డేటా చోరీ.. గోప్యతకు గోరీ | Dileep Reddy Guest Column On Personal Information Security | Sakshi
Sakshi News home page

డేటా చోరీ.. గోప్యతకు గోరీ

Published Fri, Jan 22 2021 12:27 AM | Last Updated on Fri, Jan 22 2021 6:37 PM

Dileep Reddy Guest Column On Personal Information Security - Sakshi

వ్యక్తిగత సమాచార భద్రత! ‘అబ్బో! అది దుర్వినియోగమైతే ఎలా...?’ మన సమాజం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సదరు ప్రాధాన్యతను నిజంగా గుర్తించిందా? ఏమో! పరస్పర సందేశాల మార్పు ఉపకరణం (మెసే జింగ్‌ యాప్‌) ‘వాట్సాప్‌’ను మునివేళ్లపై నిలిపి, నిర్ణయాన్ని వాయిదా వేసుకునేలా చేసిందంటే నిజమేనేమో! అనిపిస్తుంది. ‘ఫలానా తేదీ లోపు మా కొత్త గోప్యతా విధానానికి అంగీకారం తెలపండి లేదా సేవల నుంచి వైదొలగండి’ అన్న వాట్సాప్, భారతీయుల్లో పెల్లుబికిన వ్యతిరేకత దెబ్బకు వెనక్కి తగ్గింది. వాయిదాతో తన ప్రతిపాదన మూడు నెలలు వెనక్కి నెట్టింది.

‘మీ సమాచార వివరాలు చూడబోము, వాడబోము’ అని వినియోగ దారుల్ని నమ్మించే కాళ్లబేరానికొచ్చింది. ఎందుకంటే, 40 కోట్ల అకౌంట్లతో ఈ దేశంలో తనకున్న అతి పెద్ద మార్కెట్‌ పడిపోతే ఎలా? భయం! తాజా ప్రతిపాదన నచ్చక లక్షలాదిమంది వేగంగా ‘సిగ్నల్‌’ ‘టెలిగ్రామ్‌’ వంటి ప్రత్యామ్నాయ యాప్‌లకు దారి మళ్లడంతో జడు సుకుంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి నిద్రమత్తు వదిలినట్టు లేచి, వాట్సాప్‌ను ప్రశ్నావళితో గద్దిస్తోంది. అసలు మీ విధానమేంటి? మా పౌరుల నుంచి మీరేం సమాచారం సేకరిస్తున్నారు? ఇక్కడ–యూర ప్‌లో తేడాలెందుకు? అని ప్రశ్నలు సంధిస్తోంది. గోప్యత విధానంలో మార్పులేమీ తేకండి అంటోంది. వాట్సాప్‌ ప్రతిపాదన వాయిదా పడిందే తప్ప సమస్య తొలగిపోలేదు. ప్రమాదం నిరంతరం పొంచి ఉంటుందన్నది నిజం.

సామాజిక మాధ్యమాలన్నింటితోనూ ఈ ప్రమాదం ఉంది, ఉంటుంది. తమ వినియోగదారుల నుంచి వేర్వేరు రూపాల్లో సేకరించే, పొందే, నిల్వ చేసే, అనుసంధానమయ్యే వ్యక్తిగత సమాచారం వారి వద్ద ‘డాటా’గా నిక్షిప్తం అవుతుంది. దాన్ని వారు గోప్యంగా ఉంచాలి. ఉంచుతు న్నామనే చెబుతారు. కానీ, ఉంచరు. వేర్వేరు వ్యాపార అవసరాలకు తామే వాడినట్టు, వ్యాపార ప్రయోజ నాలున్న మూడో పక్షానికి అమ్ముకున్నట్టు చాలా సార్లు వెల్లడయింది. ఇప్పుడదే పెద్ద సమస్య! అది తప్పించాలంటే పౌరుల వ్యక్తిగత సమాచారానికి ప్రభుత్వ పరమైన భద్రత కావాలి. చట్టపరమైన రక్షణ ఏర్పడాలి. దానికి కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ‘వ్యక్తిగత సమా చార రక్షణ చట్టం’ (పీడీపీ) పకడ్బందిగా ఉండాలి. తగిన నిఘా, నియంత్రణ వ్యవస్థలతోనే వ్యక్తిగత సమాచార దోపిడీ, దుర్వినియో గానికి కళ్లెం వేయగలం.

ఉచిత సేవ, ధనార్జన యావ!
ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక ప్రపంచ గతి మారింది. కమ్యూని కేషన్‌ రంగంలో శాస్త్ర–సాంకేతిక విప్లవమే వచ్చింది. ఎన్నో విధాలుగా సమాచారం సేకరించడం, ప్రోదిచేయడం, మార్పిడి చేయడం నుంచి  క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపరిమితంగా, గోప్యంగా దాచిపెట్టడం వరకు ఆశ్చర్యకరమైన పరిణామాలొచ్చాయి. దొంగచాటుగా, బహిరంగంగా అమ్ముకోవడమూ రివాజయింది. డిజిటల్‌ ఎకానమీలో ఇదే ఓ ఇంధన మైంది. ఈ–కామర్స్‌కు రాచబాట పడింది. క్షణాల్లో సమాచార మార్పిడి జరిగిపోతోంది. వ్యాపార–వాణిజ్య వ్యవహారాల్లో పెను మార్పులకు వాకిళ్లు తెరుచు కున్నాయి. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్, గూగుల్‌... ఇలా ఎన్నెన్నో వైవిధ్యభరిత ఉపకరణాలొచ్చాయి. ఈ– కామర్స్‌ ప్రక్రియలో మెసేజింగ్‌ యాప్‌లూ బలపడ్డాయి.

కరోనా మహమ్మారి మనుషుల భౌతిక కదలికల్ని కట్టడి చేసిన దరిమిళా.. వస్తు, సేవల రంగంలో ‘ఆన్‌లైన్‌’ ఒక కీలక ప్రక్రియ అయిపోయింది. అంతకు ముందునుంచే సామాజిక మాధ్యమ వేదికలతో కోట్లమంది అనుసంధానమయ్యారు. వారెవరు, ఎక్కడివారు, ఎంత వయసు, ఏం చేస్తుంటారు, ఆదాయమెంత, వ్యయమెంత, అభిరుచులేంటి, వ్యవహా రాలేంటి... ఒక్కటేమిటి? వారికి సంబంధించిన సమస్త సమాచారం ఆయా యాప్‌లలోకి చేరుతోంది. ఇంకోరకంగా చెప్పాలంటే, మనమే.. వారిని ఆహ్వానించడమే కాక చొచ్చుకు వచ్చేంత చనువిచ్చాం. నిజానికి ఈ సమాచారమంతా వారు గోప్యంగా ఉంచాలి. నిర్దేశించిన అవసరానికే వినియోగించాలి. అలా కాకుండా వేర్వేరు వ్యాపార సంస్థలకు విక్రయిస్తు న్నారు.

ఆయా కంపెనీల వ్యాపార వృద్ధికి తోడ్పడే వాణిజ్య ప్రకటనలు చేర్చడానికి, భావజాల వ్యాప్తికి, ఆలోచనా సరళిని ప్రభా వితం చేయడానికీ... ఇలా ఎన్నో వ్యాపార, కొన్ని చోట్ల రాజకీయ అవసరాలకు పౌరుల వ్యక్తిగత గోప్య సమాచారాన్ని వాడుకుంటున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, గూగుల్‌ వంటివి రుసుమేమీ తీసుకోకుండా ఉచిత సేవలు అందిస్తున్నట్టే ఉంటుంది. కానీ, తమ విని యోగదారుల సమాచారాన్ని అందివ్వడం–అమ్ముకోవడం ద్వారా వస్తోత్పత్తి, సేవా విక్రయ సంస్థల నుంచి పెద్దమొత్తాల్లో వారు డబ్బు గడిస్తున్నారు. ఇదో పెద్ద వ్యాపారం. సదరు యాప్‌ సంస్థలు పౌరుల వ్యక్తిగత ఉనికి వివరాలే కాకుండా ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనల్లోకి చొరబడటంతో సగటు మనిషి వ్యక్తిగత సమాచారం అంగడి వస్తువయింది. ప్రతొక్కరి బతుకు వాల్‌పోస్టరయింది.

వాట్సాప్‌ గగుర్పాటే సాక్ష్యం!
సమాచార గోప్యత విషయంలో వాట్సాప్‌ కొత్త ప్రతిపాదన ఏక పక్షంగా ఉన్నందున నిలిపివేయాలన్న ఒక అడ్వకేటు పిటిషన్‌ విచా రిస్తూ డిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘అది ప్రయివేటు యాప్, మీ సమాచారానికి భద్రత లేదనుకుంటే అక్కడ్నుంచి తొలగించండి, వారి సేవల నుంచి మీరు తొలగిపోండి, భద్రత ఉన్న వేరే యాప్‌కు మారండి’ అని జస్టిస్‌ సంజయ్‌ సచ్‌దేవ్‌ అన్నారు. అదంత చిన్న విషయమా? కోట్ల మందికి సంబంధించిన అంశం. తమ వద్ద వినియోగదారుల సమాచారం ‘తొలికొస నుంచి కడకొస దాకా’ గోప్యమే! అని హామీ ఇస్తాయి. ఈ హామీకి ఎందుకు కట్టుబడవు? అన్నది మౌలిక ప్రశ్న. తమ కొత్త విధానానికి అంగీకారం తెలపండి అని వాట్సాప్‌ ప్రకటించాక వారం (జనవరి5–11)లోనే ప్రత్యా మ్నాయ యాప్‌ ‘సిగ్నల్‌‘ను దేశంలో 33 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసు కున్నారు. అదే వారంలో వాట్సాప్‌ డౌన్‌లోడ్‌లు 39 శాతం తగ్గాయి.

దేశంలో ప్రతి నాలుగో వ్యక్తి వాట్సాప్‌ వినియోగదారుడే! వారు జారి పోతున్న ఆ వేగం చూసి వాట్సాప్‌ జడుసుకుంది. సత్వర దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఏ ప్రయోజనాలు లేకుంటే ఇంత దేబిరింపు దేనికి? నిజానికి వారి ఉద్దేశం కొత్త గోప్యత నిబంధనల ప్రకారం తాము సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకోవడానికి వినియోగదారులు సమ్మతించడం. సమ్మతిలేని వారు వైదొలగడం. ఫేస్‌బుక్‌ ఇక యథేచ్చగా సదరు సమాచారాన్ని తన, తన ఒప్పంద వ్యాపార సంస్థలు స్వేచ్ఛగా విని యోగించుకోవడం. వాణిజ్య ప్రకటనల ఆదాయాన్ని పెంచుకోవడం. ఉభయత్రా లాభం! ఇదీ తలంపు.

కానీ, ఇప్పుడిస్తున్న తాజా వివరణ ప్రకారం కేవలం వ్యాపార అకౌంట్ల విషయంలో తప్ప సాధారణ పౌరుల వ్యక్తిగత సమాచారం, కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, ప్రేమికులు వంటి వారి సంభాషణల జోలికి రామంటున్నారు. అసలు అలాంటి డాటాను మేం చూడం, వాడం అని నమ్మబలుకు తోంది. కానీ, పౌరులకు అనుమానాలు న్నాయి. ఆ భయ–సందేహాలతో ఇవాళ పౌరులు ప్రత్యామ్నాయ ‘యాప్‌’లకు వెళ్లవచ్చు! కానీ, రేపు ఏదో రోజు అదే ఫేస్‌బుకో, మరో పోటీదారో ప్రత్యామ్నాయ యాప్‌లను కొనరని, మంచి ధర పలికితే అవి మాత్రం అమ్ముడు పోవని గ్యారెంటీ లేదు. వ్యక్తిగత సమాచారం చౌర్యానికి గురయ్యే ప్రమాద ఆస్కారం నుంచి పౌరులకు శాశ్వత రక్షణ కావాలి.

సర్కార్‌పై కన్నేయాల్సిందే!
వ్యక్తిగత సమాచార దుర్వినియోగ ప్రమాదంపై మెసేజింగ్‌ యాప్‌ల పట్ల పౌరులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రభుత్వాల పట్ల కూడా అంతే అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం అధికారికంగా సేకరించిన ఆధార్‌ సమాచారం లోగడ దుర్వినియోగమైన సందర్భాలెన్నో వెలుగు చూశాయి. పౌరుల ఫోన్‌ నంబర్ల సమాచారాన్ని పదిహేడు పైసల చొప్పున అమ్ముకున్న నీచ ఘటనలున్నాయి. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం గత సంవత్సరం విస్పష్టంగా తేల్చి చెప్పే వరకు వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే కాదని కేంద్ర ప్రభుత్వం భావించిన, వాదించిన దేశం మనది. పౌరుల హక్కుల కన్నా కార్పొరేట్ల వ్యాపార ప్రయోజనాలకు పెద్దపీట వేసే సర్కార్ల ఎత్తుల్ని పసిగట్టాల్సిందే! వ్యక్తిగత సమాచార భద్రత పేరిట ఇప్పుడు తీసుకురానున్న పీడీపీ చట్టం ఎంత పకడ్బందీ అన్నదీ కాపెట్టుకొని ఉండాలి.

ఎందుకంటే, గత శీతాకాల సమావేశాల్లోనే ముసాయిదాను పార్లమెంటు ముందుకు తెచ్చినా, అభ్యంతరాల నడుమ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపారు. అధికార భాజపా ఎంపీ మీనాక్షీ లేకీ నేతృత్వం లోని జేపీసీ సంప్రదింపుల ప్రక్రియ ముగించి, చట్టం పేరుతో సహా 89 సవరణలతో తుది ముసాయిదాను ఇటీవలే సిద్ధం చేసింది. రానున్న బడ్జెట్‌ సమావేశాల్లో ఆమోదింపచేయాలన్నది తలంపు. ప్రయివేటు యాప్‌ల నుంచి, సామాజిక మాధ్యమాల నుంచి పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత అనే వంకతో సదరు సమాచారాన్ని కేంద్రం తన గుప్పెట్లోకి, నియంత్రణలోకి తెచ్చుకునేలా ముసాయిదా ఉందనే విమ ర్శలున్నాయి. అప్పుడది, రాజ్యాంగం పౌరులకు కల్పించిన వ్యక్తిగత సమాచార గోప్యతా హక్కుకే భంగకరం! వ్యక్తిగత–వ్యక్తిగతం కాని సమాచారాన్ని నిర్వచించడమైనా, సదరు డాటా సేకరణ–నిర్వహణ– నిలువ–వినియోగం, దుర్వినియోగ నియంత్రణ, భద్రత వంటి విషయాల్లో ఎటువంటి చట్టరక్షణ కల్పిస్తారన్నది ముఖ్యం. నిన్నటి వాట్సాప్‌ ఎత్తుగడైనా, రేపు మరే ఆన్‌లైన్‌ యాప్‌ నిర్వహకులో చేసే లోపాయికారి ప్రతిపాదనలనైనా.. ఈ చట్టం ఎలా నిలువరిస్తుంది? అన్నది చట్టరూపకల్పనను బట్టే ఉంటుంది. అందుకే, ప్రజాప్రతి నిధులు, పౌర సమాజం అప్రమత్తంగా ఉండాలి.

రెండు నియంత్రణలూ ఉండాలి
చట్టం ఒక్కటే సరిపోదు. గట్టి చట్టం అమల్లోకి వచ్చాక ఏర్పాటయ్యే రక్షణ ప్రాధికార సంస్థ, నియంత్రణ వ్యవస్థ పనితీరు ముఖ్యం. నిఘా –నియంత్రణ వ్యవస్థలు గోప్యత ఉల్లంఘనలకు ప్రతిస్పందించడమే కాకుండా ముందస్తు నివారణా వైఖరితో పనిచేయాలి. చట్టాలు చేసే– ఉల్లంఘించే వారి మధ్య పిల్లి–ఎలుక ఆట ఎప్పుడూ ఉంటుంది. ఒక నిబంధన తమని అడ్డగిస్తే, దాన్ని అధిగమించి పని కానిచ్చుకునే సాంకేతికతను నేరబుద్ది కలిగిన సంస్థలు  సృష్టించుకుంటాయి. ఇదొక చక్రీయ ప్రక్రియ. పౌరులు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. ఉచితంగా వస్తుందంటే చాలు, ఏ ఆధునిక సదుపాయమైనా నిబంధ నలు చదువకుండానే గుడ్డిగా సమ్మతి తెలుపడం మానుకోవాలి. అవసరం ఉన్నా, లేకున్నా వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని ఎక్కడపడితే అక్కడ పంచుకునే అలవాట్లను తగ్గించుకోవాలి. తెలిసో తెలియకో.. కనీస గోప్యత లేకుండా సొంత జీవితాన్ని ఎంతగా బజారుకీడ్చుకుంటున్నామో... కొంచెం ఇంగితంతో వ్యవహరిస్తేనే మనకూ, సమాజానికీ మంచిది.


దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement