కరోనా మహమ్మారి తొలిదశలో వైరస్ వ్యాప్తికి.. ఢిల్లీలో మతపరమైన కార్యక్రమానికి హాజరైన తబ్లిగి జమాత్ ముస్లిం గ్రూప్ కారణమని ఆరెస్సెస్–బీజేపీ నాయకత్వం ఆరోపించింది. అది నిజమే అయితే, ఈ ఏడు వైరస్ వ్యాప్తికి ఆరెస్సెస్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది. ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ముందస్తుగా నిర్వహించిన కుంభమేళా కార్యక్రమంలో ఆరెస్సెస్ పాత్ర లేదా? లక్షలాది ప్రజలు హాజరైన కుంభమేళా నుంచి వైరస్ దేశంలోని గ్రామాలన్నింటికీ వ్యాపించిన ఘటనకు ఎవరు బాధ్యత వహించాలి? కనీవినీ ఎరుగని ఈ విధ్వంసంలో తమ పాత్ర ఎంత అనే విషయంలో ఇప్పటికైనా సంఘ్ పరివార్, మోహన్ భాగవత్ నోరు విప్పాల్సి ఉంది. తప్పించుకు తిరగడం అనేది జాతీయవాదం కానే కాదు.
భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న కోవిడ్– 19 విషాదానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రాథమికంగా బాధ్యత వహించాలా? కోవిడ్–19 తొలి వేవ్ తర్వాత భారత ప్రభుత్వం, పాలనా యంత్రాంగం, భారత ప్రజలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని స్వయంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అదినేత మోహన్ భాగవత్ మే 15న ప్రకటించారు. అంతే.. భారతదేశంలో కరోనా మృతుల సునామీ విరుచుకుపడటానికి బాధ్యులైనవారిలో ప్రధాని మోదీని కూడా బీజేపీ మాతృసంస్థ చేర్చివేసిందని ప్రతిపక్షం, మీడియా వెంటనే విమర్శలు మొదలెట్టేశాయి.
కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఆరెస్సెస్ బాధ్యత ఏమిటి? తనకు రాజకీయాలతో సంబంధం లేనే లేదని ఆరెస్సెస్ చెప్పుకుంటున్నప్పటికీ బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఆరెస్సెస్ చేయగలిగినంతా చేసింది. సరిహద్దుల్లోని భారత శత్రువులతో పోరాడటానికి కొద్ది రోజుల వ్యవధిలోనే తమ సంస్థ సిద్ధంగా ఉంటుందంటూ గతంలో మోహన్ భాగవత్ సంచలన ప్రకటన చేశారు. కానీ ఇంత శక్తివంతమైన సంస్థ కూడా ప్రస్తుతం నెలకొన్న వైద్యపరమైన సంక్షోభాన్ని, దేశవ్యాప్త కల్లోలాన్ని ఎందుకు పసిగట్టలేకపోయింది? బీజేపీని, ఆ పార్టీ ప్రధాని మోదీని తగు చర్యలు చేపట్టాల్సిందిగా ఆరెస్సెస్ ఎందుకు ఆదేశించలేకపోయింది?
ప్రధాని మోదీ దశాబ్దాలపాటు రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్తగా గడిపారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2002లో మారణకాండ చోటు చేసుకున్న తర్వాత హిందువులు బాధితులవుతున్నారనే భావనను బలోపేతం చేసే అవకాశాన్ని ఆరెస్సెస్, మోదీ సమర్థవంతంగా అందిపుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మోదీకి ప్రమోషన్ లభించి న్యూఢిల్లీకి తరలివెళ్లారు. ‘నేను నిన్ను ఉపయోగించుకుంటాను, నువ్వు నన్ను ఉపయోగించుకో’ అనే భావజాలాన్ని ఆరెస్సెస్, మోదీ పరస్పరం పంచుకున్నారు. వీరిద్దరి ఉమ్మడి శత్రువు అయిన ముస్లింలు స్థిరంగా ఉంటూండగానే, వీరిద్దరూ పరస్పరం వాడేసుకున్నారు. అదే సమయంలో భారత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే ఎజెండా వీరిద్దరికీ లేదు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం విషయంలో కానీ, మానవ సమానత్వంలో కానీ వీరికి ఏమాత్రం విశ్వాసం లేదు. దానికి మించి ప్రజాస్వామ్య మూలసూత్రాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను వీరు ఎన్నడూ విశ్వసించలేదు.
1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ ఆవిర్భవించిన తర్వాత ఆ సంస్థకు ఆధిపత్యం వహించిన సర్ సంచాలక్‌లలోకెల్లా మోహన్ భాగవత్ అత్యంత శక్తివంతమైనవారు అన్నది స్పష్టమే. భారత ప్రభుత్వంపై, పౌర సమాజంపై ఇంతటి ప్రభావం చూపగలుగుతున్న వారిని మునుపెన్నడూ చూసి ఎరుగం. ప్రత్యేకించి హిందూ పౌర సమాజంపై మోహన్ భాగవత్ వేసిన ప్రభావం అంతాఇంతా కాదు. ఇది ఎలా సాధ్యమయిందంటే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ గెలవడానికి ముందు, ఆరెస్సెస్, బీజేపీలు ఢిల్లీపై కానీ, దేశంలోని చాలా రాష్ట్రాల్లో కానీ ఎన్నడూ పట్టు సాధించిన పాపాన పోలేదు. చివరకు 1999–2004 సంవత్సరాల మధ్య నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కూడా ఢిల్లీలో, బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రభుత్వంపై ఆ పార్టీకి పరిమితమైన పట్టు మాత్రమే ఉండేది. అప్పట్లో బీజేపీ నియంత్రణలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఉండేవి. దీని పర్యవసానంగానే 2000 సంవత్సరం నుంచి ఆరెస్సెస్ చీఫ్‌గా ఉండిన కేఎస్ సుదర్శన్ నేటి మోహన్ భాగవత్ కంటే చాలా తక్కువ పలుకుబడి కలిగి ఉండేవారు.
కరోనా మహమ్మారి తొలిదశలో అంటే 2020 మార్చిలో, కరోనా వ్యాప్తి చెందడానికి.. ఢిల్లీలో అంతర్జాతీయ మతపరమైన కార్యక్రమంలో భాగంగా హాజరైన తబ్లిగి జమాత్ ముస్లిం గ్రూప్ కారణమనే భావనను ఆరెస్సెస్–బీజేపీ బలంగా ముందుకు తీసుకొచ్చింది. నిజానికి లాక్ డౌన్ ప్రకటించడానికి ముందే ఈ మత కార్యక్రమం మొదలైంది. తబ్లిగి జమాత్‌పై ఆ ఆరోపణలు నిజమే అయినట్లయితే, ఈ సంవత్సరం కరోనా వైరస్ వ్యాప్తికి ఆరెస్సెస్ మరింత బాధ్యత వహించాల్సి ఉంది. ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు సంవత్సరం ముందస్తుగా నిర్వహించిన కుంభమేళా భారీ కార్యక్రమానికి ఆరెస్సెస్ బాధ్యత వహించదా? లక్షలాదిమంది ప్రజలు హాజరైన కుంభమేళా నుంచి వైరస్ దేశంలోని గ్రామాలన్నింటికీ వ్యాపించిన ఘటనకు, గంగానది పొడవునా సామూహికంగా వైరస్ ప్రభావ మరణాలు సంభవించడానికి ఎవరు బాధ్యత వహించాలి?
అదే సమయంలో అయిదురాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రధాని మోదీ ఇతర బీజేపీ జాతీయ స్థాయి నాయకుల బహిరంగ సమావేశాలకు భారీ స్థాయిలో ప్రజలను తరలించడంలో ఆరెస్సెస్ పాత్ర లేనే లేదా? ఈ క్రమంలో ఇంటింటికీ, గ్రామం నుంచి గ్రామానికీ, నగరం నుంచి నగరానికి ఆరెస్సెస్ కార్యకర్తలతో పాటు వైరస్ తోడుగా ప్రయాణించలేదా? ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఆరెస్సెస్ అదినేత మోహన్ భాగవత్ కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రి పాలయ్యారని వార్త కూడా వచ్చింది. అటు పిమ్మట సైతం ఆయన ఎన్నికలను వాయిదా వేయాలని బహిరంగంగా సూచించలేకపోయారు. కొందరు హిందుత్వ మద్దతుదారులు చెబుతున్నట్లుగా మోహన్ భాగవత్ కచ్చితంగా ఆవు మూత్రాన్ని, ఆవు పేడను కరోనా చికిత్సకోసం ఉపయోగించి ఉండరని నేను గట్టిగా చెప్పగలను. మరోవైపున ఈ ’బూటకపు’ వైద్య శాస్త్రాన్ని విమర్శించడానికి కూడా ఆరెస్సెస్ అధినేత ముందుకు రాలేదు.
అన్నిటికంటే మించి మోహన్ భాగవత్, మోదీ ఒకే సంస్థ నీడలో సుదీర్ఘకాలంలో ఎదిగి వచ్చారన్నది మనం గ్రహించాలి. మోదీ ప్రధాని అయ్యేంతవరకు, రాష్ట్రీయ స్వయం సేవక్ అఖిల భారత యంత్రాంగంపై కానీ, దాని విశాలమైన సంస్థాగత యంత్రాంగంపై గానీ ఆయనకు ఏమాత్రం నియంత్రణ కూడా లేదు. సంఘ్ పరివార్ లోని కుల సాంస్కృతిక నియంత్రణల నేపథ్యంలో మోహన్ భాగవత్ సహజంగానే ఆరెస్సెస్‌లో అత్యంత శక్తివంతమైన నేతగా వెలుగొందుతూ వచ్చారు. అదే సమయంలో వెనుకబడిన కులాలనుంచి వచ్చిన మోదీకి ఎలాంటి ప్రాధాన్యతా ఉండేది కాదు. 2002 సంవత్సరానికి ముందువరకు ఆరెస్సెస్‌కి చెందిన మోహన్ భాగవత్, మరొక మహారాష్ట్ర బ్రాహ్మణుడైన ప్రమోద్ మహాజన్‌ల ఆదేశాలను మోదీ శిరసావహించేవారన్నది జగమెరుగని సత్యం. ఆరెస్సెస్–బీజేపీ సంస్థాగత నిర్మాణాల్లో కులం ప్రధాన అధికార శక్తిగా ఉంటూ వచ్చింది.
నరేంద్రమోదీకి అత్యంత అనుకూలంగా మారిన విషయం ఏమిటంటే ఆయన గుజరాతీ నేపథ్యమే. ఇది మాత్రమే ఆయనకు పలు వ్యాపార సంస్థలతో బలమైన అనుసంధానాన్ని కల్పించింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాధృచ్ఛికంగా తన ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. తనను తాను మరింత ముందుకు ప్రోత్సహించుకోవడానికి తన గత నెట్‌వర్క్‌లను మోదీ అత్యంత సమర్థంగా ఉపయోగించుకోగలిగారు. అయితే ఇప్పుడు సైతం సంఘ్ పరివార్ అధినేత మోహన్ భాగవత్.. ప్రధాని మోదీని గొప్ప నాయకుడిగా ఆమోదిస్తున్నారంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే చంద్రగుప్త మౌర్యుడు చక్రవర్తి అయినప్పటికీ అతడిని కౌటిల్యుడు తనకంటే అధికుడిగా ఎన్నడూ ఆమోదించేవాడు కాదు మరి.
ఈ నేపథ్యంలో మోహన్ భాగవత్, ఆయన నేతృత్వంలోని సంఘ్ పరివార్‌కు భారతదేశం ప్రస్తుతం కూరుకుపోయిన ఉన్న తీవ్ర సంక్షోభంలో ఏ పాత్రా లేదని భారత ప్రజానీకం ఎలా విశ్వసించగలదు? కనీవినీ ఎరుగని ఈ సర్వవిధ్వంసంలో తమ పాత్ర ఎంత అనే విషయంలో ఇప్పటికైనా సంఘ్ పరివార్, మోహన్ భాగవత్ నోరు విప్పాల్సి ఉంది. ఒకటి మాత్రం నిజం.. పలాయనత్వం లేదా తప్పిం చుకు తిరగడం అనేది జాతీయవాదం కానే కాదు.
ప్రొ‘‘ కంచ ఐలయ్య
షెపర్డ్
వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment