samakaleenam
-
ఈ సంక్షోభానికి అసలు మూలం
ఈరోజు ప్రపంచం మొత్తం పుతిన్ గురించి మాట్లాడుతోంది. కానీ రష్యాలో పాతుకుపోయిన సనాతన మతతత్వమే అసలు సమస్య. కమ్యూనిజం, సోషలిజం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించడమే కాదు, రష్యన్ సమాజంలోకి సనాతన వ్యతిరేక విలువలను తీసుకొచ్చిన ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని కూడా అక్కడి సనాతన మతం వ్యతిరేకిస్తోంది. ఈ రాజకీయ, ఆధ్యాత్మిక, సామాజిక పునాదే నేడు పుతిన్‌ను ఇలా తయారు చేసింది. ప్రపంచం ఇప్పుడు అఫ్గాన్ తాలిబనిజం, రష్యన్ సనాతనవాదం వంటి పలురకాల మత ఛాందసవాదాలతో తలపడుతోంది. ఈ యుద్ధంలో రష్యా గెలిచి ఉక్రెయినియన్ ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసినట్లయితే, ఉదారవాద మత ప్రపంచం తమ ప్రజాస్వామ్యం, లౌకికవాదాల ప్రయోగంలో కొత్త దశలోకి ప్రవేశించక తప్పదు. ఆధునిక కాలాల్లో పాలకవర్గ రాజకీయ శక్తులు తీవ్రమైన మత లేదా మత వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగితేలడం అత్యంత ప్రతికూల పరిణామాలను తీసుకొస్తుంది. రష్యన్ అనుభవం దీన్ని స్పష్టంగా ప్రదర్శిస్తోంది. రష్యాలో కమ్యూనిస్టు దశ సంపూర్ణంగా మత వ్యతిరేకతతో కూడుకుంది. కమ్యూనిస్టు పాలనలో భయంకరమైన బాధలకు గురైన సనాతన చర్చితో ఇప్పుడు పుతిన్ రష్యా ప్రగాఢంగా ముడిపడివుంది. 20వ శతాబ్ది ప్రారంభం నుండి రష్యన్ సమాజం, ప్రభుత్వం– రెండూ మత సమస్యపై అత్యంత తీవ్రమైన వైఖరులను తీసుకున్నాయి. బోల్షివిక్ విప్లవం తర్వాత రష్యాలో మత వ్యతిరేక ప్రచారం ఎంత తీవ్రంగా సాగిందంటే, చర్చికి సంబంధించిన చిహ్నాలు, భవనాలను కూల్చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలు అప్పటికీ మతస్ఫూర్తితో ఉంటున్నందున ప్రజలందరూ నాస్తికత్వాన్ని పాటించాలని కమ్యూనిస్టులు భావించేవారు. ఇప్పుడు రష్యన్ అధ్యక్షుడు పుతిన్... మతాచరణను రాజ్యవిధానంగా నమ్మాలని ప్రజలను బలవంతపెడుతున్నారు. రష్యన్ సనాతన చర్చి ప్రామాణికమైన పితృస్వామిక వ్యవస్థ నేతృత్వంలో ఉండేది. ఇది రోమన్ కేథలిక్ మతతత్వానికి భిన్నమైనది. అందుకే పుతిన్ నిరంకుశ వ్యవస్థను పూర్తిగా సమర్థించడం, ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని బలపర్చడమే కాకుండా యుద్ధానికి అవసరమైన బలగాలను కూడా ఇది సమీకరించింది. రష్యన్ చరిత్ర, జాతీయత పట్ల సనాతన చర్చి వ్యాఖ్యానం సరిగ్గా ఇతర ఆధ్యాత్మిక మతతత్వాలను అచ్చుగుద్దేలా ఉంటుంది. మతం అనేది జాతిని నిర్వచించే కీలక వనరుగా మారిపోయినప్పుడు ప్రతి అంశంలోనూ ఛాందసవాదం పాతుకుపోతుంది. రష్యాలో ఉక్రెయిన్ భాగమని రష్యన్ సనాతన మతబోధకులు నమ్ముతారు. ఎందుకంటే రష్యన్ సనాతన చర్చి ప్రస్తుత ఉక్రెయిన్ ప్రాంతంలో 10వ శతాబ్దంలో పుట్టింది. సెయింట్ ఆండ్రూస్ కీవన్ రస్ ప్రాంతంలో తొలి చర్చిని నెలకొల్పినట్లు చెబుతారు. అదే ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ పేరుతో చలామణిలో ఉంది. రష్యా, ఉక్రెయిన్, బెలారస్లను సనాతన అఖండ రష్యాగా చెప్పేవారు. దీనికీ... ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను సనాతన హిందూ ప్రాంతాలుగా గుర్తిస్తూ అఖండ భారత్ గురించి ఆరెస్సెస్ నేతలు చెప్పేదానికీ ఏమాత్రం వ్యత్యాసం లేదు. సోవియట్ యూనియన్ శాంతియుతంగా విచ్ఛిన్నమైపోవడం ఆమోదించకూడదనీ, కనీసం సనాతన చర్చి కేంద్రంగా ఉన్న రష్యాను ఎలాగైనా సరే మళ్లీ ఐక్యపర్చాలనీ భావిస్తున్న సనాతన మతబోధకుల నుండి పుతిన్ ఈ థియరీని తీసుకొచ్చారు. సనాతన చర్చిలో కూడా అసమ్మతివాదులు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ చాలావరకు సనాతన నేతలు పుతిన్‌తో ఉంటున్నారు. ఈ రోజు ప్రపంచం మొత్తంగా పుతిన్ గురించి మాట్లాడుతోంది కానీ సమస్య ఒక్క పుతిన్ మాత్రమే కాదు. మొత్తం సనాతన మతతత్వానికి చెందిన మత జాతీయతే అసలు సమస్య. రోమన్ కేథలిక్ చర్చితో సనాతన రష్యన్ చర్చి విభేదించడంలో కొన్ని మౌలిక సమస్యలు ఉన్నాయి. అలాగే పశ్చిమాన ప్రొటెస్టెంట్ చర్చితో ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. సనాతన చర్చి మద్దతుతో పుతిన్ రష్యాకు ఎదురులేని నేతగా మారిన తర్వాత రష్యాలోని రోమన్ కేథలిక్కులపై హింసాత్మకంగా దాడి చేయడం మొదలైంది. గర్భస్రావాలపై, స్వలింగ వివాహాలపై రోమన్ చర్చి కాస్త ఉదారవాద దృక్పథం తీసుకోవడమే కాకుండా ఉదారవాద డ్రెస్ కోడ్‌ను కూడా పాటిస్తూ వచ్చింది. దీంతో ఇవన్నీ పాశ్చాత్య ప్రపంచ ఆధునికానంతర దశలో చొచ్చుకువచ్చిన అనైతిక విధానాలుగా సనాతన చర్చి భావించేది. పాశ్చాత్య ఉదారవాదులను సనాతనవాద రష్యన్లు తమ శత్రువులుగా భావించేవారు. అయితే రష్యన్లు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నారని దీని అర్థం కాదు. కమ్యూనిస్టు దశలో శ్రామికవర్గ నియంతృత్వ భావన రష్యన్ ప్రజల మనస్తత్వంపై ప్రతికూల ప్రభావం కలిగించింది. కమ్యూనిస్టు పాలనలో వారి అనుభవం వల్ల కావచ్చు. ప్రత్యేకించి సనాతన భావాలు కలిగినవారు సనాతన నిరంకుశ రాజకీయ పాలననే గట్టిగా విశ్వసిస్తున్నారు. నేటి రష్యాను ఆధ్యాత్మిక రాజ్యంగా మనం పిలవలేనప్పటికీ పుతిన్ వంటి స్వార్థ కాంక్షగల పాలకులు ఇలాంటి సనాతన వాతావరణాన్ని క్రమేపీ ఆధ్యాత్మిక నిరంకుశత్వంలోకి సులువుగా తీసుకుపోతారు. ఉదారవాదం, లౌకికవాదం రెండూ ప్రమాదకరమైన సిద్ధాంతాలని రష్యన్ సనాతనవాదులు నమ్ముతున్నారు. కమ్యూనిజం, సోషలిజం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించడమే కాదు, రష్యన్ సమాజంలోకి సనాతన వ్యతిరేక విలువలను తీసుకొచ్చిన ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని కూడా సనాతన చర్చి వ్యతిరేకిస్తోంది. పుతిన్ మితవాద నిరంకుశత్వం చాలా ఉపయోగకరమని ఇలాంటి జాతీయవాద ప్రాపంచిక దృక్పథాలు భావిస్తున్నాయి. తమ పొరుగున ఉన్న ఉక్రెయినియన్ ప్రజాస్వామ్యం తమ మితవాద, లాంఛనప్రాయమైన ఎన్నికలతో కూడిన నిరంకుశత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని సనాతన చర్చి భావిస్తోంది. చైనా తరహా మార్కెట్ కమ్యూనిజాన్ని రష్యన్లు కోరుకోవడం లేదు. కమ్యూనిస్టు వ్యవస్థలు ప్రజల ఆధ్యాత్మిక స్వయంప్రతిపత్తిని నిర్మూలించడమే కాకుండా ప్రజాజీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభుత్వం నిర్దేశిస్తూ రావడంతో... ప్రభుత్వమూ, మతమూ ఒకటిగా కలిసిపోయి ఉండే తరహా నియంతృత్వాన్ని రష్యన్ సనాతనవాదులు కోరుకుంటున్నారు. ప్రభుత్వాన్ని, మతాన్ని విడదీయడానికి ఆస్కారమే లేని ఈ వ్యవస్థే పుతిన్‌ను సంపూర్ణంగా బలపర్చింది. చాలావరకు ముస్లిం దేశాలు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక నిరంకుశ రాజ్యవ్యవస్థలలోనే నడుస్తుంటాయి. కానీ ఇవి లౌకికవాదంతో ఘర్షణ పడవు. అఫ్గాన్ తాలిబనిజం ఒక్కటే అత్యంత తీవ్రరూపంలోకి మళ్లింది. మతం, రాజ్యవ్యవస్థ కలగలిసిన నిరంకుశత్వం... విభిన్న సామాజిక, రాజకీయ వ్యవస్థలను కొనసాగించదలుస్తున్న పొరుగుదేశాలతో యుద్ధాలు కోరుకుంటుంది. సోషలిస్టు వ్యవస్థలు కుప్పకూలిన తర్వాత ప్రపంచం తిరిగి సోషలిస్టు పూర్వ ఘర్షణల స్థాయికి చేరుకుంది. రష్యాలో ప్రజాస్వామిక సంక్షేమ జాతీయవాదం కాకుండా ఆధ్యాత్మిక జాతీయవాదమే జాతి కార్యాచరణను నిర్ణయిస్తోంది. పాశ్చాత్య ప్రపంచం రష్యాను ఒక ధూర్తదేశంగా వర్ణిస్తున్నప్పటికీ తమపై ఈ ముద్రను ఆధ్యాత్మిక జాతీయవాదం లెక్కచేయదు. క్రిస్టియన్ ప్రపంచంలో ఈ దిశను రష్యా ఇప్పుడు చూపిస్తున్నట్లుంది. ఉక్రెయిన్ కూడా ప్రభుత్వాన్ని, చర్చిని నామమాత్రంగా మాత్రమే విడదీసే ప్రజాస్వామిక నమూనాను ఆమోదించే సనాతన క్రిస్టియానిటీని కలిగి ఉన్నది కనుక ఈ యుద్ధంలో ఏం జరగబోతుందనేది వేచి చూడాలి. ప్రపంచం ఇప్పుడు అఫ్గాన్ తాలిబనిజం, రష్యన్ సనాతనవాదం వంటి పలురకాల ఆధ్యాత్మిక ఛాందసవాదాలతో తలపడుతోంది. భారతదేశంలో హిందుత్వశక్తులు పదేపదే తాము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నామనీ, రాజ్యాంగ పరిధిలో నడుస్తున్నామనీ చెప్పుకుంటున్నప్పటికీ, మతపరమైన ఛాందసవాదం ఈ శక్తులను ఏవైపునకు తీసుకుపోతుందనేది చెప్పలేం. మతమనేది ప్రభుత్వ పాలనతో కలిసిపోయాక, ఒక పాలకుడు జీవితకాల పాలకుడిగా మారాలని అభిప్రాయానికి వచ్చాక, మతపర శక్తులు పౌరసమాజాన్ని దూకుడుగా నియంత్రిస్తాయి. ఎన్నికల వ్యవస్థను కూడా తారుమారు చేసినప్పడు ఏ వ్యవస్థ అయినా నియంతృత్వంలోకి వెళ్లి తీరుతుంది. ఈ యుద్ధంలో రష్యా గెలిచి ఉక్రెయినియన్ ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసినట్లయితే, క్రిస్టియన్ ప్రపంచం తమ జాతీయవాదం, ప్రజాస్వామ్యం, లౌకికవాద తత్వాల ప్రయోగంలో కొత్త దశలోకి ప్రవేశించడం ఖాయం. ప్రొ‘‘ కంచ ఐలయ్య వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త షెపర్డ్ -
నిన్నటి తప్పు నేడు చేయొద్దు!
‘డెల్టా ప్లస్’ అత్యంత ప్రమాదకారి అని అంతర్జాతీయ శాస్త్రసమాజమే అభిప్రాయపడుతోంది. ‘అసలు డెల్టాయే ప్రమాదకారి, డెల్టా ప్లస్ ఇంకా...’ అని ప్రఖ్యాత వైరాలజిస్టు, అమెరికా శ్వేతసౌధ ముఖ్య సలహాదారు ఆంథోనీ ఫౌచీ పేర్కొన్నారు. గత రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న సూచనలు, చేస్తున్న హెచ్చరికలు ఇదే ధ్రువపరుస్తున్నాయి. ‘ఇది అత్యంత ప్రమాదకారి, దీంతో జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో వైద్యులు, శాస్త్ర నిపుణుల నిర్దేశించే ప్రవర్తన కలిగి ఉండటం పౌర సమాజపు ప్రధాన కర్తవ్యం! పౌరసమాజానికిది పరీక్షా కాలం! ప్రభుత్వాలకు, అంతకుమించి మన ప్రజారోగ్య వ్యవస్థకున్న పరిమితులు తేటతెల్లమైన తర్వాత ఎవరైనా పౌరసమాజంపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వ చర్యల వైపు చూస్తూనే విశాల జనబాహుళ్యపు పూర్తి సహకారం అర్తించే సమయమిది. ప్రజలు సంయమనం, క్రమశిక్షణ, శ్రద్ధ వహిస్తేనే... కోవిడ్–19 వంటి మహమ్మారి నుంచి సమాజం బయటపడగలుగుతుంది. ఇలాంటి ఉపద్రవాలనెన్నింటినో అధిగమిం చిన చారిత్రక సందర్భాలు ప్రజల ‘సమష్టి–నిబద్ధ కృషి’ ఖాతాలో చాలా ఉన్నాయి. ఏడాదిన్నర కాలంగా ప్రపంచ మానవాళినే వణికి స్తున్న కోవిడ్–19 తగ్గినట్టే తగ్గుతూ... వైరస్ కొత్త రకాల్ని సృష్టి స్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. మనిషి సహజ రోగనిరోధక శక్తి, చికిత్స ద్వారా ఇచ్చే ఔషధాలను తట్టుకునేందుకు వైరస్ తనంత తాను రూపు–స్వభావం మార్చుకోవడం (మ్యుటేషన్) సహజం. ఈ క్రమంలో పుడుతున్న కొత్త రకాలు (వేరియంట్స్) ఎన్నో! వూహాన్ (చైనా) మౌలిక రకం నుంచి... ఆల్ఫా (యు.కె.లో గుర్తించిన రకం), బీటా (దక్షిణాఫ్రికాలో బయటపడిన రకం), డెల్టా (భారత్‌లో వెలుగు చూసిన రకం)లను దాటి తాజాగా పుట్టి క్రియాశీలమౌతున్న ‘డెల్టా ప్లస్’ రకం దడ పుట్టిస్తోంది. దేశంలో 40 కేసులు దాటాయి. మననే కాక మరో 8 దేశాలకూ నిద్ర లేకుండా చేస్తోంది. దాని లక్షణాలు, కన బరిచే స్వభావం, చూపే ప్రభావం... సరికొత్త సవాల్! ఇప్పుడు మనం వాడుతున్న టీకామందులు కొత్త రకం వైరస్ నుంచి ఏమేర రక్షణ కల్పిస్తాయనే విషయమై విశ్వవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతు న్నాయి. ‘డెల్టా’ మౌలిక రకం వైరస్ బారిన పడినా, ఆస్పత్రి వెళ్లే దాకా పరిస్థితిని రానీయకుండా ఫైజర్, ఆస్ట్రాజెనికా (మన కోవిషీల్డ్) టీకా మందు రక్షణనిస్తుందని ఆక్స్ఫర్డ్ అధ్యయనంలో వెల్లడైంది. ‘డెల్టా ప్లస్’ వైరస్ నుంచి కూడా సదరు రక్షణ లభిస్తుందా? అన్నది ఇంకా పరీక్షల స్థితిలోనే ఉంది. ఇదే విషయమై భారత వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్) నిర్వహిస్తున్న పరీక్ష ఫలితాలు త్వరలోనే వెలువడనున్నాయి. ‘టీకామందు తీసుకున్న వారిలో పుట్టే యాంటీ బాడీలు, కొత్త వైరస్‌ను నిర్వీర్యం చేస్తున్నాయా? అనేది మా పరీక్షల్లో తేలుతుంది’ అంటూ మండలి శాస్త్రవేత్త డాక్టర్ సమీరన్ పండ చెప్పిన మాటలు కొత్త ఆశల్ని, ఆకాంక్షల్ని రేకెత్తిస్తున్నాయి. అతి ప్రమాదకారి కొత్త రకం ‘డెల్టా ప్లస్’ అత్యంత ప్రమాదకారి అని అంతర్జాతీయ శాస్త్రసమాజమే అభిప్రాయపడుతోంది. ‘అసలు డెల్టాయే ప్రమాదకారి, డెల్టా ప్లస్ ఇంకా...‘ అని ప్రఖ్యాత వైరాలజిస్టు, అమెరికా శ్వేతసౌధ ముఖ్య సల హాదారు ఆంథోనీ ఫౌచీ పేర్కొన్నారు. లోతైన పరిశీలనల్ని బట్టి.... వేగంగా వ్యాప్తి, ఇన్ఫెక్షన్ను పెంచడం, సోకిన వారి–ఊపిరితిత్తుల కణజాలాన్ని బలంగా అంటిపెట్టుకోవడం, మోనోక్లోనల్ యాంటీ బాడీల ప్రభావాన్ని బాగా తగ్గించడం వంటివి తాజా వైరస్ లక్ష ణాలుగా చెబుతున్నారు. అందుకే, వ్యూహాత్మకంగా ముందుకు సాగా లని ప్రభుత్వాలూ హెచ్చరిస్తున్నాయి. గత రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న సూచనలు, చేస్తున్న హెచ్చరికలు ఇదే ధ్రువపరుస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ‘ఇది అత్యంత ప్రమాదకారి, తీవ్ర రూపం దాల్చకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాలను అప్ర మత్తం చేసింది. మరో మూడు రాష్ట్రాల్లోనూ ఈ కేసుల్ని గుర్తించినట్టు చెబుతున్నా అధికారికంగా సమాచారం లేదు. డెల్టా ప్లస్ కేసులు రాగానే అప్రమత్తం కావాలని, ఆయా ప్రాంతాల్లో స్థానిక కట్టడి (కంటైన్మెంట్ జోన్ల ప్రకటన) ఏర్పరచాలని, నమూనాలను తదుపరి పరీక్ష–విశ్లేషణ కోసం ‘జీనోమిక్ కన్సార్షియం’ (ఐఎన్ఎస్ఏసీవోజీ)కి పంపించాలనీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశించింది. డెల్టా రకం వైరస్ 80 దేశాల్లో కనిపించినా, డెల్టా ప్లస్ భారత్‌తోపాటు అమెరికా, బ్రిటన్, పోలాండ్, పోర్చ్‌గల్, రష్యా, చైనా, జపాన్, నేపాల్ దేశాల్లో వెల్లడైంది. ఆల్ఫా రకం ఒకరి నుంచి సగటున నలుగురికి వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటే, డెల్టా ప్లస్ 5 నుంచి 8 మందికి సోకే ప్రమాదముంది. డెల్టా మౌలిక రకం కూడా ప్రమాదకారేనని పశ్చిమ దేశాల వైద్యులు, శాస్త్రవేత్తలంటున్నారు. బ్రిటన్ గణాంకాల ప్రకారం, డెల్టా సోకిన వారిలో లక్షణాలు బయటకు కనిపించిన నాటి నుంచి కేవలం 3–4 రోజుల్లోనే ఇన్ఫెక్షన్ తీవ్ర స్థితికి వెళ్లిపోతున్నట్టు స్పష్టమైంది. అడుగులు ముందుకే పడాలి దేశంలో కోవిడ్ కేసులు రమారమి తగ్గుతున్న పరిస్థితి. మొత్తమ్మీద 40 కోట్ల మందికి పరీక్షలు జరుపగా, 3 కోట్ల మందికి కరోనా సోకినట్టు రికార్డయింది. ఒకరోజు కొత్త కేసులు సగటున 40 వేలకు తగ్గాయి. ఒకరోజు కోలుకున్న వారి సంఖ్య 82 వేలకు పెరిగింది. కొత్త కేసుల కన్నా రోగులు కోలుకున్న కేసుల సంఖ్య ఎక్కువ గత 40 రోజుల నుంచి నిరవధికంగా నమోదవుతోంది. ఈ పరిస్థితుల్లో... వైరస్ కొత్తరకం వ్యాప్తి పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, కోవిడ్ మూడో అల అనుకున్న దానికన్నా ముందే ముంచుకు వచ్చే ప్రమాదాన్ని ప్రభు త్వాలతో పాటు నిపుణులూ శంకిస్తున్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల చర్యలెలా ఉన్నా... పౌరసమాజం బాధ్యతగా వ్యవహరించాలంటు న్నారు. కోవిడ్ సముచిత ప్రవర్తన (సీఏబీ) కలిగి ఉండాల్సిన అవ సరం ఏమిటో రెండో అలలో మనకు స్పష్టంగా బోధపడింది. వ్యూహం కొరవడ్డ ప్రభుత్వ విధాన లోపాలు, అవసరానికి తగ్గట్టు లేని మన వైద్య–ప్రజారోగ్య వ్యవస్థ అగచాట్లకు పౌరుల విపరీత ప్రవర్తన తోడై రెండో అలలో తీవ్ర నష్టమే జరిగింది. లక్షలమంది ప్రాణాలు కోల్పో యారు. ఇరవై రోజుల్లో లక్షమంది భారతీయులు చనిపోయిన పాడుకాలం ఈ అలలోనే చూశాం. లక్షలాది మంది వ్యాధి బారిన పడి కోలుకున్నా... కోవిడ్ తర్వాతి ఇబ్బందులతో ఇంకా సతమతమౌ తున్నారు. కోట్లాది మంది ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కు మంటూ గడిపిన దిక్కుమాలిన కాలం. మొదటి అల ముగింపు దశలో మన అలసత్వానికి తగిన మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అంత దాకా ఉన్న కట్టడిని క్రమంగా ఎత్తివేసి ప్రభుత్వాలు కొంత వెసులు బాటు ఇవ్వగానే, పౌరులు విచ్చలవిడిగా బయటకు వచ్చారు. మహ మ్మారి నుంచి గట్టెక్కామనుకున్నారు. గుంపులుగా తిరిగి, పండుగలు– పబ్బాల్లో గుమిగూడి, మాస్క్‌లు లేకుండా, భౌతిక దూరం లెక్క చేయక ఇష్టానుసారం నడిచారు. అప్పుడే డెల్టా రకం వైరస్ వచ్చి తీరని నష్టం కలిగించింది. గత డిసెంబరులో తొలిసారి ఇక్కడే వెలుగు చూసింది. రెండో అల వేగంగా ముంచుకు వచ్చి, తీరని నష్టం కలిగిం చడం వెనుక బలమైన కారణాలు ఇవే అని ఆధారాలతో వెల్లడైంది. వైరస్ ప్రభావం, కేసుల సంఖ్య తగ్గుతూ ఇప్పుడిప్పుడే ఊరట చెందు తుంటే... వైరస్ కొత్త రకం మళ్లీ బయపెడుతోంది. అవసరం మనది... ఒక వంక వైరస్ వ్యాప్తిని నిలిపి, వైద్యం అందించి ప్రాణాలు నిలు పడం మరో వైపు కార్యకలాపాలు సాగించి ఆర్థికవ్యవస్థను మెరుగు పరచడం ప్రభుత్వాల బాధ్యత. రెంటి మధ్య సమతూకం పాటించి ప్రాణాలు, ప్రాణాధారాలను కాపాడే ద్విముఖపాత్ర ప్రభుత్వాలు పోషిస్తాయి. కానీ, ప్రాణాధారాలు కాపాడుకుంటూనే ప్రాణాలు నిలుపుకోవలసిన అవసరం ప్రజలది. ఇంతటి మహమ్మారిని ఎదు రొడ్డి నిలిచే నిత్య పోరాటం ఒక ఉమ్మడి బాధ్యత! వైరస్ వ్యాప్తిని, కోవిడ్ ప్రభావాన్నీ నిలువరించేలా పౌరులు అన్ని జాగ్రత్తలు పాటిం చాలి. వైరస్ కొత్తరూపంలో ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు... అప్రమత్తత ఎంతో అవసరం. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతుల్ని నిరంతరం శుభ్రపరచుకోవడం... ఇలా వైద్యులు, శాస్త్ర నిపుణుల నిర్దేశించే ప్రవర్తన కలిగి ఉండటం పౌర సమాజపు ప్రధాన కర్తవ్యం! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
లోకం చూపు టీకావైపు!
సరైన డాటా వెల్లడి, సముచిత నిర్ణయాలు, అమల్లో పారదర్శకతే కోవిడ్ విముక్తి పోరులో కీలకమని నిపుణులంటున్నారు. కేసుల లెక్క, మరణాల సంఖ్య, వ్యాధిగ్రస్తులవడం–కోలుకోవడం వంటి విషయాల్లో నిజాలు చెప్పట్లేదని, తప్పుడు గణాంకాలిస్తున్నారనే విమర్శలున్నాయి. మరో వంక, టీకామందు నిల్వల గురించి సమాచారం జనబాహుళ్యంలో పెట్టకూడదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, ఇతర సంస్థలకు ఇటీవలే నిర్దిష్ట ఆదేశాలిచ్చింది. ఈ చర్యలు మరిన్ని సందేహాలకు తావిస్తున్నాయి. ఇవన్నీ అధిగమించి ముందుకు సాగితేనే యుద్ధంలో గెలుస్తాం. కోవిడ్‌ను ఓడించి నిలుస్తాం! దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గి కోవిడ్ రెండో అల వెనక్కి జారుతున్న క్రమంలోనే... టీకా ప్రక్రియ (వ్యాక్సినేషన్) పైకి అందరి దృష్టీ మళ్లుతోంది. ఇప్పుడిదొక ముఖ్యాంశమైంది. కోవిడ మూడో అల రాకుండా, వచ్చినా తీవ్రత లేకుండా చూసుకోవాలంటే వేగంగా టీకా ప్రక్రియ జరిపించాలనేది దేశం ముందున్న లక్ష్యం. దీనిపై కేంద్ర– రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారించాయి. తగు దిద్దుబాటు చర్యలతో, విధానమార్పు ప్రకటించిన ప్రధాని మోదీ, ఇకపై టీకామందును కేంద్రమే రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుందని చెప్పారు. ప్రక్రియను పరు గులు తీయిస్తామన్నారు. అదే సమయంలో ముళ్లపొదల్లా... పలు అంశాలు టీకా చుట్టే అల్లుంటున్నాయి. ఇందులో కొన్ని వ్యూహ వైక ల్యాలు, నిర్వహణా లోపాలు, విధానపరమైన వైఫల్యాలైతే మరికొన్ని అనుకోకుండా పుట్టుకు వచ్చిన సవాళ్లు! ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఈ చిక్కుముడులన్నిటినీ విప్పి ముందుకు సాగితేనే మనమీ ఉపద్రవం నుంచి తక్కువ నష్టంతో బయటపడగలుగుతాము. కోవిడ్ విషకోరల నుంచి విశాల భారతాన్ని కాపాడుకోగలుగుతాం. టీకామందుల తయారీలో ఘన చరిత్ర, పంపిణీలో మనకున్న సామర్థ్యాన్ని బట్టి ఈ పాటికి ప్రపంచంలోనే భారత్ ముందుండాల్సింది! మరెన్నో దేశాలకు ఆపన్న హస్తం అందించి ఉండాల్సింది. ఉంటామనే మొదట్లో మన ప్రధాని, దావోస్ ఆర్థిక సదస్సు వేదిక నుంచి ప్రపంచానికి తెలియ జెప్పారు. కానీ, ఆ పరిస్థితిపుడు లేదు. లక్ష్యం వైపు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా నడుస్తున్నాం. అమెరికా, యూరప్, ఇతర అభివృద్ధి చెందిన సమాజాలు రెండు డోసుల టీకా ప్రక్రియ ముగించుకొని తలసరి రెండు, మూడు డోసుల టీకా భవిష్యత్తు కోసం రిజర్వు చేసుకున్నాయి. కెనడా ఒక్కో పౌరుడికి (తలసరి) 9 డోసుల చొప్పున రిజర్వు చేసు కుంది. క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తూ, పలు దేశాల్లో కట్టడి ఉపసంహ రిస్తున్నారు. జనజీవనాన్ని సాధారణ స్థాయికి తెస్తున్నారు. ఆర్థిక వ్యవ స్థల్ని పునరుత్తేజం చేస్తున్నారు. జనవరి మధ్యలో టీకా ప్రక్రియ ప్రారంభించిన మనం, ఇప్పటికి సుమారు 20 కోట్ల మందికి కనీసం ఒక డోసు, దాదాపు 5 కోట్ల మందికి సంపూర్ణ టీకా (రెండు డోసులు) ఇచ్చాం. 137 కోట్ల భారతావనిలో భారీ లక్ష్యాలే ముందున్నాయి. శరవేగంతో వెళితేనే..... ఆర్థిక వ్యవస్థను పూర్వపుబాట పట్టించాలంటే వాణిజ్యం, వ్యాపారం వంటి దైనందిన ప్రక్రియలు పూర్తిస్థాయిలో పనిచేయాలి. అందుకు, ‘సామూహిక రోగనిరోధకత’ (హెర్డ్ ఇమ్యూనిటీ) రావాలి. జనాభాలో 70 శాతం మందికి టీకామందు, కనీసం ఒక డోసైనా ఇస్తేనే ఇది సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నెలవారీ(మే) నివేదిక చెబుతోంది. సెప్టెంబరు మాసాంతానికి ఈ లక్ష్యం సాధించా లంటే సగటున రోజూ 93 లక్షల మందికి టీకా మందు వేయాలి. గడ చిన 5 మాసాల్లో అత్యధికమంటే, ఒక రోజు 42.65 లక్షల డోసులే ఇవ్వగలిగారు. ఈ వేగం సరిపోదు. ఇకపై స్వదేశీ ఉత్పత్తి పెరగడం, విదేశీ కంపెనీలతో కొనుగోలు ఒప్పందాలు, కేంద్రమే సమకూర్చుకొని పంపిణీ చేయడం, రాష్ట్రాలూ ఈపాటికే కోవిడ్ సెంటర్లను ఏర్పరచి నిర్వహిస్తున్నందున లక్ష్యం సాధ్యమే అంటున్నారు. నమోదు సైట్లు, టీకామందు సెంటర్లు, వైద్య–అనుబంధ సిబ్బంది, టీకామందు సరఫ రాలను సమన్వయ పరచి, రాత్రీపగలు (27/7) శ్రమిస్తే లక్ష్యం సాధ్య మేనని నివేదిక పేర్కొంది. టీకామందు ఉత్పత్తిపై సందేహాలు, అపో హలతో టీకాకు పౌరుల వెనుకంజ, ఇతర నిర్వహణా లోపాల్ని అధిగ మించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. వివిధ కంపెనీల టీకామం దుల్లో ధర వ్యత్యాసాల సమస్య అలాగే ఉంది. సుప్రీంకోర్టూ దీన్ని తప్పుబట్టింది. ప్రయివేటు ఆస్పత్రులకు 25 శాతం టీకామందు కేటా యింపు, వారి దోపిడీకి లైసెన్సు ఇవ్వడమేననే విమర్శలున్నాయి. కోవిడ్ సమాచార వెల్లడిలో పారదర్శకత లోపిస్తోందనే ఆరోపణలు న్నాయి. అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్లుహె చ్వో) అనుమతించిన జాబితాలోకి, స్వదేశీ టీకామందు కోవాక్సిన్ (భారత్ బయోటెక్ వారి ఉత్పత్తి) ఇంకా ఎక్కకపోవడం పెద్ద సమ స్యగా మారుతోంది. ఈ టీకా రెండు డోసులు తీసుకున్నా, దాన్ని ‘వాక్సినేషన్’గా పరిగణించక పలు దేశాలు అనుమతి నిరాకరిం చడంతో, భారతీయుల అంతర్జాతీయ ప్రయాణాలకిది అవరోధంగా మారింది. కోరిన సమాచారం కంపెనీ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం మరింత చొరవతో సత్వరం డబ్లుహెచ్‌వో ఆమోదం తీసుకురావాలి. ఉత్పత్తి ఊపందుకోవాలి దేశీయ, విదేశీ కంపెనీలయినా టీకామందు ఉత్పత్తి ఎన్నో రెట్లు పెంచాలి. సెప్టెంబరు–డిసెంబరు మధ్య 216 కోట్ల డోసుల ఉత్పత్తి చేస్తామని కేంద్రం లోగడ ప్రకటించింది. కానీ, ఇదే కాలంలో సరఫ రాకై 44 కోట్ల డోసుల ఉత్పత్తికి ఆర్డర్లు, అడ్వాన్సులు ఇస్తున్నట్టు ఇటీ వలే వెల్లడించింది. ఎందుకీ వ్యత్యాసమో తెలియదు. దాదాపు 90 శాతం ఉత్పత్తికి బాధ్యత వహిస్తున్న భారత్ సీరమ్ సంస్థ (కోవీషీల్డ్) ఇకపై ఉత్పత్తిని పెంచనున్నట్టు పేర్కొంది. ముడి పదార్థాల దిగుమతి ఓ సమస్యగా ఉండింది. కేంద్ర ప్రభుత్వ సంప్రదింపుల తర్వాత అమెరికా (యుఎస్), ఆయా పదార్థాల ఎగుమతు లపై ఉన్న నిషే«ధం తొలగించింది ‘అమెరికా రక్షణ ఉత్పత్తుల చట్ట’ నిబంధనల్ని సడలిం చామని యుఎస్ అధికారవర్గాలు వెల్లడించాయి. ముడిసరుకు దేశానికి వచ్చి, ఉత్పత్తి పెరిగేది ఆగస్టు నెలాఖరులోనే! భారత్ బయోటెక్ సంస్థ కూడా తమ ఉత్పత్తుల్ని జూన్ నుంచి పెంచుతున్నట్టు చెప్పింది. జూలైలో 7.4 కోట్ల డోసులు ఈ సంస్థ ఉత్పత్తి చేయనుందని కేంద్రం వెల్లడించింది. ఇదంతా గజిబిజిగా ఉంది. ఫైజర్ (యూఎస్) టీకా మందు ఉత్పత్తి చేసే కంపెనీ, తాము భారత్‌లో సరఫరాకు ఒప్పందం కుదుర్చుకోవాలంటే న్యాయపరమైన రక్షణ కల్పించాలని కేంద్ర సర్కా రును అడుగుతోంది. పాక్షికంగా కల్పించే అవకావాలున్నాయి. స్వదే శీతో సహా ఇప్పటి వరకు ఏ కంపెనీకి ఇటువంటి రక్షణ కల్పించలేదు. ధరల్లో అసాధారణ తేడా! లాభాపేక్షలేని పద్ధతిన భారత్‌లో పది డాలర్ల (రూ.730)కే ఒక్కో డోసు టీకామందు ఇస్తామని ఫైజర్ ఉత్పత్తిదారు చెబుతోంది. ఇదే కంపెనీ అమెరికాలో, ఐరోపాలో ఇస్తున్న ధర కంటే ఇది తక్కువ. అంటే, భారత్‌లో ఇది దేశీయ ఉత్పత్తి కోవిషీల్డ్ ధర (రూ.780) కన్నా తక్కువ! మరి, రష్యాకు చెందిన స్పుత్నిక్–వి (రూ.1145), మరో దేశీయ ఉత్పత్తి కోవాక్సిన్ (రూ.1410) ధరలు ఎందుకంత ఎక్కువ అనేది ప్రశ్న. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రులకు 25 శాతం కోటా కేటా యించిన నేపథ్యంలో, ఈ ధర వ్యత్యాసం పలు సమస్యలకు దారి తీస్తుందని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా అభిప్రాయ పడింది. టీకామందు ఉత్పత్తి ఫార్ములాలను బట్టి ఈ వ్యత్యాసమని, అధికధర నిర్ణయించిన కంపెనీలు చెబుతున్నాయి. అడెనోవైరస్ ఫార్ములాతో రూపొందించే మిగతా టీకామందు తయారీ చౌకలో అవుతుందని, తమలా ఇనాక్టివేటెడ్ వైరస్ వినియోగ ఫార్ములా వల్ల, పెద్దమొత్తంలో ఉత్పత్తి చేసినా వ్యయం తగ్గదని కోవాక్సిన్ ఉత్పత్తి దారు చెబుతున్నారు. ధర ఎక్కువున్నప్పటికీ, ఆయా టీకా మందుల సామర్థ్యం తక్కువని వస్తున్న అధ్యయనాలు పౌరుల్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. సదరు నివేదికలు సత్య దూరం, అసమగ్రమని ఉత్ప త్తిదారు అంటున్నారు. ఏమైనా.. ప్రభుత్వం ఇంకా సమర్థంగా ఆయా కంపెనీలతో చర్చించి, సహేతుక ధరల్ని ఖరారు చేసుండాల్సింది. సరైన డాటా వెల్లడి, సముచిత నిర్ణయాలు, అమల్లో పారదర్శకతే కోవిడ్ విముక్తి పోరులో కీలకమని నిపుణులంటున్నారు. కేసుల లెక్క, మరణాల సంఖ్య, వ్యాధిగ్రస్తులవడం–కోలుకోవడం వంటి విష యాల్లో నిజాలు చెప్పట్లేదని, తప్పుడు గణాంకాలిస్తున్నారనే విమర్శ లున్నాయి. మరో వంక, టీకామందు నిల్వల గురించి సమాచారం జనబాహుళ్యంలో పెట్టకూడదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, ఇతర సంస్థలకు ఇటీవలే నిర్దిష్ట ఆదేశాలిచ్చింది. ఈ చర్యలు మరిన్ని సందేహాలకు తావిస్తున్నాయి. ఇవన్నీ అధిగమించి ముందుకు సాగితేనే యుద్ధంలో గెలుస్తాం. కోవిడ్‌ను ఓడించి నిలుస్తాం! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
డేటా చోరీ.. గోప్యతకు గోరీ
వ్యక్తిగత సమాచార భద్రత! ‘అబ్బో! అది దుర్వినియోగమైతే ఎలా...?’ మన సమాజం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సదరు ప్రాధాన్యతను నిజంగా గుర్తించిందా? ఏమో! పరస్పర సందేశాల మార్పు ఉపకరణం (మెసే జింగ్ యాప్) ‘వాట్సాప్’ను మునివేళ్లపై నిలిపి, నిర్ణయాన్ని వాయిదా వేసుకునేలా చేసిందంటే నిజమేనేమో! అనిపిస్తుంది. ‘ఫలానా తేదీ లోపు మా కొత్త గోప్యతా విధానానికి అంగీకారం తెలపండి లేదా సేవల నుంచి వైదొలగండి’ అన్న వాట్సాప్, భారతీయుల్లో పెల్లుబికిన వ్యతిరేకత దెబ్బకు వెనక్కి తగ్గింది. వాయిదాతో తన ప్రతిపాదన మూడు నెలలు వెనక్కి నెట్టింది. ‘మీ సమాచార వివరాలు చూడబోము, వాడబోము’ అని వినియోగ దారుల్ని నమ్మించే కాళ్లబేరానికొచ్చింది. ఎందుకంటే, 40 కోట్ల అకౌంట్లతో ఈ దేశంలో తనకున్న అతి పెద్ద మార్కెట్ పడిపోతే ఎలా? భయం! తాజా ప్రతిపాదన నచ్చక లక్షలాదిమంది వేగంగా ‘సిగ్నల్’ ‘టెలిగ్రామ్’ వంటి ప్రత్యామ్నాయ యాప్‌లకు దారి మళ్లడంతో జడు సుకుంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి నిద్రమత్తు వదిలినట్టు లేచి, వాట్సాప్‌ను ప్రశ్నావళితో గద్దిస్తోంది. అసలు మీ విధానమేంటి? మా పౌరుల నుంచి మీరేం సమాచారం సేకరిస్తున్నారు? ఇక్కడ–యూర ప్లో తేడాలెందుకు? అని ప్రశ్నలు సంధిస్తోంది. గోప్యత విధానంలో మార్పులేమీ తేకండి అంటోంది. వాట్సాప్ ప్రతిపాదన వాయిదా పడిందే తప్ప సమస్య తొలగిపోలేదు. ప్రమాదం నిరంతరం పొంచి ఉంటుందన్నది నిజం. సామాజిక మాధ్యమాలన్నింటితోనూ ఈ ప్రమాదం ఉంది, ఉంటుంది. తమ వినియోగదారుల నుంచి వేర్వేరు రూపాల్లో సేకరించే, పొందే, నిల్వ చేసే, అనుసంధానమయ్యే వ్యక్తిగత సమాచారం వారి వద్ద ‘డాటా’గా నిక్షిప్తం అవుతుంది. దాన్ని వారు గోప్యంగా ఉంచాలి. ఉంచుతు న్నామనే చెబుతారు. కానీ, ఉంచరు. వేర్వేరు వ్యాపార అవసరాలకు తామే వాడినట్టు, వ్యాపార ప్రయోజ నాలున్న మూడో పక్షానికి అమ్ముకున్నట్టు చాలా సార్లు వెల్లడయింది. ఇప్పుడదే పెద్ద సమస్య! అది తప్పించాలంటే పౌరుల వ్యక్తిగత సమాచారానికి ప్రభుత్వ పరమైన భద్రత కావాలి. చట్టపరమైన రక్షణ ఏర్పడాలి. దానికి కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ‘వ్యక్తిగత సమా చార రక్షణ చట్టం’ (పీడీపీ) పకడ్బందిగా ఉండాలి. తగిన నిఘా, నియంత్రణ వ్యవస్థలతోనే వ్యక్తిగత సమాచార దోపిడీ, దుర్వినియో గానికి కళ్లెం వేయగలం. ఉచిత సేవ, ధనార్జన యావ! ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచ గతి మారింది. కమ్యూని కేషన్ రంగంలో శాస్త్ర–సాంకేతిక విప్లవమే వచ్చింది. ఎన్నో విధాలుగా సమాచారం సేకరించడం, ప్రోదిచేయడం, మార్పిడి చేయడం నుంచి క్లౌడ్ కంప్యూటింగ్‌తో అపరిమితంగా, గోప్యంగా దాచిపెట్టడం వరకు ఆశ్చర్యకరమైన పరిణామాలొచ్చాయి. దొంగచాటుగా, బహిరంగంగా అమ్ముకోవడమూ రివాజయింది. డిజిటల్ ఎకానమీలో ఇదే ఓ ఇంధన మైంది. ఈ–కామర్స్‌కు రాచబాట పడింది. క్షణాల్లో సమాచార మార్పిడి జరిగిపోతోంది. వ్యాపార–వాణిజ్య వ్యవహారాల్లో పెను మార్పులకు వాకిళ్లు తెరుచు కున్నాయి. ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్, గూగుల్... ఇలా ఎన్నెన్నో వైవిధ్యభరిత ఉపకరణాలొచ్చాయి. ఈ– కామర్స్ ప్రక్రియలో మెసేజింగ్ యాప్‌లూ బలపడ్డాయి. కరోనా మహమ్మారి మనుషుల భౌతిక కదలికల్ని కట్టడి చేసిన దరిమిళా.. వస్తు, సేవల రంగంలో ‘ఆన్లైన్’ ఒక కీలక ప్రక్రియ అయిపోయింది. అంతకు ముందునుంచే సామాజిక మాధ్యమ వేదికలతో కోట్లమంది అనుసంధానమయ్యారు. వారెవరు, ఎక్కడివారు, ఎంత వయసు, ఏం చేస్తుంటారు, ఆదాయమెంత, వ్యయమెంత, అభిరుచులేంటి, వ్యవహా రాలేంటి... ఒక్కటేమిటి? వారికి సంబంధించిన సమస్త సమాచారం ఆయా యాప్‌లలోకి చేరుతోంది. ఇంకోరకంగా చెప్పాలంటే, మనమే.. వారిని ఆహ్వానించడమే కాక చొచ్చుకు వచ్చేంత చనువిచ్చాం. నిజానికి ఈ సమాచారమంతా వారు గోప్యంగా ఉంచాలి. నిర్దేశించిన అవసరానికే వినియోగించాలి. అలా కాకుండా వేర్వేరు వ్యాపార సంస్థలకు విక్రయిస్తు న్నారు. ఆయా కంపెనీల వ్యాపార వృద్ధికి తోడ్పడే వాణిజ్య ప్రకటనలు చేర్చడానికి, భావజాల వ్యాప్తికి, ఆలోచనా సరళిని ప్రభా వితం చేయడానికీ... ఇలా ఎన్నో వ్యాపార, కొన్ని చోట్ల రాజకీయ అవసరాలకు పౌరుల వ్యక్తిగత గోప్య సమాచారాన్ని వాడుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ వంటివి రుసుమేమీ తీసుకోకుండా ఉచిత సేవలు అందిస్తున్నట్టే ఉంటుంది. కానీ, తమ విని యోగదారుల సమాచారాన్ని అందివ్వడం–అమ్ముకోవడం ద్వారా వస్తోత్పత్తి, సేవా విక్రయ సంస్థల నుంచి పెద్దమొత్తాల్లో వారు డబ్బు గడిస్తున్నారు. ఇదో పెద్ద వ్యాపారం. సదరు యాప్ సంస్థలు పౌరుల వ్యక్తిగత ఉనికి వివరాలే కాకుండా ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనల్లోకి చొరబడటంతో సగటు మనిషి వ్యక్తిగత సమాచారం అంగడి వస్తువయింది. ప్రతొక్కరి బతుకు వాల్పోస్టరయింది. వాట్సాప్ గగుర్పాటే సాక్ష్యం! సమాచార గోప్యత విషయంలో వాట్సాప్ కొత్త ప్రతిపాదన ఏక పక్షంగా ఉన్నందున నిలిపివేయాలన్న ఒక అడ్వకేటు పిటిషన్ విచా రిస్తూ డిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘అది ప్రయివేటు యాప్, మీ సమాచారానికి భద్రత లేదనుకుంటే అక్కడ్నుంచి తొలగించండి, వారి సేవల నుంచి మీరు తొలగిపోండి, భద్రత ఉన్న వేరే యాప్‌కు మారండి’ అని జస్టిస్ సంజయ్ సచ్దేవ్ అన్నారు. అదంత చిన్న విషయమా? కోట్ల మందికి సంబంధించిన అంశం. తమ వద్ద వినియోగదారుల సమాచారం ‘తొలికొస నుంచి కడకొస దాకా’ గోప్యమే! అని హామీ ఇస్తాయి. ఈ హామీకి ఎందుకు కట్టుబడవు? అన్నది మౌలిక ప్రశ్న. తమ కొత్త విధానానికి అంగీకారం తెలపండి అని వాట్సాప్ ప్రకటించాక వారం (జనవరి5–11)లోనే ప్రత్యా మ్నాయ యాప్ ‘సిగ్నల్‘ను దేశంలో 33 లక్షల మంది డౌన్లోడ్ చేసు కున్నారు. అదే వారంలో వాట్సాప్ డౌన్లోడ్లు 39 శాతం తగ్గాయి. దేశంలో ప్రతి నాలుగో వ్యక్తి వాట్సాప్ వినియోగదారుడే! వారు జారి పోతున్న ఆ వేగం చూసి వాట్సాప్ జడుసుకుంది. సత్వర దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఏ ప్రయోజనాలు లేకుంటే ఇంత దేబిరింపు దేనికి? నిజానికి వారి ఉద్దేశం కొత్త గోప్యత నిబంధనల ప్రకారం తాము సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకోవడానికి వినియోగదారులు సమ్మతించడం. సమ్మతిలేని వారు వైదొలగడం. ఫేస్బుక్ ఇక యథేచ్చగా సదరు సమాచారాన్ని తన, తన ఒప్పంద వ్యాపార సంస్థలు స్వేచ్ఛగా విని యోగించుకోవడం. వాణిజ్య ప్రకటనల ఆదాయాన్ని పెంచుకోవడం. ఉభయత్రా లాభం! ఇదీ తలంపు. కానీ, ఇప్పుడిస్తున్న తాజా వివరణ ప్రకారం కేవలం వ్యాపార అకౌంట్ల విషయంలో తప్ప సాధారణ పౌరుల వ్యక్తిగత సమాచారం, కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, ప్రేమికులు వంటి వారి సంభాషణల జోలికి రామంటున్నారు. అసలు అలాంటి డాటాను మేం చూడం, వాడం అని నమ్మబలుకు తోంది. కానీ, పౌరులకు అనుమానాలు న్నాయి. ఆ భయ–సందేహాలతో ఇవాళ పౌరులు ప్రత్యామ్నాయ ‘యాప్’లకు వెళ్లవచ్చు! కానీ, రేపు ఏదో రోజు అదే ఫేస్‌బుకో, మరో పోటీదారో ప్రత్యామ్నాయ యాప్‌లను కొనరని, మంచి ధర పలికితే అవి మాత్రం అమ్ముడు పోవని గ్యారెంటీ లేదు. వ్యక్తిగత సమాచారం చౌర్యానికి గురయ్యే ప్రమాద ఆస్కారం నుంచి పౌరులకు శాశ్వత రక్షణ కావాలి. సర్కార్‌పై కన్నేయాల్సిందే! వ్యక్తిగత సమాచార దుర్వినియోగ ప్రమాదంపై మెసేజింగ్ యాప్‌ల పట్ల పౌరులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రభుత్వాల పట్ల కూడా అంతే అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం అధికారికంగా సేకరించిన ఆధార్ సమాచారం లోగడ దుర్వినియోగమైన సందర్భాలెన్నో వెలుగు చూశాయి. పౌరుల ఫోన్ నంబర్ల సమాచారాన్ని పదిహేడు పైసల చొప్పున అమ్ముకున్న నీచ ఘటనలున్నాయి. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం గత సంవత్సరం విస్పష్టంగా తేల్చి చెప్పే వరకు వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే కాదని కేంద్ర ప్రభుత్వం భావించిన, వాదించిన దేశం మనది. పౌరుల హక్కుల కన్నా కార్పొరేట్ల వ్యాపార ప్రయోజనాలకు పెద్దపీట వేసే సర్కార్ల ఎత్తుల్ని పసిగట్టాల్సిందే! వ్యక్తిగత సమాచార భద్రత పేరిట ఇప్పుడు తీసుకురానున్న పీడీపీ చట్టం ఎంత పకడ్బందీ అన్నదీ కాపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే, గత శీతాకాల సమావేశాల్లోనే ముసాయిదాను పార్లమెంటు ముందుకు తెచ్చినా, అభ్యంతరాల నడుమ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపారు. అధికార భాజపా ఎంపీ మీనాక్షీ లేకీ నేతృత్వం లోని జేపీసీ సంప్రదింపుల ప్రక్రియ ముగించి, చట్టం పేరుతో సహా 89 సవరణలతో తుది ముసాయిదాను ఇటీవలే సిద్ధం చేసింది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఆమోదింపచేయాలన్నది తలంపు. ప్రయివేటు యాప్‌ల నుంచి, సామాజిక మాధ్యమాల నుంచి పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత అనే వంకతో సదరు సమాచారాన్ని కేంద్రం తన గుప్పెట్లోకి, నియంత్రణలోకి తెచ్చుకునేలా ముసాయిదా ఉందనే విమ ర్శలున్నాయి. అప్పుడది, రాజ్యాంగం పౌరులకు కల్పించిన వ్యక్తిగత సమాచార గోప్యతా హక్కుకే భంగకరం! వ్యక్తిగత–వ్యక్తిగతం కాని సమాచారాన్ని నిర్వచించడమైనా, సదరు డాటా సేకరణ–నిర్వహణ– నిలువ–వినియోగం, దుర్వినియోగ నియంత్రణ, భద్రత వంటి విషయాల్లో ఎటువంటి చట్టరక్షణ కల్పిస్తారన్నది ముఖ్యం. నిన్నటి వాట్సాప్ ఎత్తుగడైనా, రేపు మరే ఆన్లైన్ యాప్ నిర్వహకులో చేసే లోపాయికారి ప్రతిపాదనలనైనా.. ఈ చట్టం ఎలా నిలువరిస్తుంది? అన్నది చట్టరూపకల్పనను బట్టే ఉంటుంది. అందుకే, ప్రజాప్రతి నిధులు, పౌర సమాజం అప్రమత్తంగా ఉండాలి. రెండు నియంత్రణలూ ఉండాలి చట్టం ఒక్కటే సరిపోదు. గట్టి చట్టం అమల్లోకి వచ్చాక ఏర్పాటయ్యే రక్షణ ప్రాధికార సంస్థ, నియంత్రణ వ్యవస్థ పనితీరు ముఖ్యం. నిఘా –నియంత్రణ వ్యవస్థలు గోప్యత ఉల్లంఘనలకు ప్రతిస్పందించడమే కాకుండా ముందస్తు నివారణా వైఖరితో పనిచేయాలి. చట్టాలు చేసే– ఉల్లంఘించే వారి మధ్య పిల్లి–ఎలుక ఆట ఎప్పుడూ ఉంటుంది. ఒక నిబంధన తమని అడ్డగిస్తే, దాన్ని అధిగమించి పని కానిచ్చుకునే సాంకేతికతను నేరబుద్ది కలిగిన సంస్థలు సృష్టించుకుంటాయి. ఇదొక చక్రీయ ప్రక్రియ. పౌరులు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. ఉచితంగా వస్తుందంటే చాలు, ఏ ఆధునిక సదుపాయమైనా నిబంధ నలు చదువకుండానే గుడ్డిగా సమ్మతి తెలుపడం మానుకోవాలి. అవసరం ఉన్నా, లేకున్నా వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని ఎక్కడపడితే అక్కడ పంచుకునే అలవాట్లను తగ్గించుకోవాలి. తెలిసో తెలియకో.. కనీస గోప్యత లేకుండా సొంత జీవితాన్ని ఎంతగా బజారుకీడ్చుకుంటున్నామో... కొంచెం ఇంగితంతో వ్యవహరిస్తేనే మనకూ, సమాజానికీ మంచిది. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఆశల రెక్కలు విరవొద్దు
కొత్త ఆశలతో సరికొత్త యేడాదిలోకి... ఆశే మనిషిని ముందుకు నడిపే చోధకశక్తి! అదే లేకుంటే, ఎప్పుడూ ఏదో ఒక నిస్సత్తువ ఆవహించి బతుకును దుర్భరం చేయడం ఖాయం! అగణిత కాలగమనంలో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు... మనం కల్పించుకున్న విభజనరేఖలే అయినా... ఒక్కొక్క గీత దాటుతున్నపుడు ఒక్కో రకమైన భావన, అనుభూతి సహజం! అదే సరికొత్త ఆశలకు ప్రేరణ! రెండు సంవత్సరాల నడిమధ్య నిలబడ్డ ఈ సంధి వేళ... విస్తృతమైన చర్చ సాగుతోంది. ముఖ్యంగా గత ఏడాది పొడుగూ మనిషి మనుగడను శాసిస్తూ, ప్రతి పార్శా్వన్నీ తడుముతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన కోవిడ్–19 ఇవాళ చర్చనీయాంశమై ప్రతినోటా నాను తోంది. కొత్త ఏడాదిలోకి... అనే ఆనందం కన్నా ఓ పీడకలలాంటి 2020 ముగిసిందనే సంతోషమే ఎక్కువ అని కొందరు. ఎట్లయితేనేం, ఓ యేడాది భారంగా గడిచిపోయింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్న, తెస్తున్న కొత్త సంవత్సరం 2021 మన ఆశల పేటి! అని మురిసేది మరికొందరు. రెండు భావనలూ సహేతుకమే! మనిషి ఆశాజీవి అనడానికిదో తాజా ఉదాహరణ! ప్రతి ప్రకృతి విలయం నుంచి, దౌర్భాగ్య పరిస్థితి నుంచీ ఎంతోకొంత సానుకూలతను తీసు కోగలిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఇది మానవేతిహాసం ఎన్నో మార్లు రుజువుచేసిన సత్యం! ఇప్పుడా సందర్భం వచ్చిందని, ఇంత దయనీయ పరిస్థితుల్లో కూడా మనం నేర్చుకోగలిగే, నేర్చుకోదగ్గ గుణపాఠాలు చాలానే ఉన్నాయనేది మేధావుల విశ్లేషణ. సామాజిక మాధ్యమాల్లో సంప్రదాయ మీడియాలో కూడా ‘2020 మనకేమైనా నేర్పిందంటే..?’ అనే కథలు, కథనాలు, వ్యాస పరంపర పుంఖాను పుంఖాలుగా వస్తోంది. కరోనా సృష్టించిన అలజడి, చేసిన నష్టం అంతా ఇంతా కాదు. చైనాలో పుట్టి, ఏడాది కాలంలోనే ఏతా వాతా 218 దేశాలను చుట్టుముట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 8.32 కోట్ల మందికి వ్యాధి సోకగా 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతటి విలయం సృష్టించిన మహమ్మారి నేర్పేదేమిటి? ఒనగూర్చిన మంచి ఏముంటుంది? అనే ప్రశ్న తలెత్తవచ్చు! కానీ, నిరంతర పరిశో ధకుడైన మనిషి, ప్రతి ప్రతికూలతనూ అధిగమించే క్రమంలో పోరాటం చేస్తాడు. ఈ మధనంలో కొన్ని సానుకూలతలనూ సాధి స్తాడు. ఎంతో కొంత కలిసొచ్చిన మంచి అటువంటిదే! పర్యావర ణంలో వచ్చిన అనూహ్య పరిణామాలైనా, ఆటోమేషన్ అయినా, ఆరోగ్య సంరక్షణ–జీవనశైలి మార్పులైనా, స్వయంసమృద్ధి యత్నా లైనా, రాజకీయ పరిష్కారాలైనా.. జాగ్రత్తగా గమనించి, మేలైన అంశాల్ని తెలివిగా శాశ్వతీకరించుకుంటే మానవాభ్యున్నతికి తక్షణ, భవిష్యత్తు ప్రయోజనాలుంటాయి. కానీ, కుక్క తోక వంకర అన్న చందంగా ఏవో సాకులు చూపి, పాత పెడదారుల్లోనే సాగితే మరింత ప్రమాదం తప్పదు. కొన్ని విషయాల్లో ఇప్పుడదే జరుగుతోంది. ఒక దృశ్యం కనబడి... కనుమరుగవుతోంది! కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రపంచం ‘లాక్డౌన్’ విధించుకొని మునగదీసుకుంది. మానవ ప్రేరిత కార్యకలాపాలు చాలావరకు స్తంభించాయి. జూలై మాసాంతం వరకూ ఇది ప్రభావం చూపింది. ఫ్యాక్టరీలు, కంపెనీలు పనిచేయక, నిర్మాణాలు ఆగి, వాహన రాకపోకలు నిలిచిపోవడంతో పర్యావరణపరంగా మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎన్నెన్నో నగరాల్లో వాయు నాణ్యత పెరిగి నట్టు, శబ్ద–నీటి కాలుష్యాలు తగ్గినట్టు అధ్యయన నివేదికలొచ్చాయి. కర్బన ఉద్గారాలు రమారమి తగ్గాయి. వన్యప్రాణులు, అటవీ జంతు వులు స్వేచ్ఛగా తిరుగాడిన వార్తలు–ఫొటోలొచ్చాయి. పక్షుల కిల కిలలు పట్టణాల్లోనూ వినిపించాయి. వందల కిలోమీటర్ల దూరం వరకు హిమాలయాలు కనిపించాయి. చాలాచోట్ల భూమ్యావరణ స్థితి మెరు గయింది. ఆర్థిక పునరుద్ధరణ కోసం మళ్లీ మానవ కార్యకలా పాలు పెంచడంతోటే కాలుష్యపు జాడలు పెరిగాయి. ఉత్పత్తి జరుగొ ద్దని, నిర్మాణాలు–ప్రయాణాలు ఉండొద్దని ఈ వాదనకు అర్థం కాదు. ప్రకృతితో మన సహజీవన విధానాన్ని పునర్నిర్వచించుకోవాల్సిన గుణపాఠమిది! సుస్థిరాభివృద్ధి సాధనకు దీన్నొక నమూనాగా తీసు కోవాలి. కానీ, నేర్చుకున్న జాడలు లేవు! కరోనా మిష చూపి, ఆర్థిక పునరుద్ధరణ వేగంగా జరగాలనే వంకతో... చట్టాలను, నిబంధనల్ని గాలికొదులుతున్నారు. తాజా చర్యలు, పరిణామాలతో పర్యావరణ ముప్పు రెట్టింపవుతోంది. పలు రాష్ట్రాల్లో కార్మిక చట్టాలను సస్పెండ్ చేయడం ఈ దురాగతాల్లో భాగమే! కంపెనీలు, కర్మాగారాల ఆగ డాలకు ద్వారాలు తెరచినట్టే! భౌతిక దూరం పాటించేందుకు ప్రజా రవాణా సరిపడదనే భావనతో వ్యక్తిగత వాహనాల జోరు పెరిగి వాయుకాలుష్యం మరింత హెచ్చింది. విపత్తులోనూ లభించిన సాను కూలతను విచక్షణారహితంగా గండికొడితే తలెత్తిన తాజా ప్రతికూలత లివి! కరోనా ముందరి వాతావరణం కన్నా ప్రమాదకరంగా మారే ఆస్కారముంది. దూసుకొచ్చిన యాంత్రీకరణ–కృత్రిమ మేధ! శాస్త్ర సాంకేతిక రంగం అనుకున్నదానికన్నా వేగంగా మనిషి నిత్య జీవితంలో యాంత్రీకరణ పెరిగింది. కృత్రిమ మేధ (ఏఐ) విరివిగా వినియోగిస్తున్నారు. ఒకరకంగా కోవిడ్–19 బలవంతపెట్టిన పరిణా మమిది. కృత్రిమ మేధను అనుసంధానం చేసిన కార్లు, డ్రోన్స్, రోబోల వినియోగం ఇప్పటికే పెంచారు. వైరస్ వ్యాప్తిని నివారించేలా మనిషికి–మనిషి తగలకుండా, భౌతిక దూరం పాటిం చేందుకు ఉపక రించే సాధనాలయ్యాయి. కనబడని మారీచునితో యుద్ధం వంటి ఈ మాయా వైరస్‌లతో పోరులో ఒకరకంగా ఇవి అనివార్యమయ్యాయి. 2030 నాటికి 30–40 శాతం ఉద్యోగాలు యంత్రాలు–ఏఐతోనే అనే అంచనా ఒకటుంది. ఇంటి నుంచే పని (డబ్ల్యూఎఫ్‌హెచ్) విధానం ప్రస్తుత విపత్కాలంలో విస్తృతమైంది. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. సింగపూర్, హాంకాంగ్ వంటి విశ్వనగరాల్లోనూ ఇది స్పష్టంగా కనిపించింది. ప్రపంచస్థాయి గల ఒక ఐటీ కంపెనీ అధ్యయనం ప్రకారం, ఇంటి నుంచి పని వల్ల 17 శాతం ఉత్పత్తి పెరి గింది. కరోనా అనంతర కాలంలోనూ ఈ పద్దతిని ఎంతో కొంత మేర శాశ్వతీకరిస్తూ పలు కంపెనీలు బడ్జెట్లు రూపొందించుకుంటున్నాయి. ఉభయ ప్రయోజనకరంగా... ఉద్యోగుల ప్రయాణాల్లో సమయాన్ని, కార్యాలయ నిర్వహణ వ్యయాన్నీ నియంత్రించుకునే సానుకూలాం శమైంది. కొరోనా దెబ్బకు అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిగా తగ్గి పోయాయి. ప్రపంచ ప్రయాణ–పర్యాటక మండలి (డబ్ల్యూటీటీసీ) అధ్యయనం ప్రకారం 3.9 శాతం వృద్ధితో, ఉత్పాదక రంగం తర్వాత వేగవంతమైన వృద్ధి నమోదు చేసిన ఈ రంగం కోవిడ్–19తో కుదే లయింది. వెబినార్లు, వీడియో కాన్ఫరెన్స్‌లు అతి సాధారణమ య్యాయి. వైద్యులు–రోగులు ప్రత్యక్షంగా కలుసుకోనవసరం లేకుండా చేపడుతున్న ‘టెలిమెడిసిన్’ విధానం, ఒక అనువైన చికిత్స పరిష్కారం అయింది. ఆరోగ్య భద్రత పథకాల కింద ప్రభుత్వ యంత్రాంగం దీన్నొక సాధనంగా మలచుకొని, గ్రామీణ ప్రాంతాలకు ఆధునిక వైద్య సదుపాయాల్ని విస్తరించవచ్చు. రోగుల్లో కొత్త నమ్మకం పెంచే వీలుంటుంది. స్వయం సమృద్ధి–జీవనశైలి! ప్రపంచీకరణ–విశ్వవిపణి విధానం ఆచరణలోకి వచ్చిన తర్వాత మొదటిసారి అందుకు విరుద్ధ పరిస్థితి కోవిడ్–19తో తలెత్తింది. గ్లోబలీకరణతో బలపడ్డ ‘బల్లపరుపు ప్రపంచమ’నే మార్కెట్ వాదన కరోనా దెబ్బకు తల్లకిందులయింది. ఏకీకృత మార్కెట్‌తో ఇన్నాళ్లు ఆహారం, వస్తు–సేవలు ఎక్కడపడితే అక్కడ విస్తారంగా లభించేవి. దేశాల మధ్య పరస్పరాధార మార్కెట్ నమూనా వృద్ధిచెందింది. నాణ్యమైన వస్తు–సేవలు ప్రపంచం ఏ మూలన ఉన్నా అక్కడ్నుంచి ఎవరైనా యథేచ్ఛగా పొందగలిగే వారు. అమెరికా–చైనా ఇందుకు ఓ పెద్ద ఉదాహరణ! ఈ యేడు పరిస్థితి మారింది. విమానాలు రెక్కలు ముదురుకొని, దేశ సరిహద్దులకు తాళాలు పడ్డపుడు... ఎవరి ఆహారం, వస్తువులు, సేవల్ని వారే సమకూర్చుకోవాల్సి వచ్చింది. స్వయం సమృద్ధి అవసరం అందరికీ తెలిసివచ్చింది. ఆహార ఉత్పత్తి విషయం లోనే కాకుండా, ఆహార సరఫరా శృంఖలాల్లోనూ పెనుమార్పులు అని వార్యమయ్యాయి. ఇక మనుషుల జీవన శైలిలోనూ కరోనా ఎన్నో మార్పులు తెచ్చింది. పెళ్లయినా, చావయినా ఇక హంగూ ఆర్భాటాలు, డాబూ–దర్పం ప్రదర్శించలేని ప్రతిబంధకాల్ని అది సృష్టించింది. పేద, అల్పాదాయవర్గాలకు ఇదొక రకంగా మేలే చేసింది. కొందరి ఇళ్లలో పెళ్లిళ్లంటే, జుగుప్సాకర సంపద ప్రదర్శనకు వేదికల్లా ఉండేవి. ఈ ఒక్క విషయంలోనే కాకుండా.... దైనందిన జీవితానికి సంబం ధించిన చాలా అంశాల్లో కనీసాలతో సరిపెట్టుకునే జీవన విధానాన్ని కరోనా నేర్పింది. వ్యక్తిగత పరిశుభ్రత, గృహ–పరిసరాల్లో పారిశుధ్యం ప్రాముఖ్యత అందరికీ తెలిసి వచ్చింది. 2003 ‘సార్స్’ వైరస్ విజృం భణ తర్వాత శానిటైజర్, మాస్క్ జపాన్‌లో అతి సాధారణమ య్యాయి. సదరు ప్రొటోకాల్ అందరికీ ఒక జీవనశైలిగా అలవడింది. అటువంటి పరిస్థితులు ఇప్పుడు అంతటా విస్తరించాయి. తిండి పద్ధతులు మార్చుకుంటున్నారు. జంక్ ఫుడ్స్ కాకుండా, రోగనిరోధక శక్తినిచ్చే ఆహారపదార్థాల పైన, సంప్రదాయ జీవనశైలి పైన దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కరోనా తెచ్చిన సానుకూలమైన మార్పే ఇది! రాజకీయ మార్పులకు... రంగస్థలం కావాలి కరోనా మహమ్మారి సమస్త ప్రజల దృష్టిని తనవైపు మళ్లించిన సంద ర్భాన్ని రాజకీయ, పాలనా వ్యవస్థలు తమకనుకూలంగా మలచుకు న్నాయి. ప్రజలకిది కంటకంగా మారింది. ఇలా ప్రపంచంలోని చాలా దేశాల్లో జరిగింది. కరోనా మార్గదర్శకాల ముసుగులోనో, లాక్డౌన్ నీడలోనో, ఆర్థిక పునరుద్ధరణ సాకుతోనో నియంతృత్వ పాలకులు ప్రజాస్వామ్య ప్రక్రియని నిర్వీర్యపరచిన ఉదంతాలున్నాయి. ప్రజల్ని వంచించారు. పౌరహక్కుల్ని పలుచన చేయడం, కార్మిక చట్టాలను నీరుగార్చడం, కార్పొరేట్ శక్తులకు తివాచీలు పరవడం వంటి చర్య లకు ఆయా ప్రభుత్వాలు పూనుకున్నాయి. మన దేశంలోనూ ఇటు వంటివి జరిగాయి. కరోనా కడగండ్లతో దేశం కుదేలయినపుడు.. వ్యూహాత్మకమైనవి తప్ప పబ్లిక్‌రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటు పరంచేయాలనే కేంద్ర మంత్రివర్గ నిర్ణయం, కొన్ని రాష్ట్రాల్లో కార్మిక చట్టాల సస్పెన్షన్ వంటివి ప్రజల్ని విస్మయపరిచాయి! ఒక వంక కరోనా... మరో వంక ప్రజా ఉద్యమాలతో 2020 అట్టుడికింది. నాటి షాహిన్‌బాగ్ బైటాయింపు నుంచి నేటి సింఘిలో తిష్టవేసిన రైతు ఉద్యమం వరకు ప్రజాందోళనలు వేడి రగిలించాయి. ప్రభుత్వం దిగి వచ్చి, వ్యవసాయ కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతాంగం అభిప్రా యాల్ని గౌరవించడం పెనుమార్పు! ప్రజాస్వామ్య పాలనలో చర్చల తోనే ప్రతిష్టంభనలు తొలగుతాయన్న గ్రహింపు, ముక్తాయింపు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన కొంగ్రొత్త ఆశ! ఇదే ప్రజాస్వామ్య వాదుల ఆకాంక్ష!! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
విభజన రేఖ చెరపవద్దు
ప్రశ్న, నిరసన... వీటి గొంతు నులిమితే న్యాయవ్యవస్థకే కాదు మొత్తం ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అన్యాయాలపై ఇక గొంతెత్తే వారే ఉండరు. భయంతో ఏ గొంతులూ పెగలకుంటే అరిష్టాలకు అడ్డూ అదుపుండదు. అప్పుడు వ్యవస్థలన్నీ గతి తప్పుతాయి. అరాచకం రాజ్యమేలుతుంది. ఇంతటి తీవ్ర ప్రమాదం ముంచుకు రాకుండా పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు రక్షణ ఉండాలి. సద్విమర్శకు తావుండాలి. కోర్టుల పరువు, ప్రతిష్టలు నిల వాలి. ప్రజాస్వామ్యపు వివిధ అంగాల మధ్య సంఘర్షణ తుది ఫలితం మధ్యేమార్గం, ఉభయతారకంగా ఉండాలి. అంతే తప్ప, ఒకదాని కోసం మరోటి బలిపెట్టకూడదు. కోర్టుల పరువు నిలపాలనే తొందర పాటులో పౌరహక్కుల్ని కాలరాయొద్దు. పౌరహక్కుల పేరిట వ్యవస్థల గౌరవాన్ని నేరపూరితంగా నేలకు దించొద్దు. ప్రముఖ న్యాయవాది, హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్‌ను కోర్టు ధిక్కారం కేసులో దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిన కేసు గురువారం కొత్త మలుపు తిరి గింది. శిక్ష ఖరారు చేయాల్సిన వేళ తాజా పరిణామాలు చోటుచేసుకు న్నాయి. ట్వీట్లలో చేసిన వ్యాఖ్యల పునరాలోచనకు రెండు, మూడు రోజులు సమయం ఇస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. తప్పు గ్రహించి, పశ్చాత్తాపం ప్రకటిస్తే తప్ప శిక్ష విషయంలో మరో అభి ప్రాయానికి తావు లేదంది. తన అభిప్రాయంలో మార్పు లేదని, తానా వ్యాఖ్యలు పూర్తి ప్రజ్ఞతోనే చేసినందున పునరాలోచన ఉండబోదని భూషణ్ నిర్ద్వంద్వంగా చెప్పారు. తీర్పు తనను కలతకు గురిచేసిందని, శిక్ష గురించి కాదు, న్యాయస్థానం తనను తప్పుగా అర్థం చేసుకుందని, దురుద్దేశ్యాలు ఆపాదించి ఆధారాలు చూపకుండానే దోషిగా తేల్చడం బాధించిందనీ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ ఒక కేసులో కోర్టు ముందు వెల్లడించిన భావాల్ని గుర్తుచేస్తూ ‘దయ చూపమని అడ గను, ఉదారత కోసం కోరను.. ప్రజాస్వామ్య పరిరక్షణకు బహిరంగ విమర్శ తప్పనిసరి అని భావించా, బాధ్యతగానే వ్యాఖ్యలు చేశాను. ఏ శిక్షకైనా సిద్ధమే’ అని తెలిపారు. తదుపరి నిర్ణయం ఇక కోర్టుదే! దేశ వ్యాప్తంగా ఈ అంశం ఓ విస్తృత చర్చకు తెరలేపింది. న్యాయవ్యవస్థ పనితీరుతో పాటు పౌరుల హక్కులు, ప్రశ్న–నిరసన– విమర్శ వంటి పలు అంశాలు ప్రస్తావనకొస్తున్నాయి. విమర్శకు తావులేని పరిస్థితి కల్పిస్తే, ఇక రాజ్యాంగం పూచీగా నిలిచిన భావప్రకటనా స్వేచ్ఛ (అధికరణం 19–(ఎ)) హక్కుకున్న అర్థమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. రెంటినీ కలగాపులగం చేయొద్దు రాజ్యాంగబద్ధమైన సంస్థల పనితీరు సజావుగా సాగేందుకు వాటి లోపాలు ఎత్తిచూపడం, సద్విమర్శ పౌరునిగా తన బాధ్యత అని భావించినట్టు ప్రశాంత్ భూషణ్ చెబుతున్నారు. నెల రోజుల వ్యవ ధితో ఆయన చేసిన రెండు ట్వీట్లు ప్రస్తుత వివాదానికి కారణం. ఒకటి, బయట సుప్రీంకోర్టు ఛీఫ్ జడ్జి ప్రవర్తనకు సంబంధించింది. ఇంకొ కటి, గత ఆరేళ్లుగా దేశంలో ఎమర్జెన్సీ విధించకుండానే ప్రజాస్వా మ్యాన్ని బలహీనపరుస్తున్న తీరు, అదే (నలుగురు ప్రధాన న్యాయ మూర్తుల) సమయంలో సుప్రీంకోర్టు పాత్ర గురించి చేసిన వ్యాఖ్య! ఈ రెండూ న్యాయవ్యవస్థ గౌరవాన్ని, ప్రజల్లో విశ్వసనీయతను తగ్గిం చేవిగా ఉన్నాయని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఒక ఫిర్యాదు ఆధారంగా తనంతతాను సుప్రీం ఈ కేసు చేపట్టి, సదరు చర్యను కోర్టు ధిక్కారంగా, భూషణ్‌ను దోషిగా తేల్చింది. ఇది వివాదాస్పదమౌ తోంది. న్యాయస్థానాలపైన, జడ్జీలపైన ఇలాంటి విమర్శలు కొత్త కాదు. 2018లో నలుగురు సుప్రీం కోర్టు సీనియర్ జడ్జీలు విలేకరుల సమావేశం పెట్టి, ‘సుప్రీంకోర్టు పనితీరు అంత సవ్యంగా లేదు, ప్రధాన న్యాయమూర్తి పని కేటాయింపు ప్రక్రియ లోపభూయిష్టం’ అని విమర్శ చేశారు. అదెందుకు కోర్టుధిక్కారం కాలేదు? అన్నది ప్రశ్న. అంటే, ఒకే విషయంలో... న్యాయమూర్తులకు, న్యాయవాదు లకు, సాధారణ పౌరులకు వేర్వేరు న్యాయాలు ఉంటాయా? అనేది సందేహం. విమర్శకు, న్యాయధిక్కారానికి మధ్య విభజన రేఖ గుర్తిం చాలి. రెంటినీ ఒకేగాట కట్టడం తప్పని సుప్రీంకోర్టే తన తీర్పుల్లో పలుమార్లు పేర్కొంది. కోర్టు ధిక్కార చట్టం–1971 సెక్షన్ 13 అదే చెబుతోంది. ఒక చర్య లేదా వ్యాఖ్య న్యాయ ప్రక్రియ నిర్వహణలో తగినంత అనుచిత జోక్యమని సంతృప్తి చెందితే తప్ప దాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించకూడదన్నది చట్టం. తన వ్యాఖ్య సత్యమని, జనహితంలో చేసిందని నిరూపించుకునే నిందితుని వాదనకూ అవ కాశం కల్పిస్తూ చట్ట సవరణ (13–బి) కూడా జరిగింది. నిఖార్సయిన విమర్శ కోర్టుధిక్కారం కాబోదనీ ఇదే చట్టం (సెక్షన్–5) చెబుతోంది. దేశ విదేశాల్లో ఎందరెందరో న్యాయకోవిధులు ఈ విషయంలో స్పష్ట మైన తీర్పులిచ్చారు. న్యాయవ్యవస్థలో అవినీతి లేదా? ట్వీట్లలో ఒక న్యాయవాది చేసిన రెండు వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ ప్రతిష్టను భంగపరచి, ప్రజల్లో విశ్వసనీయతను తగ్గిస్తాయన్న భావ నతో ఉన్నత న్యాయస్థానం వ్యక్తి ప్రాథమిక హక్కును నలిపివేయ డాన్ని ప్రజాస్వామ్య వాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగా మన న్యాయవ్యవస్థ, కోర్టులు, మొత్తంగా ప్రజాస్వామ్యం ఈ రోజు అంతటి బలహీన పునాదులపై ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. ‘బార్ (న్యాయవాదుల సంఘం)ను నోరు మూయించి న్యాయస్థానాల్ని బలోపేతం చేయలేర’నే నినాదం దేశవ్యాప్తంగా పెల్లుబుకుతోంది. కోర్టుల గౌరవాన్ని నిలబెట్టే ఉద్దేశంతో, వాటి పనితీరుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయనీయకుండా పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు ‘కోర్టు «ధిక్కార’ అస్త్రంతో ముందే బంధనాలు విధించడం సబబా? తద్వారా కోర్టుల గౌరవం, విశ్వసనీయత పెరుగుతాయా అంటున్నారు. 108 పేజీల తన తీర్పులో, ‘నాలుగు స్తంభాల్లో ఒకటిగానే కాదు, భారత ప్రజాస్వామ్యానికి న్యాయవ్యవస్థ మూలస్తంభం’ అని పేర్కొన్న సర్వో న్నత న్యాయస్థానం, దేశంలో నెలకొన్న పరిస్థితులకూ బాధ్యత వహిం చాలన్న విమర్శను ఎందుకు స్వీకరించలేకపోయింది? వ్యాఖ్యను విమ ర్శగా కాకుండా కోర్టుధిక్కారంగా ఎలా పరిగణించారనేది విస్మయం! ‘ఇప్పుడే కాదు, 16 మందిలో సగంమంది సుప్రీం ప్రధాన న్యాయ మూర్తులు అవినీతిపరులన్న విమర్శ చేసినపుడు కూడా తన ఉద్దేశం కేవలం ఆర్థిక అవినీతి కాదని, ‘అవినీతి’ని విస్తృతార్థంలో వినియోగిం చానని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆగస్టు 4న ఇచ్చిన వివరణలో, ఆగస్టు 10న కోర్టు ఆదేశాలకు బదులిచ్చినపుడూ పేర్కొన్నారు. ‘కింది స్థాయి న్యాయవ్యవస్థలో దేశమంతటా అవినీతి ఉంది, అక్కడక్కడ ఉన్నతస్థాయిలోకీ విస్తరించింది’ అని 1964లోనే పార్లమెంటరీ కమిటీ నివేదించింది. ‘జడ్జీల్లోనూ అవినీతి పరులున్నార’ని మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్పీ బరూచా, ‘అవినీతి అంటుకోకుండా న్యాయ వ్యవస్థ ఏమీ పవిత్రంగా లేదని నేను నిజాయితీగా అంగీకరించా ల్సిందే’ అని మరో మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివంలు బహి రంగంగా పేర్కొనడాన్ని భూషణ్ తన వాదనలో ఉటంకించారు. న్యాయవ్యవస్థపై విమర్శ న్యాయధిక్కారమో, కోర్టుధిక్కారమో ఎలా అవుతుందన్న ఆయన ప్రశ్నకు సహేతుకమైన సమాధానం రావట్లేదు. ఒక గిడసబారిన ఉపకరణం (కోర్టుధిక్కారం)తో ఉన్నత న్యాయస్థానం మొరటు దెబ్బ వేసిందని, ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్టను, ప్రజల్లో విశ్వ సనీయతను పెంచకపోగా సన్నగిల్ల చేస్తుందన్న భయాన్నీ కొందరు వ్యక్తం చేస్తున్నారు. తప్పుగా వాడితే వికటించే ప్రమాదం కోర్టుధిక్కారం, న్యాయధిక్కారం వంటి అస్త్రాల్ని కోర్టులు, జడ్జీలు ఎంతో ఆచితూచి వాడాలని విశ్వవ్యాప్తంగా ఓ బలమైన అభిప్రాయం. అమెరికా, బ్రిటన్, ఐక్యరాజ్యసమితి స్థాయిలోనే కాక దీనిపై మన దేశంలోనూ లోగడ విస్తృత చర్చ జరిగి, నిక్కచ్చి అభిప్రాయాలు వ్యక్త మయ్యాయి. బ్రిటన్‌లో 2013లో ఏకంగా కోర్టుధిక్కార చట్టాన్ని రద్దు చేశారు. ఆ సందర్భంగా తెచ్చిన బిల్లుపై చర్చలో మాట్లాడుతూ, ‘విమర్శ అసమంజసంగా ఉన్నా, నిందాపూర్వకంగా ఉన్నా, చివరకు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవపట్టించేదైనా... జడ్జీలు కటువుగా దాన్ని పట్టించుకోకుండా ఉండటమే మేలు’ అని సుప్రసిద్ధ న్యాయమూర్తి (ఐర్లాండ్) లార్డ్ కార్స్వెల్ అంటారు. ఇంగ్లండ్‌కు చెందిన ఇరవయ్యో శతాబ్ది గొప్ప న్యాయవాది, న్యాయమూర్తి టామ్ డెన్నింగ్ స్ఫూర్తి ఇక్కడ కావాలి. ఆయనే ఓ పుస్తకంలో రాసినట్టు, లేబర్‌పార్టీ నాయ కుడు, న్యాయవాది హార్టీ›్ల షోక్రాస్ ఓ కేసు తీర్పు నచ్చక ‘డెన్నింగ్ ఒక గాడిద’ అని వ్యాఖ్యానించడంతో అది ‘ది టైమ్స్’ (లండన్)లో ప్రచురి తమయింది. కోర్టు/న్యాయ ధిక్కారం కింద తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. ‘అవును ఆయన విమర్శించినట్టు నేను గాడిద కాను అని... కోర్టుధిక్కారం కింద తీసుకొని కాదు, నా పనితీరు ద్వారా నిరూ పించాలి’ అన్నది ఆయన వైఖరి. 1964లోనే సుప్రీం మాజీ న్యాయ మూర్తి గజేంద్ర గడ్కర్, ‘న్యాయధిక్కారాధికారాన్ని జడ్జీలు ఆలోచించి వాడాలి, వికటిస్తే అది న్యాయవ్యవస్థ ప్రతిష్టను, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచకపోగా తగ్గించే ప్రమాదముంది’ అన్నారు. ఇప్పుడదే జరుగు తోందన్నది అత్యధికుల భయం! నిజానికి న్యాయ/కోర్టు ధిక్కార అంశాన్ని జడ్జీలు పౌరుల విమర్శలకు కాకుండా రెండే సందర్భాల్లో వాడాలని న్యాయకోవిదుల భావన! ఒకటి, కోర్టులు చెప్పింది ఎవరైనా పాటించనపుడు. రెండు, చేస్తామని (అఫిడవిట్లో, అండర్టేకింగో) కోర్టులకు చెప్పిన మాట ఎవరైనా ఉల్లంఘించినపుడు మాత్రమే అన్నది సారం. రక్షించాల్సిన వారే రౌద్రం వహిస్తే...? తన పట్ల ఫలానా జడ్జి వివక్షతో ఉన్నారు, కేసు విచారణ మరో బెంచీకి మార్చండన్న వినతి పట్టించుకోవాలి. కానీ, ప్రస్తుత కేసులో రెండు మార్లు అలా కోరినా నిరాకరించారు, ఎందుకో తెలియదు. ‘వివక్ష లేదని జడ్జి్జ దృష్టిలో కాదు, నిందితుని దృష్టిలో చూడాల’ని లోగడ ఒక కేసులో జస్టిస్ వెంకటాచలయ్య చెప్పారు. కీలక వ్యవహారాల్లో నత్త నడకన సాగే విచారణ ఈ కేసులో ప్రశాంత్ భూషణ్ వెంటపడ్డట్టు వేగంగా సాగడమే విస్మయం! జడ్జీల అవినీతిపై చర్చ చాలా ముఖ్యం. దాని ఫలితంగానే విచారణలు, రుజువైతే అత్యున్నత చట్టసభల్లో వారి తొలగింపు ప్రతిపాదనలు–నిర్ణయాలు సాధ్యం. అలాంటి పరిస్థితు ల్లోనే హైకోర్టు జడ్జీలు పి.డి.దినకరన్, సుమిత్రాసేన్ రాజీనామాలు మనం చూశాం. సహేతుకమైన విమర్శల పట్ల ఉదారంగా వ్యవహరిం చడం ద్వారా మాత్రమే న్యాయస్థానాలు మరింత స్వేచ్ఛగా స్వతం త్రంగా పనిచేస్తాయి, గౌరవం–విశ్వసనీయత పొందుతాయి. అంతే తప్ప, కోర్టుల గౌరవం, విశ్వసనీయత పెంచడానికి పౌరుల హక్కుల్ని పణంగా పెట్టడం సరికాదు. సుప్రీంకోర్టు పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణ సంస్థే కాదు, ఇతర ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ రాజ్యాంగానికి లోబడి నడుచుకునేలా చూసుకోవాల్సిన వ్యవస్థ! తెలుగునాట ఓ సామెత ఉంది. ‘కన్నతల్లే దయ్యమైతే.. ఇక తొట్టెల (ఉయ్యాల) కట్టే తావెక్కడ?’ అని. సర్వో న్నత న్యాయస్థానం, దయ్యాల బారి నుంచి బిడ్డల్ని కాపాడుకునే దయగల కన్నతల్లి కావాలని జనం కోరిక! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
మన దారి మళ్లీ ప్రకృతిలోకే!
‘‘మనిషికి పని శిక్ష కాదు. అది అతనికి ప్రశంస. అదే అతని బలం. అందులోనే ఆనందం’’ అంటారు ప్రఖ్యాత ఫ్రెంచ్ నవలా రచయిత్రి జార్జ్ శాండ్ (అరోరె డుపిన్, 1804–1876 కలం పేరిది). పనే మనిషి జీవ నాధారమైన పరిస్థితుల్లో అది లేకుండా ఎన్నా ళ్లుండగలరు? చారిత్రక పోరాటాల పొత్తిళ్ల లోంచి పుట్టిన అంతర్జాతీయ కార్మిక దినో త్సవం, మేడే ముంగిట్లో... ఇదొక కోటి రూకల ప్రశ్న! ఇప్పుడు దేశమంతా, దాదాపు ప్రపంచమంతా కమ్ము కున్న కరోనా నిర్బంధపు మూసివేత (లాక్డౌన్)లో పనిలేని మనిషి ఏం చేయాలి? ఎన్నాళ్లు ఇంటికే పరిమితమవాలి? కూడబెట్టుకున్న ఆర్థిక వనరులు కరిగితే, తదుపరి జరుగుబాటెలా? విడతలుగా మూసి వేతను తొలగించుకుంటూ ముందుకు నడవడమే మనిషి చేయాల్సిన పని. గడచిన నలబై రోజులుగా మన దేశంలో లాక్డౌన్ అమలవు తోంది. కరోనా వ్యాధి వ్యాప్తిని కట్టడి చేస్తూనే నిర్బంధాన్ని క్రమంగా సడలిస్తూ జనజీవనాన్ని సాధారణ స్థితికి తేవాలనేది పాలకుల యోచన. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు యత్నం జరుగుతోంది. ఎక్కడో చిక్కుకున్న కార్మికులను స్వస్థలాలకు, స్వస్థలాల్లో చిక్కుపడి పోయిన వారిని కోరుకునే పనిప్రదేశాలకు తరలించే సన్నాహాలు మొద లయ్యాయి. ఒక్కపెట్టున లాక్‌డౌన్‌తో పుట్టెడు కష్టాలు చవిచూసిన వలసకార్మికుల విషయంలో జరిగిన తప్పిదానికిది దిద్దుబాటు చర్య! అటు సంపూర్ణ జీవి, ఇటు నిర్జీవీ కాని అర్థజీవి కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం ఇంకా వణుకుతోంది. సమస్త ఆర్థిక వ్యవస్థలు కుదేల య్యాయి. పదుల లక్షల్లో వ్యాధిగ్రస్తులవుతుంటే, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యవస్థలన్నీ స్తంభించాయి. అంతటా స్తబ్దత అలుముకొంది. కోవిడ్–19 అంటువ్యాధి లోతుపాతులు నెమ్మ దిగా తెలిసి వస్తున్నాయి. విరుగుడు కోసం ఒక వంక వ్యాధి నయం చేసే మందు, మరోవంక వైరస్‌ను తట్టుకునే టీకా (వాక్సిన్) కోసం ప్రయోగాలు ఒక్కో దశ దాటుకుంటూ ముమ్మరంగా సాగుతున్నాయి. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఇన్నాళ్లూ లాక్డౌన్ పకడ్బందిగా అమ లుచేస్తూ వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితే శాశ్వతం కాదు. ఇదివరకటి సాధారణ స్థితి ఇప్పుడప్పుడే రాదు. ఈ లోపున, ఓ కొత్త సాధారణ స్థితి వస్తుంది. దాన్నే అంతర్జాతీయ పరిభాషలో ‘న్యూ నార్మల్’ అంటు న్నారు. ఇప్పుడా సరికొత్త సాధారణ స్థితే సర్వత్రా చర్చనీయాంశ మౌతోంది. ఎలా సన్నద్ధం కావాలన్నది మానవాళి ముందున్న ప్రశ్న! మనిషి నిజంగా మారుతాడా? పార్కు చేసిన కారు అద్దంపై దుమ్ము పేరుకుపోవడం లేదు. నగరపు చెట్లమీదుగా బాల్కనీలోంచి పక్షుల శబ్దాలు వంటింట్లోకి స్పష్టంగా వినిపిస్తున్నాయి. నీలాకాశం నిర్మలంగా ఉంది. రాత్రిపూట కిక్కిరిసిన చుక్కలూ గిలిగింతలు పెడుతున్నాయి. కాలుష్యం లేక నదీ జలాలు పారదర్శకంగా పారి నదిగర్భం స్వచ్ఛంగా అగుపిస్తోంది. చాన్నాళ్ల తర్వాత జలందర్ నుంచి వందల కి.మీ దూరంలోని హిమాలయ పర్వతాల మంచు కళ్లకు కడుతోంది. జనసంచారం, వాహనాల సందడి లేక వన్యప్రాణులు, జలచరాలు మారిన తమ పూర్వాశ్రమా ల్లోకి, ఆధునిక నిర్మాణాల్లోకి వచ్చి స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. కోవిడ్–19 తర్వాత ఇది శాశ్వతంగా ఉంటుందా? ఉంటుందనుకో వడం అత్యాశే కాక అశాస్త్రీయం కూడా! ప్రస్తుత నిర్బంధ స్థితిలోనే భవిష్యత్ మానవ మనుగడ అసంభవం! క్రమంగా అది తిరిగి చలన శీలత పొందుతుంది. అప్పుడు మళ్లీ పరిశ్రమల్లో ఉత్పత్తి, ఆకాశంలో విమానాలు, రహదారుల్లో వాహనాలు, జనావాసాల్లో జన సంచారం, ఆటలు, పాటలు, వాణిజ్యం, వ్యాపారం... అన్నీ మనిషి దినచర్యల్లో భాగమౌతాయి. కానీ, యధాతథంగా మూసివేతకు ముందరి విచ్ఛల విడితనమో, మూసివేతలోని స్తబ్దతో ఉండవు. అదే సరికొత్త సాధారణ స్థితి! ప్రపంచ గమనమే మారుతుంది. ఇదివరకటి వాణిజ్యం అలాగే ఉండదు. అన్ని వినిమయ వస్తువులతో పాటు ఆహార ఉత్పత్తి కేంద్రాలు, వినియోగ పద్దతులు, వస్తు సరఫరా చానళ్లు, ఉద్యోగ వ్యవస్థ, సేవా రంగం... ఇలా సమస్త వ్యాపకాల్లో కొత్త క్రమత ఏర్పడుతుంది. మానవ విలువల్లోనూ మార్పు అనివార్యమౌతుంది. ప్రకృతి, పర్యావరణం వంటి అంశాల ప్రాధాన్యత తెలిసివస్తోంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో), ప్రపంచ బ్యాంకు... వంటి సంస్థల పనితీరూ మారాల్సి వస్తుంది. భద్రత, విద్య–ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాల నుంచి రాజకీయ నిర్వహణ వరకు మార్పుల్ని అని వార్యం చేసేంతగా కోవడ్–19 ప్రపంచ గతినే ప్రభావితం చేస్తోంది. దీనికి వ్యక్తులుగా, పౌరసమాజంగా, ప్రభుత్వాలుగా ఎవరు ఏ మేరకు మారుతారు? అన్నిట్లోనూ కీలక పాత్రధారి అయిన మనిషి ప్రవర్తన, పరివర్తన ఎలా ఉండబోతోంది? అన్నదే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. భయపడటమా? లొంగదీసుకోవడమా? భూగ్రహంపై కరోనా కుదుపు అసాధారణం. మనిషి దురాశ, సహజ వనరుల దోపిడీ, ప్రకృతి విధ్వంస క్రమంలో సాగిన వికృతాల వల్లే విష వైరస్ల పుట్టుక అని తేటతెల్లమైంది. ఎయిడ్స్, ఫ్లూ, ఎబోలా, సార్స్ వంటివి పుట్టి ఎంతటి అంటు వ్యాధులకు, తద్వారా మానవ మనుగడ విధ్వంసానికి కారణమయ్యాయో కోవిడ్ తర్వాత బాగా తెలిసి వచ్చింది. గత నలబై రోజుల బలవంతపు మూసివేతతో కలు గులో ఊపిరాడని ఎలుకలా మనిషి పరిస్థితి మారింది. శాస్త్రసాంకేతి కతో సమస్త జీవరాశిపై తనదే ఆధిపత్యం అనుకున్న మనిషికి గర్వ భంగమైంది. జీవవైవిధ్య ప్రాధాన్యత, ప్రకృతి సమతూకాన్ని కాపా డాల్సిన ఆవశ్యకత తెలిసివచ్చాయి. మారే వాతావరణాన్ని బట్టి కరోనా వైరస్ తన ఆర్‌ఎన్‌యే సీక్వెన్సింగ్‌ను మార్చుకుంటుంటే వాక్సిన్ కనిపెట్టడం కష్టమైన పరిస్థితి! వ్యాధి ముదిరితే చికత్సకు మందులు లేవు, చికిత్స పద్ధతులూ (ప్రొటోకాల్స్) తెలియవు! అంటు వ్యాధి కనుక ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా చూసుకోవడం ఒక్కటే చేయగలిగిన పని. అదొకటే అందుబాటులో ఉన్న పరిష్కార మార్గమని తెలిసింది, తీసుకోవాల్సిన జాగ్రత్తలూ ఎరుకే కనుక వైర స్తో సహజీవనం అనివార్యమని మనసు దృ«ఢపరచుకోవడమే విజ్ఞత! భయపడి అతి జాగ్రత్తలకు పోయి, వరుస నిర్బంధాలతో ఆర్థిక వ్యవ స్థల్ని కుదేలు చేయడం మంచిది కాదు. డబ్లుహెచ్‌వో చెప్పినట్టు గుర్తించు, పరీక్షించు, చికిత్స చెయ్ (త్రిబుల్ టీ) పద్దతిలో వ్యాధిని నియంత్రించాలి. శుభ్రత, మాస్క్‌లు ధరించడం, పని పద్దతులు మార్చుకోవడం, కనీస ఆరోగ్యసూత్రాలు పాటించడం, రోగనిరోధక శక్తి పెంచుకోవడం వంటివి చేస్తూ ఉండాలి. ప్రయోగశాలలు దాటి, ఉత్పత్తి కేంద్రాల నుంచి జనబాహుళ్యంలోకి టీకా, మందులు వచ్చే వరకు ప్రజ్ఞతో ఉండటమొక్కటే మార్గం. ఇదెంత కాలం ఉంటుందో కూడా తెలియదు. ఇదే మన జీవనశైలి అయినా ఆశ్చర్యం లేదు. ఇన్నాళ్లు మనతో ఉన్న వేర్వేరు బాక్టీరియా, వైరస్‌లలాగే కరోనా ఒకటని గ్రహించాలి. సహజీవనం చేస్తూనే, అవగాహనతో తగు జాగ్ర త్తలు తీసుకుంటూ మనిషి దాన్ని నియంత్రణలో ఉంచడం ఇప్పట్లో చక్కటి పరిష్కారం. అవసరమైన మేర పరీక్షలు జరుపకుంటేనో, లక్షణాలున్నా భయంతో పరీక్షలకు జడిసి తప్పించుకుంటేనో... కఠిన లాక్‌డౌన్‌తో ఇన్నాళ్లు ప్రజానీకం చేసిన త్యాగాలు, ప్రభుత్వ వ్యవస్థల కృషి అంతా వృధా! భయంతో వ్యాధి వ్యాప్తికి దోహదపడటం కాకుండా ప్రజ్ఞతో ఎవరికివారం ఆ గొలుసును ఛేదించాల్సిన సమయ మిది. తన భిన్నత్వాన్ని మనిషి జ్ఞానం ద్వారా చాటాలి. గతం పునరావృతం... భవిత డిజిటల్ మయం ‘అరవైలు, డెబ్బైలలో పుట్టిన మనం అదృష్టవంతులం...’ అంటూ ఒక ఆసక్తికర కథనం సామాజిక మాధ్యమాల్లో తరచూ చక్కర్లు కొడుతుం టుంది. అప్పట్లో... ఆరుబయట ఎండల్లో ఆడటాలు, అరకొర వస్తు వైభోగం, రేడియో–టీవీ కొత్తదనం, పనులన్నీ సొంతంగా చేసుకో వడం, పళ్లుకూరగాయలు బాగా తినటం, సమిష్టికుటుంబాల్లో కలివి డిగా తిరగటం... వంటివన్నీ అందులో గుర్తు చేస్తారు. లాక్డౌన్లో అవన్నీ మనకిపుడు తిరిగి అనుభవానికి వస్తున్నాయి. ఇస్త్రీలేని బట్టలు ధరించడం, పనులన్నీ సొంతంగా చేసుకోవడం, సాత్వికాహారం ఇష్టంగా తినటం, రోగనిరోధక శక్తి కోసం కాయగూరలు పళ్లు ఎక్కువ తీసుకోవడం, విలాస వస్తువ్యామోహం లేకుండా ఉన్నదానితో సరి పెట్టుకోవడం, మొక్కలకు, ఇంటెనక పెరళ్లకు, పొలాలకు, సమీపం లోని అడవులకు విలువివ్వటం... ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత అవుతుంది. వాటి ప్రాధాన్యత మళ్లీ ఇప్పుడు తెలిసొ స్తోంది. బస్సులు, రైళ్లు, విమానాలు, షాపింగ్ మాళ్లు, సినిమాలు... ఇంకా చాలా చాలా లేకుండా వరుసగా నెల రోజులకు పైనే ఉండాల్సి వస్తుందని, ఉంటామని మనమెవరమూ అనుకున్నది కాదు. ఉండలే మేమో అని ఊహల్లో సందేహించినా... ఉండగలుగుతున్నామన్నది కఠిన వాస్తవం. తప్పుడు అంచనాలకు– వాస్తవ అనుభవాలకు మధ్య ఓ ఘర్షణ! మేలైన పాత పద్ధతులు, సంప్రదాయ జీవన విధానంలోని మంచికి ఎప్పటికైనా ఆధరణ ఉంటుందనేదే కోవిడ్–19 నేర్పుతున్న పాఠం. అలా అని ఆధునికత ప్రభావం చూపదనుకుంటే పొరపాటే! టెక్నాలజీని అందిపుచ్చుకొని పనితీరును మరింత ఆధునీకరించుకో వాల్సి వస్తోంది. ఐటీ, సేవా తదితర రంగాల్లో ఆన్లైన్ ద్వారా ఉద్యో గులు ఇంటినుంచి పనిచేయడం భారత్‌లో ఇన్నాళ్లు నామమాత్రంగా ఉండేది. పరిమిత సిబ్బందిని ఆఫీసుకు పిలిచి, ఇళ్ల నుంచే మెజారిటీ సిబ్బందితో ఎలా పనితీసుకోవచ్చో పెద్ద పెద్ద కంపెనీలూ తెలుసుకుం టున్నాయి. మున్ముందు పనిక్రమం, పద్ధతుల్లోనూ సమూల మార్పులు రానున్నాయి. వనరుల పొదుపు మొదలవుతుంది. ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. విద్య, వైద్యం వంటి రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఒత్తిడి ప్రభుత్వాలపై పెరుగుతుంది. కరోనా వంటి విపత్తులు ఎన్నొచ్చినా.. భవిష్యత్తులో గట్టిగా నిల బడాలంటే ఒక్కటే బలమైన సమాధానం, సరికొత్త సాధారణ స్థితి.... ఫ్రెంచ్ తత్వవేత్త రూసో చెప్పినట్టు, సాగాలి మన ప్రయాణం ‘మళ్లీ ప్రకృతి లోకి’. దిలీప్ రెడ్డి -
ప్రజాతీర్పు వండి వారుస్తారా?
గత వారం రోజుల సభలు, సమావేశాలు, ప్రజాస్పందన చూస్తున్న వారికి ఒక విషయం స్పష్టమౌతోంది. ఏపీ జనాభిప్రాయం ఇప్పటికే వారి మెదళ్లలో నిశ్చయం అయిపోయింది. ఇక అది ఈవీఎంలలోకి బదిలీ కావడమే తరువాయి. కానీ, కులాల వారిగా ఓట్లను చీల్చడానికి, వర్గాల వారిగా ప్రత్యర్థిని బలహీనపరచడానికి, లేని నిందారోపణలతో విపక్షనేతను చిన్నబుచ్చడానికి, పౌరుల్ని తక్కువ అంచనా వేసి సాను‘కుల’ మీడియాతో జనాభిప్రాయం తిరగరాయడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ దింపుడు కళ్లం ఆశే! రాజకీయ స్వార్థంతో చేసే ఏ చర్యలు ఎలా ఉన్నా, ప్రజల్ని తక్కువ అంచనా వేయడం, జనాభిప్రాయాన్ని ఇష్టానుసారంగా తిరగరాస్తామనుకోవడం భ్రమ మాత్రమే! ‘ఇక్కడ చట్టం అమలు కాదు, ఉపయోగించ బడుతుంది’ (యహా ఖానూన్ లాగూ నహీ హోతా, ఇస్తెమాల్ కియా జాతా హై) అనే డైలాగ్ అమితాబ్ నటించిన ‘అంధా ఖానూన్’ సినిమాలోది. అధికారం అండతో చట్టాలను చెరబట్టినవారు ఇష్టానుసారం వ్యవహరించే స్థితిని ప్రతిబింబించే అహంకారపు మాట అయినందున, సదరు డైలాగ్ నేరుగా ప్రేక్షకుల గుండెను తాకుతుంది. సన్నివేశం ఉత్కంఠ రేపుతుంది. దాదాపు అలాంటి వాతావరణమే నెలకొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇపుడు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమైంది. గెలుపు సందేహమై, ఓటమి తప్పదనే సంకేతాల కారణంగా అధికారపక్షం వైపునుంచి అన్ని మాయోపాయాలూ మొదలయ్యాయి. అయిదేళ్ల పాలనలో ప్రజాస్వా మ్యపు వ్యవస్థలన్నింటినీ చిద్రం చేసిన పాలకులు, ఇప్పుడు ఒకటొకటిగా అన్ని సంప్రదాయాలు, పద్దతులు, మర్యాదల్ని మంటగలుపుతున్నారు. ప్రజాక్షేత్రంలో గందరగోళం సృష్టించడం ద్వారా, ఇప్పటికే సిద్ధాంత పటుత్వం తగ్గి పలుచనైన రాజకీయాల్ని మరింత కలుషితం చేస్తున్నారు. అవసరానికో, అవకాశవాదానికో పనికొచ్చే పొత్తులతో, లోపాయికారి ఒప్పందాలతో ఎన్నికల చిత్రాన్నే మారుస్తున్నారు. జనాభిప్రాయాన్నే వంచించాలని ఎత్తుగడలు వేస్తున్నారు. స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆలోచించి, ఓటువేసే వాతావరణం ఓటర్లకు దక్కనీకుండా, ఏదోలా వారిని ప్రభావితం చేసే వ్యూహ రచనల్లో మునిగితేలుతున్నారు. అధి కారపు అండదండలు, ఆర్థిక ప్రయోజనాల రుచి మరిగిన చిన్న చితక పార్టీలు, పచ్చ మీడియా బేషరతుగా పాలకపక్షానికి ఊడిగం చేస్తు న్నాయి. రాజకీయ శిబిరాలకు దన్నుగా అనుకూల మీడియా... బలపడు తున్న జనాభిప్రాయాన్ని వక్రీకరింప జూస్తోంది. నిజం ప్రతిబింబించడం కాదు, నిర్మించడం అంతకన్నా కాదు, ప్రఖ్యాత జర్నలిస్టు ‘నామ్ చోమ్స్కీ’ చెప్పినట్టు, ‘జనాభిమతాన్ని’ తామే వండి, వార్చే పని ఇప్పుడు తెలుగునాట య«ధేచ్ఛగా సాగిస్తున్నారు. సంక్షుభిత సమ యాలు, సంక్లిష్ట ఎన్నికల్లోనూ విజ్ఞతతో వ్యవహరించే ఆంధ్ర సమాజాన్ని చిన్నచూపు చూసే రాజకీయ వైఖరి ఇది. దానికి ‘తందాన’ పలికే అను‘కుల’ మీడియా పోకడ రాజకీయ–మేధావి వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది. జనాన్ని తప్పుదోవ పట్టించే ఎత్తుగడలు ఎన్ని పన్నినా... ప్రజాక్షేత్రంలో మాత్రం అస్పష్టత ఉండదు. రంగు తొలగడం తరువాయి పరిస్థితి సానుకూలంగా లేనపుడు ప్రజల్లో గందరగోళం సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూడటం రాజకీయాల్లో ఓ నమూనా! ఫక్తు అదే పాటి స్తున్నారిపుడు. ఓట్లే యావ, గెలుపే లక్ష్యం! మతాన్ని, ముఖ్యంగా కులాన్ని మున్నెన్నడు లేనంతగా ఈ ఎన్నికల్లో వాడుకునే కుటిల వ్యూహాలు పన్నుతున్నారు. ప్రత్యక్ష–పరోక్ష పొత్తులు–అవగాహనలు కూడా పక్కా అవకాశవాదంతోనే తప్ప ఏ సిద్ధాంత సారూప్యతా, నిబ ద్ధతా లేదు. పాలకపక్షమైన తెలుగుదేశంతో జనసేన సఖ్యత జనానికి తెలియంది కాదు! తానొక విపక్షమై ఉండి, చాలా ప్రజాసంబంధ విషయాల్లో ప్రభుత్వంపై విమర్శల కన్నా సాటి ప్రధాన ప్రతిపక్షంపైనే విమర్శలు ఎక్కుపెట్టారు జనసేన నేత! కీలకమైన ప్రజా సమస్యలు ముప్పిరిగొన్నపుడు, తగుదునమ్మా అని తాను రంగ ప్రవేశం చేసి, జనా నికి ఊరట కన్నా ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించిన సందర్భాలెన్నో! అయినా, అటువంటిదేదీ లేదని మభ్యపెట్టడానికి ఎన్నెన్ని మాటలు చెప్పారో! కానీ, వారి లాలూచీ కుస్తీ క్రమ క్రమంగా బయటపడుతోంది. ఎక్కడో ఉత్తరాదిలో ఉన్న బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రితో పొత్తుకు ఎంత వేగంగా పావులు కదిపారు? దీని వెనుక ఉండి వ్యవ హారం నడిపిందెవరు? ఎవరి ప్రయోజనాలు నెరవేరడానికి? దళిత, బడుగు బలహీనవర్గాలు ప్రధాన దన్నుగా ఉన్న వైఎస్సార్సీపీని రాజకీ యంగా దెబ్బతీయాలనే ఎత్తుగడ కాదా? ఏపీలో బీఎస్పీ–జనసేన–లెఫ్ట్ కూటమి వ్యూహాత్మక పొత్తుల తెరవెనుక ఉన్న పరోక్ష పథగామి ఎవరు? రాజకీయాల్లో ఓనమాలు తెలిసిన ప్రతి ఒక్కరూ అంచనా వేయగలరు. మైనారిటీ ఓట్లు దక్కనీయొద్దనే కుటిల నీతితోనే, విపక్షనేతకు బీజేపీతో లేని బంధం అంటగట్టడం. ఆంధ్ర–తెలంగాణ వివాదాన్ని రగల్చడానికి కేసీఆర్–జగన్ ఒకటనే దుష్ప్రచారం. వైఎస్సార్‌ని అభిమానించే పెద్ద సంఖ్య కాంగ్రెస్ వాదుల్ని వైఎస్సార్సీపీకి కానీకుండా చేసేందుకు కాంగ్రెస్‌తో తన అంగీకారం.. ఇన్ని వ్యూహాలా? ఆయా గ్రూపులు పోటీ చేసే స్థానాల ఎంపికతోనే రంగు బయటపడుతోంది, రేపు అభ్యర్థిత్వాలు ఖరారయ్యాక ఏ వ్యూహం వెనుక ఏ కుటిల నీతో తెలియకుండా ఉంటుందా? పులుముకున్న పులివర్ణం కలకాలం నిలువదు. తుంపర వర్షానికే కరిగిపోతోంది, ఇక రేపటి జడివానకు నిలుస్తుందా? ఊహు! రంగు వెలసి గాడిద బయట పడటం ఖాయం! దిగితే తెలుస్తుంది లోతు ఇంత కాలం ముసుగులో గుద్దులాటలు ఎలా ఉన్నా, ఒకసారి రాజకీయ బరిలోకి దిగాక అసలు రంగు తెలిసిపోవాల్సిందే! నిలదొక్కుకోకుంటే వెలిసిపోవాల్సిందే! వేగంగా తరం మారుతోంది. సామాజిక మాధ్య మాల ప్రభావం పెరిగాక సామాన్యులు కూడా తెలివిపరులైపోతున్నారు. ఆలోచిస్తున్నారు. ప్రత్యక్ష సమాచారంతో స్పష్టమైన అభిప్రాయాలు ఏర్ప రచుకుంటున్నారు. ఏ రంగంలో నిపుణుల్ని అక్కడే ఆదరిస్తున్నారు తప్ప ఇతర రంగాల్లో పెద్దపీట వేయడానికి వెనకాడుతున్నారు. సినీ తారలు, ఆ గ్లామర్‌తో రాజకీయాల్లో వెలగడమిక కష్టమే! తమిళ రాజకీయాలేలిన జయలలితే ఆ తరంలో ఆఖరు అనిపిస్తుంది. ఉత్సాహంతో ఎవరైనా సినీ రంగం నుంచి వచ్చినా... రాజకీయాల్లో నిబద్ధతతో నిలదొక్కుకోవా ల్సిందే! ఇప్పుడు పవన్‌కళ్యాణ్ అయినా, జేడీ లక్ష్మీనారాయణ అయినా తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. 2014 ఎన్నికల ముందు టీడీపీని సమర్థించినపుడున్నంత స్పష్టత ఇప్పుడు జనసేనాధిప తిలో కొరవడింది. చంద్రబాబునైనా, జగన్మోహన్రెడ్డినైనా ఆయన సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? ఏదైతే, ఎందుకు? స్పష్టంగా వ్యక్త పరచాలని ప్రజలు డిమాండ్ చేస్తారు. ప్రజాకవి శ్రీశ్రీ అన్నట్టు, ‘ప్రజా జీవితంలోకి వచ్చాక ఏమైనా, ఎన్నైనా అంటాం’ అంటారు జనం. విశాఖ పట్నం లోక్‌సభ అభ్యర్థిత్వం ఖరారైన లక్ష్మీనారాయణ సీబీఐ అధికారిగా వ్యవహరించిన తీరు మరోమారు రాజకీయ తెరపైకి వస్తుంది. జగన్మో హన్ రెడ్డిపై కేసుల విచారణలో చూపిన అత్యుత్సాహం, చంద్రబాబుపై కేసుల విషయానికొచ్చే సరికి ఎందుకు తగ్గిందనే ప్రశ్న ఎప్పటికీ రేగు తూనే ఉంటుంది. తమ వద్ద తగిన సిబ్బంది లేరు కనుక విచారించలే మని న్యాయస్థానానికి ఆయన నేతృత్వపు సీబీఐ బదులివ్వడం అప్పట్లో వార్తయింది. నైపుణ్యాలు, సానుకూల ప్రచారాలే కాకుండా ప్రతికూల వాఖ్యలు కూడా ఇప్పుడు జనం చర్చల్లోకి వస్తాయి. ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఓ సీబీఐ కేసు విచారణను ఆదిలాబాద్ జిల్లా జడ్జి తప్పుబట్టడం వంటివి ఇప్పుడు ప్రచారంలోకి రావచ్చు. 2010లో ఆదిలాబాద్ వాంకిడి మండలం సర్కెపల్లి అడవిలో జరిగన ఆజాద్ (మావోయిస్టు), హేమ చంద్ర ప్రసాద్ (జర్నలిస్టు) ఎన్కౌంటర్ కేసు దర్యాప్తు సవ్యంగా జరగ లేదని, పోలీసులకు అనుకూలంగా సాగిందని జడ్జి వ్యాఖ్యానించారు. సమాధానం లేకే ఎదురుదాడి అయిదేళ్లు అధికారం అప్పగిస్తే అన్నిటా విఫలమైన ప్రభుత్వ పెద్ద, విపక్షం విమర్శల్ని తట్టుకోలేక ఎదురుదాడికి తలపడుతున్నారు. చేసిన ప్రగతిని చెప్పుకోలేని దుస్థితిలో విపక్షనేతపై నోటికొచ్చిన నిందలు మోపుతున్నారు. నలబై యేళ్ల అనుభవమని చెప్పే ముఖ్యమంత్రికి ఒక నిందితుడికి, నేరస్తుడికి తేడా తెలియదా? విపక్షనేత ఎదుర్కొంటున్న వన్నీ తామే వేసిన తప్పుడు కేసులని, ఏ కేసులోనూ ఏదీ నిరూపిత మయ్యే పరిస్థితి లేదని తెలిసీ చేసేది కువిమర్శ కాదా? 1999 ఎన్నికల్లోనూ నాటి పీసీసీ అధ్యక్షుడు డా.వైఎస్.రాజశేఖరరెడ్డిపై ఈయన ఇటువంటి నిందలే మోపారు. వారొస్తే అభివృద్ధి ఆగిపోతుందని, శాంతి భద్రతలుండవని, రౌడీయిజం రాజ్యమేలుతుందనీ ప్రజల్లో భయాందోళ నలు రేపారు. అదృష్టంతో ఆ ఎన్నికల్లో నెగ్గి, నిరూపితం కాని అవే నిందల్ని వైఎస్‌పై మళ్లీ మోపే ప్రయత్నం 2004లోనూ చేసి భంగ పడ్డారు. అవన్నీ రాజకీయ దుగ్ధతో చేసిన నిరాధారపు నిందలని డా‘‘ వైఎస్. హయాం నిరూపించింది. ‘అభివృద్ధి–సంక్షేమం’ జోడెడ్ల బండిలా పాలనను వై.ఎస్ పరుగులు తీయించారు. తర్వాతి తరాల పాలకులకు వైఎస్సార్ హయాం బెంచ్మార్కయింది. ఉత్తుత్తి నిందలు నమ్మి, అయ్యో... బంగారు పాలన అయిదేళ్లు జాప్యం చేసుకున్నామే! అని ప్రజలు పశ్చాత్తాప పడ్డారు. ఇప్పుడు ప్రజలు నిందలు నమ్మడానికి, సుపరిపాలనను జాప్యం చేసుకోవడానికి సిద్దంగా లేరు. సడలిన నమ్మకానికి ఇవే ఆధారాలు! గత వారం రోజుల సభలు, సమావేశాలు, ప్రజాస్పందన చూస్తున్న వారికి ఒక విషయం స్పష్టమౌతోంది. ఏపీ జనాభిప్రాయం ఇప్పటికే వారి మెదళ్లలో నిశ్చయం అయిపోయింది. ఇక అది ఈవీఎంలలోకి బదిలీ కావ డమే తరువాయి. అందుకు మూడు వారాల గడువుంది. ఈ లోపున ఎన్నెన్ని సర్కస్ ఫీట్లో! సీఎం విశ్వాసం నడలిందనడానికి పరస్పర విరు ద్ధపు ఆయన మాటలు, వ్యవçహారమే సంకేతం. ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగుతున్న ఇద్దరు మంత్రుల్ని తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయించిన సీఎం, తన తనయుడు లోకేష్‌తో మాత్రం చేయించలేదు. రిస్కు తీసుకోవడానికి సిద్ధంగా లేరన్న మాట! రెండు విధాలా, ఓటమి ఆస్కారాన్ని అంగీకరించారన్నట్టే! ‘నా నలభయేళ్ల రాజకీయ జీవితంలో ఇంత సానుకూలత ఎప్పుడూ చూడలేదు’ అని గంభీరంగా ప్రకటన చేసిన ఆయన, హిందూపూర్‌లో ఒక సీఐ స్థాయి అధికారి పోటీని నివా రించడానికి తన ప్రభుత్వంతో ఎలా మోకాలడ్డారో జనం చూశారు. అడ్డు కోవడం సరికాదని, పూర్వపు తేదీతో సీఐ రాజీనామా అంగీకరించండని ట్రిబునల్తో చెప్పించుకోవాల్సి వచ్చింది. కులాల వారిగా ఓట్లను చీల్చ డానికి, వర్గాల వారిగా ప్రత్యర్థిని బలహీన పరచడానికి, లేని నిందారోప ణలతో విపక్షనేతను చిన్నబుచ్చడానికి, పౌరుల్ని తక్కువ అంచనా వేసి సాను‘కుల’ మీడియాతో జనాభిప్రాయం తిరగరాయడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ దింపుడు కళ్లం ఆశే! రాజకీయ స్వార్థంతో చేసే ఏ చర్యలు ఎలా ఉన్నా, ప్రజల్ని తక్కువ అంచనా వేయడం, జనాభిప్రాయాన్ని ఇష్టానుసారంగా తిరగరాస్తామనుకోవడం భ్రమ మాత్రమే! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
భయం లేకే బరితెగింపు!
