దేశంలో విద్వేష శక్తులున్నాయ్
బీజేపీ, సంఘ్ పరివార్‌లపై రాహుల్ ధ్వజం
- గాయని శుభాముద్గల్‌కు రాజీవ్ సద్భావనా అవార్డు ప్రదానం
న్యూఢిల్లీ : దేశంలో విరోధాలను ప్రోత్సహిస్తున్న శక్తులు ఉన్నాయని, విడిపోయిన, విభజితమైన దేశం కావాలనుకుంటున్నాయని, జనం మధ్య సంబంధాలను తెంపాలని ఈ శక్తులు కోరు కుంటున్నాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. బీజేపీ, సంఘ్ పరివార్‌లపై పరోక్షంగా ధ్వజమెత్తారు. రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన పురస్కారాన్ని 2014-15 సంవత్సరానికి హిందుస్తానీ గాయని సుభాముద్గల్‌కు శనివారం ఢిల్లీలో ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద ప్రశంసాపత్రంతోపాటు రూ. 10 లక్షల నగదు అందించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. ‘‘దురదృష్టవశాత్తూ ఈ శక్తులు ఇప్పుడు భారతదేశంలో ఉన్నాయి. విద్వేషాన్ని క్రియాశీలంగా ప్రోత్సహిస్తున్న మహిళలు, మగవాళ్లు ఉన్నారు. వారు అవమానిస్తారు, వేరుచేస్తారు. వారు ఏకాకులను చేస్తారు, చంపుతారు.
ఈ కొద్ది మంది ఇప్పుడు దేశంలో గెలుస్తున్నామని భావించినప్పటికీ.. ప్రతి ఒక్కరి కోసం నిలుచున్న మిమ్మల్ని, మీలాంటి లక్షలాది మందిని గౌరవించటం మాకు గర్వకారణం’’ అని పేర్కొన్నారు. శుభాముద్గల్ తన గానం ద్వారా సరిహద్దులను బద్దలుకొట్టి లక్షలాది మంది జీవితాల్లో సామరస్యాన్ని తీసుకువచ్చారని రాహుల్ కొనియాడారు. తన తండ్రి రాజీవ్‌గాంధీ కూడా ఇవే రాజకీయాలు చేశారని పేర్కొన్నారు. భారతదేశం సామరస్యంగా ఉండటమే ఒక సంగీతమని అభివర్ణించారు. తన స్కూలు రోజుల్లో తాను కూడా ఒకసారి భయంభయంగా పాటపాడానని.. అయితే అది పాట కాదని, శబ్దమేనని తన సీనియర్లు వ్యాఖ్యానించటంతో మళ్లీ బహిరంగంగా పాడలేదన్నారు. కాగా, రాజీవ్ 72వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.