తప్పెవరిది? తిప్పలెవరికి? | fault lies with both sides on junior doctors strike, analyses dileep reddy | Sakshi
Sakshi News home page

తప్పెవరిది? తిప్పలెవరికి?

Published Fri, Oct 31 2014 12:07 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

తప్పెవరిది? తిప్పలెవరికి? - Sakshi

తప్పెవరిది? తిప్పలెవరికి?

2012 జూనియర్ డాక్టర్ల సమ్మె కాలం నాటి ద్వైపాక్షిక ఒప్పందంలోని అంశాలేవీ అమలుకు నోచుకోలేదు. నేటి జూడాల సమ్మె వెనుక కొన్ని అదృశ్య శక్తులు ఉండి నడుపుతున్నాయంటున్న నేటి ఉప ముఖ్యమంత్రి రాజయ్య నాడు జూడాల ఉద్యమానికి వెనుక నిలిచిన శక్తే! విపక్షంలో ఉన్నపుడు ఒక మాట, అధికారంలోకి రాగానే మరోమాట అనే ఈ వైఖరే సమస్యను జటిలం చేస్తోంది. ప్రభుత్వం గత ఒప్పందాన్ని అమలు చేయకపోతే ‘న్యాయధిక్కారం కింద కోర్టును ఎందుకు సంప్రదించలేదు?’ అనే హైకోర్టు ప్రశ్నకు జూడాల వద్ద సమాధానం లేదు. తీర్పును కోర్టు రిజర్వు చేయడంతో బంతి ఇప్పుడు ప్రభుత్వం కోర్టులోకొచ్చింది. ఇక ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
 
సమకాలీనం
 

అండమాన్ దీవుల్లో అటవీ అధికారిగా పనిచేస్తూ హైదరాబాద్‌లో కూతురిని చూసుకోవడానికి వచ్చిన లక్ష్మణ్‌కి గుండెనొప్పి వచ్చింది. వెంటనే 108 సర్వీసులో గాంధీ ఆస్పత్రికి తరలించారు. జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా అక్కడెవరూ చూసేవారు లేక, వైద్యం అందక మరణించాడు.

గాంధీలో... ఉస్మానియాలో... వరంగల్ ఎంజీఎంలో... ఇంకా, జిల్లాల్లోని ఇతర ఆస్పత్రుల్లో.... ఎందరెందరో మృత్యువుతో పోరాడుతున్నారు, పరిస్థితి విషమిస్తే మృత్యువు ఒడిలోకి జారుతున్నారు.ఎందుకీ దుస్థితి దాపురించింది. సమ్మె విరమించేది లేదంటున్నారు తెలం గాణ జూనియర్ డాక్టర్లు. అన్నీ మేం చూసుకుంటాం, వెంటనే సమ్మె విరమించి పనుల్లో చేరండంటున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఇటు జూడాలు, అటు ప్రభుత్వం ఎవరి వైఖరిని వారు కొనసాగిస్తున్నారు. ఈ ప్రతిష్టంభన తొలిగేదెలా?

దమన నీతి...ద్వంద్వ వైఖరి

‘ఎప్పుడూ ఏంటి ఈ ‘జూడా’ల సమ్మె! పనీ పాటా లేదా వీళ్లకు?’ అని చాలా మంది విసుక్కుంటుంటారు. కానీ, ఒక్కసారైనా లోతుగా అసలు సమస్య ఏంటి? మూలాలెక్కడున్నాయి? బాధ్యులెవరు? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకరు. ఈ దుస్థితికి రాజ్యాంగం పరిధిలో పనిచేసే అన్ని వ్యవస్థల బాధ్యతా ఉంది. ప్రభుత్వాన్నే తీసుకుంటే, జూనియర్ డాక్టర్లు లేవనెత్తుతున్న అంశాల్ని పరిష్కరించే చిత్తశుద్ధిని ప్రభుత్వం ఎప్పుడూ చూపలేదు. 2012 ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం నెరవేర్చాల్సిన అంశాలన్నీ అమలుకు నోచుకోకుండా అలాగే ఉన్నాయి. ప్రభుత్వానికి నేతృత్వం వహించే పార్టీలు మారుతున్నా ప్రభుత్వ వైఖరి మారటంలేదు. జూడాల వెనుక కొన్ని అదృశ్య శక్తులు ఉండి నడుపుతున్నాయంటున్న నేటి ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యమంత్రి డాక్టర్ రాజయ్య 2012లో ఇదే జూడాలు ఉద్యమించినపుడు వారికి అండగా వెనుక ఉన్న శక్తే! వారి డిమాండ్లు మారలేదు, కానీ, రాజయ్య స్థానం మారింది. జూడాలపై అత్యవసర సర్వీసుల చట్టం ప్రయోగిస్తామన్న నాటి సీఎంను ‘ఎస్మా’ రెడ్డి అన్న కె.చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ‘ఏమిటి జూడాల బెట్టు?’ అంటున్నారు. విపక్షంలో ఉన్నపుడు ఒకమాట, అధికారంలోకి రాగానే మరోమాట మాట్లాడటం రాజకీయ నేతలకు రివాజయింది. అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు జరిగినపుడు తెలంగాణ జర్నలిస్టుల పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ నిప్పులు చెరిగిన పెద్ద మనుషులు... గద్దెనెక్కాక అదే వేదికపై తాము జరిపించిన ‘మెట్రోపొలిస్’ సదస్సుకు జర్నలిస్టుల్ని రానీయలేదు. ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు, దీక్షలు చేయనీయట్లేదంటూ పెద్దఎత్తున సాగించిన ఆందోళనలతో 2009, డిసెంబర్ 9న పార్లమెంటులో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయించే వరకు తీసుకెళ్లిన తెరాస నాయకత్వం.. గద్దెనెక్కాక ఏంచేసింది? ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సమావే శాన్ని అడ్డుకుంది. ప్రజాస్వామ్య, పౌరసంఘాల నేతల్ని నిర్బంధించింది. కోట బయట ఒకగొంతు, కోట లోపల మరోగొంతు అనే ఈ వైఖరే ప్రస్తుత ప్రతిష్టం భనకు కారణం. సమస్య తీవ్రమైన ప్రతిసారీ జూడాలు డిమాండ్లు వెల్లడిస్తారు, నిరసన తెలుపుతారు, చివరకు సమ్మెకే దిగుతారు. ఏ దశలోనూ ప్రభుత్వం సయోధ్యకు యత్నించిన దాఖలాలుండవు. ‘‘సరే, మీరు సమ్మె చేయండి.

మేం ప్రజాప్రయోజనవ్యాజ్యం వేయించి విరమింపజేస్తాం’’ అని కొందరు ప్రభుత్వ పెద్దలే తమను రెచ్చగొట్టారని జూడా వర్గాలంటున్నాయి. ఇలాంటి ప్రతిష్టంభన ఏర్పడ్డ సందర్భాల్లో తలెత్తిన సంక్లిష్ట పరిస్థితుల నుంచి సంప్రదింపులు గట్టెక్కిం చాయి. అలాంటి సత్సంప్రదాయాలకు ప్రభుత్వాలు ఇటీవలి కాలంలో తిలోద కాలిచ్చాయి. ప్రభుత్వం వైపు నుంచి ఉన్నతాధికారులో, మంత్రులో తక్షణం జూడాలతో సంప్రదింపులు జరిపి ప్రజల ఇబ్బందుల్ని తొలగించాలి.

రుచిమరిగిన వ్యవహారం

సమస్య ఉంటే మా దృష్టికి తెండి, మేం పరిష్కరిస్తాం, ముందు సమ్మె విరమిం చండని హైకోర్టు పేర్కొన్న తర్వాత కూడా సమ్మె విరమించకపోవడం జూడాల మొండితనాన్ని వెల్లడిస్తోంది. రాజ్యాంగం, చట్టం, కడకు సమధర్మ ప్రాతిపదికన చూసినా, ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మె చేసే హక్కే లేదని సుప్రీం ధర్మాసనం (జస్టిస్ ఎం.బి.షా, జస్టిస్ ఎ.ఆర్ లక్ష్మణన్) ఒక కేసులో లోగడే స్పష్టం చేసింది. సమ్మె ప్రాథమిక హక్కు కాదు, అనివార్యమైన పరిస్థితుల్లో నిరసనను ప్రకటించే ఒక మార్గం మాత్రమేనని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో వెల్లడించింది. ఉమ్మ డి బేరసారాల ద్వారా లబ్ధిపొందే ఉద్దేశంతో సమ్మె చేసినా, రాజ్యాంగ అధికర ణం 19(1)లోని భావప్రకటనా స్వేచ్ఛను ఉదారంగా అన్వయించినా ఇది ప్రాథ మిక హక్కు కాజాలదనీ స్పష్టం చేసింది. అంతమాత్రాన సమ్మెను, సమ్మె చేస్తా మనే హెచ్చరికను చట్టవ్యతిరేక ఒత్తిడిగా పరిగణించలేమని కూడా సుప్రీం చెప్పింది. పారిశ్రామిక వివాదాల చట్టంలో సమ్మెకు తగిన నిర్వచనముందని, ‘‘సమ్మె చట్టబద్ధమైనా, కాకపోయినా... తమ సమస్యల పరిష్కారానికి అన్ని మార్గాలూ అన్వేషించి, కడకు సమ్మె చేస్తే అది చట్టబద్ధం కాకపోయినా న్యాయ సమ్మతమే’’ అని జస్టిస్ కృష్ణ అయ్యర్ అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలూ సమ్మె చేసే హక్కును గుర్తించాయని సుప్రీంకోర్టు లోగడ (1989 ఎస్‌సీ కేసెస్ 710) పేర్కొంది. విధిలేని పరిస్థితుల్లోనే తాము సమ్మెకు దిగామంటున్న జూడా ల వాదనను హైకోర్టు అంగీకరించడంలేదు. సమ్మె విరమించాలని కోర్టు చెప్పాక కూడా వారి వైఖరిలో మార్పులేకపోవడంతో ‘సమ్మె చేస్తున్నారా? రాజకీ యం చేస్తున్నారా?’ అనీ అది ప్రశ్నించింది. ఒక దశలో ‘ప్రభుత్వ బెదిరింపులకు లొం గేది లేదు, సమ్మె విరమించేది లేదు, ఏమున్నా ఇక ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుం టాం’ అన్న జూడాల ప్రకటన ఫక్తు రాజ కీయ వాసనతో కూడుకున్నదే!
 
బాధ్యత ప్రభుత్వానిదే...

జూనియర్ డాక్టర్లు చేస్తున్న వాదనలో కొంత పస ఉంది. 2012 జూడాల సమ్మెలో చివరకు ప్రభుత్వం దిగివచ్చి చర్చలు సాగించాక అంగీకారం కుదిరిం ది. హామీలు నెరవేరుస్తామని ప్రభుత్వం కోర్టుకు విన్నవించడంతో జూడాలు సమ్మె విరమించారు. ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు మెరుగుపరచాలని, స్టయిపెండ్ పెంచాలని, ప్రైవేటు వ్యక్తుల దాడుల నుంచి రక్షణకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని, లైబ్రరీలను అప్‌గ్రేడ్ చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో నివాస వసతి కల్పించాలని, తమను సర్వీసులోకి తీసుకొని గ్రామీణ సేవలకు నియోగించడంగానీ, సదరు సేవలకు ప్రత్యేకంగా సర్టిఫికెట్ ఇవ్వటం గానీ చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క గ్రామీణ సేవల అంశం మిన హా వీటికి సూత్రప్రాయంగా ప్రభుత్వం అంగీకరించింది. అవేవీ ఇప్పటి వరకూ అమలు పరచలేదని జూడాలంటారు. ‘అలాంటప్పుడు, న్యాయధిక్కారం కింద కోర్టును ఎందుకు సంప్రదించలేదు? ఎవరు అడ్డుకున్నారు?’ అని హైకోర్టు ప్రశ్న. జూడాల వద్ద సమాధానం లేదు. ఇతర మార్గాలకన్నా సమ్మె చేయడమే వారికి అలవాటయిందనే విమర్శ కూడా ఉంది. తమిళనాడు ప్రభుత్వం సమ్మె చేస్తున్న ఉద్యోగుల్ని పెద్ద సంఖ్యలో తొలగించిన కేసులో ఉద్యోగులకు సమ్మె చేసే హక్కు లేదని సుప్రీం ధర్మాసనం తీర్పిచ్చింది. ఆ తీర్పు సరైన న్యాయ స్ఫూర్తిని ప్రతిఫలించలేదంటూ జస్టిస్ కృష్ణ అయ్యర్ ఒక వ్యాఖ్య చేశారు. ‘ఇటు వంటి తీర్పును కూడా ప్రజల్లో ఒక వర్గం ఆహ్వానిస్తోందంటే, చీటికీమాటికీ సమ్మె చేస్తూ ఆ హక్కును దుర్వినియోగపరుస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం’ అన్నారాయన. ఇతర డిమాండ్లతోపాటు అయిదింట మూడు ప్రధాన డిమాం డ్లను అంగీకరించామని, ఉత్తర్వులు కూడా ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోం ది. గత అనుభవాల దృష్ట్యా జూడాలు నమ్మట్లేదు. కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వారి అనుమానం. కాబట్టి కార్యని ర్వాహక వ్యవస్థ కూడా సమస్యను జటిలం చేస్తున్నట్టు స్పష్టమౌతోంది. వైద్యశా ఖకు చెందిన ఒక ఉన్నతాధికారి తాజా పరిస్థితిపై విచిత్రమైన వ్యాఖ్య చేశారు. ‘జూడాల ఆందోళన వెనుక ఎవరున్నారో మాకు తెలుసు, తెలంగాణలోని తెరాస ప్రభుత్వాన్ని రకరకాలుగా ఇబ్బందులకు గురిచేసే క్రమంలో ఇదొక పార్శ్వం’ అన్న అధికారి స్వరం ఫక్తు రాజకీయ వైఖరినే ధ్వనిస్తోంది. తప్పు ఎవరు చేస్తు న్నా, శిక్ష మాత్రం సామాన్యులు అనుభవిస్తున్నారు. వైద్యం అందక అలమటిస్తు న్నారు. తీర్పును కోర్టు రిజర్వు చేయడంతో బంతి ఇప్పుడు ప్రభుత్వ కోర్టులో కొచ్చింది. ఇక అమాయక ప్రజలను కాపా డాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.     
 
 దిలీప్ రెడ్డి  సీనియర్ జర్నలిస్టు

http://img.sakshi.net/images/cms/2014-10/71414694422_Unknown.jpg
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement