కొత్త ఆశలతో సరికొత్త యేడాదిలోకి... ఆశే మనిషిని ముందుకు నడిపే చోధకశక్తి! అదే లేకుంటే, ఎప్పుడూ ఏదో ఒక నిస్సత్తువ ఆవహించి బతుకును దుర్భరం చేయడం ఖాయం! అగణిత కాలగమనంలో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు... మనం కల్పించుకున్న విభజనరేఖలే అయినా... ఒక్కొక్క గీత దాటుతున్నపుడు ఒక్కో రకమైన భావన, అనుభూతి సహజం! అదే సరికొత్త ఆశలకు ప్రేరణ! రెండు సంవత్సరాల నడిమధ్య నిలబడ్డ ఈ సంధి వేళ... విస్తృతమైన చర్చ సాగుతోంది. ముఖ్యంగా గత ఏడాది పొడుగూ మనిషి మనుగడను శాసిస్తూ, ప్రతి పార్శా్వన్నీ తడుముతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన కోవిడ్–19 ఇవాళ చర్చనీయాంశమై ప్రతినోటా నాను తోంది. కొత్త ఏడాదిలోకి... అనే ఆనందం కన్నా ఓ పీడకలలాంటి 2020 ముగిసిందనే సంతోషమే ఎక్కువ అని కొందరు. ఎట్లయితేనేం, ఓ యేడాది భారంగా గడిచిపోయింది.
వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్న, తెస్తున్న కొత్త సంవత్సరం 2021 మన ఆశల పేటి! అని మురిసేది మరికొందరు. రెండు భావనలూ సహేతుకమే! మనిషి ఆశాజీవి అనడానికిదో తాజా ఉదాహరణ! ప్రతి ప్రకృతి విలయం నుంచి, దౌర్భాగ్య పరిస్థితి నుంచీ ఎంతోకొంత సానుకూలతను తీసు కోగలిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఇది మానవేతిహాసం ఎన్నో మార్లు రుజువుచేసిన సత్యం! ఇప్పుడా సందర్భం వచ్చిందని, ఇంత దయనీయ పరిస్థితుల్లో కూడా మనం నేర్చుకోగలిగే, నేర్చుకోదగ్గ గుణపాఠాలు చాలానే ఉన్నాయనేది మేధావుల విశ్లేషణ. సామాజిక మాధ్యమాల్లో సంప్రదాయ మీడియాలో కూడా ‘2020 మనకేమైనా నేర్పిందంటే..?’ అనే కథలు, కథనాలు, వ్యాస పరంపర పుంఖాను పుంఖాలుగా వస్తోంది. కరోనా సృష్టించిన అలజడి, చేసిన నష్టం అంతా ఇంతా కాదు. చైనాలో పుట్టి, ఏడాది కాలంలోనే ఏతా వాతా 218 దేశాలను చుట్టుముట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 8.32 కోట్ల మందికి వ్యాధి సోకగా 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇంతటి విలయం సృష్టించిన మహమ్మారి నేర్పేదేమిటి? ఒనగూర్చిన మంచి ఏముంటుంది? అనే ప్రశ్న తలెత్తవచ్చు! కానీ, నిరంతర పరిశో ధకుడైన మనిషి, ప్రతి ప్రతికూలతనూ అధిగమించే క్రమంలో పోరాటం చేస్తాడు. ఈ మధనంలో కొన్ని సానుకూలతలనూ సాధి స్తాడు. ఎంతో కొంత కలిసొచ్చిన మంచి అటువంటిదే! పర్యావర ణంలో వచ్చిన అనూహ్య పరిణామాలైనా, ఆటోమేషన్ అయినా, ఆరోగ్య సంరక్షణ–జీవనశైలి మార్పులైనా, స్వయంసమృద్ధి యత్నా లైనా, రాజకీయ పరిష్కారాలైనా.. జాగ్రత్తగా గమనించి, మేలైన అంశాల్ని తెలివిగా శాశ్వతీకరించుకుంటే మానవాభ్యున్నతికి తక్షణ, భవిష్యత్తు ప్రయోజనాలుంటాయి. కానీ, కుక్క తోక వంకర అన్న చందంగా ఏవో సాకులు చూపి, పాత పెడదారుల్లోనే సాగితే మరింత ప్రమాదం తప్పదు. కొన్ని విషయాల్లో ఇప్పుడదే జరుగుతోంది.
ఒక దృశ్యం కనబడి... కనుమరుగవుతోంది!
కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రపంచం ‘లాక్‌డౌన్’ విధించుకొని మునగదీసుకుంది. మానవ ప్రేరిత కార్యకలాపాలు చాలావరకు స్తంభించాయి. జూలై మాసాంతం వరకూ ఇది ప్రభావం చూపింది. ఫ్యాక్టరీలు, కంపెనీలు పనిచేయక, నిర్మాణాలు ఆగి, వాహన రాకపోకలు నిలిచిపోవడంతో పర్యావరణపరంగా మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎన్నెన్నో నగరాల్లో వాయు నాణ్యత పెరిగి నట్టు, శబ్ద–నీటి కాలుష్యాలు తగ్గినట్టు అధ్యయన నివేదికలొచ్చాయి. కర్బన ఉద్గారాలు రమారమి తగ్గాయి. వన్యప్రాణులు, అటవీ జంతు వులు స్వేచ్ఛగా తిరుగాడిన వార్తలు–ఫొటోలొచ్చాయి.
పక్షుల కిల కిలలు పట్టణాల్లోనూ వినిపించాయి. వందల కిలోమీటర్ల దూరం వరకు హిమాలయాలు కనిపించాయి. చాలాచోట్ల భూమ్యావరణ స్థితి మెరు గయింది. ఆర్థిక పునరుద్ధరణ కోసం మళ్లీ మానవ కార్యకలా పాలు పెంచడంతోటే కాలుష్యపు జాడలు పెరిగాయి. ఉత్పత్తి జరుగొ ద్దని, నిర్మాణాలు–ప్రయాణాలు ఉండొద్దని ఈ వాదనకు అర్థం కాదు. ప్రకృతితో మన సహజీవన విధానాన్ని పునర్నిర్వచించుకోవాల్సిన గుణపాఠమిది! సుస్థిరాభివృద్ధి సాధనకు దీన్నొక నమూనాగా తీసు కోవాలి. కానీ, నేర్చుకున్న జాడలు లేవు! కరోనా మిష చూపి, ఆర్థిక పునరుద్ధరణ వేగంగా జరగాలనే వంకతో... చట్టాలను, నిబంధనల్ని గాలికొదులుతున్నారు.
తాజా చర్యలు, పరిణామాలతో పర్యావరణ ముప్పు రెట్టింపవుతోంది. పలు రాష్ట్రాల్లో కార్మిక చట్టాలను సస్పెండ్ చేయడం ఈ దురాగతాల్లో భాగమే! కంపెనీలు, కర్మాగారాల ఆగ డాలకు ద్వారాలు తెరచినట్టే! భౌతిక దూరం పాటించేందుకు ప్రజా రవాణా సరిపడదనే భావనతో వ్యక్తిగత వాహనాల జోరు పెరిగి వాయుకాలుష్యం మరింత హెచ్చింది. విపత్తులోనూ లభించిన సాను కూలతను విచక్షణారహితంగా గండికొడితే తలెత్తిన తాజా ప్రతికూలత లివి! కరోనా ముందరి వాతావరణం కన్నా ప్రమాదకరంగా మారే ఆస్కారముంది.
దూసుకొచ్చిన యాంత్రీకరణ–కృత్రిమ మేధ!
శాస్త్ర సాంకేతిక రంగం అనుకున్నదానికన్నా వేగంగా మనిషి నిత్య జీవితంలో యాంత్రీకరణ పెరిగింది. కృత్రిమ మేధ (ఏఐ) విరివిగా వినియోగిస్తున్నారు. ఒకరకంగా కోవిడ్–19 బలవంతపెట్టిన పరిణా మమిది. కృత్రిమ మేధను అనుసంధానం చేసిన కార్లు, డ్రోన్స్, రోబోల వినియోగం ఇప్పటికే పెంచారు. వైరస్ వ్యాప్తిని నివారించేలా మనిషికి–మనిషి తగలకుండా, భౌతిక దూరం పాటిం చేందుకు ఉపక రించే సాధనాలయ్యాయి. కనబడని మారీచునితో యుద్ధం వంటి ఈ మాయా వైరస్‌లతో పోరులో ఒకరకంగా ఇవి అనివార్యమయ్యాయి. 2030 నాటికి 30–40 శాతం ఉద్యోగాలు యంత్రాలు–ఏఐతోనే అనే అంచనా ఒకటుంది. ఇంటి నుంచే పని (డబ్ల్యూఎఫ్‌హెచ్) విధానం ప్రస్తుత విపత్కాలంలో విస్తృతమైంది. మంచి ఫలితాలు కూడా వచ్చాయి.
సింగపూర్, హాంకాంగ్ వంటి విశ్వనగరాల్లోనూ ఇది స్పష్టంగా కనిపించింది. ప్రపంచస్థాయి గల ఒక ఐటీ కంపెనీ అధ్యయనం ప్రకారం, ఇంటి నుంచి పని వల్ల 17 శాతం ఉత్పత్తి పెరి గింది. కరోనా అనంతర కాలంలోనూ ఈ పద్దతిని ఎంతో కొంత మేర శాశ్వతీకరిస్తూ పలు కంపెనీలు బడ్జెట్లు రూపొందించుకుంటున్నాయి. ఉభయ ప్రయోజనకరంగా... ఉద్యోగుల ప్రయాణాల్లో సమయాన్ని, కార్యాలయ నిర్వహణ వ్యయాన్నీ నియంత్రించుకునే సానుకూలాం శమైంది. కొరోనా దెబ్బకు అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిగా తగ్గి పోయాయి.
ప్రపంచ ప్రయాణ–పర్యాటక మండలి (డబ్ల్యూటీటీసీ) అధ్యయనం ప్రకారం 3.9 శాతం వృద్ధితో, ఉత్పాదక రంగం తర్వాత వేగవంతమైన వృద్ధి నమోదు చేసిన ఈ రంగం కోవిడ్–19తో కుదే లయింది. వెబినార్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు అతి సాధారణమ య్యాయి. వైద్యులు–రోగులు ప్రత్యక్షంగా కలుసుకోనవసరం లేకుండా చేపడుతున్న ‘టెలిమెడిసిన్’ విధానం, ఒక అనువైన చికిత్స పరిష్కారం అయింది. ఆరోగ్య భద్రత పథకాల కింద ప్రభుత్వ యంత్రాంగం దీన్నొక సాధనంగా మలచుకొని, గ్రామీణ ప్రాంతాలకు ఆధునిక వైద్య సదుపాయాల్ని విస్తరించవచ్చు. రోగుల్లో కొత్త నమ్మకం పెంచే వీలుంటుంది.
స్వయం సమృద్ధి–జీవనశైలి!
ప్రపంచీకరణ–విశ్వవిపణి విధానం ఆచరణలోకి వచ్చిన తర్వాత మొదటిసారి అందుకు విరుద్ధ పరిస్థితి కోవిడ్–19తో తలెత్తింది. గ్లోబలీకరణతో బలపడ్డ ‘బల్లపరుపు ప్రపంచమ’నే మార్కెట్ వాదన కరోనా దెబ్బకు తల్లకిందులయింది. ఏకీకృత మార్కెట్‌తో ఇన్నాళ్లు ఆహారం, వస్తు–సేవలు ఎక్కడపడితే అక్కడ విస్తారంగా లభించేవి. దేశాల మధ్య పరస్పరాధార మార్కెట్ నమూనా వృద్ధిచెందింది. నాణ్యమైన వస్తు–సేవలు ప్రపంచం ఏ మూలన ఉన్నా అక్కడ్నుంచి ఎవరైనా యథేచ్ఛగా పొందగలిగే వారు. అమెరికా–చైనా ఇందుకు ఓ పెద్ద ఉదాహరణ! ఈ యేడు పరిస్థితి మారింది. విమానాలు రెక్కలు ముదురుకొని, దేశ సరిహద్దులకు తాళాలు పడ్డపుడు... ఎవరి ఆహారం, వస్తువులు, సేవల్ని వారే సమకూర్చుకోవాల్సి వచ్చింది. స్వయం సమృద్ధి అవసరం అందరికీ తెలిసివచ్చింది. ఆహార ఉత్పత్తి విషయం లోనే కాకుండా, ఆహార సరఫరా శృంఖలాల్లోనూ పెనుమార్పులు అని వార్యమయ్యాయి. ఇక మనుషుల జీవన శైలిలోనూ కరోనా ఎన్నో మార్పులు తెచ్చింది.
పెళ్లయినా, చావయినా ఇక హంగూ ఆర్భాటాలు, డాబూ–దర్పం ప్రదర్శించలేని ప్రతిబంధకాల్ని అది సృష్టించింది. పేద, అల్పాదాయవర్గాలకు ఇదొక రకంగా మేలే చేసింది. కొందరి ఇళ్లలో పెళ్లిళ్లంటే, జుగుప్సాకర సంపద ప్రదర్శనకు వేదికల్లా ఉండేవి. ఈ ఒక్క విషయంలోనే కాకుండా.... దైనందిన జీవితానికి సంబం ధించిన చాలా అంశాల్లో కనీసాలతో సరిపెట్టుకునే జీవన విధానాన్ని కరోనా నేర్పింది. వ్యక్తిగత పరిశుభ్రత, గృహ–పరిసరాల్లో పారిశుధ్యం ప్రాముఖ్యత అందరికీ తెలిసి వచ్చింది. 2003 ‘సార్స్’ వైరస్ విజృం భణ తర్వాత శానిటైజర్, మాస్క్ జపాన్‌లో అతి సాధారణమ య్యాయి. సదరు ప్రొటోకాల్ అందరికీ ఒక జీవనశైలిగా అలవడింది. అటువంటి పరిస్థితులు ఇప్పుడు అంతటా విస్తరించాయి. తిండి పద్ధతులు మార్చుకుంటున్నారు. జంక్ ఫుడ్స్ కాకుండా, రోగనిరోధక శక్తినిచ్చే ఆహారపదార్థాల పైన, సంప్రదాయ జీవనశైలి పైన దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కరోనా తెచ్చిన సానుకూలమైన మార్పే ఇది!
రాజకీయ మార్పులకు... రంగస్థలం కావాలి
కరోనా మహమ్మారి సమస్త ప్రజల దృష్టిని తనవైపు మళ్లించిన సంద ర్భాన్ని రాజకీయ, పాలనా వ్యవస్థలు తమకనుకూలంగా మలచుకు న్నాయి. ప్రజలకిది కంటకంగా మారింది. ఇలా ప్రపంచంలోని చాలా దేశాల్లో జరిగింది. కరోనా మార్గదర్శకాల ముసుగులోనో, లాక్‌డౌన్ నీడలోనో, ఆర్థిక పునరుద్ధరణ సాకుతోనో నియంతృత్వ పాలకులు ప్రజాస్వామ్య ప్రక్రియని నిర్వీర్యపరచిన ఉదంతాలున్నాయి. ప్రజల్ని వంచించారు. పౌరహక్కుల్ని పలుచన చేయడం, కార్మిక చట్టాలను నీరుగార్చడం, కార్పొరేట్ శక్తులకు తివాచీలు పరవడం వంటి చర్య లకు ఆయా ప్రభుత్వాలు పూనుకున్నాయి.
మన దేశంలోనూ ఇటు వంటివి జరిగాయి. కరోనా కడగండ్లతో దేశం కుదేలయినపుడు.. వ్యూహాత్మకమైనవి తప్ప పబ్లిక్‌రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటు పరంచేయాలనే కేంద్ర మంత్రివర్గ నిర్ణయం, కొన్ని రాష్ట్రాల్లో కార్మిక చట్టాల సస్పెన్షన్ వంటివి ప్రజల్ని విస్మయపరిచాయి! ఒక వంక కరోనా... మరో వంక ప్రజా ఉద్యమాలతో 2020 అట్టుడికింది. నాటి షాహిన్‌బాగ్ బైటాయింపు నుంచి నేటి సింఘిలో తిష్టవేసిన రైతు ఉద్యమం వరకు ప్రజాందోళనలు వేడి రగిలించాయి. ప్రభుత్వం దిగి వచ్చి, వ్యవసాయ కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతాంగం అభిప్రా యాల్ని గౌరవించడం పెనుమార్పు! ప్రజాస్వామ్య పాలనలో చర్చల తోనే ప్రతిష్టంభనలు తొలగుతాయన్న గ్రహింపు, ముక్తాయింపు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన కొంగ్రొత్త ఆశ! ఇదే ప్రజాస్వామ్య వాదుల ఆకాంక్ష!!
దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment