‘డెల్టా ప్లస్’ అత్యంత ప్రమాదకారి అని అంతర్జాతీయ శాస్త్రసమాజమే అభిప్రాయపడుతోంది. ‘అసలు డెల్టాయే ప్రమాదకారి, డెల్టా ప్లస్ ఇంకా...’ అని ప్రఖ్యాత వైరాలజిస్టు, అమెరికా శ్వేతసౌధ ముఖ్య సలహాదారు ఆంథోనీ ఫౌచీ పేర్కొన్నారు. గత రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న సూచనలు, చేస్తున్న హెచ్చరికలు ఇదే ధ్రువపరుస్తున్నాయి. ‘ఇది అత్యంత ప్రమాదకారి, దీంతో జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో వైద్యులు, శాస్త్ర నిపుణుల నిర్దేశించే ప్రవర్తన కలిగి ఉండటం పౌర సమాజపు ప్రధాన కర్తవ్యం!
పౌరసమాజానికిది పరీక్షా కాలం! ప్రభుత్వాలకు, అంతకుమించి మన ప్రజారోగ్య వ్యవస్థకున్న పరిమితులు తేటతెల్లమైన తర్వాత ఎవరైనా పౌరసమాజంపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వ చర్యల వైపు చూస్తూనే విశాల జనబాహుళ్యపు పూర్తి సహకారం అర్తించే సమయమిది. ప్రజలు సంయమనం, క్రమశిక్షణ, శ్రద్ధ వహిస్తేనే... కోవిడ్–19 వంటి మహమ్మారి నుంచి సమాజం బయటపడగలుగుతుంది. ఇలాంటి ఉపద్రవాలనెన్నింటినో అధిగమిం చిన చారిత్రక సందర్భాలు ప్రజల ‘సమష్టి–నిబద్ధ కృషి’ ఖాతాలో చాలా ఉన్నాయి.
ఏడాదిన్నర కాలంగా ప్రపంచ మానవాళినే వణికి స్తున్న కోవిడ్–19 తగ్గినట్టే తగ్గుతూ... వైరస్ కొత్త రకాల్ని సృష్టి స్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. మనిషి సహజ రోగనిరోధక శక్తి, చికిత్స ద్వారా ఇచ్చే ఔషధాలను తట్టుకునేందుకు వైరస్ తనంత తాను రూపు–స్వభావం మార్చుకోవడం (మ్యుటేషన్) సహజం. ఈ క్రమంలో పుడుతున్న కొత్త రకాలు (వేరియంట్స్) ఎన్నో! వూహాన్ (చైనా) మౌలిక రకం నుంచి... ఆల్ఫా (యు.కె.లో గుర్తించిన రకం), బీటా (దక్షిణాఫ్రికాలో బయటపడిన రకం), డెల్టా (భారత్‌లో వెలుగు చూసిన రకం)లను దాటి తాజాగా పుట్టి క్రియాశీలమౌతున్న ‘డెల్టా ప్లస్’ రకం దడ పుట్టిస్తోంది. దేశంలో 40 కేసులు దాటాయి. మననే కాక మరో 8 దేశాలకూ నిద్ర లేకుండా చేస్తోంది. దాని లక్షణాలు, కన బరిచే స్వభావం, చూపే ప్రభావం... సరికొత్త సవాల్! ఇప్పుడు మనం వాడుతున్న టీకామందులు కొత్త రకం వైరస్ నుంచి ఏమేర రక్షణ కల్పిస్తాయనే విషయమై విశ్వవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతు న్నాయి.
‘డెల్టా’ మౌలిక రకం వైరస్ బారిన పడినా, ఆస్పత్రి వెళ్లే దాకా పరిస్థితిని రానీయకుండా ఫైజర్, ఆస్ట్రాజెనికా (మన కోవిషీల్డ్) టీకా మందు రక్షణనిస్తుందని ఆక్స్‌ఫర్డ్ అధ్యయనంలో వెల్లడైంది. ‘డెల్టా ప్లస్’ వైరస్ నుంచి కూడా సదరు రక్షణ లభిస్తుందా? అన్నది ఇంకా పరీక్షల స్థితిలోనే ఉంది. ఇదే విషయమై భారత వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్) నిర్వహిస్తున్న పరీక్ష ఫలితాలు త్వరలోనే వెలువడనున్నాయి. ‘టీకామందు తీసుకున్న వారిలో పుట్టే యాంటీ బాడీలు, కొత్త వైరస్‌ను నిర్వీర్యం చేస్తున్నాయా? అనేది మా పరీక్షల్లో తేలుతుంది’ అంటూ మండలి శాస్త్రవేత్త డాక్టర్ సమీరన్ పండ చెప్పిన మాటలు కొత్త ఆశల్ని, ఆకాంక్షల్ని రేకెత్తిస్తున్నాయి.
అతి ప్రమాదకారి కొత్త రకం
‘డెల్టా ప్లస్’ అత్యంత ప్రమాదకారి అని అంతర్జాతీయ శాస్త్రసమాజమే అభిప్రాయపడుతోంది. ‘అసలు డెల్టాయే ప్రమాదకారి, డెల్టా ప్లస్ ఇంకా...‘ అని ప్రఖ్యాత వైరాలజిస్టు, అమెరికా శ్వేతసౌధ ముఖ్య సల హాదారు ఆంథోనీ ఫౌచీ పేర్కొన్నారు. లోతైన పరిశీలనల్ని బట్టి.... వేగంగా వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్‌ను పెంచడం, సోకిన వారి–ఊపిరితిత్తుల కణజాలాన్ని బలంగా అంటిపెట్టుకోవడం, మోనోక్లోనల్ యాంటీ బాడీల ప్రభావాన్ని బాగా తగ్గించడం వంటివి తాజా వైరస్ లక్ష ణాలుగా చెబుతున్నారు. అందుకే, వ్యూహాత్మకంగా ముందుకు సాగా లని ప్రభుత్వాలూ హెచ్చరిస్తున్నాయి. గత రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న సూచనలు, చేస్తున్న హెచ్చరికలు ఇదే ధ్రువపరుస్తున్నాయి.
మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ‘ఇది అత్యంత ప్రమాదకారి, తీవ్ర రూపం దాల్చకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాలను అప్ర మత్తం చేసింది. మరో మూడు రాష్ట్రాల్లోనూ ఈ కేసుల్ని గుర్తించినట్టు చెబుతున్నా అధికారికంగా సమాచారం లేదు. డెల్టా ప్లస్ కేసులు రాగానే అప్రమత్తం కావాలని, ఆయా ప్రాంతాల్లో స్థానిక కట్టడి (కంటైన్మెంట్ జోన్ల ప్రకటన) ఏర్పరచాలని, నమూనాలను తదుపరి పరీక్ష–విశ్లేషణ కోసం ‘జీనోమిక్ కన్సార్షియం’ (ఐఎన్‌ఎస్‌ఏసీవోజీ)కి పంపించాలనీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశించింది. డెల్టా రకం వైరస్ 80 దేశాల్లో కనిపించినా, డెల్టా ప్లస్ భారత్‌తోపాటు అమెరికా, బ్రిటన్, పోలాండ్, పోర్చ్‌గల్, రష్యా, చైనా, జపాన్, నేపాల్ దేశాల్లో వెల్లడైంది. ఆల్ఫా రకం ఒకరి నుంచి సగటున నలుగురికి వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటే, డెల్టా ప్లస్ 5 నుంచి 8 మందికి సోకే ప్రమాదముంది. డెల్టా మౌలిక రకం కూడా ప్రమాదకారేనని పశ్చిమ దేశాల వైద్యులు, శాస్త్రవేత్తలంటున్నారు. బ్రిటన్ గణాంకాల ప్రకారం, డెల్టా సోకిన వారిలో లక్షణాలు బయటకు కనిపించిన నాటి నుంచి కేవలం 3–4 రోజుల్లోనే ఇన్‌ఫెక్షన్ తీవ్ర స్థితికి వెళ్లిపోతున్నట్టు స్పష్టమైంది.
అడుగులు ముందుకే పడాలి
దేశంలో కోవిడ్ కేసులు రమారమి తగ్గుతున్న పరిస్థితి. మొత్తమ్మీద 40 కోట్ల మందికి పరీక్షలు జరుపగా, 3 కోట్ల మందికి కరోనా సోకినట్టు రికార్డయింది. ఒకరోజు కొత్త కేసులు సగటున 40 వేలకు తగ్గాయి. ఒకరోజు కోలుకున్న వారి సంఖ్య 82 వేలకు పెరిగింది. కొత్త కేసుల కన్నా రోగులు కోలుకున్న కేసుల సంఖ్య ఎక్కువ గత 40 రోజుల నుంచి నిరవధికంగా నమోదవుతోంది. ఈ పరిస్థితుల్లో... వైరస్ కొత్తరకం వ్యాప్తి పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, కోవిడ్ మూడో అల అనుకున్న దానికన్నా ముందే ముంచుకు వచ్చే ప్రమాదాన్ని ప్రభు త్వాలతో పాటు నిపుణులూ శంకిస్తున్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల చర్యలెలా ఉన్నా... పౌరసమాజం బాధ్యతగా వ్యవహరించాలంటు న్నారు. కోవిడ్ సముచిత ప్రవర్తన (సీఏబీ) కలిగి ఉండాల్సిన అవ సరం ఏమిటో రెండో అలలో మనకు స్పష్టంగా బోధపడింది. వ్యూహం కొరవడ్డ ప్రభుత్వ విధాన లోపాలు, అవసరానికి తగ్గట్టు లేని మన వైద్య–ప్రజారోగ్య వ్యవస్థ అగచాట్లకు పౌరుల విపరీత ప్రవర్తన తోడై రెండో అలలో తీవ్ర నష్టమే జరిగింది. లక్షలమంది ప్రాణాలు కోల్పో యారు. ఇరవై రోజుల్లో లక్షమంది
భారతీయులు చనిపోయిన పాడుకాలం ఈ అలలోనే చూశాం. లక్షలాది మంది వ్యాధి బారిన పడి కోలుకున్నా... కోవిడ్ తర్వాతి ఇబ్బందులతో ఇంకా సతమతమౌ తున్నారు. కోట్లాది మంది ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కు మంటూ గడిపిన దిక్కుమాలిన కాలం. మొదటి అల ముగింపు దశలో మన అలసత్వానికి తగిన మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అంత దాకా ఉన్న కట్టడిని క్రమంగా ఎత్తివేసి ప్రభుత్వాలు కొంత వెసులు బాటు ఇవ్వగానే, పౌరులు విచ్చలవిడిగా బయటకు వచ్చారు. మహ మ్మారి నుంచి గట్టెక్కామనుకున్నారు. గుంపులుగా తిరిగి, పండుగలు– పబ్బాల్లో గుమిగూడి, మాస్క్‌లు లేకుండా, భౌతిక దూరం లెక్క చేయక ఇష్టానుసారం నడిచారు. అప్పుడే డెల్టా రకం వైరస్ వచ్చి తీరని నష్టం కలిగించింది. గత డిసెంబరులో తొలిసారి ఇక్కడే వెలుగు చూసింది. రెండో అల వేగంగా ముంచుకు వచ్చి, తీరని నష్టం కలిగిం చడం వెనుక బలమైన కారణాలు ఇవే అని ఆధారాలతో వెల్లడైంది. వైరస్ ప్రభావం, కేసుల సంఖ్య తగ్గుతూ ఇప్పుడిప్పుడే ఊరట చెందు తుంటే... వైరస్ కొత్త రకం మళ్లీ బయపెడుతోంది.
అవసరం మనది...
ఒక వంక వైరస్ వ్యాప్తిని నిలిపి, వైద్యం అందించి ప్రాణాలు నిలు పడం మరో వైపు కార్యకలాపాలు సాగించి ఆర్థికవ్యవస్థను మెరుగు పరచడం ప్రభుత్వాల బాధ్యత. రెంటి మధ్య సమతూకం పాటించి ప్రాణాలు, ప్రాణాధారాలను కాపాడే ద్విముఖపాత్ర ప్రభుత్వాలు పోషిస్తాయి. కానీ, ప్రాణాధారాలు కాపాడుకుంటూనే ప్రాణాలు నిలుపుకోవలసిన అవసరం ప్రజలది. ఇంతటి మహమ్మారిని ఎదు రొడ్డి నిలిచే నిత్య పోరాటం ఒక ఉమ్మడి బాధ్యత! వైరస్ వ్యాప్తిని, కోవిడ్ ప్రభావాన్నీ నిలువరించేలా పౌరులు అన్ని జాగ్రత్తలు పాటిం చాలి. వైరస్ కొత్తరూపంలో ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు... అప్రమత్తత ఎంతో అవసరం. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతుల్ని నిరంతరం శుభ్రపరచుకోవడం... ఇలా వైద్యులు, శాస్త్ర నిపుణుల నిర్దేశించే ప్రవర్తన కలిగి ఉండటం పౌర సమాజపు ప్రధాన కర్తవ్యం!
దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment