతిక నియంత్రణల నేపథ్యంలో మోహన్ భాగవత్ సహజంగానే ఆరెస్సెస్‌లో అత్యంత శక్తివంతమైన నేతగా వెలుగొందుతూ వచ్చారు. అదే సమయంలో వెనుకబడిన కులాలనుంచి వచ్చిన మోదీకి ఎలాంటి ప్రాధాన్యతా ఉండేది కాదు. 2002 సంవత్సరానికి ముందువరకు ఆరెస్సెస్‌కి చెందిన మోహన్ భాగవత్, మరొక మహారాష్ట్ర బ్రాహ్మణుడైన ప్రమోద్ మహాజన్‌ల ఆదేశాలను మోదీ శిరసావహించేవారన్నది జగమెరుగని సత్యం. ఆరెస్సెస్–బీజేపీ సంస్థాగత నిర్మాణాల్లో కులం ప్రధాన అధికార శక్తిగా ఉంటూ వచ్చింది. నరేంద్రమోదీకి అత్యంత అనుకూలంగా మారిన విషయం ఏమిటంటే ఆయన గుజరాతీ నేపథ్యమే. ఇది మాత్రమే ఆయనకు పలు వ్యాపార సంస్థలతో బలమైన అనుసంధానాన్ని కల్పించింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాధృచ్ఛికంగా తన ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. తనను తాను మరింత ముందుకు ప్రోత్సహించుకోవడానికి తన గత నెట్‌వర్క్‌లను మోదీ అత్యంత సమర్థంగా ఉపయోగించుకోగలిగారు. అయితే ఇప్పుడు సైతం సంఘ్ పరివార్ అధినేత మోహన్ భాగవత్.. ప్రధాని మోదీని గొప్ప నాయకుడిగా ఆమోదిస్తున్నారంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే చంద్రగుప్త మౌర్యుడు చక్రవర్తి అయినప్పటికీ అతడిని కౌటిల్యుడు తనకంటే అధికుడిగా ఎన్నడూ ఆమోదించేవాడు కాదు మరి. ఈ నేపథ్యంలో మోహన్ భాగవత్, ఆయన నేతృత్వంలోని సంఘ్ పరివార్‌కు భారతదేశం ప్రస్తుతం కూరుకుపోయిన ఉన్న తీవ్ర సంక్షోభంలో ఏ పాత్రా లేదని భారత ప్రజానీకం ఎలా విశ్వసించగలదు? కనీవినీ ఎరుగని ఈ సర్వవిధ్వంసంలో తమ పాత్ర ఎంత అనే విషయంలో ఇప్పటికైనా సంఘ్ పరివార్, మోహన్ భాగవత్ నోరు విప్పాల్సి ఉంది. ఒకటి మాత్రం నిజం.. పలాయనత్వం లేదా తప్పిం చుకు తిరగడం అనేది జాతీయవాదం కానే కాదు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ప్రథమ ప్రాధాన్య ఓట్లపైనే దృష్టి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభలు, సమావేశాలే కాకుండా క్షేత్రస్థాయిలోని ప్రతి ఓటర్ను కలిసేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. అనుబంధ సంఘాల కార్యకర్తలను క్షేత్రస్థాయికి పంపి మరీ గ్రాడ్యుయేట్ ఓట్లను బీజేపీ అభ్యర్థులకు ఎక్కువ మొత్తంలో పడేలా ప్రణాళికలు రూపొందించుకుంది. ముఖ్యంగా ప్రథమ ప్రాధాన్య ఓట్లు రాబట్టుకోవడమే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేస్తోంది. రంగంలోకి సంఘ్ పరివార్.. బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆ పార్టీ అనుబంధ సంఘాలూ రంగంలోకి దిగాయి. చాపకింద నీరులా సంఘ్‌పరివార్ ప్రచారం నిర్వహి స్తోంది. ఇప్పటికే 25 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని కమలం పార్టీ నియమించింది. ఇటు నియోజకవర్గాల వారీగా ఇప్పటికే సమావేశాలను పూర్తి చేసుకున్న ఆ పార్టీ.. మేధావుల సదస్సులను నిర్వహిస్తోంది. లాయర్లు, డాక్టర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నేతలు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఇక సంఘ్ పరివార్ నేతలు పోలింగ్ బూత్‌ల వారీగా సమీక్షలతో పాటు క్షేత్రస్థాయిలో ఓటర్లకు టచ్‌లో ఉంటూ ప్రథమ ప్రాధాన్య ఓట్లను రాబట్టుకునేలా ప్రచారం చేస్తున్నారు. అవే ప్రధాన అస్త్రాలుగా.. ప్రస్తుతమున్న సిట్టింగ్ స్థానంతో పాటు మరో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేలా కమలనాథులు ఎప్పటికప్పుడు ప్రచార ప్రణాళికలను అమలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల్లో వ్యతిరేకత అంశాలనే ప్రధాన ప్రచారాస్త్రాలుగా చేసుకొని బీజేపీ ముందుకెళ్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి తరుణ్ చుగ్, ఇతర ముఖ్య నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. మరోవైపు కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, రమేశ్ పోఖ్రియాల్ ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. మరికొందరు జాతీయ స్థాయి నేతలు కూడా రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్‌ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, టీఆర్ఎస్ అభ్యర్థులనే తమ ప్రత్యర్థులుగా చూస్తూ బీజేపీ ప్రచారం చేస్తోంది. ఉద్యోగులు, నిరుద్యోగులు ఏ వర్గం వారూ టీఆర్ఎస్ పాలనలో సంతోషంగా లేరని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇటు పెట్రోల్ ధరల పెంపు అంశాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు బీజేపీ సోషల్ మీడియా విభాగం గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. గత ప్రభుత్వాల కారణంగానే ధరల పెరుగుదల తప్పడం లేదని చెబుతోంది. తమపై విమర్శలు చేసే ముందుకు పెట్రోల్ ధరల పెంపుతో రాష్ట్రానికి వచ్చే వ్యాట్ (పన్నులు) ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నిస్తోంది. -
బీజేపీ ప్రభుత్వ వైఖరిపై కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, ఈ దిశలో కార్యాచరణను అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గం నిర్ణయించింది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేలా కలిసొచ్చే శక్తులను ఒక్కతాటిపైకి తీసుకురావాలని అభిప్రాయపడింది. బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులను ఎక్కడికక్కడ ఎదుర్కొనేందుకు వీలుగా జాతీయ, రాష్ట్రస్థాయిల్లో లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తుల విశాల వేదిక ఏర్పాటు దిశగా సీపీఐ చొరవ తీసుకోవాలని పలువురు సభ్యులు సూచించినట్లు సమాచారం. గతంలో పాండిచ్చేరిలో చేసిన తీర్మానానికి అనుగుణంగా విశాల ప్రాతిపదికన లెఫ్ట్, డెమోక్రటిక్, సెక్యులర్, సామాజిక శక్తులను ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు పార్టీ కృషిని మరింత పెంచాలని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు కోరినట్లు తెలిసింది. రెండురోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం మఖ్దూంభవన్‌లో మొదలైన సందర్భంగా పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై నివేదిక సమర్పించారు. ఇందులో భాగంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, దేశ ఆర్థిక వ్యవస్థకు వాటిల్లుతున్న నష్టం, కార్మిక, ఇతర చట్టాలకు తూట్లు పొడవడం, కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ఎన్ఆర్సీ పేరిట మైనారిటీ, ఇతర వర్గాల ప్రజలకు ఇబ్బందులు కల్పించడం, మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, తదితర అంశాలను ప్రస్తావించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అలాగే ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో కోల్‌కతాలో జరగనున్న పార్టీ జాతీయ నిర్మాణ మహాసభల్లో చర్చించాల్సిన అంశాలు, పార్టీ నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శి నివేదికపై వివిధ రాష్ట్రాల వారీగా సభ్యులు తమ అభిప్రాయాలను తెలిపాక, ఆదివారం వివిధ తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు పార్టీ ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
సంఘ్, బీజేపీలే దేశానికి శత్రువులు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంపై దాడి చేస్తున్న సంఘ్ పరివార్, బీజేపీలే దేశానికి ప్రధాన శత్రువులని, నరేంద్ర మోదీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో విధ్వంసం సృష్టించిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అమెరికా, ఇజ్రాయెల్‌కు తాకట్టు పెట్టిన మోదీ సర్కారు దేశంలోనూ మత కోణంలో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. సంఘ్ పరివార్ చేతిలో బీజేపీ ప్రభుత్వం రిమోట్కంట్రోల్గా మారిందని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో ఆ పార్టీ ప్రతినిధులకు సౌహార్ద సందేశమిచ్చారు. ‘‘దళితులు, మైనార్టీలను బలి తీసుకుంటున్నారు. లౌకికవాద యువతను చంపేస్తున్నారు. ముఖ్య ప్రభుత్వ పదవులు, యూనివర్సిటీలు, ఇతర సంస్థల్లో ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రవేశించాయి. ఫాసిస్ట్ పాలనకు మోదీ సర్కారు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ మతతత్వ సర్కారు అవలంబిస్తున్న విధానాలపై ప్రజల నుంచి నిరసన వస్తోంది. వామపక్ష పార్టీలు మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహించి ప్రజలకు విముక్తి కలిగించాలి’’ అని సురవరం అన్నారు. దేశంలో అవినీతి పెరిగిపోయిందని, రైతులు కష్టాల్లో ఉన్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ అనుకూల ఆర్థిక వ్యవస్థ కారణంగా దేశంలో 36 కుటుంబాలకే లబ్ధి కలుగుతోందని, సామాన్యుడు ఛిద్రమై పోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో వామపక్షాల ఐక్యత గతం కన్నా ఎంతో అవసరమని స్పష్టంచేశారు. ఈ దిశగా ఉమ్మడి పోరాటాలకు సీపీఐ తమ వంతు సహకారం అందిస్తుందన్నారు. వామపక్షాలు మాత్రమే ప్రజలను ఈ దుస్థితి నుంచి గట్టెక్కించగలవని చెప్పారు. ఇంతటి దుస్థితి ఎప్పుడూ లేదు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పౌర హక్కులకు ఇంతటి దుస్థితి ఎప్పుడూ లేదని సీపీఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ఆరోపించారు. బెంగాల్, త్రిపురల్లో ఓటమి వామపక్ష శ్రేణుల్లో కొంత నిరుత్సాహాన్ని కలిగించిందని అన్నారు. అయితే ఢిల్లీ, మహారాష్ట్రల్లో కార్మిక ఆందోళనలు, నాసిక్–ముంబైల వరకు రైతుల ర్యాలీ, విద్యార్థుల ఆందోళనలు దేశంలో మార్పునకు సంకేతాలుగా కనపడుతున్నాయన్నారు. – దీపాంకర్ భట్టాచార్య, సీపీఐఎంఎల్ నేత సీపీఎం పెద్దన్న పాత్ర తీసుకోవాలి దేశంలో వామపక్ష ఐక్యత కోసం కృషి చేయాల్సిన బాధ్యత సీపీఎంపై ఉందని ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ నాయకుడు శివశంకరన్ అన్నారు. దేశంలో ఉన్న వామపక్ష పార్టీల్లో అతిపెద్ద పార్టీ సీపీఎం అని, మహాసభకు హాజరైన వామపక్ష పార్టీలే కాక, విస్తృత వామపక్ష ఐక్య ఉద్యమాలను నిర్మించడంలో సీపీఎం ప్రధాన పాత్ర పోషించాలన్నారు. – శివశంకరన్, ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ నేత సవాళ్ల సమయమిది మతానికి రాజకీయ రంగు పులిమి దేశంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకెళుతోందని రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) నాయకుడు మనోజ్ భట్టాచార్య వ్యాఖ్యానించారు. సవాళ్లతో కూడుకున్న ఈ సమయంలో వామపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. – మనోజ్ భట్టాచార్య, ఆర్ఎస్పీ నేత బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి దేశానికి ప్రస్తుతం మిలిటెంట్ ప్రజాస్వామిక ఉద్యమాలు అత్యవసరమని ఎస్‌యూసీఐ (సీ) నాయకుడు ఆశిష్ భట్టాచార్య అన్నారు. దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. – ఆశిష్ భట్టాచార్య, ఎస్‌యూసీఐ(సీ) నేత -
గౌరి హత్య వెనుక సంఘ్ హస్తం
♦ మావోయిస్టుల ప్రమేయం లేదు ♦ మాజీ మావోయిస్టులు సిరిమనె నాగరాజు, నూర్ శ్రీధర్ శివాజీనగర : సీనియర్ పాత్రికేయురాలు, సామాజికకర్త గౌరీ లంకేశ్‌ను మావోయిస్టులు ఎట్టి పరిస్థితిలోను హత్య చేయటానికి అవకాశమే లేదని మాజీ మావోయిస్టులు సిరిమనె నాగరాజు, నూర్ శ్రీధర్ స్పష్టం చేశారు. సోమవారం వారు ఇక్కడ విలేకరులతో మాట్లాడు తూ...మావోయిష్టులు ఏనాడు పోరాటదారులు, సాహితీవేత్తలను, సమాజ సేవకులను అంతం చేసే సాహసానికి ఒడిగట్టిన నిదర్శనాలు లేవని, ఉద్యమకారులకు అండగా నిలిచే మావోయిస్టులు ఓ పాత్రికేయురాలైన గౌరి లంకేశ్‌ను హత్య చేయరని సిరిమనె నాగరాజు స్పష్టం చేశారు. నక్సలైట్లతో గౌరి లంకేశ్‌కు ఎలాంటి విభేదాలు లేవని, ఈ హత్య వెనుక సంఘ్ పరివార్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. మావోయిష్టులు మాఫియా గ్యాంగ్ కాదని, అదొక క్రమశిక్షణతో కూడిన రాజకీయ పార్టీ అని, దానికి ఒక ప్రణాళిక ఉందని తెలిపారు. నియమాలకు అనుగుణంగా ఆ పార్టీ పని చేస్తుందని, ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన ప్రతి ఒక్కరి అభిప్రాయం మేరకే నిర్ణయాలు ఉంటాయన్నారు. దేశంలో మావోయిస్టులు పాత్రికేయులను హత్య చేసిన సంఘటనలు లేవని, అదే విధంగా అధికారులను కిడ్నాప్ చేసి హత్య చేసిన నిదర్శనాలు లేవని స్పష్టం చేశారు. ఈ విధమైన విధానాలను అనుసరిస్తున్న మావోయిస్టులు గౌరి లంకేశ్‌ను హత్య చేయటానికి ఒడిగట్టరన్నారు. దర్యాప్తు తప్పుదారి పట్టించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 12న నగరంలో సాహితీవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, పోరాట నాయకులు సమావేశం జరుపనున్నట్లు ఆయన తెలిపారు. -
‘సంఘ్’ ప్రోత్సాహంతో ముస్లింలపై దాడులు
సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపణ సాక్షి, హైదరాబాద్: సంఘ్ పరివార్ ప్రోత్సాహంతో పథకం ప్రకారం దళితులు, ముస్లింలపై దేశవ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రజల ఆహార అలవాట్లను సైతం మార్చే విధంగా ఒత్తిడి పెంచుతున్నారని విమర్శించారు. నారాయణగూడ వైఎంసీఏ గ్రౌండ్స్‌లో సీపీఐ నగర సమితి కార్యదర్శి ఈటీ నరసింహ నేతృత్వంలో సోమవారం ఏర్పాటు చేసిన జనసేవాదళ్ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గోవధను నిషేధించారని, అయినా అనేక చోట్ల గోరక్షక్‌దళ్ గూండాల దాడులు జరుగుతున్నాయని అన్నారు. గోరక్షక దళాల దాడుల నుంచి పార్టీని, ప్రజలను రక్షించాలని ప్రజాసేవాదళ్, జనసేవాదళ్ వలంటీర్లను కోరారు. అనంతరం మగ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన పార్టీ ఉపాధ్యాయుల సైద్ధాంతిక శిక్షణ శిబిరాన్ని సురవరం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. స్వార్థ రాజకీయాల కోసం పాలకులు లౌకికవాదం అర్థాన్ని, నిర్వచనాన్ని క్రమంగా ధ్వంసం చేస్తున్నారన్నారు. పాలకులు అనుసరిస్తున్న విధానాలతోపాటు సమకాలీన రాజకీయాలను అధ్యయనం చేస్తూ ప్రజలు, కార్యకర్తలను ఉపాధ్యాయులు చైతన్యవంతులను చేయాలని సూచించారు. పార్టీ నేతలు కె.నారాయణ, పల్లా వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
‘సంఘ్’తో ప్రజాస్వామ్యానికి భంగం
ప్రజాసంఘాలు పోరాడాలి: సీపీఐ నేత సురవరం సాక్షి, హైదరాబాద్: మోదీ ప్రభుత్వం అండదండలతో దేశంలో సంఘ్ పరివార్ శక్తుల ఆగడాలు పెరిగిపోయి, దేశ లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం వాటిల్లుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఆరోపించారు. సెక్యులరిజం, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజాసంఘాలు పోరాడాల్సి ఉందని పిలుపునిచ్చారు. గురువారం మఖ్దూంభవన్‌లో జరిగిన వివిధ రాష్ట్రస్థాయి ప్రజాసంఘాల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాల్లో దళితులు, అణగారిన వర్గాలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య, లౌకికశక్తులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ భావస్వేచ్ఛ కోసం దేశవ్యాప్తంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. పేదలకు డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం, దళితులకు మూడెకరాల భూమి, కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ వంటి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి దశల వారీగా పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈర్ల నర్సింహా, పశ్య పద్మ, ఎం.ఆదిరెడ్డి, ఎన్.బాల మల్లేశ్, టి.శ్రీనివాస్, ఏఐటీయూసీ నాయకులు నర్సింహన్, రత్నాకరరావు, ఏఐవైఎఫ్ నాయకులు ఎం.అనిల్‌కుమార్, టి.రాములు యాదవ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు వేణు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో విద్వేష శక్తులున్నాయ్
బీజేపీ, సంఘ్ పరివార్‌లపై రాహుల్ ధ్వజం - గాయని శుభాముద్గల్కు రాజీవ్ సద్భావనా అవార్డు ప్రదానం న్యూఢిల్లీ : దేశంలో విరోధాలను ప్రోత్సహిస్తున్న శక్తులు ఉన్నాయని, విడిపోయిన, విభజితమైన దేశం కావాలనుకుంటున్నాయని, జనం మధ్య సంబంధాలను తెంపాలని ఈ శక్తులు కోరు కుంటున్నాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. బీజేపీ, సంఘ్ పరివార్‌లపై పరోక్షంగా ధ్వజమెత్తారు. రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన పురస్కారాన్ని 2014-15 సంవత్సరానికి హిందుస్తానీ గాయని సుభాముద్గల్కు శనివారం ఢిల్లీలో ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద ప్రశంసాపత్రంతోపాటు రూ. 10 లక్షల నగదు అందించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. ‘‘దురదృష్టవశాత్తూ ఈ శక్తులు ఇప్పుడు భారతదేశంలో ఉన్నాయి. విద్వేషాన్ని క్రియాశీలంగా ప్రోత్సహిస్తున్న మహిళలు, మగవాళ్లు ఉన్నారు. వారు అవమానిస్తారు, వేరుచేస్తారు. వారు ఏకాకులను చేస్తారు, చంపుతారు. ఈ కొద్ది మంది ఇప్పుడు దేశంలో గెలుస్తున్నామని భావించినప్పటికీ.. ప్రతి ఒక్కరి కోసం నిలుచున్న మిమ్మల్ని, మీలాంటి లక్షలాది మందిని గౌరవించటం మాకు గర్వకారణం’’ అని పేర్కొన్నారు. శుభాముద్గల్ తన గానం ద్వారా సరిహద్దులను బద్దలుకొట్టి లక్షలాది మంది జీవితాల్లో సామరస్యాన్ని తీసుకువచ్చారని రాహుల్ కొనియాడారు. తన తండ్రి రాజీవ్‌గాంధీ కూడా ఇవే రాజకీయాలు చేశారని పేర్కొన్నారు. భారతదేశం సామరస్యంగా ఉండటమే ఒక సంగీతమని అభివర్ణించారు. తన స్కూలు రోజుల్లో తాను కూడా ఒకసారి భయంభయంగా పాటపాడానని.. అయితే అది పాట కాదని, శబ్దమేనని తన సీనియర్లు వ్యాఖ్యానించటంతో మళ్లీ బహిరంగంగా పాడలేదన్నారు. కాగా, రాజీవ్ 72వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. -
‘సంఘ్’ చర్యలపై దేశవ్యాప్త ఆందోళన
సీపీఐ జాతీయ కార్యవర్గం యోచన సాక్షి, హైదరాబాద్: దేశంలో చోటుచేసుకున్న పరిణామాలు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్న సంఘ్ పరివార్ శక్తులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని సీపీఐ భావిస్తోంది. దేశంలో లౌకికత్వం దెబ్బతినేలా, దేశ మౌలిక సూత్రాలను విచ్ఛిన్నం చేసేలా వివిధ రూపా ల్లో బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్న మతోన్మాద ఎజెండాకు గట్టి సమాధానాన్ని ఇచ్చేలా ప్రచార కార్యక్రమాలను రూపొం దించాలని యోచిస్తోంది. తప్పుడు వీడియోలు సృష్టించి జేఎన్‌యూ నేత కన్హయ్యపై దేశద్రోహం కేసు పెట్టి జైల్లో పెట్టడం, జాతీయ మీడి యా ద్వారా దానిపై పెద్దఎత్తున దుష్ర్పచారం సాగించడం వంటి వాటిపై ఉద్యమించే విషయంపై చర్చిస్తోంది. పార్టీగా విడిగా, విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ పరంగా, దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య, లౌకిక, ప్రగతిశీల, సామాజిక సంస్థలు, శక్తులను కలుపుకుని వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు నిర్వహించాలని ఆలోచన చేస్తోంది. పార్టీ రెండురోజుల జాతీయ కార్యవర్గసమావేశాలు సోమవారం హైదరాబాద్ మఖ్దూంభవన్‌లో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. జాతీయస్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, బీజేపీ ప్రభుత్వ విధానాలు, రిసెర్చీ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య, కన్హయ్యపై కేసు, సంఘ్ దూకుడు, బెంగాల్, కేరళ సహా ఐదు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాల గురించి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తమ నివేదికలో వివరించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ఆమోదించాలని సీపీఐ జాతీయ కార్యవర్గం తీర్మానించింది. విద్యను, విశ్వవిద్యాలయాలను కాషాయీకరించేందుకు బీజేపీ, సంఘ్ పరివార్ చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తూ జాతీయ కార్యవర్గం మరో తీర్మానాన్ని ఆమోదించింది. అలహాబాద్ వర్సిటీలో బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ను అడుగు పెట్టకుండా అడ్డుకున్న విద్యార్థి సంఘం అధ్యక్షురాలు రిచాశర్మ వర్సిటీ నుంచి బయటకు వెళ్లగొట్టే ప్రయత్నాలను ఖండించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీని ఎదుర్కొనేందుకు వామపక్ష, ప్రజాస్వామ్య ఫ్రంట్ ఏర్పాటు చేసే అంశంపై చర్చిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. జాతీయ కార్యవర్గ భేటీలో దీనిపై చర్చించాక స్పష్టత వస్తుందన్నారు. -
నేత హితవు సరే.. మరి అనుచరుల వైఖరి...!
క్షేత్రస్థాయిలో అనుచరులు యథావిధిగా వ్యవహరిస్తుంటే, నేతలు మాత్రం బుజ్జగింపు మాటలు వల్లించడం వృథాప్రయాస అని చాలాకాలం క్రితం మాజీ ప్రధాని వీపీ సింగ్ స్పష్టంచేశారు. మత సహనంపై మోదీ తాజా ప్రకటన బీజేపీ, సంఘ్పరివార్లపై ప్రభావం చూపగలదా? దివంగత ప్రధాని విశ్వ నాథ్ ప్రతాప్‌సింగ్ గతంలో భారతీయ జనతా పార్టీ గురించి ఒక విషయం చెప్పారు. ఆ విషయం ఆయన ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లోనే కాదు నేటికీ అంతే నిర్దిష్టంగా, అంతే సుస్పష్టంగా ఉండటం ఆశ్చర్యం గొలిపిస్తుంది. విషయానికి వస్తే 1980ల చివర్లో బీజేపీ నేతలు ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజపేయిలు రాజీవ్ గాంధీని ఓడించడానికి ప్రయత్నిస్తున్న కాలంలో వీపీ సింగ్ కూడా వారితో చేయి కలిపారు. ఆ సమయంలోనే అయోధ్య ఉద్యమం ఊపందు కుంది. ఈ ఉద్యమం భారత్‌ను దెబ్బతీస్తుందని తర్వాత గ్రహించిన వీపీ సింగ్ ఆ ఇద్దరు నేతల భాగస్వామ్యంతో తెగదెంపులు చేసుకున్నారు. అయితే ఈ పరిణామం వీపీ సింగ్ ప్రభు త్వాన్ని కూడా కూల్చేసింది. లౌకికత్వాన్ని కాపాడ టం కోసం తన్ను తాను బలిపెట్టుకున్నట్లుగా ఆయన తర్వాత ఘనంగా చెప్పుకున్నారు. ఆ తర్వాత తన జీవితం చివరి సంవత్సరాల్లో ఆయన.. బీజేపీని ఓడించడమే ప్రధాన రాజకీయ లక్ష్యంగా కలిగిన వివిధ బృందాలను ఏకం చేయడానికి ప్రయ త్నిస్తూ గడిపారు. ఆ సమయంలో ఒక పత్రికా రచ యిత వీపీసింగ్కు ఒక విషయం చెప్పారు. వాజ పేయి నిగ్రహం ప్రదర్శిస్తారనీ, ఐక్యతను, సహనభావాన్ని ఆయన బోధిస్తారు కాబట్టి బీజేపీ మొత్తం గా మతతత్వపార్టీ కాదనీ ఆ మాటల సారాంశం. అయితే వీపీ సింగ్ ఆ విలేకరికి సమాధాన మిస్తూ బీజేపీ ఎల్లవేళలా దూకుడుగా మాట్లాడా ల్సిన అవసరం ఉండేది కాదన్నారు. ఈ విషయాన్ని నిజంగా వినవలసిందీ, ఆలోచించవలసిందీ బీజేపీ మద్దతుదారులే అన్నారాయన. క్షేత్రస్థాయిలో వాళ్లు ఎలాంటి భాష వాడుతున్నారు? మీడియా ముందు సీనియర్ పార్టీ నాయకులు వల్లించే ధర్మోపదేశాల కంటే ఇదే ముఖ్యం. క్షేత్రస్థాయిలో వారు విషం కక్కుతున్నారని వీపీ సింగ్ ముక్తాయించారు. మన ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ ఈ వారం సామరస్యం, సహనభావం గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు. అది విన్నాక నాకు సరిగ్గా నాటి వీపీ సింగ్ అభిప్రాయం మరోసారి గుర్తు కొచ్చింది. ఢిల్లీలో చర్చిలకు వ్యతిరేకంగా హింసా త్మక చర్యలు పెరుగుతున్నట్లు వస్తున్న వార్తల మధ్యే మోదీ తన పద్ధతికి భిన్నంగా ఒక చర్చిలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల ఇద్దరు భారతీయులను కేరళలో కేథలిక్ మత సంప్రదాయానుసారం మహనీయు లుగా ప్రకటించారు. వారు కురియకోస్ అలియాస్ చవర, యుప్రేసియా. వీరిలో చవర గురించి మోదీ ఇలా ప్రస్తావించారు. ‘‘విద్య చాలా తక్కువమందికే అందుబాటులో ఉన్న కాలంలో ప్రతి చర్చి కూడా ఒక పాఠశాలలా కావాలని చవర ఆనాడే నొక్కి చెప్పారు. ఆ విధంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్యా ద్వారాలను ఆయన తెరిచారు’’ సంస్కృత భాషకు సంబంధించి తనకున్న పరిజ్ఞానం ప్రదర్శిస్తూ మోదీ ఈ సందర్భంగా సహనభావం, బాహాటత్వం గురించి బోధించారు. హిందువులు విశ్వ సామరస్యతను విశ్వసించడమే కాకుండా, అన్ని మతాలూ సత్యమేనని ఆమోదిస్తా రంటూ స్వామి వివేకానంద చేసిన ప్రవచనాన్ని కూడా ఆయన ఉటంకించారు. చాలాకాలం క్రితం నేను మోదీని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసు కెళ్లాను. సహన భావం గురించి తాను మాట్లాడద లచుకోలేదనీ, హిందూ సమ్మతి, సానుకూలత పట్లే మనం దృష్టి పెట్టాలని మోదీ స్పష్టంగా చెప్పారు. దాంతో పోలిస్తే సహనభావం అనేది ఒక మెట్టు కింద ఉంటుందన్నారు. అయితే ఈ వారం క్రిస్టియన్ కార్యక్రమంలో మాట్లాడినప్పుడు ఆనాటి తన సూత్రీకరణ నుంచి వైదొలిగి కొన్ని అంశాలను చాలా స్పష్టంగా చెప్పారు. ఏ రకంగా చూసినా ఇవి చాలా ముఖ్య మైనవి. ఆయనేమన్నారంటే... ‘‘ఒక మతాన్ని లేదా విశ్వాసాన్ని కలిగి ఉండే, కొనసాగించే, స్వీకరించే స్వేచ్ఛ పౌరుల వ్యక్తిగత అభీష్టమని మనం గుర్తిస్తాం. నా ప్రభుత్వం సంపూర్ణ మత స్వాతంత్య్రానికి కట్టుబడి ఉంటుంది. ఎలాంటి నిర్బంధం, లేదా అనుచిత ప్రభావాలకు గురి కాకుండా అతడు లేదా ఆమె తన మతాన్ని కొనసాగించడంలో, పర మతాన్ని అవలంబించే విషయంలో పరిపూర్ణ హక్కు కలిగి ఉంటారన్నదే నా భావన. మెజారిటీ కావచ్చు లేదా మైనారిటీ కావచ్చు ఏ మత బృందమైనా సరే.. ప్రచ్ఛన్నంగా లేదా బహిరంగంగా ఇతరుల పట్ల విద్వేషాన్ని ప్రేరేపించడాన్ని నా ప్రభుత్వం ఏ పరిస్థితుల్లోనూ అనుమతించదు. నాది అన్ని మతాలకు సమాన గౌరవం ఇచ్చే ప్రభుత్వం.’’ ప్రధాని మోదీ ఎంత స్పష్టంగా ఈ విషయా లను ప్రస్తావించారన్నది ఇక్కడ కీలకం. తన పార్టీ లోని మంత్రివర్గంలోని కొందరు సభ్యులు, పార్టీలో, సంఘ్ పరివార్‌లోని మిత్రులు కొందరు మతప రంగా చేసిన వ్యాఖ్యలు తనను గాయపర్చాయని ప్రధాని తేల్చి చెప్పారు. ఇలాంటి భాషను మళ్లీ ఎవరైనా ఉపయోగిస్తే అప్పుడు మోదీ చేసిన ఉపన్యాసం ఆధారంగా మీడియా ఆయననే బాధ్యు డిని చేయవచ్చు. చర్చి కార్యక్రమంలో చేసిన ఆ ప్రసంగం మోదీ వ్యక్తిత్వంలోని ఒక అంశాన్ని వెలికి తెచ్చింది. ఇది తరచుగా తన్ను తాను ప్రదర్శించుకోదు. ఇది ఆయన గుజరాతీ స్ఫూర్తిలో భాగం. సిద్ధాంతానికి మొండిగా కట్టుబడటం కంటే ప్రయోజనాలను సిద్ధించుకోవడం కోసం రాజీధోరణి ప్రదర్శించే స్ఫూర్తి అది. అభివృద్ధికి సంబంధించిన సమస్య లతో వ్యవహరించేటప్పుడు తనలోని ఈ పార్శ్వా న్ని మోదీ క్రమం తప్పకుండా ప్రదర్శిస్తారు. సంఘ్ పరివార్ సిద్ధాంతవేత్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ రూపొందించిన ఆరెస్సెస్ ఆర్థిక సిద్ధాంతాన్ని ఆయన ఇలాంటి సందర్భాల్లో తక్కువ చేసి, పక్కనపెట్టేస్తారు కూడా. అయితే మత విశ్వాసానికి సంబంధించిన అంశాలపై మోదీ నిజంగానే చాలా తక్కువగా బయటపడతారు. అందుకే ఆయన చర్చిలో చేసిన ఈ ప్రసంగం చాలా ముఖ్యమైంది. మనం చివరకు నాయకుడి అసలైన మాటలు విన్నాం. ఆయన ఎటు నిలబడుతున్నారో తెలుసు కున్నాం. తన మంత్రివర్గ సహచరుల నుంచి, సంఘ్ పరివార్‌లోని ఇతరుల నుంచి కూడా ఇదే విధమైన భాష వస్తుందని, ఇలాంటి ప్రకటనే వారి నుంచి కూడా రావాలని మనం ఎదురుచూస్తున్నాం. క్షేత్ర స్థాయిలో అనుచరులు యథావిధిగా వ్యవహరి స్తుంటే, నేతలు మాత్రం బుజ్జగింపు మాటలు వల్లిం చడం వ్యర్థప్రయాస అని చాలా సంవత్సరాల క్రితం వీపీ సింగ్ స్పష్టంగా పేర్కొన్నారు మరి. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com -
మోడీ ప్రధాని అభ్యర్థిత్వానికి ఆరెస్సెస్ కసరత్తు!
న్యూఢిల్లీ: గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి బీజేపీ ప్రధాని అభ్యర్థిత్వం కట్టబెట్టేందుకు ఏకాభిప్రాయ సాధన కోసం ఆరెస్సెస్ కసరత్తు చేస్తోంది. సంస్థ సీనియర్ నేత సురేశ్ భయ్యాజీ జోషీ ఆదివారమిక్కడ ఈ అంశంపై పార్టీ సీని యర్ నేతలైన అద్వానీ, సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్‌లతో భేటీఅయ్యారు. ఈ భేటీలో మోడీని ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తీసుకురావాల్సిన అవసరం, ఆయనను ఎప్పుడు అభ్యర్థిగా ప్రకటించాలి వం టి వాటిపై భయ్యాజీ చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. మోడీ ప్రధాని అభ్యర్థిగా వద్దని అద్వానీ, సుష్మా తదితరులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఆయనపై వ్యతిరేకతను తొలగించేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాకే దీనిపై నిర్ణయం తీసుకోవాలని అద్వానీ, సుష్మా చెబుతుండగా, అంతవరకు వేచి చూడొద్దని రాజ్‌నాథ్, అరుణ్ జైట్లీ అంటున్నారు.