
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ గురువారం ఉదయం ఓ సందేశం విడుదల చేశారాయన.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించి గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. కొత్తగా ఎన్నికైన మా అభ్యర్థులకు అభినందనలు. గొప్ప శ్రద్ధతో పని చేసిన పార్టీ కార్యకర్తలను చూసి నేను గర్విస్తున్నా’’ అని ఎక్స్ పోస్టులో సందేశం ఉంచారాయన.
ఇదిలా ఉంటే.. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలిచారు. ఇక.. ఉత్కంఠ భరితంగా సాగిన ఉమ్మడి కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా చిన్నమైల్ అంజిరెడ్డి నెగ్గారు. టీచర్స్ ఎమ్మెల్సీగా కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ మాత్రం ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు.. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో అంజిరెడ్డి జయకేతనం ఎగురవేశారు.

Comments
Please login to add a commentAdd a comment