చట్టాల పట్ల నిర్భీతితో, సాటి మనిషిని వెంటాడి, నరికి చంపేందుకు ఉన్మాదులు తెగబడుతున్న తీరు ఆందోళనకరం. తీవ్ర నేరాలు చోటుచేసుకున్నపుడు, సదరు కేసుల విచారణ జరిపించి సత్వర న్యాయం అందేలా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. దాంతో ప్రజలకు విశ్వాసం, నేరస్తులకు భయం పెరుగుతాయి. జన సమక్షంలో హత్యలు చేసి, పోలీసుల వద్ద నిందితులు లొంగిపోయి, తగు సాక్ష్యాధారాలున్నపుడు... ఏ మాత్రం జాప్యం చేయకుండా వేగంగా విచారణ ముగించి, శిక్షలు పడేలా చూస్తే, సమా జంలో చట్టాలు–శిక్షల భయం నిలుస్తుంది. వ్యవస్థలన్నీ మనిషి ఉత్కృష్ట జీవనగతి కోసమే! మనిషి ప్రాణాల్ని కాపాడటం సదరు వ్యవస్థలన్నిటి ప్రాథమిక కర్తవ్యం. గత పదిహేనురోజుల్లో పట్టపగలు నడిరొడ్డున జరి గిన హత్యలు, హత్యాయ త్నాలు సగటు మనిషిలో భయం పుట్టిస్తున్నాయి. ఎంచుకున్న వారిని జనం చూస్తుండగానే వెంటాడి హతమార్చిన తీరు, అçక్కడ నెలకొన్న భీతావహ వాతావరణం, తర్వాత జరుగుతున్న చర్చ... ఇదంతా ఒక ‘న్యూస్‌రీల్’లా కళ్ల ముందు తిరుగు తోంది. నాగరిక సమాజంగా మనం ఎటు పయని స్తున్నాం? అనే ఊహ గగుర్పాటు కలిగిస్తోంది. ‘అంతటా, రోజూ ఇవే జరుగుతున్నాయా? ఏదో ఒకటీ, అరా ఘటనలకు ఇంతలా కంగారు పడాలా?’ అనొచ్చు సగటు మేధావులెవరైనా! కానీ, అవి జరి గిన తీరు, అందుకు దారితీసిన కారణాలు, రాగల పరిణామాల్ని లోతుగా విశ్లేషిస్తే, అలా తీసిపారేయ డానికి వీళ్లేదు అనిపిస్తోంది. చట్టం–న్యాయ ప్రక్రియ, పోలీసు వ్యవస్థ, మీడియా, సామాజిక పరిస్థితులు, మానవ సంబంధాలు... ఇలా అన్నీ ఇపుడు చర్చకు వస్తున్నాయి. ఆయా ఘటనల ముందు, వెనక పరి స్థితులెలా ఉన్నా, రెండంశాలు మాత్రం తీవ్రంగా కలత రేపుతున్నాయి. చట్టాల పట్ల నిర్భీతితో, జనం చూస్తుండగానే సాటి మనిషిని వెంటాడి, నరికి చంపేందుకు ఉన్మాదులు తెగబడుతున్న తీరు ఆందో ళనకరం. అదే సమయంలో... జనం అచేతన, నిష్క్రి యత్వం, తమకేమీ పట్టనట్టు సాఫీగా సాగిపోతున్న తీరు మరింత గగుర్పాటు కలిగిస్తోంది. సామాజిక మాధ్యమాలు వంటి ‘కృత్రిమ ప్రపంచం’ (వర్చువల్ వల్డ్)లో ఉన్నంత క్రియాశీలంగా జనం వాస్తవిక ప్రపంచంలో ఉండట్లేదు. ఈ పరిస్థితులిలాగే ఉంటే, ఇంకెన్ని ఘాతుకాల్ని చూడాల్సి వస్తుందోననే భయం పలువురిని కలవరపెడుతోంది. ఈ ఘోరాల వెనుక భూవివాదాలు, వివాహేతర సంబంధాలు, పరువు భావనలు, కులాంతర ధ్వేషాగ్నులు, పగ–కక్ష సాధిం పులు ప్రధాన కారణాలవటం వికటిస్తున్న సామాజిక పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇవన్నీ తమకేమీ సంబంధంలేని వ్యవహారాలన్నట్టు పాలకులు స్పంద నారహితంగా ఉండటం మరింత ఆశ్చర్యకరం. ఏ విరుగుడు చర్యలూ తీసుకోకుండా ఈ పరిస్థితుల్ని ఇలాగే కొనసాగనిస్తే, అవింకా ఎటు దారితీస్తాయో అంతుబట్టని అయోమయం! నిరంతరం తలపై వేలాడే కత్తిలా చట్టమంటే ఓ ‘భయం’ నెలకొల్పడం ద్వారానే నేరాల్ని నియంత్రించగలమనే సంప్రదాయ భావన తరచూ గుర్తుకొస్తోంది. ఆ భయం సడలు తోంది. అందుకు, అనేకాంశాలు కారణమవుతు న్నాయి. మారిన ప్రభుత్వాల ప్రాధాన్యతలు, వ్యవ స్థాగత లోపాలు, సన్నగిల్లిన సామాజిక విలువలు, పలుచనైన మానవ సంబంధాలు, ప్రపంచీకరణ తాలూకు ఆర్థిక అసమానతలు... ఇలా ఎన్నెన్నో అంశాలు పరిస్థితుల్ని అక్కడికి తోస్తున్నాయి. ఎవరూ దీన్ని గట్టిగా పట్టించుకోక మనుషుల భద్రత గాల్లో దీపమయితే ఎలా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంత నిర్భీతి ప్రమాదకరం! చట్టం, న్యాయ వ్యవస్థ, శిక్షలంటే ఇంతటి భయంలేని తనం ప్రమాద సంకేతమని సామాజికవేత్తలంటు న్నారు. మొన్న మిర్యాలగూడ, నిన్న ఎర్రగడ్డ, నేడు అత్తాపూర్‌లో జరిగిన çఘటనలు మనకదే భావన కలి గించాయి. ఇవి కాకుండా ఇలాంటి హత్యలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఇది పరిమితంగా అక్క డక్కడ పొడచూపుతున్నదే అనుకున్నా... ఈ సంకే తాలు సమాజానికంత శ్రేయస్కరం కాదనేది ఆందో ళన.. పట్టపగలు, జనం మధ్య మారణాయుధాలతో తలపడి మనుషుల్ని తెగనరకడం అన్నదో ఉన్మాద చర్య! ఇందుకు కారణాలు చాలానే ఉండొచ్చు. తర్వాత తామెదుర్కోబోయే ఇబ్బందుల కన్నా లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తిని మట్టుపెట్టడమే ప్రధాన మనే ఉన్మాదపు భావనతోనో, మద్యం సేవించిన మత్తులోనో కొందరు ఇలాంటి దాష్టీకాలకు పాల్పడ వచ్చని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. ఏం చేసయినా తర్వాతి పరిస్థితిని తామెదుర్కొనగలమనే మొండి ధీమా కూడా ఇలాంటి చర్యలకు వారిని పురిగొల్పే ఆస్కారముందని సామాజిక శాస్త్రవేత్తలం టున్నారు. నేర–న్యాయ ప్రక్రయలోని లోపాలే ఈ నిర్భీతికి ముఖ్య కారణమని నిపుణుల విశ్లేషణ. నేర దర్యాప్తు, సాక్ష్యాల పరీక్ష, న్యాయ విచారణ–అప్పీలు తదితర ప్రక్రియల్ని ఏ దశలోనయినా ప్రభావితం చేయగలలమనే ధీమాయే ఇటువంటి తెగింపులకు కారణమౌతోంది. ప్రక్రియలో జాప్యం, సాక్ష్యాల్ని తారుమారు చేయడం, సాక్షులు మాట మార్చేలా చూడ్డం, అప్పీలుతో శిక్షల అమలు వాయిదా వేయిం చుకోవడం.... ఇలా ఎన్నో మాయోపాయాలతో నేర స్తులు తప్పించుకుంటున్నారు. మహా అంటే రెండు, మూడు నెలలు జైళ్లో ఉంటాం, తర్వాత బెయిలో, అప్పీలో.. బయటకొచ్చేస్తామనే ధైర్యం కూడా వారినీ దుశ్చర్యలకు పురిగొల్పుతోంది. దర్యాప్తు–విచార ణల్లో అసాధారణ జాప్యాలు, అతి తక్కువ (సగటు 27 శాతం) కేసుల్లోనే శిక్షలు పడుతున్న తీరు, శిక్ష ఖరారయ్యాక కూడా దాని అమలు వాయిదాతో అప్పీళ్లు దశాబ్దాలపాటు సాగేలా చూసుకోవడం ఇందుకు నిదర్శనం. ఇటువంటి దురాగతాలకు రాజ కీయ నాయకులు, పలుకుబడి గలిగిన వారు వత్తాసుగా నిలవడం పరిస్థితిని ఇంకా దిగజా రుస్తోంది. సంబంధాలు తెగిన సమాజం మనుష్యుల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. నగర, పట్టణ ప్రాంతాల్లో ఒకరికొకరు సంబంధం లేకుండానే బతికేస్తున్నారు. పక్కింట్లో ఏం జరుగు తోందో ఈ ఇంటివాళ్లకు తెలియదు. రోడ్డు మీద కత్తిపోటుకు గురైన మనిషి రక్తపు మడుగులో గిలగిల్లాడుతుంటే... ఓ చూపు చూసి, నిట్టూర్చి తమ మానాన తాము సాగిపోవడం రివాజయింది. కళ్లె దుట ఒకర్ని మరొకరు పొడుస్తున్నా చోద్యం చూస్తు న్నారు. పని ఒత్తిడి లేకుంటే కాసేపు నిలబడి సెల్ ఫోన్లో ఫోటోనో, వీడియోనో తీసి సామాజిక మాధ్య మాల్లో పోస్టింగ్ పెట్టడం మామూలయింది. తెగించ యినా ప్రాణాలు నిలబెట్టడం మనిషి ప్రధాన కర్తవ్య మనే భావన తగ్గుతోంది. రిస్కు తీసుకోవడానికి సిద్దపడట్లేదు. ‘దాడి నాపై కాదు కదా! నాకెందుకు... అడ్డుకున్నందుకు దుండగులు నాపై కక్ష కడితేనో! సాక్షమివ్వడానికి పోలీస్‌స్టేషన్ చుట్టో, కోర్టు చుట్టో తిరగాల్సి వస్తేనో..! ఇలాంటి శంక, మీమాంస ఎక్కు వయింది. ఎర్రగడ్డ ఘటనలో సాహసించిన ఓ యువ కుడు వెనకనుంచి పటేల్మని తన్నడంతో నిందితుడు పడిపోయినందువల్ల, ఒక పోటు తగ్గి మాధవి ప్రాణా లతో బతికి బట్టకట్టింది. కనీసం ఆ జోక్యం లేకుంటే! ఏమయ్యేదో! అత్తాపూర్‌లో ఒక వ్యక్తి నిందితుడ్ని వెనకనుంచి పట్టుకొని నిరోధించడానికి యత్నిం చినా.. తానొక్కడవడం వల్లేమో అది సాధ్యపడ లేదు. విదిల్చుకున్న నిందితుడు వరుస పోట్లతో, లక్ష్యం చేసుకున్న వ్యక్తిని అక్కడికక్కడే హతమా ర్చాడు. దుండగుడి చేతిలో ఉన్నది గన్ వంటి ప్రమా దకర మారణాయుధం కాదు, గొడ్డలే అయినందున అక్కడున్నవారిలో ఓ నలుగురయిదుగురు పరస్పరం కనుసైగ చేసుకొని ఒక్కసారిగా నిందితులపై లంఘించి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో? అనే భావన అత్యధికులు వ్యక్తం చేశారు. ఇలా సాహసం చేసే వారికి తర్వాతయినా పోలీసులు రక్షణ కల్పిం చాలి. ప్రభుత్వం, పోలీసులు, మీడియా... తగు ప్రోత్సాహకాలివ్వడం, అవార్డులు–రివార్డులతో సత్కరించడం వంటివి చేయాలి. ‘కాదు, మా గుర్తింపు గోప్యంగా ఉంచండ’ని వారు కోరితే అదే చేయాలి. సదరు సాహసం ఇతరులకు స్ఫూర్తి అవు తుంది. నేరగాళ్లను అడ్డుకునేందుకు ఇంకెందరో సిద్ద మవుతారు. ఘటనా స్థలిలో సాటి మనుషులే అడ్డు కున్న సందర్భాలు పెరిగితే దుండగుల మొండి సాహ సాలు, హంతక చర్యలు తగ్గుతాయి. మీడియాకూ బాధ్యత ప్రసారమాధ్యమాలు సంయమనం పాటించాలని, బాధ్యతతో వ్యవహరించాలని సామాజికవేత్తలంటు న్నారు. పట్టపగలు, వెంటాడి మనిషిని మనిషి చంపే దాష్టీకాలు జరిగినపుడు ప్రసారాల్లో విచక్షణ చూపా లనేది వారి అభిప్రాయం. వాటిని పదే పదే చూపి, ‘ఓస్! ఇంతేనా.... హత్య ఇంత తేలికా..? ఇంత సుల భంగా నేరస్థలి నుంచి జారుకోవచ్చా!’ అన్న భావ నలు బలపడనీకుండా ప్రసారాల్లో జాగ్రత్త వహిం చాలి. చిరు చొరవే అయినా.. సాహసించిన వారిని హీరోలుగా చూపాలి. వేగంగా దర్యాప్తు–విచారణ ముగించి, సత్వర న్యాయంతో శిక్షలు పడ్డపుడు మీడియా వాటికెక్కువ ప్రాచుర్యం కల్పించాలనేది నిపుణుల అభిప్రాయం. పౌరులెవరైనా.. తామే పాఠకులు, తామే రిపోర్టర్లయ్యే వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమ వేదికల్లోనూ విచ్చలవిడితనం పెరిగిపోతోంది. ధృవీకరణ లేని వార్తల వ్యాప్తిని ఇక్కడ నిలువరించాలి. శీఘ్ర విచారణలు నిరంతరం జరగాలి పోలీసుల నేర దర్యాప్తు ప్రక్రి యల్లో ఇటీవల ఎంతో శాస్త్రీయత వచ్చింది. సాధారణ వేలి ముద్రలకు తోడు డీఎన్యే వేలిముద్రల్ని సరిపోల్చడం, ఇతర ఫొరెన్సిక్ పరీక్షలు, సీసీ కెమెరాల ఫుటేజీ విశ్లేషణ, లై డిటెక్టర్ల వాడకం... ఇలా పలు పద్దతులతో నిందితుల్ని ఇట్టే పట్టేస్తున్నారు. దర్యాప్తు వేగంగా ఓ కొలిక్కి తెస్తు న్నారు. శాస్త్ర–సాంకేతిక సహకారం వల్ల వివిధ విభాగాల మధ్య సమన్వయం, దర్యాప్తుల్లో ఖచ్చి తత్వం పెరిగాయి. ఇదే పరిస్థితి న్యాయ విచా రణ–శిక్షల ఖరారులోనూ ఉంటే, నేరస్తుల మీద చట్ట ప్రభావం ఎంతో ఉంటుంది. శిక్ష భయంతో నేరం చేయడానికి జంకుతారు. నేర తీవ్రతను బట్టి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సత్వర న్యాయం కోసం ‘శీఘ్ర విచారణ న్యాయ స్థానాల్ని’ (ఫాస్ట్ ట్రాక్ కోర్ట్సు) ఏర్పాటు చేస్తున్నారు. నిర్భయ వంటి కేసుల్లో విచారణ వేగంగా జరిపి, తక్కువ సమయంలోనే శిక్షల్ని ఖరారు చేశారు. అలాంటి కొన్ని న్యాయ స్థానాలను శాశ్వత ప్రాతిపదికన నడపాలి. తీవ్ర నేరాలు చోటుచేసుకున్నపుడు, సదరు కేసుల విచా రణ అక్కడ జరిపించి సత్వర న్యాయం అందేలా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. దాంతో ప్రజలకు విశ్వాసం, నేరస్తులకు భయం పెరుగుతాయి. జన సమక్షంలో హత్యలు చేసి, పోలీసుల వద్ద నిందితులు లొంగిపోయి, తగు సాక్ష్యాధారాలున్నపుడు... ఏ మాత్రం జాప్యం చేయకుండా వేగంగా విచారణ ముగించాలి. సత్వరం శిక్షలు పడేలా చూస్తే, సమా జంలో చట్టాలు–శిక్షల భయం నిలుస్తుంది. తాను ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలన్నీ మనిషి ఉత్కృష్ట జీవనగతి కోసమే! మనిషి ప్రాణాల్ని కాపాడటం సదరు వ్యవస్థలన్నిటి ప్రాథమిక కర్తవ్యం. దిలీప్ రెడ్డి -
ప్రజాధనం–పచ్చదనం–మనం
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో, దేశం మొత్తమ్మీద పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వెచ్చించి చేపడుతున్న ‘హరిత’ కార్యక్రమాల్లో జనభాగస్వామ్యం, పౌర అప్రమత్తత, ప్రజాసంఘాల నిఘా, సామాజిక సంస్థల తనిఖీ ఎంత? అన్నది కీలక ప్రశ్న. ఇవన్నీ సవ్యంగా జరిగినపుడే ఆయా కార్యక్రమాల రచనలో ఉద్దేశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. ఖర్చయ్యే ప్రతి పైసాకు ఎంతో కొంత ప్రయోజనం నెరవేరుతుంది. లేకుంటే, పెద్ద మొత్తం ప్రజాధనం ఖర్చయిపోయి ఇదొక డొల్ల కార్యక్రమంగానే మిగిలిపోతుంది. అందుకే ప్రజలు స్వచ్చందంగా పాల్గొని రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యత నెరవేర్చాలి. హక్కుల గురించి మాత్రమే మాట్లాడే మను షులకు బాధ్యతల్ని గుర్తు చేస్తే చురుక్కుమంటుంది. తమ విధులు–బాధ్యతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి దంటారు. మన సామూహిక బాధ్యతలు కూడా ఏతావాతా మనందరం ఉమ్మడి హక్కులు నిండుగా అనుభవించడానికే అని చెబితే... ఎట్టెట్టా? అని ముక్కున వేలేసుకుంటారు. వ్యక్తిగత హక్కుల భద్ర తకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. హక్కులు, బాధ్య తలూ ఒకే నాణేనికి రెండు వైపులంటే... ‘ఓయబ్బో! ఈయనొచ్చాడయా దిగి... మాకు నీతి పాఠాలు చెప్ప డానికి, హు...!’ అన్నా అంటారు. కానీ, ఇది పచ్చి నిజం! మానవ సంబంధాలు, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల ఏర్పాటు, విద్య–ఉపాధి అవ కాశాల కల్పన... ఇలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినపుడు మనం హక్కుల గురించి మాట్లాడినంత బాధ్యతల గురించి మాట్లాడం, మాట్లాడనీయం. అదీ ముఖ్యంగా పౌరుల బాధ్యతల గురించైతే అస్సలు మాట్లాడం! ఎంతసేపు ప్రభుత్వాల బాధ్య త–జవాబుదారితనం, అధికారుల విధులు–కర్త వ్యాలు, వాటి విజయ–వైఫల్యాలే మనకు సదా కథా వస్తువు. మన హక్కుల గురించి, అవి భంగపోయిన తీరు గురించి ఎంతైనా మాట్లాడతాం. అవతలి వారి బాధ్యతల గురించి, వాటి అమలులో వైఫల్యం గురించి అంతకన్నా పిసరు ఎక్కువగానే మాట్లా డతాం. మరి మన బాధ్యతల సంగతి? మన విధి నిర్వహణ మాటో! మన జవాబుదారితనం ఏం గాను? కొన్ని విషయాల్లో మనం బాధ్యతల్ని విస్మరిం చడం ఎంతటి విపరిణామాలకు దారి తీస్తుందో తెలు సుకుంటే గుండె తరుక్కుపోతుంది. పర్యావరణమే తీసుకుంటే, దాని పరిరక్షణ రాజ్యాంగం మనకు నిర్దే శించిన బాధ్యత. ఈ విషయంలో ఏ మేరకు మనం బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నామని ఎవరికి వారు బేరీజు వేసుకోవాల్సిందే! పౌరులుగా, ప్రజా సంఘాలుగా, పౌర సమాజంగా మనకూ ఈ విషయంలో విహిత బాధ్యత ఉంది. ముఖ్యంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో, దేశం మొత్తమ్మీద పెద్ద ఎత్తున ప్రజాధ నాన్ని వెచ్చించి చేపడుతున్న ‘హరిత’ కార్యక్రమాల్లో జనభాగస్వామ్యం, పౌర అప్రమత్తత, ప్రజాసం ఘాల నిఘా, సామాజిక సంస్థల తనిఖీ ఎంత? అన్నది కీలక ప్రశ్న. ఇవన్నీ సవ్యంగా జరిగినపుడే ఆయా కార్యక్రమాల రచనలో ఉద్దేశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. ఖర్చయ్యే ప్రతి పైసాకు ఎంతో కొంత ప్రయోజనం నెరవేరుతుంది. లేకుంటే, పెద్ద మొత్తం ప్రజాధనం ఖర్చయిపోయి ఇదొక డొల్ల కార్య క్రమంగానే మిగిలిపోతుంది. మంచి పనికి పౌర మద్దతుండాలి జనాకర్షణ పథకాలతో ఓట్లు పిండుకునే రాజ కీయాలు నడుస్తున్న కాలంలో, ఏ వత్తిడి లేకపోయినా ప్రభుత్వాలు ‘హరితహారం’ వంటి బృహత్ కార్య క్రమం తీసుకోవడాన్ని విమర్శకులు కూడా అభినంది స్తారు. అయిదేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టింది. నాలుగో విడత హరితహారాన్ని బుధవారమే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించింది. ఈ యేడు 40 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం. 33 శాతం ఉండా ల్సిన అడవుల విస్తీర్ణం 23 శాతమే ఉన్నట్టు ప్రభు త్వం చెబుతోంది. అది కూడా సందేహమేనని పర్యా వరణవేత్తలంటున్నారు. పంచాయతీరాజ్ చట్టం లోనూ మార్పులు చేసి హరితహారాన్నొక శాశ్వత కార్యక్రమం చేయాలన్న సర్కారు తలంపునకు స్థాని కంగా పౌర సహాకారం ఉంటే తప్ప ఏదీ సాకారం కాదు. ఒకటి, రెండేళ్లలో ప్రతి గ్రామంలో నర్సరీని నడిపే దిశగా అడుగులు పడాలన్నది సర్కారు ఆకాంక్ష. ప్రభుత్వంలోని వివిధ శాఖల్ని అనుసంధా నపరచడం, అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల్నీ బాధ్యుల్ని చేయడం, వివిధ రూపాల్లో ఉపాధిహామీ పథకపు నిధుల్నే ప్రధానంగా వినియోగించడం... ఇప్పటివరకు జరుగుతూ వచ్చింది. ఈ కార్యక్రమా నికి గడచిన మూడేళ్లలో 2473 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించింది. గొప్ప కార్యక్రమమే అయినా... మొక్కలు నాటడంపై ఉన్న శ్రద్ద వాటిని బతికించడంలో లేదనే విమర్శ ఉంది. ఎక్కడికక్కడ మొక్కల మనుగడ దక్కేది తక్కువే కావడం ఆందో ళన కలిగిస్తోంది. సగటు నలబై శాతం కూడా దక్క ట్లేదు. నాయకుల శ్రద్ద, అధికారుల నిబద్దత, స్థానిక సంస్థల పాత్ర, పౌర సంఘాల ప్రమేయం, ప్రజల భాగస్వామ్యం మొక్కల్ని అధికశాతం బతికించుకోవ డంలో కీలక పాత్ర వహిస్తాయి. సిద్దిపేట జిల్లాలో అత్యధిక శాతం మనుగడ నమోదవడం, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో అత్యల్ప శాతం మొక్కలే బత కడం ఇందుకు నిదర్శనం. వాటిని బతికించుకోవా ల్సిన బాధ్యత పౌరులు, ప్రజా సంఘాలపైనా ఉంది. ప్రచారంపై ఉన్న శ్రద్ద పనిపై ఏది? మొక్కలు నాటే, అడవులు పెంచే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు అదే స్థాయి శ్రద్ద పౌరుల్ని భాగస్వాముల్ని చేయడంపై చూపటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నిర్వహి స్తున్న ‘వనం మనం’ ఇందుకు నిరద్శనం. ఏటా జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కార్తీక పౌర్ణమి వరకు ఈ కార్యక్రమం కింద కోట్లాది మొక్కలు నాట డాన్ని లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. 2015–16లో 30 కోట్ల మొక్కలు నాటినట్టు సర్కారు లెక్క! నేలమీద అవి ఎక్కడున్నాయో జాడే లేదు! మొక్కకు సగటున రూ.15 ఖర్చయినట్టు రికార్డు రాశారు. ఇలా ఒక సంవత్సరం రూ.360 కోట్లు ఖర్చు చేసింది. గత సంవత్సరం 25 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా 18.46 కోట్లు నాటామని, ఈ యేడు మరో 25 కోట్ల మొక్కలు లక్ష్యమనీ అంటోంది. 25 కోట్ల మొక్కల్ని అందించేపాటి నర్సరీల వ్యవస్థే రాష్ట్రంలో లేదనేది విమర్శ. లెక్కలే తప్ప మొక్కలు లేవని, ఉన్న మొక్కలు కూడా మొక్కుబడి పనుల వల్ల సరిగా నాట కుండానే రోడ్ల పైన పారవేసి పోతున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. అటవీ ప్రాంతం ఇప్పుడు 24 శాతం ఉందని చెప్పే ప్రభుత్వం, 2029 నాటికి 50 శాతం చేయాలని ‘మిషన్ హరితాం ధ్రప్రదేశ్’ చేప ట్టినట్టు విస్తృత ప్రచారం చేస్తోంది. పనిలో పనిగా కార్పొరేట్ రంగాన్ని, స్థానికసంస్థల్ని, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల్ని. పౌర సంఘాల్ని కూడా భాగ స్వాముల్ని చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ‘పారిస్ ఒప్పందం’లో పలు పర్యావరణ స్వీయ నిర్భందాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో అడుగులైతే నెమ్మదిగా వేస్తోంది. జనాన్ని చైతన్య పరిచే చర్యలే లేవు. ‘నష్టపరిహార అటవీ అభివృద్ధి నిధి నిర్వహణ, ప్రణాళిక ప్రాధికార సంస్థ’ (కంపా) కింద పెద్ద ఎత్తున నిధులున్నా వాటిని వినియోగించడం లేదని ఏటా ‘కాగ్’ తప్పుబడు తోంది. రూ.39000 కోట్లుండగా ఏటా రూ.6000 కోట్లు కొత్తగా జత అవుతున్నాయి. పౌర భాగస్వా మ్యంపై ప్రభుత్వాలేవీ పెద్దగా శ్రద్ద పెట్టడం లేదు. రాజ్యాంగ స్ఫూర్తికి సుప్రీం రక్షణ ఒకరి బాధ్యత మరొకరికి హక్కు అయినట్టే, ఒకరి హక్కు ఇంకొకరి బాధ్యత అని దేశంలోని న్యాయ స్థానాలు పలుమార్లు తీర్పుల్లో స్పష్టం చేశాయి. పర్యావరణ పరిరక్షణ సవ్యంగా జరిగితేనే పౌరులం దరి జీవించే హక్కుకు భద్రత! ఇలా అందరి హక్కు రక్షణ క్రమంలో పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత కూడా అవుతుంది. రాజ్యాంగం 21వ అధికరణంలోని జీవించే హక్కును సమగ్రంగా వివరిస్తూ, కాలుష్యరహిత జీవితం పౌరుల ప్రాథ మిక హక్కని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (ఎమ్.సీ మెహతా వర్సెస్ యూనియన్ ఆప్ ఇండియా) 1987లోనే స్పష్టత ఇచ్చింది. అధికరణం 19 (1)(జి) ప్రకారం ఏ వృత్తయినా, ఏ వాణిజ్య– వ్యాపారమైనా నిర్వహించుకోవడం పౌరుల ప్రాథ మిక హక్కే అయినప్పటికీ, దానికి కొన్ని పరిమితు లున్నాయి. సమాజం, ఇతర జనసమూహాల ఆరో గ్యాన్ని దెబ్బతీసే విధంగా పౌరులెవరూ తమ స్వేచ్ఛాయుత వాణిజ్య–వ్యాపారపు హక్కును విని యోగించుకోజాలరనీ సుప్రీంకోర్టు (కూవర్జీ బి.బరుచ్చా వర్సెస్ ఎక్సైజ్ కమిషనర్, అజ్మీర్–1954 కేసులో) చెప్పింది. పౌర హక్కుల పరంగా... వాణిజ్య స్వేచ్ఛ, పర్యావరణ పరిరక్షణ అనే అంశాల మధ్య వివాదం తలెత్తినపుడు న్యాయస్థానాలు సహజంగానే పర్యావరణ పరిరక్షణ వైపు మొగ్గాలని కూడా న్యాయ స్థానం స్పష్టం చేసింది. దానికి లోబడే ఏ వాణి జ్య–వ్యాపార కార్యకలాపాలైనా చేసుకోవచ్చంది. వేదాల నుంచి మన ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాల్లో కూడా ప్రకృతితో మమైకమై సకల జీవ రాశితో మనిషి సహజీవనం సాగించడాన్నే నొక్కి చెప్పారు. అదే జరిగింది ఇంతకాలం. ‘మానవుని స్వర్గం భూమ్మీదే ఉంది. ఈ సజీవ భూగ్రహం అన్ని జీవులది. ఇది ప్రకృతి వరం. దీన్ని పరిరక్షించు కుంటూ ప్రేమాస్పద జీవనం సాగించాలి’ అని అధ ర్వణవేదంలో ఉంది. పర్యావరణ పరిరక్షణ అన్నది మన సంస్కృతి, సంప్రదాయాల్లో ఆచరణగానే కాకుండా రాజ్యాంగపరంగా కూడా తగు భద్రత ఏర్పా ట్లున్నాయి. అటవుల సంరక్షణ, నీటి నిర్వహణ, భూసార పరిరక్షణలో గ్రామస్థాయి నుంచి స్థానిక సంస్థలకు విశేషాధికారాలు కల్సిస్తూ మనం రాజ్యాం గాన్ని సవరించుకున్నాం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పౌరులకు అందించడం, అందుకోసం ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడటం సంక్షేమ ప్రభుత్వాల బాధ్యత (అధికరణం 47, 48) అనేది తిరుగులేని భద్రత! అదే సమయంలో పౌరుల బాధ్యతను కూడా రాజ్యాంగం ఎప్పటికప్పుడు గుర్తుచేస్తోంది. అడ వులు, చెరువులు, నదులు, జీవవైవిధ్యంతో కూడిన ప్రకృతిని కాపాడుతూ, పర్యావరణాన్ని అభివృద్ధి పరుస్తూ సకలజీవుల పట్ల దయ, అనుకంపతో ఉండ టం ప్రతి పౌరుని బాధ్యత (అధికరణం 51–ఎ (జి)) అని చెబుతోంది. ఇప్పుడా స్ఫూర్తి సర్వత్రా రగలాలి. ప్రతి పౌరుడూ తన స్థాయిలో స్పందించాలి. ప్రతి గ్రామమూ కదలాలి. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు నూరు శాతం విజయవంతమయ్యేలా తోడ్పడాలి. అది ‘కంపా’ అయినా, ‘హరితహారమై’నా, ‘వనం మనం’ అయినా... అక్కడ ఖర్యయ్యే ప్రతిపైసా ప్రజాధనం. అది వృధా కానీయకుండా ప్రయోజనం కలిగించేలా చూసే, చూడాల్సిన బాధ్యత మనది, మనందరిది! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ :dileepreddy@sakshi.com -
ఆ ‘సగం’ లేనిదే ‘మనం’ లేం!
మూడు దశాబ్దాలుగా ఆడపిల్లల పట్ల చూపిన వివక్ష ఫలితంగా... మగపిల్లవాడి పెళ్లి నేడు తల్లి దండ్రులకు సవాల్‌గా మారింది. 20-45 ఏళ్ల మధ్య వయస్కులైన 4.12 కోట్ల మంది పురుషులు నేడు బలవంతపు బ్రహ్మచర్యం పాటించాల్సివస్తోంది! ముందు ముందు పరిస్థితులు ఇంకెలా ఉంటాయో ఊహించుకోవాల్సిందే. ఆర్థిక సరళీకరణ, గ్లోబలీకరణ విధానాలు అమలవుతున్న క్రమంలోనే ఆడపిల్ల పట్ల వివక్ష విపరీతంగా పెరిగింది. అంటే శాస్త్ర సాంకేతికతతో ముందుకు నడుస్తున్నామనుకుంటూనే, ఆలోచనలపరంగా మనం వెనక్కి నడుస్తున్నట్టే లెక్క. మహిళా సాధికారత గురించి పాలకులు మహా జోరుగా ఉపన్యాసాలు దంచే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా క్షేత్ర స్థాయి వాస్తవాలు గగుర్పాటు కలిగి స్తున్నాయి. కరడుగట్టిన పురుషాధిక్య సమాజంలో మహిళా సాధికారత సమీప భవిష్యత్తులోనే కాదు, ఎన్నటికైనా సాధ్యమేనా? అని సందేహం కలుగుతోంది. మహిళను మననిస్తారా? అనే భయసందేహాలు కలుగు తున్నాయి. మహిళల పట్ల పురుషుల ఆలోచనా ధోరణిలో మార్పు రానంత వరకు మహిళా స్వేచ్ఛ, మహిళా స్వాతంత్య్రం, మహిళా సాధికారత ఉపన్యా సాలకు పనికొచ్చే ఊతపదాలుగా, సర్కారు కంటితుడుపు పథకాల్లో అందంగా ఒదిగే పారిభాషక పదాలుగానే మిగిలిపోతాయి. ప్రత్యేకావకాశాల సంగతలా ఉంచి మహిళల సహజ ఎదుగుదలకు అవకాశాల్ని కూడా కర్కశంగా నలిపేస్తున్న వాతావరణం సర్వత్రా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నిన్నటికి నిన్న కూకట్‌పల్లిలో తన ప్రేమను నిరాకరించిందని ఓ యువతిపై హత్యాయత్నం చేసిన ఉన్మాది హతుడైన ఘటన నుంచి...ఓ ఎయిర్ హోస్టెస్‌ను భర్తే హతమార్చిన ఘటన వరకు ఈ దుర్మార్గాలను ఎన్నని చెప్పగలం? పుట్టబోయేది ఆడపిల్లే అని తెలిసి గర్భంలోనే చిదిమేయడం, ఆ దశదాటి పుట్టినా సజీవంగానే కుప్పతొట్టెల్లో విసిరేయడం, పుట్టిన్నుంచి ఆడపిల్లని అంగడి సరుకులా అమ్మేయడం, సంప్రదాయపు కట్టుబాట్లతో ఆడపిల్ల ఎదుగుదలను అడుగడుగునా కట్టడి చేయడం, యుక్తవయసులో ప్రేమా గీమా అని వేధించి, మాట చెల్లుబాటు కాలేదని రాక్షసంగా చిదిమే యడం, పెళ్లయ్యాక వరకట్నం వేధింపులతో, ఆధిపత్యం సతాయింపులతో అంతమొందించడం ... ఇవన్నీ నేటి మహిళ దయనీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఎంత ఆధునికత వైపు నడుస్తున్నా మహిళల పట్ల ఆలోచనలు మెరుగుపడకపోగా, మరింత దిగజారుడుతనమే కనిపిస్తోంది. ఏయేటి కాయేడు మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నా ఎవరికీ పట్టడం లేదు. చట్టబద్దమైన సంస్కరణలు, చిత్తశుద్దితో కూడిన ఆచరణ ఉంటే తప్ప ఆడపిల్లకు రక్షణ లేదేమో అనిపిస్తోంది. ఈ గణాంకాలు దేనికి సంకేతం! దేశంలో లింగ నిష్పత్తి ప్రమాదకరంగా మారుతోంది. సగటున ప్రతి వెయ్యి మంది పురుషులకు 933 మంది మాత్రమే మహిళలున్నారు. ఇంతకన్నా ప్రమాదకరమైన పరిస్థితి మున్ముందున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడు దశాబ్దాల క్రితం తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల వివక్షతో అనుసరిం చిన పద్ధతుల ఫలితంగా... యువకులకు తమ ఈడు ఆడపిల్లలు దొరకని పరిస్థితి నెలకొంది. ఒకప్పటి పరిస్థితి తారుమారై... మగపిల్లవాడి పెళ్లి తల్లి దండ్రులకు సవాల్‌గా మారింది. అయినా ఆడపిల్ల పుట్టుకను ఈసడించు కుంటున్న స్థితిలో.... ఇరవై, ముఫ్ఫై ఏళ్ల తర్వాత పరిస్థితులు ఇంకెంత భయంకరంగా ఉంటాయో ఊహించుకోవాల్సిందే. నేడు 20-30 ఏళ్ల యువకులకు భార్య ఉందంటే అదృష్టవంతుల కిందే లెక్క. ఆ వయసు యువకులు దేశంలో 5.63 కోట్ల మంది ఉంటే, అదే వయసు యువతులు 2.07 కోట్లు మాత్రమే ఉన్నారు. అలాగే 30లలోని (30-40 ఏళ్లు) పురుషులు 70.1 లక్షల మంది ఉంటే, ఆ వయసులో ఉన్న మహిళలు 22.1 లక్షల మంది మాత్రమే ఉన్నారు. 40లలో కూడా ఇటువంటి వ్యత్యాసమే ఉంది. మన జనాభా లెక్కల్లో లింగ వ్యత్యాసాల్ని విశ్లేషించినపుడు ఈ గణాంకాలు బయటపడ్డాయి. అంటే మొత్తమ్మీద వివాహం కాని పురుషులు (20-45) 6.50 కోట్ల మంది ఉంటే, అదే వయో పరిమితిలోని అవివాహిత స్త్రీలు 2.38 కోట్లు మాత్రమే ఉన్నారు. 4.12 కోట్ల మంది పురుషులు బలవంతపు బ్రహ్మచర్యం పాటిస్తున్నట్టే. ఏ మ్యారేజీ బ్యూరోలో వాకబు చేసినా ఈ పరిస్థితి తేటతెల్లమౌతుంది. ఒకప్పుడు, ‘ఇంట్లో పెళ్లికెదిగిన అమ్మాయి ఉంది, తెలిసిన వాళ్లుంటే కాస్త సంబంధాలు చూసి పెట్టండి’ అని తల్లిదండ్రులు వాకబు చేసేవారు. ఇప్పుడు ‘మీ ఎరుకలో అమ్మాయిలున్నారా ఎక్కడైనా? మా వాడూ...’ అనే వినతులు ఎక్కువయ్యాయి! ఎవరి పాపం ఎవరికి చుట్టుకుంటోంది! పుట్టబోయే బిడ్డ ఆడనా, మగనా అని తేల్చే లింగ నిర్ధారణ పరీక్షలు మన దేశంలో 1970 దశకంలో మొదలై, 1980 దశకంలో పెచ్చు పెరిగాయి. ఆర్థిక సరళీకరణ విధానాలు, గ్లోబలీకరణ మనిషి ఆలోచనా ధోరణిని మార్చిన క్రమంలోనే ఆడపిల్ల పట్ల వివక్ష విపరీతంగా పెరిగింది. ఈ మూడు దశాబ్దాల్లోనూ ఆడపిల్లల్ని నిర్మూలించే దుశ్చర్యలు విచ్చలవిడిగా జరిగాయి. తల్లి కడుపున ఉండగానేనో, పుట్టీపుట్టగానేనో ఆడపిల్లల ప్రాణాలను చిదిమేసిన దుష్ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లింగనిర్ధారణ పరీక్షలు జరపడం, వాటి ఫలితాలను తల్లిదండ్రులకు తెలియపరచడం నేర మని చెప్పే చట్టాలున్నా గోప్యంగా అవి జరుగుతూనే ఉన్నాయి. ‘‘ఈ సాంకేతిక వైద్య సదుపాయం రాను రాను గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించిం దని, కఠినమైన చర్యలు తీసుకోకుంటే ఇది 2021 నాటికి దుర్మార్గమైన స్థితికి చేరుతుంది’’ అని ‘గర్భ-గర్భస్థశిశు సాంకేతిక పరీక్షల (పీసీపీఎన్డీటీ) చట్టం’ పర్యవేక్షణ కమిటీ సభ్యురాలైన డాక్టర్ నీలమ్ సింగ్ అన్నారు. శాస్త్ర సాంకేతి కతతో ముందుకు నడుస్తున్నామనుకుంటూనే మనం పెడదారి పట్టిన ఆలోచనలతో కచ్చితంగా వెనక్కి నడుస్తున్నట్టే లెక్క. ‘‘1980లలో పుట్టిన వారూ మా దగ్గరికి వస్తుంటారు. కానీ వారికి అనువైన మ్యాచెస్ దొరకవు. కులం, చదువు, ఆస్తి, వయసు....ఇలా పలు విషయాల్లో రాజీపడతామం టారు. అయినా వధువులు దొరకరు’’ అని హైదరాబాద్‌లో మ్యారేజీ బ్యూరో నిర్వహించే ఓ పెద్దమనిషి తెలిపారు. 1901లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 972 మహిళలు ఉండేవారు. సహజ నిష్పత్తి 1000: 954 కన్నా ఇది మెరుగైన స్థితి. ప్రతి వెయ్యి మంది పురుషులకు 1970లలో 930 మహిళలున్నారు. 1980లలో అది 934 కాగా 1990లలో ఆ సంఖ్య 927కు పడిపోయింది. 2000లలో అది 933 గా నమోదయింది. ఆలోచనా ధోరణిలోనే లోపం మహిళల పట్ల మన ఆలోచనా ధోరణిలోనే లోపముంది. పురుషాధిక్య వ్యవస్థలో వారిని నిమ్న లింగంగా పరిగణించే తత్వం బలంగా వేళ్లూనుకొని ఉంది. తల్లిదండ్రుల నీడలో ఆడుకునే పిల్లల నుంచి నేడో రేపో ప్రాణాలు విడిచే ముసలి వాళ్ల వరకు అదే ఆధిపత్య ధోరణి, అదే వివక్ష కొనసాగిస్తుంటారు. అన్ని సందర్భాల్లోనూ వారిని తక్కువ చేసి చూడటం రివాజుగా మారింది. స్త్రీ,పురుషలు చేసే ఒకే పనికి ఇచ్చే కూలి డబ్బులు, వేతనాల నుంచి అన్ని స్థాయిల్లోనూ ఈ వ్యత్యాసాలుంటాయి. పని ప్రదేశాల్లోని వివక్ష, అవమానాలు మహిళల్ని ప్రాణాంతక స్థితికి నెడుతున్నాయి. వారసత్వ ఆస్థిలో పురుషులతో సమానంగా స్త్రీలకు ఆస్తి హక్కు కల్పింటే చట్టం ఉన్నా, ఆచరణలో ఎక్కడా అది జరగదు. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వారి అర్హతలకు తగ్గ అవకాశాలను కల్పించకపోగా సహజ సిద్ధంగా సంక్రమించిన హక్కుల్ని కూడా కాలరాస్తున్నారు. మరణించిన తల్లి చితికి నిప్పంటించినందుకు ఓ మహిళను స్వయానా సోదరుడే హతమార్చిన ఘటన చత్తీస్ఘడ్ లోని రాయ్‌పూర్ జిల్లా మోదలో ఇటీవల సంచలనం సృష్టించింది. ఆమె గ్రామ సర్పంచ్ కూడా! పదవులు, హోదాలతో నిమిత్తం లేకుండా మహిళా హక్కుల కాలరాచివేత సాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో మహిళకు సాధికారత కల్పిస్తామనే రాజకీయ ప్రసంగాలకు అర్థమే లేకుండా పోతోంది. అత్యున్నత చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తామనే ప్రతిపాదన గడచిన దశాబ్ద కాలంగా పార్లమెంటులోనే నగుబాటుకు గురవుతోంది. మన రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నా, మెజారిటీ స్థానాల్లో మహిళల్ని నామ మాత్రం చేసి వారి భర్తలో, తండ్రులో, సోదరులో, ఇతర పెత్తందార్లో పెత్తనం చెలాయించడం పరిపాటి. మహిళలు, మహిళా సంఘాల పేరుతో ఇసుక క్వారీల బాధ్యతలను ఇచ్చినట్టున్నా తెరవెనుక పాలకపక్ష నేతలు చేసేదేమిటో అందరికీ తెలుసు. తండ్రి తర్వాత తనకు దక్కాల్సిన వారసత్వ పూజారిత్వం హక్కు కోసం ఓ మహిళ కోర్టుకు వెళ్లి సాధించుకోవాల్సి వచ్చింది. పైగా పోలీసు బందూకుల రక్షణ మధ్య మాత్రమే ఆమె పూజాదికాలు జరపాల్సి వచ్చింది. ఇదీ, మన వాళ్లు జబ్బలు చరచుకొని ప్రచారం చేసే మహిళా సాధికారత! ప్రచారం, ఆచరణ, సంస్కరణలతోనే పరిష్కారం ఆడ, మగ అనే తేడా సృష్టి పరమైన సహజ వైవిధ్యమే తప్ప ఇరువురూ సరిసమానమనే భావనల్ని పిల్లల్ని పెంచేప్పుడే తలిదండ్రులు వారిలో నాటాలి. స్త్రీలను గౌరవించే మన సంస్కృతీ సంప్రదాయాల్ని వివరించాలి. ప్రభుత్వపరంగా కూడా నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించి సంస్కరణల్ని కఠినంగా అమలుపరచాలి. ఇప్పటికే ఉన్న అరకొర చట్టాల్నైనా పకడ్బందీగా అమలు చెయ్యాలి. తగు ప్రచారం ద్వారా సాధించే సామాజిక పరివర్తనే కీలకం. అందం, నాట్యం, అణుకువ... కోసం ఆడపిల్ల పాదం విశాలంగా విస్తరించకూడదని చైనాలో ఒకప్పుడు శిశువులుగా ఉన్నపుడే వారి పాదాలు పెరగకుండా కట్టుకట్టేసేవారు. ఈ దురాచారాన్ని నిర్మూలించడానికి విసృ్తతమైన ప్రచారం జరిగింది. ఒక దశలో, పాదం కట్టుకట్టి పెంచిన ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోకూడదనే ఆంక్షనూ విధించారు. క్రమంగా ఆ పాదం కట్టు దురాచారం రూపు మాసిపోయింది. చట్టాల కన్నా సాంఘిక చైతన్యంతోనే మనం ఒకప్పుడు సతీసహగమనాన్ని రూపు మాపగలిగాం. ఆడపిల్లని కాపాడ్డానికి అలాంటి సామాజిక పరివర్తన రావాలి. అర్జెంటీనా వంటి లాటిన్ అమెరికా దేశాల్లో మహిళలకి చట్ట సభల్లో మూడోవంతు స్థానాలను రిజర్వు చేసిన తర్వాత గణనీయమైన మార్పులొచ్చాయి. అది మనకు ఆదర్శం కావాలి. విధాన నిర్ణయాల్లో చొరవ, శాస్త్ర, సాంకేతికతలు ఉత్ప్రేరకాలుగా మహిళాభ్యుదయం సాధించవచ్చని అనేక అభివృద్ధిచెందిన, చెందుతున్న దేశాలు నిరూపించాయి. తైవాన్‌లో వస్తూత్పత్తికి ప్రాధాన్యత నిచ్చి మహిళలకు తగు ప్రాతినిధ్యం కల్పించిన తర్వాత వారి సాధికారత బాగా పెరిగింది. పెరూ దంపతులిద్దరికి ఉమ్మడిగా భూయాజమాన్య హక్కులను కల్పించడంతో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. మహిళలకు ఉద్యోగ, ఉపాధి, ఆర్థికావకాశాలను కల్పించడం ద్వారా సమాజంలో వారి స్థాయి బాగా పెరిగింది. మనం ఆ అనుభవాలన్నిటినీ క్రోడీకరించి సర్వశక్తులా కృషి చేసి ఆడపిల్లను కాపాడుకోవాలి. స్త్రీ శక్తిని, మహిళా సాధికారతను మనవా భ్యున్నతికి దోహదపడేలా చేయాలి. ఆకాశంలోనే కాదు నేల మీదా సగం నువ్వు సగం నేను. దిలీప్ రెడ్డి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
బడి చదువులు బతికేదెలా?
సమకాలీనం బట్టీల పుణ్యమా అని దేశవ్యాప్తంగా జరిగే అన్ని పోటీ ప్రవేశ పరీక్షల్లో రికార్డులు సాధించే మన వాళ్లు అకడమిక్స్‌లో, ఉద్యోగాలు పొందడంలో ఉత్తర భారత దేశీయులతో పోటీ పడలేకపోతున్నారు. కారణం సరుకు లేకపోవడమే! పాఠశాల విద్య అనే పునాది బలహీనంగా ఉండటమే! వివిధ అధ్యయనాల ప్రకారం ఇందుకు ప్రధాన కారణం టీచరే! అత్యధిక టీచర్లు సమయానికి బడికి రారు. వచ్చినా పాఠాలు చెప్పరు. ఉపాధ్యాయ సంఘాలు బలమైన శక్తిపీఠాలుగా ఉండి, ఎగవేతలకు దన్నుగా నిలుస్తాయి. వారంరోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బడులన్నీ ఈ విద్యా సంవత్సరానికి మూతపడనున్నాయి. ఇప్పుడున్న పద్ధతిలోనే పాఠశాల విద్య కొనసాగితే... తెలుగునాట ప్రాథమిక-సెకండరీ విద్య భవితవ్యమే మూతపడే దుస్థితికి చేరుతుంది. ఒక తరం అంధకారంలో పడే ప్రమాదం ఉంది. సకల విద్యలకు పునాది అయిన ప్రాథమిక విద్య పాతాళానికి కూరుకుపోతోంది. భవిష్యత్తులో అధ్వానమైన సమాజ నిర్మాణానికి భూమికను సిద్ధం చేస్తున్నట్టుంది. ఎవరు బాధితులు అంటే మొత్తంగా ఓ తరం! ఎవరు బాధ్యులు అంటే, అందరూ!! ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వాలు, సమాజం. అంతా కలసి విద్యావ్యవస్థ మూలాల్లో చీడపురుగుల్ని పెంచుతున్నారు. నైపుణ్యాలు లేవు, సృజన లేదు, పదో తరగతి సమీపిస్తున్నా... మెజారిటీ విద్యార్థులకు చదవడం-రాయడం సరిగా రాదు, కూడిక-తీసివేత వంటి గణిత చతుర్విధ ప్రక్రియలే తెలియవు. తెలుగు, ఇంగిష్ మాధ్యమాల్లోనూ, ప్రభుత్వ పాఠశాల ల్లోనే కాకుండా ప్రయివేటు బడుల్లో కూడా ఇదే దుస్థితి. ప్రపంచమంతా ముందుకు నడిస్తే, మనం వెనక్కి నడుస్తున్నాం. ‘ఏం లాభమొచ్చె నాయనా, అగొ ఆ పిల్లలంతా బడికి వొయిన్రు, అటు సదువు రాకపాయె, ఇటు పనీ రాకపాయె, మా పక్కింటోల్ల పిల్లలు బడీగిడీ లేదు, పనికే పొయిన్రు, ఇప్పుడు గాపని జేసుకొనన్న బతుకుతుండ్రు‘ దేశంలోనే అత్యల్ప అక్షరాస్యత ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండల కేంద్రంలో కూలీ పనిచేసుకునే ఓ తల్లి, చదువుల కోసం బడికి వెళ్లి కూడా పనికిరాకుండా పోయిన పిల్లల పట్ల వ్యక్తం చేసిన ఆవేదన మొత్తం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రథమ దోషులు ప్రభుత్వాలే!! పాఠశాల విద్యపై ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయి. బడులెలా నడుస్తున్నాయి? ఉపాధ్యాయులున్నారా? పనిచేస్తున్నారా? పిల్లలకు విద్య లభిస్తోందా? ఫలితాలెలా ఉంటున్నాయి? ఇలాంటి విషయాలేవీ సర్కారుకు పట్టవు. అనేక విషయాల్లో దేశంలో తొలి అయిదారు రాష్ట్రాల్లో ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాఠశాల విద్యలో మాత్రం చివరి అయిదారు రాష్ట్రాల్లో ఉంటూ వచ్చింది. విభజన తర్వాత కూడా పరిస్థితి అదే! పాఠశాల విద్యకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రణాళికేతర పద్దు కింద రూ. 12,664 కోట్లు, ప్రణాళిక కింద రూ. 2300 కోట్లు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికేతర పద్దు కింద రూ. 7,976 కోట్లు, ప్రణాళికా పద్దు కింద రూ. 1,078 కోట్లు కేటాయించింది. వెరసి రెండు రాష్ట్రాలూ తమ తాజా బడ్జెట్లలో దాదాపు 24 వేల కోట్ల రూపాయలు పాఠశాల విద్యకు కేటాయించాయి. కానీ, ఏం లాభం! ఫలితాలు అధ్వానంగా ఉన్నాయి. 8, 9 తరగతుల్లో ఉండీ తెలుగు రాయడం, చదవడం రాని వాళ్లు 52 శాతం ఉన్నారంటే ఏమనుకోవాలి! కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఒక ఆర్టీఐ కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద సేకరించి, విశ్లేషించిన వివరాల ప్రకారం ఈ ప్రభుత్వాలు ప్రతి ఏటా ఒక్కో విద్యార్థిపైన 38,500 రూపాయలు ఉపాధ్యాయుల జీతాలకే వెచ్చిస్తున్నాయి. ఇంకా మౌలిక సదుపాయాలకు, ఇతరేతర నిర్వహణకయ్యే ఖర్చు అదనం. పిల్లలున్న చోట ఉపాధ్యాయులుండరు. అయిదారు తరగతులకు ఒకరిద్దరు పంతుళ్లే ఉంటారు. పిల్లలు నామమాత్రంగా ఇరవై, ముప్పై ఉన్న చోట అయిదారుగురు టీచర్లుంటారు. చాలా ఖాళీలుంటాయి. ఉన్నవాళ్లలో అత్యధికులు పనిచేయరు. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 1,135 మండలాలుంటే, మండలానికొకరి చొప్పున ఉండాల్సిన విద్యాధికారులు (ఎం.ఇ.ఓ), 110 మందే ఉండేవారు. మిగతా అన్ని మండలాలకు సీనియర్ ప్రధానోపాధ్యాయుల్నే ఎం.ఇ.ఓ. లుగా ప్రకటిస్తే, వారు అటు పాఠశాలకు న్యాయం చేయక, ఇటు మండలంలోని బడులనూ పర్యవేక్షించక పరిస్థితి ఘోరంగా తయారయినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఉన్నత విద్యను సంస్కరించడానికి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ మధ్య ఓ పెద్ద మీటింగ్ పెట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విద్యారంగ మేధావుల్ని రప్పించారు. అంతా విన్న తర్వాత, ముంబాయికి చెందిన ఓ పెద్దమనిషి కఠోర సత్యం చెప్పారు. ‘విద్యావిధానం పిరమిడ్ పద్ధతిలో ఉండాలి. పైనుండే ఉన్నత విద్య గురించి ఆలోచిస్తున్నారు మంచిదే! కానీ, కింద పటిష్టమైన పునాది పాఠశాల విద్య, అదే ఇక్కడ దయనీయంగా ఉంది, దాన్ని సంస్కరించుకోండి ముంద’ని సెలవిచ్చారు. చెమట పట్టించే చేదు నిజాలు! ప్రథమ్ వాళ్లు జరిపిన మొదటి అధ్యయన ‘అసర్’ నివేదిక, కేంద్ర విద్యా పరిశోధన-శిక్షణ మండలి (ఎన్సీఈయార్టీ), రాష్ట్ర మండలి (ఎస్సీఈయార్టీ) జరిపిన పలు అధ్యయన నివేదికలు చెప్పేదొకటే! ఇక్కడ నిర్లక్ష్యం తారస్థాయిలో ఉంది. ఫలితంగా సర్కారు బడుల్లో చదువు కొండెక్కుతోంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ- 5 జిల్లాల్లో ఓ శాంపిల్ సర్వే జరిపారు. 100 పాఠశాలలు, 150 మంది టీచర్లు, 1000 మంది విద్యార్థులపై అధ్యయనం ఆశ్చర్యకరమైన అంశాలను వెల్లడించింది. 2011 నుంచి కొత్త విద్యా విధానం, కొత్త పాఠ్యపుస్తకాలు వచ్చాయి, అందులో చాలా మార్పులున్నాయన్న విషయం 20 శాతం మంది విద్యార్థులకు కూడా తెలియదు. పాత కొత్త సిలబస్‌లో ఉన్న తేడాలేంటో సగం కన్నా ఎక్కువ మంది ఉపాధ్యాయులకే తెలియదు. 90 శాతం ప్రధానోపాధ్యాయులకు ప్రస్తుతం అమలవుతున్న విద్యార్థి ‘నిరంతర సమగ్ర మూల్యాంకన’(సీసీయీ) పద్ధతి గురించి తెలియదు. పిల్లల్లో ఏయే నైపుణ్యాలు పెంచి, సామర్థ్యాలు వృద్ధి చేయడానికి నూతన విధానం వచ్చిందో తెలిసిన పంతుళ్లు 20 శాతం లోపు. పాఠ్యాంశాల్లో విషయ అమరిక తెలిసిన టీచర్లు 15 శాతం కన్నా తక్కువ. పాఠ్య ప్రణాళిక అత్యవసరమైన కొత్త పద్ధతిలో, 90 శాతం మంది టీచర్లు ప్రణాళికే లేకుండా పాఠాలు చెబుతున్నారు. పేపర్లు దిద్దరు, దిద్దినా ప్రమాణాలుండవు. విద్యార్థుల్లో సామాన్య, సాంఘిక శాస్త్రాలు, గణితంలో వారి వారి ప్రవేశాన్ని పరీక్షిస్తే సరిగ్గా స్పందించిన వారు 10 శాతం, ఓ మోస్తరుగా స్పందించి సమాధానం చెప్పిన వారు 20 శాతం, సమాధానం చెప్పలేకపోయిన విద్యార్థులు 70 శాతం ఉన్నారు. ఇక ప్రయివేటు బడుల్లోనూ ప్రమాణాలేమీ గొప్పగా లేవు. తెలంగాణలోని 10 జిల్లాలు 442 బడులు, 10,291 ఉపాధ్యాయులు, 78,082 విద్యార్థులపై జరిపిన అధ్యయనంలో వెల్లడయిన నిజాలు భయంకరంగా ఉన్నాయి. తెలుగు మీడియంలో 48 శాతం, ఇంగ్లీషు మీడియంలో 46 శాతం విద్యార్థులకు రాయడం, చదవడం రాదు. 43 శాతం మందికి గుణకారం- భాగహారం కూడా రాదు. ప్రయివేటు బడుల్లో అత్యధిక శాతం టీచర్ల పరిస్థితి ఘోరం. అక్కడ విద్య ఒక్కటే కాదు, అన్నీ పక్కా వ్యాపారం. సర్కార్ టీచరే అతి పెద్ద సవాల్! పెద్ద పోటీ మధ్య, పటిష్ట వడపోత తర్వాత ఉన్నత అర్హతలు కలిగిన వారే ప్రభుత్వ టీచర్లుగా ఎంపికవుతారు. ఈ లెక్కన, రాష్ట్రాల్లో ఉన్న ఉపాధ్యాయ క్రీమీలేయర్ ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో ఉంది. కానీ, ఏం లాభం. ఫలితాలు మాత్రం నానాటికి తీసికట్టు. గడచిన దశాబ్ద కాలంలో మౌలిక సదుపాయాలు, నిర్వహణా వ్యయం, జీతభత్యాలు, పుస్తకాలు, పాఠ్యాంశాలు ఇలా అన్ని విషయాల్లోనూ సంస్కరణల పరంగా మంచి వైపే అడుగులు పడ్డాయి. కానీ, ఉపాధ్యాయుల చిత్తశుద్ధి, అంకితభావం, విద్యార్థులకు సరైన విద్య అందించడం విషయంలోనే ఆశించిన మార్పులు రావట్లేదు. బట్టీల పుణ్యమా అని దేశ వ్యాప్తంగా జరిగే అన్ని పోటీ ప్రవేశ పరీక్షల్లో రికార్డులు సాధించే మన వాళ్లు అకడమిక్స్‌లో, ఉద్యోగాలు పొందడంలో ఉత్తర భారత దేశీయులతో పోటీ పడలేకపోతున్నారు. కారణం సరుకు లేకపోవడమే! పాఠశాల విద్య అనే పునాది బలహీనంగా ఉండటమే! వివిధ అధ్యయనాల ప్రకారం ప్రధాన కారణం టీచరే! అత్యధిక టీచర్లు సమయానికి బడికి రారు. వచ్చినా పాఠాలు చెప్పరు. ఉపాధ్యాయ సంఘాలు బలమైన శక్తి పీఠాలుగా ఉండి, ఎగవేతలకు దన్నుగా నిలుస్తాయి. 40 వేలు జీతం తీసుకునే ఉపాధ్యాయుడు తనకు బదులు 4 వేల రూపాయలకు ఓ విద్యావాలంటీర్‌ను నియమించి పని కానిస్తాడు. రెండు రాష్ట్రాల్లో ఇలాంటి మా(రీచ)రు టీచర్లు 70 నుంచి 80 వేల మంది ఉంటారు. అసలు టీచర్లు నెలకోమారు సంతకాలు చేస్తారు. నిలదీయాల్సిన అధికారుల్ని ఏదోరకంగా సంతృప్తి పరుస్తారు. ఉన్నత విద్యకోసమో, అత్యవసర వైద్య అవసరాల కోసమో ప్రభుత్వం కల్పించిన 5 ఏళ్ల సెలవు సౌకర్యాన్ని అడ్డంగా వాడుకొని కార్పొరేట్ కాలేజీల్లో విద్యాబోధన చేస్తున్న సర్కారు టీచర్లు కూడా వేలలోనే ఉన్నారు. ఇలా ఉంటే, ఇంక ప్రభత్వ బడుల్లోకి ఎవరొస్తారు? మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద ఓ ప్రయివేటు స్కూల్ బస్సును రైలు డీకొని పసిపిల్లలు అసువులు బాసినపుడు, ఓ మహిళ చేసిన ఆర్తనాదం ఇప్పటికీ చాలా మంది చెవుల్లో రింగుమంటూనే ఉంది. ‘మా ఊరి సర్కార్ బడిల మన్నువొయ్య! అది బాగుంటే, నా బిడ్డెను ఈ బస్సుల పొరుగూరికెందుకు పంపుతుంటి, ఎందుకు సస్తుండె! దేవుడో, గీ సర్కారొల్లే చంపిన్రు నా బిడ్డను’ అన్న మాటలు అక్షర సత్యాలు. మధ్యాహ్న భోజన పథకం ఎత్తేస్తే, బడుల్లో విద్యార్థుల సంఖ్య నిలుస్తుందా అన్నది సందేహమే! రెండు ప్రశ్నలకు ఉపాధ్యాయులు సమాధానం చెప్పాలె! వాళ్లు చిత్తశుద్దితో చదువులు చెబితే, 8, 9 తరగతుల పిల్లలకెందుకు కనీసం చదవరాదు? రాయరాదు? టీచర్లు తమ పిల్లల్నెందుకు తాము చదువు చెప్పే బడుల్లో చదివించరు? కఠిన నిర్ణయాలు అవసరం బడి పునర్నిర్మాణం జరగాలి. పాఠశాల విద్యకు జీవగంజి పోయాలి. విధాన పరమైన కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. నిర్వహణ-నిఘా- నియంత్రణలో భారీ సంస్కరణలు రావాలి. మధ్యాహ్న భోజన పథకాన్నీ సవ్యంగా నిర్వహిం చడానికి పిల్లల హాజరీని వారి ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలి. టీచర్ల హాజరీని బయోమెట్రిక్ విధానంతో రికార్డు చేయాలి. బడి నిర్వహణను ఆన్లైన్ పద్దతిన నియంత్రించాలి. పాఠశాలకు-సమాజానికి మధ్య సమన్వ యాన్ని పెంచాలి. విద్యాయాజమాన్య కమిటీకి చట్టబద్దమైన అధికారాలు కల్పించి, వారి ఆద్వర్యంలోనే నెల నెలా ఉపాధ్యాయుల జీతభత్యాలు విడుదలయ్యేలా చూడాలి. ఏం చేసైనా సరే పాఠశాల విద్యను కాపాడాలి. ఈ సమాజపు భవిష్యత్తు విత్తనంలోనే ఒట్టిపోకుండా మొలకెత్తనివ్వాలి. ఈమెయిల్:dileepreddy@sakshi.com -
చక్ర బంధంలో ఆర్టీఐ చట్టం
సమకాలీనం ఎంతో విప్లవాత్మకమైన సమాచార హక్కు చట్టానికి అన్నివైపుల నుంచీ ప్రమాదం ముంచుకొచ్చింది. రాజకీయ పార్టీలు, అధికార గణం, స్ఫూర్తి కొరవడ్డ కమిషనర్లు, ప్రభుత్వాలు సహా అంతా దాని అమలుకు గండికొడుతున్నారు. పార్టీలు కూడా పౌర సంస్థలేనని, అవి పౌరులు కోరే సమాచారం ఇచ్చి తీరాల్సిందేనని ఆదేశించినా బేఖాతరు చేయడం, కేంద్రం వాటికి దన్నుగా నిలవడం ఆందోళనకరం. ఏడు నెలలుగా ముఖ్య సమాచార కమిషనర్‌ను నియమించకపోవడమే కేంద్ర ప్రతికూల వైఖరికి నిదర్శనం. సమాచార హక్కు చట్టాన్ని సజీవంగా సమాధి చేసే యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విప్లవాత్మకమైన ఈ చట్టాన్ని నీరుగార్చే యత్నం అన్నివైపుల నుంచీ జరగడం ఆందోళనకరం. ఇటు ప్రధాన రాజకీయ పక్షాలు, ప్రభుత్వ పెద్దల నుంచి అటు ముఖ్య అధికార యంత్రాంగం, స్ఫూర్తి కొరవడ్డ కమిషన్ల వరకు ఏక కాలంలో చట్టం అమలును గండికొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. చట్టం అమల్లోకి వచ్చిన దశాబ్దికే ‘ఇలా అయితే, ఈ చట్టం మనుగడ సాగిం చేనా?’ అని సందేహం తలెత్తుతోంది. పాలనా వ్యవస్థల్లో పారదర్శకతను సాధించడం ద్వారా సామాన్యునికి ప్రజాస్వామ్య ఫలాలను అందించే లక్ష్యం తో తెచ్చిన ఈ చట్టం అమలుకు తిలోదకాలిచ్చే వ్యవహార శైలి కేంద్ర ప్రభుత్వ నిర్వాకంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ‘ఇంత గొప్ప చట్టం మేమే తెచ్చాం’ అని జబ్బలు చరుచుకున్న యూపీయే ప్రభుత్వమే చివరి రోజుల్లో ఆర్టీఐ అమలు పట్ల నిర్లక్ష్యం వహించింది. ఈ చట్టంతో వచ్చిన పారదర్శకత వల్ల రాజకీయంగా ఎంతో లబ్ధి పొందిన నాటి విపక్ష ఎన్డీఏ, ఇప్పుడు పాలక పక్షంగా సహచట్టాన్ని నిర్వీర్యం చేసే బాధ్యత తీసుకుంది. ఏడు నెలలుగా ముఖ్య సమాచార కమిషనర్‌ను నియమించకుండా తాత్సారం చేస్తోంది. ఈ చట్టం అమలును పర్యవేక్షిస్తూ, దేశవ్యాప్తంగా సరైన సంకేతాలివ్వాల్సిన కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)నే దెబ్బతీసే చర్యలకు కేంద్రం తలపడుతోంది. ఈ చట్టపరిధిలో సీఐసీ ఫుల్‌బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్ని ఇటు పాటించకుండా ఉల్లం ఘిస్తూ, అటు న్యాయస్థానంలో సవాలైనా చేయకుండా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర కమిషన్ తామిచ్చిన ఉత్త ర్వుల్ని తామే అమలు చేయజాలమని చేతులెత్తేసి, కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ)పై ఆ భారం మోపి సహ చట్ట స్ఫూర్తిని గంగలో కలిపింది. ఇక, మొదట్నుంచీ సీఐసీపై ఆధిపత్యం కోసం పాకులాడుతున్న డీఓపీటీ... ముఖ్య కమిషనర్ లేని పరిస్థితిని అవకాశంగా తీసుకొని కమి షన్ను బలహీనపరిచే చర్యల్ని ముమ్మరం చేస్తోంది. దూడలు గట్టున మేస్తాయా...? వివిద వ్యవస్థలకు మార్గదర్శకంగా ఉండాల్సిన రాజకీయ వ్యవస్థ సహ చట్టం అమలు విషయమై తప్పుడు సంకేతాలిస్తోంది. సీఐసీ తీర్పును లక్ష్యపెట్టక ప్రధాన రాజకీయ పక్షాలు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరు అధికార గణానికి, కార్యనిర్వాహక వ్యవస్థకు తప్పుడు సంకేతమిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిధులను పొందుతున్న స్వచ్ఛం ద సంస్థలు కూడా ఆర్టీఐ పరిధిలోకొస్తాయని ఈ చట్టం చెబుతోంది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎన్సీపీలు అలాంటి పౌర సంస్థలేనని, ఈ చట్టం కింద పౌరులడిగే సమాచారం ఇచ్చి తీరాల్సిందేనని సీఐసీ 2013 జూన్ లోనే ఖరాకండిగా ఆదేశించినా అవి ఖాతరు చేయడం లేదు. పోనీ, దీన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్నయినా ఆశ్రయించాయా? అంటే అదీ లేదు. పార్టీలు అనుసరిస్తున్న ఈ మొండివైఖరి ప్రజాస్వామ్యవ్యవస్థ ఉనికికే సవా లు. రాజకీయ పక్షాల్ని ఆర్టీఐ పరిధి నుంచి బయటకు తెచ్చేలా చట్టసవరణకు యూపీయే ప్రభుత్వపు చివరి రోజుల్లో ఒక బిల్లును ప్రతిపాదించారు. అన్ని పార్టీలు ఈ విషయంలో ఏకమై పార్లమెంటు స్టాండింగ్ కమిటీలో ముసాయి దా బిల్లుకు ఏకపక్షంగా మద్దతు తెలిపాయి! ఆ బిల్లు ఆమోదం పొందకుం డానే 2015 మే నెలలో లోక్‌సభ రద్దయింది. నేటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా అదే దోరణితో వ్యవరిస్తోంది. ఇటీవల రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమా ధానమిస్తూ, ‘పార్టీలను ఆర్టీఐ కింద పౌరసంస్థలుగా ప్రకటిస్తే వాటి పని తీరునకది భంగం కలిగిస్తుంది, ప్రత్యర్థులు వారి సమాచారాన్ని దుర్వినియో గం చేసే ప్రమాదముంది’ అని చట్ట వ్యతిరేక ప్రకటన చేసింది. గోద్రా అల్లర్ల తర్వాత నాటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ, ప్రధాని వాజ్‌పేయ్ మధ్య ఉత్తరప్రత్యుత్తరాల ప్రతులు కావాలన్న దరఖాస్తుదారునికి అధికారులు మొండిచేయి చూపారు. కన్నతల్లే దయ్యమైతే...! చట్టాన్ని అమలు చేయాల్సిన కేంద్రమే ఆర్టీఐ అమలును తూట్లు పొడిచే చర్యలకు పూనుకుంటోంది. ‘కన్నతల్లే దయ్యమైతే...పసికందుకు తొట్టెల కట్టే చోటేది’ అన్నట్టుంది పరిస్థితి. గత ఆగస్టు నుంచి సీఐసీ పదవి ఖాళీగా ఉంది. కీలకమైన అప్పీళ్లు పరిష్కారానికి నోచకుండా పడి ఉన్నాయి. పీఎం కార్యా లయం, విజిలెన్స్ కమిషన్, కాగ్, సుప్రీంకోర్టు, హోమ్ సహా 34 ప్రధాన శాఖల ఆర్టీఐ అప్పీళ్లను కేంద్ర సమాచార కమిషనర్ లేనిదే సీఐసీలో విచారించడానికి లేదు. అంటే, ఆయా శాఖలు సమాచారాన్ని ఏకపక్షంగా తిరస్కరించినా దిక్కు లేదు. ఇందులో ఇంకో సాంకేతికాంశం కూడా ఉంది. అసలు సీఐసీ లేకుండా అటు కేంద్ర సమాచార కమిషన్ గానీ, ఇటు రాష్ట్రాల కమిషన్లు (ఎస్ఐసీ) గానీ పనిచేయడానికి లేదు. కమిషన్ పూర్తిస్థాయి నిర్వ హణను ఇతర కమిషనర్ల సహకారంతో ముఖ్య సమాచార కమిషనర్ మాత్ర మే చేపట్టాలని సెక్షన్ 12 (4) చెబుతోంది. లోగడ ఇలాగే కమిషనర్ లేని పరిస్థితే గుజరాత్లో తలెత్తితే, వెంటనే ముఖ్య సమాచార కమిషనర్‌ను నియమించాలని అహ్మదాబాద్ హైకోర్టు ఆదేశించింది. కేంద్ర కమిషన్‌లో సీఐసీ నియామకానికి ఎంపిక కమిటీని ప్రధాని మోదీ డిసెంబర్ 13న నియ మించారు. ప్రధానితోపాటు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ, విపక్ష నేత మల్లి కార్జున్ ఖర్గేలతో కూడిన ఈ త్రిసభ్య సంఘం రెండుసార్లు భేటీ అయినా నియామక ప్రక్రియ అంగుళం ముందుకు జరగలేదు. చట్టం సక్రమంగా అమలైతే పారదర్శకతపరంగా తమ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందనే భయం వల్లనే కేంద్రం దీన్ని నిర్వీర్యం చేయడానికి పూనుకుంది. మొత్తంగా ఆర్టీఐపై కేంద్రం వైఖరి ఎన్డీఏ ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా ఉంది. అధికారులు ఆడిందే ఆట...... పాలకుల వైఖరిని బట్టే కేంద్ర అధికారులు నడుస్తుంటారు. ఆర్టీఐ విషయంలో ప్రభుత్వధోరణిని చూసే కేంద్ర ప్రభుత్వ శాఖలు ఇష్టారాజ్యంగా సమాచా రాన్ని నిరాకరిస్తున్నాయి. పద్మ అవార్డులపై నిర్దిష్టంగా అడిగిన సమాచారాన్ని గృహమంత్రిత్వ శాఖ ఏకపక్షంగా నిరాకరించింది. ఆ దరఖాస్తు అప్పీలును విచారించాలంటే సీఐసీ ఉండాలి. కాబట్టి ఇప్పట్లో అది విచారణకు రాదు. ఇదే పరిస్థితి చాలా శాఖల్లో నెలకొని ఉంది. గత పదేళ్లుగా కొందరు చిత్తశుద్దిగల కమిషనర్లు, మరీ ముఖ్యంగా ఆర్టీఐ కార్యకర్తలు, ప్రసారమాధ్యమాలు చూపిన చొరవతో సహ చట్టంపై ప్రజల్లో అవగాహన పెరుగుతూ వచ్చింది. దరఖాస్తుల సంఖ్యా పెరిగింది. బడుగు బలహీనవర్గాలు, అల్ప, మధ్యా దాయవర్గాల వారు ప్రధానంగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాల కింద తమ కు దక్కాల్సిన ప్రయోజనాలకు సంబంధించే ఎక్కువగా దరఖాస్తులు చేస్తున్న ట్టు తేలింది. దశాబ్దాల నుంచి సహ చట్టం అమల్లోవున్న అమెరికాలో గత ఏడాది 35 లక్షల ఆర్టీఐ దరఖాస్తులు వస్తే, భారతదేశంలో 45 లక్షల దర ఖాస్తులు వచ్చాయి! ఇలాంటి కీలక సమయంలోనే ఆ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పాలకులలాగే కేంద్ర ప్రభుత్వ సిబ్బంది- శిక్షణ వ్యవహారాలశాఖ (డీఓపీటీ) సైతం సీఐసీని మరింతగా నిర్వీర్యం చేసేందుకు పావులు కదుపుతోంది. ప్రధాని ప్రత్యక్ష పర్యవేక్షణలోని ఈ శాఖే కేంద్ర సమాచార కమిషన్‌కు సదుపాయాలు కల్పించే సౌజన్య విభాగం. మొదట్నుంచీ డీఓపీటీకి, సీఐసీకి పడటం లేదు. సీఐసీ మొదటి ముఖ్య సమాచార కమి షనర్ వజహత్ హబీబుల్లా ఆదేశాల్ని అది సుదీర్ఘంగా అమలు చేయక, సంఘర్షణాత్మక ధోరణితో పనిచేసింది. ఫైల్ నోటింగ్స్ కూడా పౌరులకివ్వాల్సిన సమాచారంలో భాగమేనని సీఐసీ ఇచ్చిన ఆదేశా లకు విరుద్ధంగా వెబ్సైట్లో సమాచారం పెట్టి లక్షలాదిగా పౌర సమాచార అధి కారుల్ని తప్పుదోవ పట్టించింది. ముఖ్య కమిషనర్ నేతృత్వంలో కమిషన్ నిర్వహించాల్సిన బాధ్యతల్ని, ఆర్థికాధికారాల్ని క్రమంగా తాము నియమించే కమిషన్ కార్యదర్శి అయిన ఐఏఎస్ అధికారికి బదిలీ చేయడానికి చూస్తోందనే విమర్శలున్నాయి. ఈ విమర్శకు బలమిచ్చేదిగా...ఈ నెల 11న డీఓపీటీ, సీఐసీ ఆర్థి కాధికారాలన్నిటీనీ కార్యదర్శికి బదలీచేస్తూ వివాదస్పద ఉత్తర్వులు ఇచ్చింది. కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తికే ఇది గొడ్డలిపెట్టు. చేతులెత్తేసే కమిషన్లు శవపేటికపై చివరి మేకులు! మేమిచ్చిన ఆదేశాల్ని మేమే అమలుపరచలేకపోతున్నామని చేతులెత్తేయడం ఇటీవలి కాలంలో కమిషనర్లకు రివాజయింది. ఇది ఆర్టీఐ కార్యకర్తల కృషిని, సామాన్యపౌరుల ఆశలను నీరుగారుస్తోంది. ఏపీ సమాచార కమిషన్ కూడా ఈ వార్షిక సదస్సులో ఇలాగే తన అశక్తతను వ్యక్తం చేసింది తమ ఆదేశాల్ని ప్రభుత్వం అమలుపరచాలని, లేకపోతే తాము చేయగలిగేదేమీ లేదని పేర్కొంది. రాజకీయ పార్టీలను పబ్లిక్ అథారిటీలుగా స్పష్టం చేస్తూ సీఐసీ ఇచ్చిన ఉత్తర్వుల్ని ఆయా పార్టీలు ఖాతరు చేయకపోయినా సీఐసీ ఏం చేయలేకపోయింది. ఇదే కేసులో ఈ నెల 16న తుది తీర్పు వెలువరిస్తూ, కమిషన్ ఆదేశించినా రాజకీయ పార్టీలు ఉత్తర్వుల్ని అమలుపరచలేదని, ఈ విషయంలో ఇంతకు మించి తామేమీ చేయజాలమని ముగ్గురు కమిషనర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పార్టీలు ఉత్తర్వుల్ని అమలు పరచలేదు, సవాల్ చేస్తూ న్యాయస్థానానికి వెళ్లలేదు, చట్టసవరణ కూడా జరగలేదు... కనుక తమ ఉత్తర్వులకు కాలదోషం పట్టలేదని మాత్రం పేర్కొంది. సీఐసీ ఉత్తర్వులు అమలయ్యేలా చూసే వ్యవస్థ లేకపోవడం చట్టంలో ఉన్న లొసు గని, దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చూడాలని డీఓపీటీని కోరుతున్నట్టుగా అది పేర్కొంది. నిజానికి కమిషన్ ఈ కేసు పరిష్కారంలో చట్టప్రకారం వ్యవహరించలేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. రాజకీయ పార్టీలను పబ్లిక్ అథారిటీలుగా ఆదేశాలిచ్చినపుడు, ఆయా పార్టీ లకు తానే పీఐవోలనూ నియమించే అధికారం ఆర్టీఐ సెక్షన్ 19 (8) ఎ (జీ) (జీజీ) ప్రకారం కమిషన్‌కు ఉంది. ఈ నిబంధనను వినియోగించుకొని ఆయా పార్టీల కార్యనిర్వాహక బృందంలో ఎవరినైనా పీఐవోలుగా ప్రకటించి జరిమానా విధించి ఉండాల్సిందని అలాంటి వారి వాదన. అంటే సీఐసీ కూడా సహ చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినట్టయింది. ఇలా... రాజకీయ పక్షాలు, కేంద్ర ప్రభుత్వం, అధికార వ్యవస్థ, కమిషన్లు ఎవరి వంతుకు వారు ఆర్టీఐని నీరుగారుస్తుండటంతో సహజంగానే ఆర్టీఐ కార్య కర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పౌర సమాజం మరింత చైతన్యమై, సంఘటిత పోరాటం ద్వారానే ఈ చట్టాన్ని కాపాడుకోవాలి. దిలీప్ రెడ్డి ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
జల నిర్లక్ష్యంతో జీవం ఆవిరే!
సమకాలీనం ఐరాస పిలుపు మేరకు ‘నీరు-నిలకడైన అభివృద్ధి’ ఈ ఏడాది ప్రాధాన్యతాంశంగా ప్రపంచ దేశాలు కసరత్తు చేస్తుండగా... తెలంగాణలో చెరువుల్ని పునరుద్ధరించే ‘మిషన్ కాకతీయ’ను, ఏపీలో ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేపట్టాయి. భారీ వ్యయంతో చేస్తున్న ఈ కార్యక్రమాలకు శాస్త్రీయ దృక్పథాన్ని జత చేసి, స్థానిక సంస్థలతో అనుసంధానించాలి. మనిషి మనుగడ కోసం, భవిష్యత్ అవసరాల కోసం నీటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తిం చాలి. అన్ని స్థాయిల్లో స్పందించి ప్రతి నీటి చుక్కను అర్థవంతంగా వాడితేనే భూగ్రహానికి రక్ష. మూడో ప్రపంచ యుద్ధమంటూ వస్తే అది నీటి కోసమే జరుగుతుందనే మాట దశాబ్దాలుగా వింటున్నాం. మానవ మనుగడకు నీరు కేంద్ర బిందువైన తీరు దృష్ట్యా నీటి ప్రాధాన్యాన్ని, నీటిని చుట్టుముట్టి వస్తున్న పర్యావరణ మార్పులను, ప్రమాదాల్ని చూస్తుంటే... ఆ యుద్ధం ఇప్పటికే మొదలైందని స్పష్టమౌతోంది. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక, స్థాయిల్లో నీటి యుద్ధాలు ఇప్పటికే సాగుతున్నాయి. ఉదాసీన వైఖరితో ఉపేక్షిస్తే, అవి మరింత తీవ్ర రూపం దాల్చి మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేయగలవని ప్రమాద ఘంటి కలు మోగుతున్నాయి. మితిమీరుతున్న ‘భూతాపం’ సృష్టిస్తున్న అనర్థాలు ‘వాతావరణ మార్పు’ తదితర రూపాల్లో ఇప్పటికే తీరని నష్టాన్ని కలిగిస్తున్నా యి. సహజ వనరైన నీటికి పర్యావరణ పరంగా ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి, నష్టాన్ని తగ్గించడం, నీటి కాలుష్యాన్ని నియంత్రించి సగటు మనిషి జీవన ప్రమాణాల్ని పెంచుకోవడంలో, జల వనరుల పరిరక్షణలో సాధించాల్సింది ఎంతో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ఏటా మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం పాటిస్తున్నారు. 1993 నుంచి జల దినోత్సనం పాటిస్తూనే ఉన్నా సమస్య మరింతగా జటిలమౌతూనే ఉంది. అందుకే ఐరాస ‘నీరు-నిలకడైన అభివృద్ధి’ని ఈ ఏడాది ప్రాధాన్య తాంశంగా ఖరారు చేసింది. ప్రపంచ దేశాలు ఈ అంశంపై కసరత్తు చేస్తుం డగా... రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు ప్రతిష్టాత్మకమైన కార్యక్ర మాలు చేపట్టాయి. తెలంగాణలో చెరువుల్ని పునరుద్ధరించే ‘మిషన్ కాకతీ య’ను మొదలెడితే, ఆంధ్రప్రదేశ్‌లో ‘నీరు-చెట్టు’ కార్యక్రమం చేపట్టింది. ఈ రెండిటికీ కేంద్ర బిందువు నీరే. అయితే, వాటికి శాస్త్రీయ దృక్పథాన్ని అందించి, వాటిని ప్రజలతో, జన సమూహాలతో, గ్రామ పంచాయతీల వంటి స్థానిక సంస్థలతో మరింతగా అనుసంధానించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ముతక విధానాలేనా? ప్రపంచమంతా ఆధునికతవైపు పరుగిడుతుంటే, మనమింకా సంప్రదాయిక ముతక పద్ధతుల్లోనే కొట్టుమిట్టాడుతున్నాం. నదుల్ని అడ్డగించి ఆనకట్టలు, పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు, కాలువలతో మనం అవలంబిస్తున్న పొలాన్ని నీటితో నింపే వరద (ఫ్లడ్) సాగు పురాతన పద్ధతి. దీనివల్ల పలు అనర్థాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అభివృద్ధిచెందిన దేశాల్లో నీటిని పొదుపుగా వాడి పర్యావరణ అనుకూలమైన తేమ, పొగ మంచు, బిందు (డ్రిప్), తుంపర (స్ప్రింక్లర్) వంటి ఆధునిక పద్ధతుల్లో సేద్యం చేస్తున్నారు. ఇజ్రాయెల్, టర్కీ వంటి దేశాలు ఈ పద్ధతులతో గణనీయమైన విజయాలు సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. టర్కీలో నీటి కనిష్ట వినియోగంతో అద్భుతాలు సృష్టించారు. పల్లపు భూములన్నింటినీ చిన్న చిన్న కమతాలుగా సమతలం చేశారు. యూఫ్రిటీస్, టైగ్రిస్ జలాల్ని ఇలా ఒడుపుగా వినియోగిస్తూ ఆహారోత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నారు. పొలాల్లో నీటిని వరదలా పారించడం వల్ల సూక్ష్మ ఖనిజాలు కొట్టుకుపోయి భూసారం చెడుతోంది. తేమ, కనీస తడి వంటి ఆధునిక పద్ధతుల్లో భూసార పరిరక్షణ జరుగుతుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్ని వ్యవ సాయ క్షేత్రాలతో అనుసంధానం చేసే పని మన వద్ద జరగటం లేదు. ఆదర్శ పరిస్థితుల్లో ఒక క్యాలరీ ఆహారోత్పత్తికి ఒక లీటరు నీరు సరిపోతుంది. కానీ, సంప్రదాయక సాగుతో ఒక క్యాలరీ ఆహారోత్పత్తికి వంద లీటర్ల నీరు అవసర మౌతోంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగమౌతున్న నీటిలో సగటున 70 శాతం వ్యవసాయ అవసరాలకై పోతోంది. కాలం చెల్లిన వ్యవసాయ పద్ధతులే ఇందుకు ప్రధాన కారణం. పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం వల్ల పర్యావర ణానికి ముప్పు తప్పదు. నైలు నది ఎగువనున్న దేశాలు విద్యుత్, వ్యవసాయ అవసరాల కోసం ఆనకట్టలు, ప్రాజెక్టులు నిర్మిస్తుండటం వల్ల ఒండ్రు మట్టి దిగువ ప్రాంతాలకు రాక ఆ ప్రాజెక్టుల్లోనే పేరుకుపోతోంది. ఈజిప్ట్ తదితర దేశాలకిది శాపంగా పరిణమిస్తోంది. ఇదే పద్ధతి కొనసాగితే ప్రపంచంలో చాలా జీవనదులు నిర్జీవ నదులుగా మారే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర జల వివాదాలు కొత్తేం కాదు. గోదావరి, కృష్ణా జల వివాదాలు తెలుగు రాష్ట్రాల మధ్య రావణ కాష్టంలా రగలడం నిత్యం చూస్తున్నదే! నదీ బోర్డులు, వాతావరణ మార్పు కేంద్రాలు రావాలి రాజకీయ వ్యవస్థ సంకుచితంగా ఆలోచించినంత కాలం జల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించదు. అందుకు పూర్తి స్వేచ్ఛ, సర్వాధికారాలు కలి గిన స్వతంత్ర నదీ బోర్డులుండాలని నిపుణులు చాలా కాలంగా చెబుతు న్నారు. తాగునీరు, సాగునీరు, విద్యుదుత్పత్తి అన్న ప్రాధాన్యతా క్రమంలో ఎప్పుడు, ఏ ప్రాజెక్టు నుంచి, ఎవరికెన్ని నీళ్లు విడుదల చేయాలనే నిర్ణయా లను ఈ బోర్డు న్యాయస్థానాల, ట్రిబ్యునళ్ల తీర్పులను బట్టి తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో రాజకీయ జోక్యానికి తావుండరాదు. ఇలాంటి ప్రాధికార సంస్థల నిర్వహణ వల్లే అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. వాతావరణ కాలుష్యాల వల్ల భూతాపం పెరిగి, అది వాతావరణ మార్పులకు కారణమౌతోంది. ఫలితంగా వర్షాలు సరిగ్గా కురవటం లేదు. రుతుక్రమం దెబ్బతిని, అతివృష్టి లేదా అనావృష్టితో వ్యవసాయానికి తీరని భంగం కలు గుతోంది. అక్కడక్కడ కొన్ని నల్లరేగడి భూముల్లో మినహాయిస్తే వర్షాధార పంటలే పండని పరిస్థితి వచ్చేస్తోంది. నిలువ నీటిపై ఆధారపడక తప్పని స్థితి దాపురించింది. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ మునుపెన్నడూ లేనంత ప్రమాదకర స్థాయికి అవి పడిపోయాయి. వేయి, రెండు వేల అడుగుల వరకు బోర్లు వేస్తేగానీ నీరు పడని పరిస్థితి. ఆధు నిక శాస్త్ర సాంకేతికత దృష్ట్యా మన సాగు విధానాలు, పద్ధతులు మారాల్సి ఉంది. తద్వారా వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ‘వెదర్ మాడిఫికేషన్ సెంటర్స్’ (డబ్లూఎంసీ)ను ఏర్పాటు చేయడం అవసరం. రాజకీయ జోక్యం లేని స్వతంత్ర ప్రతిపత్తి గల ఈ సంస్థలు నిపుణుల నిర్వహణలో నడవాలి. వర్ష రుతువులో ‘మేఘ మథ నం’ ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించాలి. అందుకోసం డబ్లూఎంసీని వైమా నిక దళంతో అనుసంధానించాలి. ఈ పనులను ప్రభుత్వమే చేపట్టాలి తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం చేయరాదు. ప్రజలతో, పంచాయతీలతో లంకె పెట్టాలి తెలంగాణలో చెరువులకు పునర్ వైభవం తీసుకురావడానికి మిషన్ కాకతీ యను చేపట్టారు. దాదాపు 46 వేల చెరువుల్ని పునరుద్ధరించడం ద్వారా వాటి నీటి నిలువ సామర్థ్యాన్ని 265 శతకోటి ఘనపుటడుగులకు (టీఎంసీలు) పెంచాలని లక్ష్యం. తద్వారా 25 లక్షల ఎకరాల సాగును స్థిరీకరించడమో, పునరుద్ధ్దరించడమో జరుగుతుంది. వచ్చే ఐదేళ్లలో దాదాపు 36 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా, గోదావరి లోతున ప్రవహి స్తుండటంతో కాకతీయుల కాలం నుంచి చెరువులే తెలంగాణలో సాగునీటికి ఆదరువుగా ఉన్నాయి. నదుల నీరు వాడుకోడానికి ఎత్తిపోతల పథకాలే దిక్కు. వాటికి పెద్ద ఎత్తున నిధులు, విద్యుత్తు అవసరం. దీంతో ప్రభుత్వాలు అలాంటి ప్రాజెక్టుల పట్ల ఆసక్తి చూపలేదు. పాలకుల నిర్లక్ష్యం వల్ల చెరువుల కింద సాగు అంతరించే పరిస్థితి దాపురించింది. చెరువుల పూడిక తీయడమే కాకతీయ మిషన్ ప్రధాన ప్రక్రియగా ఉంది. దీనివల్లే పూర్వ వైభవం రాదు. దాదాపు వెయ్యేళ్లు చెరువులు సురక్షితంగా ఉండటానికి ప్రధాన కారణం చెరువు, ఊరు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటమే. చెరువు నీళ్లతో పం టలు పండేవి. చాకలి, కుమ్మరి, మత్స్యకారులు తదితర సకల వృత్తులకు ప్రధాన జీవనాధారం చెరువే. చెరువుకు గ్రామానికి మధ్య ఉన్న విడదీయరాని బంధం నేడు తెగిపోయింది. చెరువుల వల్ల మోట బావులు, ఊట బావులు, చేద బావుల్లో నీరుండేది. భూగర్భజల మట్టాలూ పైనే ఉండేవి. చెరువులపై నిర్లక్ష్యం పెరిగాక, చెరువులోకి నీరొచ్చి చేరేందుకు ఆధారమైన పరీవాహక ప్రాంతాలు చాలా వరకు సాగులోకొచ్చాయి. ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసు కున్నారు. చెరువులు కూడా కబ్జాలకు గురయ్యాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రియల్ మాఫియాల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వీటిని విముక్తం చేయాల్సి ఉంది. అందుకుగాను, ఈ చెరువుల పునరుద్ధరణ, నిర్వహణ తదితరాలన్నింటినీ గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు అప్పగించాలి. వారికి అధికారాలు కల్పించి గ్రామ సభను నిర్ణాయక వేదికగా బలోపేతం చేయాలి. ఊరు-చెరువు మధ్య బంధాన్ని పటిష్టపరచాలి. అప్పుడే చేస్తున్న కృషికి సార్థకత. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన నీరు-చెట్టు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. చెరువుల్ని పునరుద్ధరించడం, కుంటలు, కాలువల్లో పూడిక తీయడం, మెరుగైన పద్ధతుల్లో చెక్ డ్యాములు, తదితర నీటి నిల్వ వసతుల్ని మెరుగు పరచడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టడం కూడా ఇందులో భాగమే! వచ్చే ఐదేళ్ల కాలంలో యాభై కోట్ల మొక్కలు నాటడం, ఇతర పర్యావరణ అనుకూల చర్యల ద్వారా నీటి లభ్యతను మెరుగుపరచడం నీరు-చెట్టు పథకం లక్ష్యంగా ప్రకటించారు. ఈ ఐదేళ్లలో సుమారు రూ.27 వేల కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. ఇంత పెద్ద మొత్తాల్లో ప్రజాధనం వెచ్చించేటప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ సంకుచిత దృష్టితో కాక విస్తృత జనహితంతో ఆలోచించాలి. పౌరులు, ప్రజా సంఘాలతో పాటు స్థానిక సంస్థల్ని క్రియాశీ లంగా ఇందులో భాగస్వాముల్ని చేస్తూ భవిష్యత్ కార్యక్రమాల్ని రచించాలి. ఇలాగే నీటిని నిర్లక్ష్యం చేస్తే భూమిపై జీవమే ఆవిరి కాక తప్పదు నిబంధనల్ని గాలికొదిలే కంపెనీలు, కర్మాగారాలు, నిఘా సంస్థలు నీటి కాలు ష్యానికి కారణమౌతున్నాయి. నదీ గర్భం నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఇసుకను తరలిస్తున్న మాఫియాల చర్యలు భూమిపై వ్రణాలు, పుండ్లు పెరగడానికి దోహద పడుతున్నాయి. నిర్లక్ష్యపు ప్రభుత్వాలు నిలకడైన అభివృద్ధిని లక్ష్య పెట్టకుండా తాత్కాలిక కంటితుడుపు చర్యలతో పబ్బం గడుపుతూ పర్యా వరణానికి గండి కొడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనమంతా అప్రమత్తం కావాలి. మన మనుగడ కోసం, భవిష్యత్ అవసరాల కోసం నీటిని కాపాడు కోవాల్సిన ప్రాముఖ్యతను గుర్తించాలి. ప్రభుత్వాలుగా, కార్పొరేట్లుగా, సంస్థ లుగా, పౌరసంఘాలుగా, వ్యక్తులుగా.. అన్ని స్థాయిల్లో స్పందించి ప్రతి నీటి చుక్కను కాపాడి అర్థవంతంగా వాడితే గానీ భూగ్రహానికి రక్షణ లేదు. (మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా) ఆర్. దిలీప్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
తప్పెవరిది? తిప్పలెవరికి?
2012 జూనియర్ డాక్టర్ల సమ్మె కాలం నాటి ద్వైపాక్షిక ఒప్పందంలోని అంశాలేవీ అమలుకు నోచుకోలేదు. నేటి జూడాల సమ్మె వెనుక కొన్ని అదృశ్య శక్తులు ఉండి నడుపుతున్నాయంటున్న నేటి ఉప ముఖ్యమంత్రి రాజయ్య నాడు జూడాల ఉద్యమానికి వెనుక నిలిచిన శక్తే! విపక్షంలో ఉన్నపుడు ఒక మాట, అధికారంలోకి రాగానే మరోమాట అనే ఈ వైఖరే సమస్యను జటిలం చేస్తోంది. ప్రభుత్వం గత ఒప్పందాన్ని అమలు చేయకపోతే ‘న్యాయధిక్కారం కింద కోర్టును ఎందుకు సంప్రదించలేదు?’ అనే హైకోర్టు ప్రశ్నకు జూడాల వద్ద సమాధానం లేదు. తీర్పును కోర్టు రిజర్వు చేయడంతో బంతి ఇప్పుడు ప్రభుత్వం కోర్టులోకొచ్చింది. ఇక ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సమకాలీనం అండమాన్ దీవుల్లో అటవీ అధికారిగా పనిచేస్తూ హైదరాబాద్‌లో కూతురిని చూసుకోవడానికి వచ్చిన లక్ష్మణ్‌కి గుండెనొప్పి వచ్చింది. వెంటనే 108 సర్వీసులో గాంధీ ఆస్పత్రికి తరలించారు. జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా అక్కడెవరూ చూసేవారు లేక, వైద్యం అందక మరణించాడు. గాంధీలో... ఉస్మానియాలో... వరంగల్ ఎంజీఎంలో... ఇంకా, జిల్లాల్లోని ఇతర ఆస్పత్రుల్లో.... ఎందరెందరో మృత్యువుతో పోరాడుతున్నారు, పరిస్థితి విషమిస్తే మృత్యువు ఒడిలోకి జారుతున్నారు.ఎందుకీ దుస్థితి దాపురించింది. సమ్మె విరమించేది లేదంటున్నారు తెలం గాణ జూనియర్ డాక్టర్లు. అన్నీ మేం చూసుకుంటాం, వెంటనే సమ్మె విరమించి పనుల్లో చేరండంటున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఇటు జూడాలు, అటు ప్రభుత్వం ఎవరి వైఖరిని వారు కొనసాగిస్తున్నారు. ఈ ప్రతిష్టంభన తొలిగేదెలా? దమన నీతి...ద్వంద్వ వైఖరి ‘ఎప్పుడూ ఏంటి ఈ ‘జూడా’ల సమ్మె! పనీ పాటా లేదా వీళ్లకు?’ అని చాలా మంది విసుక్కుంటుంటారు. కానీ, ఒక్కసారైనా లోతుగా అసలు సమస్య ఏంటి? మూలాలెక్కడున్నాయి? బాధ్యులెవరు? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకరు. ఈ దుస్థితికి రాజ్యాంగం పరిధిలో పనిచేసే అన్ని వ్యవస్థల బాధ్యతా ఉంది. ప్రభుత్వాన్నే తీసుకుంటే, జూనియర్ డాక్టర్లు లేవనెత్తుతున్న అంశాల్ని పరిష్కరించే చిత్తశుద్ధిని ప్రభుత్వం ఎప్పుడూ చూపలేదు. 2012 ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం నెరవేర్చాల్సిన అంశాలన్నీ అమలుకు నోచుకోకుండా అలాగే ఉన్నాయి. ప్రభుత్వానికి నేతృత్వం వహించే పార్టీలు మారుతున్నా ప్రభుత్వ వైఖరి మారటంలేదు. జూడాల వెనుక కొన్ని అదృశ్య శక్తులు ఉండి నడుపుతున్నాయంటున్న నేటి ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యమంత్రి డాక్టర్ రాజయ్య 2012లో ఇదే జూడాలు ఉద్యమించినపుడు వారికి అండగా వెనుక ఉన్న శక్తే! వారి డిమాండ్లు మారలేదు, కానీ, రాజయ్య స్థానం మారింది. జూడాలపై అత్యవసర సర్వీసుల చట్టం ప్రయోగిస్తామన్న నాటి సీఎంను ‘ఎస్మా’ రెడ్డి అన్న కె.చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ‘ఏమిటి జూడాల బెట్టు?’ అంటున్నారు. విపక్షంలో ఉన్నపుడు ఒకమాట, అధికారంలోకి రాగానే మరోమాట మాట్లాడటం రాజకీయ నేతలకు రివాజయింది. అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు జరిగినపుడు తెలంగాణ జర్నలిస్టుల పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ నిప్పులు చెరిగిన పెద్ద మనుషులు... గద్దెనెక్కాక అదే వేదికపై తాము జరిపించిన ‘మెట్రోపొలిస్’ సదస్సుకు జర్నలిస్టుల్ని రానీయలేదు. ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు, దీక్షలు చేయనీయట్లేదంటూ పెద్దఎత్తున సాగించిన ఆందోళనలతో 2009, డిసెంబర్ 9న పార్లమెంటులో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయించే వరకు తీసుకెళ్లిన తెరాస నాయకత్వం.. గద్దెనెక్కాక ఏంచేసింది? ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సమావే శాన్ని అడ్డుకుంది. ప్రజాస్వామ్య, పౌరసంఘాల నేతల్ని నిర్బంధించింది. కోట బయట ఒకగొంతు, కోట లోపల మరోగొంతు అనే ఈ వైఖరే ప్రస్తుత ప్రతిష్టం భనకు కారణం. సమస్య తీవ్రమైన ప్రతిసారీ జూడాలు డిమాండ్లు వెల్లడిస్తారు, నిరసన తెలుపుతారు, చివరకు సమ్మెకే దిగుతారు. ఏ దశలోనూ ప్రభుత్వం సయోధ్యకు యత్నించిన దాఖలాలుండవు. ‘‘సరే, మీరు సమ్మె చేయండి. మేం ప్రజాప్రయోజనవ్యాజ్యం వేయించి విరమింపజేస్తాం’’ అని కొందరు ప్రభుత్వ పెద్దలే తమను రెచ్చగొట్టారని జూడా వర్గాలంటున్నాయి. ఇలాంటి ప్రతిష్టంభన ఏర్పడ్డ సందర్భాల్లో తలెత్తిన సంక్లిష్ట పరిస్థితుల నుంచి సంప్రదింపులు గట్టెక్కిం చాయి. అలాంటి సత్సంప్రదాయాలకు ప్రభుత్వాలు ఇటీవలి కాలంలో తిలోద కాలిచ్చాయి. ప్రభుత్వం వైపు నుంచి ఉన్నతాధికారులో, మంత్రులో తక్షణం జూడాలతో సంప్రదింపులు జరిపి ప్రజల ఇబ్బందుల్ని తొలగించాలి. రుచిమరిగిన వ్యవహారం సమస్య ఉంటే మా దృష్టికి తెండి, మేం పరిష్కరిస్తాం, ముందు సమ్మె విరమిం చండని హైకోర్టు పేర్కొన్న తర్వాత కూడా సమ్మె విరమించకపోవడం జూడాల మొండితనాన్ని వెల్లడిస్తోంది. రాజ్యాంగం, చట్టం, కడకు సమధర్మ ప్రాతిపదికన చూసినా, ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మె చేసే హక్కే లేదని సుప్రీం ధర్మాసనం (జస్టిస్ ఎం.బి.షా, జస్టిస్ ఎ.ఆర్ లక్ష్మణన్) ఒక కేసులో లోగడే స్పష్టం చేసింది. సమ్మె ప్రాథమిక హక్కు కాదు, అనివార్యమైన పరిస్థితుల్లో నిరసనను ప్రకటించే ఒక మార్గం మాత్రమేనని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో వెల్లడించింది. ఉమ్మ డి బేరసారాల ద్వారా లబ్ధిపొందే ఉద్దేశంతో సమ్మె చేసినా, రాజ్యాంగ అధికర ణం 19(1)లోని భావప్రకటనా స్వేచ్ఛను ఉదారంగా అన్వయించినా ఇది ప్రాథ మిక హక్కు కాజాలదనీ స్పష్టం చేసింది. అంతమాత్రాన సమ్మెను, సమ్మె చేస్తా మనే హెచ్చరికను చట్టవ్యతిరేక ఒత్తిడిగా పరిగణించలేమని కూడా సుప్రీం చెప్పింది. పారిశ్రామిక వివాదాల చట్టంలో సమ్మెకు తగిన నిర్వచనముందని, ‘‘సమ్మె చట్టబద్ధమైనా, కాకపోయినా... తమ సమస్యల పరిష్కారానికి అన్ని మార్గాలూ అన్వేషించి, కడకు సమ్మె చేస్తే అది చట్టబద్ధం కాకపోయినా న్యాయ సమ్మతమే’’ అని జస్టిస్ కృష్ణ అయ్యర్ అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలూ సమ్మె చేసే హక్కును గుర్తించాయని సుప్రీంకోర్టు లోగడ (1989 ఎస్సీ కేసెస్ 710) పేర్కొంది. విధిలేని పరిస్థితుల్లోనే తాము సమ్మెకు దిగామంటున్న జూడా ల వాదనను హైకోర్టు అంగీకరించడంలేదు. సమ్మె విరమించాలని కోర్టు చెప్పాక కూడా వారి వైఖరిలో మార్పులేకపోవడంతో ‘సమ్మె చేస్తున్నారా? రాజకీ యం చేస్తున్నారా?’ అనీ అది ప్రశ్నించింది. ఒక దశలో ‘ప్రభుత్వ బెదిరింపులకు లొం గేది లేదు, సమ్మె విరమించేది లేదు, ఏమున్నా ఇక ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుం టాం’ అన్న జూడాల ప్రకటన ఫక్తు రాజ కీయ వాసనతో కూడుకున్నదే! బాధ్యత ప్రభుత్వానిదే... జూనియర్ డాక్టర్లు చేస్తున్న వాదనలో కొంత పస ఉంది. 2012 జూడాల సమ్మెలో చివరకు ప్రభుత్వం దిగివచ్చి చర్చలు సాగించాక అంగీకారం కుదిరిం ది. హామీలు నెరవేరుస్తామని ప్రభుత్వం కోర్టుకు విన్నవించడంతో జూడాలు సమ్మె విరమించారు. ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు మెరుగుపరచాలని, స్టయిపెండ్ పెంచాలని, ప్రైవేటు వ్యక్తుల దాడుల నుంచి రక్షణకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని, లైబ్రరీలను అప్‌గ్రేడ్ చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో నివాస వసతి కల్పించాలని, తమను సర్వీసులోకి తీసుకొని గ్రామీణ సేవలకు నియోగించడంగానీ, సదరు సేవలకు ప్రత్యేకంగా సర్టిఫికెట్ ఇవ్వటం గానీ చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క గ్రామీణ సేవల అంశం మిన హా వీటికి సూత్రప్రాయంగా ప్రభుత్వం అంగీకరించింది. అవేవీ ఇప్పటి వరకూ అమలు పరచలేదని జూడాలంటారు. ‘అలాంటప్పుడు, న్యాయధిక్కారం కింద కోర్టును ఎందుకు సంప్రదించలేదు? ఎవరు అడ్డుకున్నారు?’ అని హైకోర్టు ప్రశ్న. జూడాల వద్ద సమాధానం లేదు. ఇతర మార్గాలకన్నా సమ్మె చేయడమే వారికి అలవాటయిందనే విమర్శ కూడా ఉంది. తమిళనాడు ప్రభుత్వం సమ్మె చేస్తున్న ఉద్యోగుల్ని పెద్ద సంఖ్యలో తొలగించిన కేసులో ఉద్యోగులకు సమ్మె చేసే హక్కు లేదని సుప్రీం ధర్మాసనం తీర్పిచ్చింది. ఆ తీర్పు సరైన న్యాయ స్ఫూర్తిని ప్రతిఫలించలేదంటూ జస్టిస్ కృష్ణ అయ్యర్ ఒక వ్యాఖ్య చేశారు. ‘ఇటు వంటి తీర్పును కూడా ప్రజల్లో ఒక వర్గం ఆహ్వానిస్తోందంటే, చీటికీమాటికీ సమ్మె చేస్తూ ఆ హక్కును దుర్వినియోగపరుస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం’ అన్నారాయన. ఇతర డిమాండ్లతోపాటు అయిదింట మూడు ప్రధాన డిమాం డ్లను అంగీకరించామని, ఉత్తర్వులు కూడా ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోం ది. గత అనుభవాల దృష్ట్యా జూడాలు నమ్మట్లేదు. కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వారి అనుమానం. కాబట్టి కార్యని ర్వాహక వ్యవస్థ కూడా సమస్యను జటిలం చేస్తున్నట్టు స్పష్టమౌతోంది. వైద్యశా ఖకు చెందిన ఒక ఉన్నతాధికారి తాజా పరిస్థితిపై విచిత్రమైన వ్యాఖ్య చేశారు. ‘జూడాల ఆందోళన వెనుక ఎవరున్నారో మాకు తెలుసు, తెలంగాణలోని తెరాస ప్రభుత్వాన్ని రకరకాలుగా ఇబ్బందులకు గురిచేసే క్రమంలో ఇదొక పార్శ్వం’ అన్న అధికారి స్వరం ఫక్తు రాజకీయ వైఖరినే ధ్వనిస్తోంది. తప్పు ఎవరు చేస్తు న్నా, శిక్ష మాత్రం సామాన్యులు అనుభవిస్తున్నారు. వైద్యం అందక అలమటిస్తు న్నారు. తీర్పును కోర్టు రిజర్వు చేయడంతో బంతి ఇప్పుడు ప్రభుత్వ కోర్టులో కొచ్చింది. ఇక అమాయక ప్రజలను కాపా డాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్టు