సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభలు, సమావేశాలే కాకుండా క్షేత్రస్థాయిలోని ప్రతి ఓటర్‌ను కలిసేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. అనుబంధ సంఘాల కార్యకర్తలను క్షేత్రస్థాయికి పంపి మరీ గ్రాడ్యుయేట్ ఓట్లను బీజేపీ అభ్యర్థులకు ఎక్కువ మొత్తంలో పడేలా ప్రణాళికలు రూపొందించుకుంది. ముఖ్యంగా ప్రథమ ప్రాధాన్య ఓట్లు రాబట్టుకోవడమే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేస్తోంది.
రంగంలోకి సంఘ్ పరివార్..
బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆ పార్టీ అనుబంధ సంఘాలూ రంగంలోకి దిగాయి. చాపకింద నీరులా సంఘ్‌పరివార్ ప్రచారం నిర్వహి స్తోంది. ఇప్పటికే 25 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని కమలం పార్టీ నియమించింది. ఇటు నియోజకవర్గాల వారీగా ఇప్పటికే సమావేశాలను పూర్తి చేసుకున్న ఆ పార్టీ.. మేధావుల సదస్సులను నిర్వహిస్తోంది. లాయర్లు, డాక్టర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నేతలు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఇక సంఘ్ పరివార్ నేతలు పోలింగ్ బూత్‌ల వారీగా సమీక్షలతో పాటు క్షేత్రస్థాయిలో ఓటర్లకు టచ్‌లో ఉంటూ ప్రథమ ప్రాధాన్య ఓట్లను రాబట్టుకునేలా ప్రచారం చేస్తున్నారు.
అవే ప్రధాన అస్త్రాలుగా..
ప్రస్తుతమున్న సిట్టింగ్ స్థానంతో పాటు మరో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేలా కమలనాథులు ఎప్పటికప్పుడు ప్రచార ప్రణాళికలను అమలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల్లో వ్యతిరేకత అంశాలనే ప్రధాన ప్రచారాస్త్రాలుగా చేసుకొని బీజేపీ ముందుకెళ్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, ఇతర ముఖ్య నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. మరోవైపు కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, రమేశ్ పోఖ్రియాల్ ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. మరికొందరు జాతీయ స్థాయి నేతలు కూడా రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్‌ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, టీఆర్‌ఎస్ అభ్యర్థులనే తమ ప్రత్యర్థులుగా చూస్తూ బీజేపీ ప్రచారం చేస్తోంది. ఉద్యోగులు, నిరుద్యోగులు ఏ వర్గం వారూ టీఆర్‌ఎస్ పాలనలో సంతోషంగా లేరని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇటు పెట్రోల్ ధరల పెంపు అంశాన్ని టీఆర్‌ఎస్ నేతలు ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు బీజేపీ సోషల్ మీడియా విభాగం గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. గత ప్రభుత్వాల కారణంగానే ధరల పెరుగుదల తప్పడం లేదని చెబుతోంది. తమపై విమర్శలు చేసే ముందుకు పెట్రోల్ ధరల పెంపుతో రాష్ట్రానికి వచ్చే వ్యాట్ (పన్నులు) ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నిస్తోంది.
ప్రథమ ప్రాధాన్య ఓట్లపైనే దృష్టి
Published Thu, Mar 11 2021 1:40 AM | Last Updated on Thu, Mar 11 2021 8:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment