అశ్రద్ధ వీడకుంటే పల్లె గుల్లే!  | Dileep Reddy Article On Covid Situation In Villages | Sakshi
Sakshi News home page

అశ్రద్ధ వీడకుంటే పల్లె గుల్లే! 

Published Fri, May 14 2021 12:51 AM | Last Updated on Fri, May 14 2021 12:55 AM

Dileep Reddy Article On Covid Situation In Villages - Sakshi

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ బారిన పడుతున్నవారి సంఖ్య గ్రామాల్లో రమారమి పెరుగుతోంది. వైరస్‌ వ్యాప్తి వేగం ఆందోళన కలిగిస్తోంది. గ్రామాలు, చిన్న పట్ట ణాల్లో వైద్య సదుపాయాలు అరకొర. ప్రమాదం ముంచుకు వచ్చినపుడు పెద్ద పట్టణాలు, నగరాలకు పరుగు తీయాల్సి వస్తోంది. మూడో ఉధృతిపై కూడా హెచ్చరికలు వస్తున్న తరుణంలో గ్రామీణ భారతాన్ని నిర్లక్ష్యం చేస్తే, రాగల రోజుల్లో తీవ్ర పరిణామాలుంటాయి. జాతిపిత గాంధీజీ చెప్పినట్లు భారతీయ ఆత్మ అయిన గ్రామాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరం దృష్టిపెట్టి కోవిడ్‌ నుంచి విముక్తి కలిగించాలి. దీనికి తక్షణ కార్యాచరణ అవసరం.

కోవిడ్‌ రెండో ఉధృతి గ్రామీణ భారతాన్ని పట్టి పీడిస్తోంది. నిరుడు నెలల పాటు కోవిడ్‌ తొలి ఉధృతి వివిధ స్థాయిల్లో ఉన్నపుడు నగరాలు, పట్టణాల్లో కనిపించిన తీవ్రత గ్రామీణ ప్రాంతాల్లో లేదు. ఒక రకంగా గ్రామాలే సురక్షితమని నగర, పట్టణ వాసులు స్వస్థలా లకు వెళ్లి గడిపిన ఉదంతాలు చాలా ఉన్నాయి. కానీ, ఈ సారి పరిస్థితి అందుకు భిన్నం. కొన్ని ప్రధాన మెట్రో నగరాలు మినహాయిస్తే దేశ మంతటా ఇదే పరిస్థితి! ముంబాయి, ఢిల్లీ, బెంగళూరు వంటి మహానగరాల్లో పెద్ద సంఖ్యలో కేసులు–మరణాలు నమోదవుతు న్నాయి. అదే క్రమంలో మిగతా రాష్ట్ర రాజధానులు, ఇతర ప్రధాన నగరాలు, పట్టణాల్లోనూ కేసులు పెరిగాయి. ప్రభుత్వాలు, వైద్య రంగం, సహాయక విభాగాలు, నిపుణులు... ఇలా అందరి దృష్టీ నగర –పట్టణ ప్రాంతాలపైనే కేంద్రీకృతమైంది. టీకామందిచ్చే ప్రక్రియ కూడా అక్కడే ఎక్కువ! మరోవైపు కోవిడ్‌ బారిన పడుతున్నవారి సంఖ్య గ్రామాల్లో రమారమి పెరుగుతోంది. మరణాల రేటూ లోగడ కన్నా ఎక్కువే! వైరస్‌ వ్యాప్తి వేగం ఆందోళన కలిగిస్తోంది. గ్రామాలు, చిన్న పట్టణాల్లో వైద్య సదుపాయాలు అరకొర. ప్రమాదం ముంచుకు వచ్చినపుడు పెద్ద పట్టణాలు, నగరాలకు పరుగు తీయాల్సి వస్తోంది. ఇది దేశం అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ ప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ట్రాల నుంచి దక్షిణాది చిన్న రాష్ట్రం కేరళ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. గడచిన పక్షం, రోజువారీ కేసుల సంఖ్య దేశంలో మూడున్నర నుంచి నాలుగు లక్షలు తాకుతూ బెంబేలెత్తిం చింది. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ ఉధృతి రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టింది. దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడికక్కడ జనం కదలికలపై కట్టడి (లాక్‌డౌన్‌) విధిం చడం వల్లే వైరస్‌ వ్యాప్తి తగ్గి ఈ ఫలితం లభిస్తున్నట్టు నిపుణులూ, కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. తాజా కట్టడితో ఉపాధిపోయిన వలస కూలీలు తిరిగి సొంతూళ్ల దారిపట్టారు. దేశవ్యాప్తంగా తొలి ఉధృతిలో సొంతూళ్లకు వచ్చిన దాదాపు ఏడెనిమిది కోట్ల మందిలో 37 శాతమే, మళ్లీ పని ప్రదేశాలకు వెళ్లినట్టు ఒక అంచనా! మిగిలిన వారంతా ఇంకా గ్రామాల్లోనే ఉన్నారు. తాజాగా వెనుదిరిగే వారితో గ్రామాలపై మరింత ఒత్తిడి ఖాయం. రెండో ఉధృతి కలవరపరుస్తుండగానే, మూడో ఉధృతిపై హెచ్చరికలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రామీణ భారతాన్ని నిర్లక్ష్యం చేస్తే, రాగల రోజుల్లో తీవ్ర పరిణామాలుం టాయి. అందుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని దేశీయ, అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


సరిదిద్దకుంటే ప్రమాదమే!
దేశవ్యాప్త గణాంకాలకు తోడు సాధారణ అంచనాలు, శాస్త్రీయ అధ్య యనాలు కూడా గ్రామీణభారత దుస్థితికి అద్దం పడుతున్నాయి. దేశంలో నాలుగింట మూడొంతు ప్రాంతాలు ఇప్పుడు కట్టడి నీడన ఉన్నాయి. పరీక్షించిన వారిలో వైరస్‌ సోకినవారు (పాజిటివిటీ రేటు) 10 శాతం దాటిన జిల్లాలు దేశంలో 718 ఉన్నట్టు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) చెబుతోంది. వచ్చే 6–8 వారాల దాకా ఇక్కడ కట్టడి కొనసాగించాల్సిందేనని మండలి ఛైర్మన్‌ డా.బలరాం భార్గవ పేర్కొన్నారు. 24 ప్రధాన రాష్ట్రాలకుగాను 13 రాష్ట్రాల్లోని జిల్లాలను, పట్టణ–గ్రామీణ ప్రాంతాలుగా వేర్పరచే వీలుంది. వాటిల్లో నగరాలు, పెద్ద పట్టణాల కన్నా చిన్న పట్టణాలు, గ్రామాల్లోనే ఎక్కువ కోవిడ్‌ కేసులున్నాయి. మిగిలిన 11 రాష్ట్రాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు, మరణాలు నమోదవు తున్నాయి. అధి కారిక లెక్కల్లో చేరని కేసులు–మరణాలు గ్రామీణ భారతంలో ఎన్నో రెట్లు అధికం! ఓ ఉజ్జాయింపు లెక్క ప్రకారం, రోజు వారీ (వారం సగటు) కేసుల్లో 65 నుంచి 89 శాతం కేసులు గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చాయి. ఛత్తీస్‌గఢ్‌ (89 శాతం), హిమాచల్‌ ప్రదేశ్‌ (79), బీహార్‌ (76), ఒడిశా (76), రాజస్తాన్‌ (72), ఏపీ (72), ఉత్తరప్రదేశ్‌ (65), జమ్మూ–కశ్మీర్‌ (65) రాష్ట్రాల్లో మెజారిటీ కేసులు గ్రామీణ ప్రాంతాలవని ఒక పరిశీలన. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంది. కోవిడ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరగటమేకాక, ఏ పరీక్షలూ చేయించుకోకుండా కోవిడ్‌ లక్షణాలతో అసంఖ్యాకులు న్నారు. రాష్ట్రాన్ని జ్వరం మాగన్నులా కమ్మింది. గ్రామీణ ప్రాంతాలు కోవిడ్‌ కోరల్లో నలుగుతుంటే, స్థానిక సంస్థలు, ఇతర ఎన్నికలు ఎలా జరిపిస్తున్నారని రాష్ట్రప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని అలహాబాద్‌ హైకోర్టు మంద లించింది. ‘మేమీ పరిస్థితిని అంచనా వేయలేక పోయాం, ఇంత వేగంగా గ్రామగ్రామానికీ వైరస్‌ వ్యాప్తి చెందుతుం దనుకోలేదు’ అని అధికార బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రాదేశ్‌ సింగ్‌ చెప్పిన మాటలు అక్కడి పరిస్థితికి నిదర్శనం. గతంతో పోలిస్తే, పంజాబ్‌ గ్రామీణ ప్రాంతాల్లో మరణాల రేటు (2.8 శాతం) పెరిగింది. అదే పట్టణ ప్రాంతాల్లో తక్కువ (0.7) నమోదయింది. పరిస్థితి విశ్లే షిస్తే, దేశ వ్యాప్తంగా దాదాపు ఒకేరీతి కారణాలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో కోవిడ్‌ లక్షణాలు కనిపించినా అత్యధికులు పరీక్షలకు, చికి త్సకు వెళ్ల టంలేదు. వెళ్లిన చోట కూడా, రెండు రోజుల్లో రావాల్సిన ఆర్టీ–పీసీఆర్‌ రిపోర్టుకు వారంపైనే పడుతోంది. ఈ లోపు, వైరస్‌ సోకినవారి వ్యాధి ముదిరి, బాగుచేయలేని స్థితికి చేరుతోంది. ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో ఆధునిక వైద్య సదుపాయాలు, పరీక్ష అవకాశాలు, ఆక్సిజన్‌ అందుబాటు... ఇలా ఏవైనా గ్రామీణ ప్రాంతాల్లో సరిగా లేవు. సరైన అవగాహన లేక కొంత, తప్పుడు భావనలతో మరికొంత గ్రామాల్లో ‘కోవిడ్‌ సముచిత ప్రవర్తన’ (సీఏబి) ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. అత్యధికులు మాస్క్‌లు లేకుండా, భౌతికదూరం పాటించ కుండా, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోకుండా నిర్లక్ష్యంగా లెక్కలేనితనంతో తిరుగుతున్నారు.


పరస్పర విమర్శలు పరిష్కారమా?
నిర్దిష్ట చర్యలతో కార్యాచరణ మాని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సరి హద్దు రాష్ట్రాలు, వేర్వేరు విభాగాలు... పరస్పర విమర్శ–ప్రతివిమర్శ చేసుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా గాలికి వదిలే శాయి. టీకా మందు విషయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొంది. దేశీయ ఉత్పత్తి తమ అవసరాలు తీర్చటం లేదని, కేంద్ర పంపిణీ పద్ధతి కూడా బాగోలేదని కొన్ని రాష్ట్రాలు ప్రపంచ టెండర్లకు సన్నద్దమయ్యాయి. ‘రాష్ట్ర ప్రభు త్వాలు టీకా మందు సేకరణ విషయమై అవాస్తవిక ఆలోచనలు వీడాలి, మేం శాస్త్రీయంగానే పంపిణీ చేస్తున్నాం. దేశీయ ఉత్పత్తి పెంచే యత్నం చేస్తున్నామం’టూ కేంద్ర వైద్యారోగ్య శాఖామంత్రి పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడారు. కేసుల ఉధృతి రాష్ట్రాలతో తమ కున్న సరిహద్దుల్ని కొన్ని రాష్ట్రాలు మూసివేస్తున్నాయి. షరతులతో రాకపోకల్ని నియంత్రిస్తున్నాయి. కోవిడ్‌తో గతించిన వారి, వందకు పైగా శవాలు గంగానదిలో కొట్టుకు వస్తే ‘మీ శవాలం’టే, ‘కాదు మీ శవాలే’ అని ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాలు తిట్టుకుంటున్నాయి! వేర్వేరు గట్లలో నాలుగైదు రోజుల కిందట, వారంపది రోజుల కిందటే మరణించగా... కుళ్లిన శవాలని ఒడ్డుకు చేర్చి, అంతిమ సంస్కారాలు చేశామని, శరీర అవశేషాల నుంచి డీఎన్‌ఏ పరీక్షలకుగాను శాంపిళ్లు తీసి భద్రపరిచామని బీహార్‌ ప్రకటించింది.


భారత్‌లో పరిస్థితులు గంభీరంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర అంతర్జాతీయ, దేశీయ సంస్థలు, నిపుణులు హెచ్చరిస్తు న్నారు. టీకామందు రెండు డోసులు తీసుకున్న వారిపై వైరస్‌ ప్రభావం లోపించి, ప్రమాదస్థాయి రమారమి తగ్గిపోయినట్టు పరిశోధన ఫలి తాలు వస్తున్న వేళ... టీకా ప్రక్రియను వేగవంతం చేయాలి. కోవిడ్‌ విష కోరల నుంచి గ్రామాలను రక్షించడానికి అవగాహన, నిఘా. పరీక్షలు, క్వారంటైన్‌ సెంటర్లు, వైద్యచికిత్స కేంద్రాలు, మందులు–ఇతర అను బంధ సహాయకాలను విరివిగా పెంచాలి. అత్యధిక భారత జనాభా నివ సిస్తున్న, జాతిపిత గాంధీ చెప్పినట్టు భారతీయాత్మ అయిన గ్రామాలపై కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరం దృష్టి పెట్టి కోవిడ్‌ నుంచి విముక్తి కలిగించాలి. దీనికి తక్షణ కార్యాచరణ అవసరం.


దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement