విభజన రేఖ చెరపవద్దు | Dileep Reddy Article On Performance Of Constitutional Institutions | Sakshi
Sakshi News home page

విభజన రేఖ చెరపవద్దు

Published Fri, Aug 21 2020 12:45 AM | Last Updated on Fri, Aug 21 2020 3:36 AM

Dileep Reddy Article On Performance Of Constitutional Institutions - Sakshi

ప్రశ్న, నిరసన... వీటి గొంతు నులిమితే న్యాయవ్యవస్థకే కాదు మొత్తం ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అన్యాయాలపై ఇక గొంతెత్తే వారే ఉండరు. భయంతో ఏ గొంతులూ పెగలకుంటే అరిష్టాలకు అడ్డూ అదుపుండదు. అప్పుడు వ్యవస్థలన్నీ గతి తప్పుతాయి. అరాచకం రాజ్యమేలుతుంది. ఇంతటి తీవ్ర ప్రమాదం ముంచుకు రాకుండా పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు రక్షణ ఉండాలి. సద్విమర్శకు తావుండాలి. కోర్టుల పరువు, ప్రతిష్టలు నిల వాలి. ప్రజాస్వామ్యపు వివిధ అంగాల మధ్య సంఘర్షణ తుది ఫలితం మధ్యేమార్గం, ఉభయతారకంగా ఉండాలి. అంతే తప్ప, ఒకదాని కోసం మరోటి బలిపెట్టకూడదు. కోర్టుల పరువు నిలపాలనే తొందర పాటులో పౌరహక్కుల్ని కాలరాయొద్దు. పౌరహక్కుల పేరిట వ్యవస్థల గౌరవాన్ని నేరపూరితంగా నేలకు దించొద్దు. ప్రముఖ న్యాయవాది, హక్కుల కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్‌ను కోర్టు ధిక్కారం కేసులో దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిన కేసు గురువారం కొత్త మలుపు తిరి గింది. శిక్ష ఖరారు చేయాల్సిన వేళ తాజా పరిణామాలు చోటుచేసుకు న్నాయి. ట్వీట్‌లలో చేసిన వ్యాఖ్యల పునరాలోచనకు రెండు, మూడు రోజులు సమయం ఇస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.

తప్పు గ్రహించి, పశ్చాత్తాపం ప్రకటిస్తే తప్ప శిక్ష విషయంలో మరో అభి ప్రాయానికి తావు లేదంది. తన అభిప్రాయంలో మార్పు లేదని, తానా వ్యాఖ్యలు పూర్తి ప్రజ్ఞతోనే చేసినందున పునరాలోచన ఉండబోదని భూషణ్‌ నిర్ద్వంద్వంగా చెప్పారు. తీర్పు తనను కలతకు గురిచేసిందని, శిక్ష గురించి కాదు, న్యాయస్థానం తనను తప్పుగా అర్థం చేసుకుందని, దురుద్దేశ్యాలు ఆపాదించి ఆధారాలు చూపకుండానే దోషిగా తేల్చడం బాధించిందనీ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ ఒక కేసులో కోర్టు ముందు వెల్లడించిన భావాల్ని గుర్తుచేస్తూ ‘దయ చూపమని అడ గను, ఉదారత కోసం కోరను.. ప్రజాస్వామ్య పరిరక్షణకు బహిరంగ విమర్శ తప్పనిసరి అని భావించా, బాధ్యతగానే వ్యాఖ్యలు చేశాను. ఏ శిక్షకైనా సిద్ధమే’ అని తెలిపారు. తదుపరి నిర్ణయం ఇక కోర్టుదే! దేశ వ్యాప్తంగా ఈ అంశం ఓ విస్తృత చర్చకు తెరలేపింది. న్యాయవ్యవస్థ పనితీరుతో పాటు పౌరుల హక్కులు, ప్రశ్న–నిరసన– విమర్శ వంటి పలు అంశాలు ప్రస్తావనకొస్తున్నాయి. విమర్శకు తావులేని పరిస్థితి కల్పిస్తే, ఇక రాజ్యాంగం పూచీగా నిలిచిన భావప్రకటనా స్వేచ్ఛ (అధికరణం 19–(ఎ)) హక్కుకున్న అర్థమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది.

రెంటినీ కలగాపులగం చేయొద్దు
రాజ్యాంగబద్ధమైన సంస్థల పనితీరు సజావుగా సాగేందుకు వాటి లోపాలు ఎత్తిచూపడం, సద్విమర్శ పౌరునిగా తన బాధ్యత అని భావించినట్టు ప్రశాంత్‌ భూషణ్‌ చెబుతున్నారు. నెల రోజుల వ్యవ ధితో ఆయన చేసిన రెండు ట్వీట్లు ప్రస్తుత వివాదానికి కారణం. ఒకటి, బయట సుప్రీంకోర్టు ఛీఫ్‌ జడ్జి ప్రవర్తనకు సంబంధించింది. ఇంకొ కటి, గత ఆరేళ్లుగా దేశంలో ఎమర్జెన్సీ విధించకుండానే ప్రజాస్వా మ్యాన్ని బలహీనపరుస్తున్న తీరు, అదే (నలుగురు ప్రధాన న్యాయ మూర్తుల) సమయంలో సుప్రీంకోర్టు పాత్ర గురించి చేసిన వ్యాఖ్య! ఈ రెండూ న్యాయవ్యవస్థ గౌరవాన్ని, ప్రజల్లో విశ్వసనీయతను తగ్గిం చేవిగా ఉన్నాయని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఒక ఫిర్యాదు ఆధారంగా తనంతతాను సుప్రీం ఈ కేసు చేపట్టి, సదరు చర్యను కోర్టు ధిక్కారంగా, భూషణ్‌ను దోషిగా తేల్చింది. ఇది వివాదాస్పదమౌ తోంది. న్యాయస్థానాలపైన, జడ్జీలపైన ఇలాంటి విమర్శలు కొత్త కాదు. 2018లో నలుగురు సుప్రీం కోర్టు సీనియర్‌ జడ్జీలు విలేకరుల సమావేశం పెట్టి, ‘సుప్రీంకోర్టు పనితీరు అంత సవ్యంగా లేదు, ప్రధాన న్యాయమూర్తి పని కేటాయింపు ప్రక్రియ లోపభూయిష్టం’ అని విమర్శ చేశారు.

అదెందుకు కోర్టుధిక్కారం కాలేదు? అన్నది ప్రశ్న. అంటే, ఒకే విషయంలో... న్యాయమూర్తులకు, న్యాయవాదు లకు, సాధారణ పౌరులకు వేర్వేరు న్యాయాలు ఉంటాయా? అనేది సందేహం. విమర్శకు, న్యాయధిక్కారానికి మధ్య విభజన రేఖ గుర్తిం చాలి. రెంటినీ ఒకేగాట కట్టడం తప్పని సుప్రీంకోర్టే తన తీర్పుల్లో పలుమార్లు పేర్కొంది. కోర్టు ధిక్కార చట్టం–1971 సెక్షన్‌ 13 అదే చెబుతోంది. ఒక చర్య లేదా వ్యాఖ్య న్యాయ ప్రక్రియ నిర్వహణలో తగినంత అనుచిత జోక్యమని సంతృప్తి చెందితే తప్ప దాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించకూడదన్నది చట్టం. తన వ్యాఖ్య సత్యమని, జనహితంలో చేసిందని నిరూపించుకునే నిందితుని వాదనకూ అవ కాశం కల్పిస్తూ చట్ట సవరణ (13–బి) కూడా జరిగింది. నిఖార్సయిన విమర్శ కోర్టుధిక్కారం కాబోదనీ ఇదే చట్టం (సెక్షన్‌–5) చెబుతోంది. దేశ విదేశాల్లో ఎందరెందరో న్యాయకోవిధులు ఈ విషయంలో స్పష్ట మైన తీర్పులిచ్చారు.

న్యాయవ్యవస్థలో అవినీతి లేదా?
ట్వీట్‌లలో ఒక న్యాయవాది చేసిన రెండు వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ ప్రతిష్టను భంగపరచి, ప్రజల్లో విశ్వసనీయతను తగ్గిస్తాయన్న భావ నతో ఉన్నత న్యాయస్థానం వ్యక్తి ప్రాథమిక హక్కును నలిపివేయ డాన్ని ప్రజాస్వామ్య వాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగా మన న్యాయవ్యవస్థ, కోర్టులు, మొత్తంగా ప్రజాస్వామ్యం ఈ రోజు అంతటి బలహీన పునాదులపై ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. ‘బార్‌ (న్యాయవాదుల సంఘం)ను నోరు మూయించి న్యాయస్థానాల్ని బలోపేతం చేయలేర’నే నినాదం దేశవ్యాప్తంగా పెల్లుబుకుతోంది. కోర్టుల గౌరవాన్ని నిలబెట్టే ఉద్దేశంతో, వాటి పనితీరుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయనీయకుండా పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు ‘కోర్టు «ధిక్కార’ అస్త్రంతో ముందే బంధనాలు విధించడం సబబా? తద్వారా కోర్టుల గౌరవం, విశ్వసనీయత పెరుగుతాయా అంటున్నారు. 108 పేజీల తన తీర్పులో, ‘నాలుగు స్తంభాల్లో ఒకటిగానే కాదు, భారత ప్రజాస్వామ్యానికి న్యాయవ్యవస్థ మూలస్తంభం’ అని పేర్కొన్న సర్వో న్నత న్యాయస్థానం, దేశంలో నెలకొన్న పరిస్థితులకూ బాధ్యత వహిం చాలన్న విమర్శను ఎందుకు స్వీకరించలేకపోయింది? వ్యాఖ్యను విమ ర్శగా కాకుండా కోర్టుధిక్కారంగా ఎలా పరిగణించారనేది విస్మయం!

‘ఇప్పుడే కాదు, 16 మందిలో సగంమంది సుప్రీం ప్రధాన న్యాయ మూర్తులు అవినీతిపరులన్న విమర్శ చేసినపుడు కూడా తన ఉద్దేశం కేవలం ఆర్థిక అవినీతి కాదని, ‘అవినీతి’ని విస్తృతార్థంలో వినియోగిం చానని న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఆగస్టు 4న ఇచ్చిన వివరణలో, ఆగస్టు 10న కోర్టు ఆదేశాలకు బదులిచ్చినపుడూ పేర్కొన్నారు. ‘కింది స్థాయి న్యాయవ్యవస్థలో దేశమంతటా అవినీతి ఉంది, అక్కడక్కడ ఉన్నతస్థాయిలోకీ విస్తరించింది’ అని 1964లోనే పార్లమెంటరీ కమిటీ నివేదించింది. ‘జడ్జీల్లోనూ అవినీతి పరులున్నార’ని మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్పీ బరూచా, ‘అవినీతి అంటుకోకుండా న్యాయ వ్యవస్థ ఏమీ పవిత్రంగా లేదని నేను నిజాయితీగా అంగీకరించా ల్సిందే’ అని మరో మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివంలు బహి రంగంగా పేర్కొనడాన్ని భూషణ్‌ తన వాదనలో ఉటంకించారు. న్యాయవ్యవస్థపై విమర్శ న్యాయధిక్కారమో, కోర్టుధిక్కారమో ఎలా అవుతుందన్న ఆయన ప్రశ్నకు సహేతుకమైన సమాధానం రావట్లేదు. ఒక గిడసబారిన ఉపకరణం (కోర్టుధిక్కారం)తో ఉన్నత న్యాయస్థానం మొరటు దెబ్బ వేసిందని, ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్టను, ప్రజల్లో విశ్వ సనీయతను పెంచకపోగా సన్నగిల్ల చేస్తుందన్న భయాన్నీ కొందరు వ్యక్తం చేస్తున్నారు. 

తప్పుగా వాడితే వికటించే ప్రమాదం
కోర్టుధిక్కారం, న్యాయధిక్కారం వంటి అస్త్రాల్ని కోర్టులు, జడ్జీలు ఎంతో ఆచితూచి వాడాలని విశ్వవ్యాప్తంగా ఓ బలమైన అభిప్రాయం. అమెరికా, బ్రిటన్, ఐక్యరాజ్యసమితి స్థాయిలోనే కాక దీనిపై మన దేశంలోనూ లోగడ విస్తృత చర్చ జరిగి, నిక్కచ్చి అభిప్రాయాలు వ్యక్త మయ్యాయి. బ్రిటన్‌లో 2013లో ఏకంగా కోర్టుధిక్కార చట్టాన్ని రద్దు చేశారు. ఆ సందర్భంగా తెచ్చిన బిల్లుపై చర్చలో మాట్లాడుతూ, ‘విమర్శ అసమంజసంగా ఉన్నా, నిందాపూర్వకంగా ఉన్నా, చివరకు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవపట్టించేదైనా... జడ్జీలు కటువుగా దాన్ని పట్టించుకోకుండా ఉండటమే మేలు’ అని సుప్రసిద్ధ న్యాయమూర్తి (ఐర్లాండ్‌) లార్డ్‌ కార్స్‌వెల్‌ అంటారు. ఇంగ్లండ్‌కు చెందిన ఇరవయ్యో శతాబ్ది గొప్ప న్యాయవాది, న్యాయమూర్తి టామ్‌ డెన్నింగ్‌ స్ఫూర్తి ఇక్కడ కావాలి. ఆయనే ఓ పుస్తకంలో రాసినట్టు, లేబర్‌పార్టీ నాయ కుడు, న్యాయవాది హార్టీ›్ల షోక్రాస్‌ ఓ కేసు తీర్పు నచ్చక ‘డెన్నింగ్‌ ఒక గాడిద’ అని వ్యాఖ్యానించడంతో అది ‘ది టైమ్స్‌’ (లండన్‌)లో ప్రచురి తమయింది. కోర్టు/న్యాయ ధిక్కారం కింద తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. ‘అవును ఆయన విమర్శించినట్టు నేను గాడిద కాను అని... కోర్టుధిక్కారం కింద తీసుకొని కాదు, నా పనితీరు ద్వారా నిరూ పించాలి’ అన్నది ఆయన వైఖరి. 1964లోనే సుప్రీం మాజీ న్యాయ మూర్తి గజేంద్ర గడ్కర్, ‘న్యాయధిక్కారాధికారాన్ని జడ్జీలు ఆలోచించి వాడాలి, వికటిస్తే అది న్యాయవ్యవస్థ ప్రతిష్టను, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచకపోగా తగ్గించే ప్రమాదముంది’ అన్నారు. ఇప్పుడదే జరుగు తోందన్నది అత్యధికుల భయం! నిజానికి న్యాయ/కోర్టు ధిక్కార అంశాన్ని జడ్జీలు పౌరుల విమర్శలకు కాకుండా రెండే సందర్భాల్లో వాడాలని న్యాయకోవిదుల భావన! ఒకటి, కోర్టులు చెప్పింది ఎవరైనా పాటించనపుడు. రెండు, చేస్తామని (అఫిడవిట్లో, అండర్‌టేకింగో) కోర్టులకు చెప్పిన మాట ఎవరైనా ఉల్లంఘించినపుడు మాత్రమే అన్నది సారం.

రక్షించాల్సిన వారే రౌద్రం వహిస్తే...?
తన పట్ల ఫలానా జడ్జి వివక్షతో ఉన్నారు, కేసు విచారణ మరో బెంచీకి మార్చండన్న వినతి పట్టించుకోవాలి. కానీ, ప్రస్తుత కేసులో రెండు మార్లు అలా కోరినా నిరాకరించారు, ఎందుకో తెలియదు. ‘వివక్ష లేదని జడ్జి్జ దృష్టిలో కాదు, నిందితుని దృష్టిలో చూడాల’ని లోగడ ఒక కేసులో జస్టిస్‌ వెంకటాచలయ్య చెప్పారు. కీలక వ్యవహారాల్లో నత్త నడకన సాగే విచారణ ఈ కేసులో ప్రశాంత్‌ భూషణ్‌ వెంటపడ్డట్టు వేగంగా సాగడమే విస్మయం! జడ్జీల అవినీతిపై చర్చ చాలా ముఖ్యం. దాని ఫలితంగానే విచారణలు, రుజువైతే అత్యున్నత చట్టసభల్లో వారి తొలగింపు ప్రతిపాదనలు–నిర్ణయాలు సాధ్యం. అలాంటి పరిస్థితు ల్లోనే హైకోర్టు జడ్జీలు పి.డి.దినకరన్, సుమిత్రాసేన్‌ రాజీనామాలు మనం చూశాం. సహేతుకమైన విమర్శల పట్ల ఉదారంగా వ్యవహరిం చడం ద్వారా మాత్రమే న్యాయస్థానాలు మరింత స్వేచ్ఛగా స్వతం త్రంగా పనిచేస్తాయి, గౌరవం–విశ్వసనీయత పొందుతాయి. అంతే తప్ప, కోర్టుల గౌరవం, విశ్వసనీయత పెంచడానికి పౌరుల హక్కుల్ని పణంగా పెట్టడం సరికాదు. సుప్రీంకోర్టు పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణ సంస్థే కాదు, ఇతర ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ రాజ్యాంగానికి లోబడి నడుచుకునేలా చూసుకోవాల్సిన వ్యవస్థ! తెలుగునాట ఓ సామెత ఉంది. ‘కన్నతల్లే దయ్యమైతే.. ఇక తొట్టెల (ఉయ్యాల) కట్టే తావెక్కడ?’ అని. సర్వో న్నత న్యాయస్థానం, దయ్యాల బారి నుంచి బిడ్డల్ని కాపాడుకునే దయగల కన్నతల్లి కావాలని జనం కోరిక!


దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement