వైరస్ రోగులకు సేవలందిస్తున్నారనే కారణంతో డాక్టర్లను, నర్సులను అద్దె ఇళ్లలోంచి ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్న ఘటనలు మనలో కొత్త తరహా స్వార్థానికి సంకేతాలు. ఇలా అద్దె ఇళ్లలోంచి గెంటేసినవారే రేపు రోగం బారిన పడితే.. ఆ డాక్టర్లు, నర్సులే వారికి సేవ చేయాల్సి వస్తుంది. మానవ అస్పృశ్యత, సామాజిక సామూహిక బాధ్యత లేని భయంకరమైన స్వార్థపరత్వం అనేవి భారతదేశాన్ని మరిన్ని మరణాలు, విధ్వంసం వైపు నెడతాయి. అసాధారణవేగంతో ప్రపంచంపై విరుచుకుపడుతూ ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న కరోనా వైరస్ నివారణ అనంతరం ప్రపంచం పూర్తిగా మారిపోతుందన్న వాస్తవాన్ని కుల, మత ఛాందసవాదులకు అర్థం చేయించాలి.
కరోనా వైరస్ మానవజాతిపై యుద్ధం అనే ఆలోచనతో ప్రపంచం వణికిపోతుండగా, సామాజిక దూరం ఒక్కటే ఈ మహమ్మారికి రక్షణ సాధనం అనే ప్రచారం మోతాదుకు మించి సాగుతోంది. అయితే వెయ్యేళ్లపాటు దేశాన్ని పట్టి పీడించిన మానవ అస్పృశ్యత దేశాన్ని ఇప్పుడు మరింత ప్రమాదకర స్థితిలోకి నెట్టే అవకాశాలు పెరుగుతున్నాయి. అందుకే భారత ప్రభుత్వం, మీడియా సామాజిక దూరం అనే భావనను వదిలిపెట్టి రోగానికి దూరంగా ఉండటం అనే పదబంధాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెయ్యేళ్లపాటు మనది కులపరమైన అస్పృశ్యతతో కూడిన సమాజంగా కొనసాగింది. ఏ కరోనా రోగి కూడా సామాజికంగా అస్పృశ్యుడు కాదు. అతడు/ఆమెను కొంచెం దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే వారి నోటినుంచి, ముక్కునుంచి వెలువడే తుంపరలు ఆరోగ్యవంతులను చేరలేవు. ఒకసారి రోగి దేహం నుంచి వైరస్ వెళ్లిపోయాక, ఆ వైరస్ బారిన పడని వారికంటే ఎక్కువ రోగ నిరోధకశక్తిని కలిగి ఉంటారు. అంతేకాకుండా వైరస్ నుంచి బయటపడిన వారు మామూలు మనుషులుగా జీవించవచ్చు కూడా. అందుకే రోగాన్ని దూరం పెట్టడమే కానీ మనుషులను దూరం పెట్టే భావన కాదిది.
సామాజిక దూరం అనే భావనమీద ఛాందసవాదులు మొదలుపెట్టిన ప్రచారంపై ఆధారపడి కులాన్ని దూరంగా ఉంచడమే కరోనాకు చికిత్స అనే ఆలోచనను చాలామంది ముందుకు తీసుకొస్తున్నారు. ఇది వేల సంవత్సరాల క్రితమే వీరు కనుగొన్న విధానమే మరి. చివరకు అత్యంత హేతువాదంతో వ్యవహరించే ద్రవిడియన్ రాష్ట్రమైన తమిళనాడులో సైతం కులపరమైన దూరం పాటించడమే కరోనా చికిత్సకు మంత్రం అనే భావన ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అలాగే పూర్తిగా శాకాహారం తీసుకునే వారి కంటే మాంసాహారం (గొర్రె, బీఫ్, కోడి, చేప, గుడ్డు) తినేవారికి మాత్రమే కరోనా వైరస్ సోకుతుందంటూ ఇవే శక్తులు ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణలో ఈరకమైన చెత్త ప్రచారం వల్లే కొంతకాలంపాటు చికెన్, మటన్ షాపులన్నీ మూతబడిపోయాయి. అయితే మాంసాహారం రూపంలో ప్రొటీన్ అధికంగా కలిగిన ఆహారంతో పాటు సీ విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ప్రజలు తప్పనిసరిగా తీసుకోవాలంటూ డాక్టర్లు చెబుతున్న సలహాల గురించి సీఎం కేసీఆర్ ఇటీవల ఒక ప్రెస్ కాన్ఫరెన్సులో నొక్కి చెప్పారు. రోగనిరోధక శక్తి బలంగా ఉన్న వారే ఎలాంటి ప్రాణాంతక వ్యాధి నుంచయినా తమను తాము కాపాడుకోగలరని సీఎం స్పష్టం చేశారు. ఆయన అలా చెప్పిన మరుసటి రోజు నుంచే తెలంగాణ వ్యాప్తంగా చికెన్, మటన్, గుడ్ల షాపుల ముందు భారీగా జనం క్యూ కట్టారు. కోడిమాంసం గురించి జరుగుతున్న దుష్ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ చేసిన ఒక్క ప్రకటనతో అనేక మంది జీవితాలను నిలబెట్టారు. అన్ని మాంసాలకంటే కోడి మాంసం చౌక. అందుకే ఇప్పుడు పేదప్రజలు కూడా కోడి మాంసం తింటున్నారు.
ఒక మనిషి బ్రాహ్మణుడా, దళితుడా, మగవాడా, మహిళా, ముస్లిమా లేక క్రిస్టియనా అనే విషయాన్ని కరోనా వైరస్ పట్టించుకోదు. మనుషులు మాంసాహారులా, శాకాహారులా అనే విషయాన్ని కూడా అది పట్టించుకోదు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారి ఊపిరితిత్తులను కబళించడం ద్వారా మానవ శరీరంలో పాతుకుపోయే పరాన్నజీవే కరోనా వైరస్. రోగనిరోధక శక్తి స్థాయి బలంగా ఉన్న వారు కరోనాను ఓడించగలరు. చైనా ఆహార అలవాట్లే వారిపై కరోనా వైరస్ దాడికి ఆస్కారమిస్తూన్నాయని జోకులేస్తున్న వారంతా ఒక వాస్తవాన్ని పరిశీలించాలి. చైనా ఈ ప్రాణాంతక వ్యాధిని సైన్స్, మందుల సహాయంతో, మొత్తం సమాజాన్ని అప్రమత్తం చేసిన లీ వెన్ లియాంగ్ వంటి గొప్ప డాక్టర్ల సేవలతో ఓడించగలిగింది. పైగా చైనా ప్రజలు వైరస్ బారినుంచి తప్పించుకోవడానికి వారిలో ఉన్న అత్యున్నతమైన రోగనిరోధక స్థాయిలు కూడా తోడ్పడ్డాయి.
ప్రపంచంలోని అన్ని మతధార్మిక సంస్థలూ మూతబడిపోయి, మతంమీద ఆధారపడిన వారందరూ వైద్యులు, మందులపై ఆధారపడుతున్న ప్రస్తుత తరుణంలో శాస్త్రీయంగా పరీక్షించిన, రోగనిరోథక స్థాయిలు బాగా ఉన్న ఆహారంపై ప్రచారం జరగాల్సిన తరుణంలో ఛాందసవాద భావజాలం, మానవ అస్పృశ్యత ప్రచారంలో బలం పుంజుకోవడమే జాతికి మరింత నష్టం చేకూర్చగలదు. నిజానికి కరోనా వైరస్ బారిన పడిన అనంతర భారతదేశం.. ఆహారం, మందులు, గృహ వనరులు తదితరాలను అన్ని కులాలు, సామాజిక బృందాలు, మతాలు, స్త్రీపురుషులు పంచుకుంటూ మానవ అస్పృశ్యత, కులతత్వ చరిత్రను పాతరేయవలసి ఉంది. మానవ సమానత్వం, సైన్స్‌ను అమలు చేస్తున్న శాస్త్రీయ తత్వాన్ని అభివృద్ధి చేసే దిశగా మనం అడుగేయాల్సి ఉంది.
గొడ్డు మాంసం తింటున్న బౌద్ద కమ్యూనిటీలపై మానవ అస్పృశ్యతను విధించారని, తర్వాత వీరిని అస్పృశ్యులుగా ముద్రించారని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ నిశిత పరిశోధనతో మనకు తెలియజెప్పారు. కానీ 1897లో ప్రాణాంతకమైన బ్యుబోనిక్ ప్లేగు మహమ్మారికి కోటిమంది భారతీయులు బలైన సమయంలో ఈ తొలి అస్పృశ్యులైన దళితులే బతికి బయటపడ్డారు. కారణం బలమైన గొడ్డు మాంసం తినడం ద్వారా వారికి లభించిన రోగనిరోధక శక్తే. ఆరోజుల్లో వారికి గొడ్డు మాంసం తప్ప మరే ఆహారం లభించేది కాదు. పైగా ప్లేగువ్యాధి బారి నపడి జనం పిట్టల్లాగా రాలిపోతున్నప్పుడు అగ్రకులాలకు చెందిన కుటుంబ సభ్యులు.. చనిపోయిన తమ సన్నిహితుల మృతదేహాలను తాకడానికి కూడా భయపడుతున్న తరుణంలో దళితులే మృతదేహాలను మోసుకుపోయి పూడ్చిపెట్టేవారు లేక దహనం చేసేవారు.
పైగా, 1897లో దేశంపై దాడి చేసిన బ్యుబోనిక్ ప్లేగు ప్రస్తుత కరోనా కంటే ప్రమాదకరమైనది. కరోనా వైరస్ సమసిపోయిన తదుపరి భారతదేశంలో తిండిపై ఉన్న ఆంక్షలను నిలిపివేయాలి. వ్యక్తులను, సామాజిక బృందాలను వేరు చేసి వివక్ష ప్రదర్శించే విధానాలను ఆపివేయాలి. ఎందుకంటే భారతీయులను మంచి ఆహారంతోనూ (వారు ఎలాంటి ఆహారం స్వీకరిస్తున్నా సరే), మెరుగైన వైద్య, ఆరోగ్య శాస్త్రాలతోనూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కరోనా వైరస్ నూతన జాతీయతా పాఠాలను మనకు నేర్పుతోంది. 1897లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో కలగలిసి ఉన్న భారతదేశంలోని 20 కోట్లమంది ప్రజల్లో ఒక కోటిమందికి పైగా ప్లేగు బారినపడి చనిపోయారు. అయితే 2020లో ప్రాణాంతక కరోనా వైరస్ దాడి చేసినప్పుడు 130 కోట్లమంది భారత ప్రజారాశులు తమ సొంత ఆహారంతో, శారీరక శ్రమతో, సామర్థ్యంతో తమను తాము బలోపేతం చేసుకున్నారు.
ఇప్పుడు జాతీయవాదం అంటే శాస్త్రీయ, సాంకేతిక, వైద్య, సాంకేతిక ఆవిష్కరణలపై మరింత శ్రద్ధపెడుతూ అన్ని రంగాల ఆహార సంస్కృతులను గౌరవించడమే అని అర్థం. వైరస్ యుద్ధం అనేది అణు యుద్ధం కంటే ప్రమాదకరమైనదని ఇప్పుడు రుజువైపోయింది. వైరస్‌తో పోరాడేటప్పుడు మనం మరింత సామాజిక సంఘీభావంతో, మానవ సమానత్వంతో, గౌరవంతో మెలగాల్సి ఉంటుంది. వ్యాధికి దూరంగా ఉండటం తాత్కాలింగా ఉండే సమస్యే కానీ కులపరమైన అస్పృశ్యతలాగా సామాజిక దూరం అనే భావనను కూడా వ్యవస్థీకృతంగా మనుషుల మనస్తత్వాల్లోకి ఇంకింపజేస్తే భారతదేశం ఎన్నటికీ భవిష్యత్ వైరస్ యుద్ధాలకు సిద్ధం కాలేదు, నిలదొక్కుకోలేదు. పర్యావరణ మార్పుల సంక్షోభ సమయంలో భవిష్యత్తులో ఎలాంటి వైరస్‌లు మనపై దాడి చేస్తాయో ఎవరికీ తెలీదు. అలాంటి సందర్భాల్లో మతపరమైన పిడివాద సూత్రాలు మనల్ని ఏమాత్రం కాపాడలేవు. కానీ రియల్ టైమ్ సైన్స్ మాత్రమే తప్పకుండా మనల్ని రక్షిస్తుంది.
వైవిధ్యపూరితమైన ఆహార సంస్కృతులు, బహుళ ఆధ్యాత్మిక ఆచరణలు, మానవ అస్పృశ్యత పూర్తిగా కనుమరుగైపోవడం ఆ నూతన ప్రపంచపు సహజతత్వంగా మారతాయి. అన్ని కులాలకు, మతాలకు చెందిన.. వైరస్ బారిన పడిన రోగులనే కాదు.. దేశంలో ఏ ఒక్కరినీ అంటరానితనంతో చూడని కొత్త సంస్కృతి ఏర్పడాలి. తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు సేవ చేస్తున్న ఆసుపత్రులు, వైద్యులు, నర్సులు ఒక సరికొత్త సామాజిక–ఆధ్యాత్మిక విలువను మనందరికీ బోధిస్తున్నారు. ప్రతి ప్రాణం సమానమైందే, మానవులంతా దైవం ప్రసాదించిన బహుమతే. వైరస్‌పై యుద్ధం నుంచి ఆవిర్భవిస్తున్న ఈ కొత్త ప్రపంచ రూపం నుంచి మనందరం పాఠాలు నేర్చుకుందాం.
ప్రొ కంచ ఐలయ్య షెపర్డ్
వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్
సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ
Comments
Please login to add a commentAdd a comment