జల నిర్లక్ష్యంతో జీవం ఆవిరే! | Samakaleenam | Sakshi
Sakshi News home page

జల నిర్లక్ష్యంతో జీవం ఆవిరే!

Published Fri, Mar 20 2015 1:11 AM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM

ఆర్.దిలీప్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సాక్షి - Sakshi

ఆర్.దిలీప్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సాక్షి

సమకాలీనం
 ఐరాస పిలుపు మేరకు ‘నీరు-నిలకడైన అభివృద్ధి’ ఈ ఏడాది ప్రాధాన్యతాంశంగా ప్రపంచ దేశాలు కసరత్తు చేస్తుండగా... తెలంగాణలో చెరువుల్ని పునరుద్ధరించే ‘మిషన్ కాకతీయ’ను, ఏపీలో ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేపట్టాయి. భారీ వ్యయంతో చేస్తున్న ఈ కార్యక్రమాలకు శాస్త్రీయ దృక్పథాన్ని జత చేసి, స్థానిక సంస్థలతో అనుసంధానించాలి. మనిషి మనుగడ కోసం, భవిష్యత్ అవసరాల కోసం నీటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తిం చాలి. అన్ని స్థాయిల్లో స్పందించి ప్రతి నీటి చుక్కను అర్థవంతంగా వాడితేనే భూగ్రహానికి రక్ష.
 మూడో ప్రపంచ యుద్ధమంటూ వస్తే అది నీటి కోసమే జరుగుతుందనే మాట దశాబ్దాలుగా వింటున్నాం. మానవ మనుగడకు నీరు కేంద్ర బిందువైన తీరు దృష్ట్యా నీటి ప్రాధాన్యాన్ని, నీటిని చుట్టుముట్టి వస్తున్న పర్యావరణ మార్పులను, ప్రమాదాల్ని చూస్తుంటే... ఆ యుద్ధం ఇప్పటికే మొదలైందని స్పష్టమౌతోంది. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక, స్థాయిల్లో నీటి యుద్ధాలు ఇప్పటికే సాగుతున్నాయి. ఉదాసీన వైఖరితో ఉపేక్షిస్తే, అవి మరింత తీవ్ర రూపం దాల్చి మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేయగలవని ప్రమాద ఘంటి కలు మోగుతున్నాయి. మితిమీరుతున్న ‘భూతాపం’ సృష్టిస్తున్న అనర్థాలు ‘వాతావరణ మార్పు’ తదితర రూపాల్లో ఇప్పటికే తీరని నష్టాన్ని కలిగిస్తున్నా యి. సహజ వనరైన నీటికి పర్యావరణ పరంగా ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి, నష్టాన్ని తగ్గించడం, నీటి కాలుష్యాన్ని నియంత్రించి సగటు మనిషి జీవన ప్రమాణాల్ని పెంచుకోవడంలో, జల వనరుల పరిరక్షణలో సాధించాల్సింది ఎంతో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ఏటా మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం పాటిస్తున్నారు. 1993 నుంచి జల దినోత్సనం పాటిస్తూనే ఉన్నా సమస్య మరింతగా జటిలమౌతూనే ఉంది. అందుకే ఐరాస ‘నీరు-నిలకడైన అభివృద్ధి’ని ఈ ఏడాది ప్రాధాన్య తాంశంగా ఖరారు చేసింది. ప్రపంచ దేశాలు ఈ అంశంపై కసరత్తు చేస్తుం డగా... రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు ప్రతిష్టాత్మకమైన కార్యక్ర మాలు చేపట్టాయి. తెలంగాణలో చెరువుల్ని పునరుద్ధరించే ‘మిషన్ కాకతీ య’ను మొదలెడితే, ఆంధ్రప్రదేశ్‌లో ‘నీరు-చెట్టు’ కార్యక్రమం చేపట్టింది. ఈ రెండిటికీ కేంద్ర బిందువు నీరే. అయితే, వాటికి శాస్త్రీయ దృక్పథాన్ని అందించి, వాటిని ప్రజలతో, జన సమూహాలతో, గ్రామ పంచాయతీల వంటి స్థానిక సంస్థలతో మరింతగా అనుసంధానించాల్సిన అవసరం ఉంది.

 ఇప్పటికీ ముతక విధానాలేనా?
 ప్రపంచమంతా ఆధునికతవైపు పరుగిడుతుంటే, మనమింకా సంప్రదాయిక ముతక పద్ధతుల్లోనే కొట్టుమిట్టాడుతున్నాం. నదుల్ని అడ్డగించి ఆనకట్టలు, పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు, కాలువలతో మనం అవలంబిస్తున్న పొలాన్ని నీటితో నింపే వరద (ఫ్లడ్) సాగు పురాతన పద్ధతి. దీనివల్ల పలు అనర్థాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అభివృద్ధిచెందిన దేశాల్లో నీటిని పొదుపుగా వాడి పర్యావరణ అనుకూలమైన తేమ, పొగ మంచు, బిందు (డ్రిప్), తుంపర (స్ప్రింక్లర్) వంటి ఆధునిక పద్ధతుల్లో సేద్యం చేస్తున్నారు. ఇజ్రాయెల్, టర్కీ వంటి దేశాలు ఈ పద్ధతులతో గణనీయమైన విజయాలు సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. టర్కీలో నీటి కనిష్ట వినియోగంతో అద్భుతాలు సృష్టించారు. పల్లపు భూములన్నింటినీ చిన్న చిన్న కమతాలుగా సమతలం చేశారు. యూఫ్రిటీస్, టైగ్రిస్ జలాల్ని ఇలా ఒడుపుగా వినియోగిస్తూ ఆహారోత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నారు. పొలాల్లో నీటిని వరదలా పారించడం వల్ల సూక్ష్మ ఖనిజాలు కొట్టుకుపోయి భూసారం చెడుతోంది. తేమ, కనీస తడి వంటి ఆధునిక పద్ధతుల్లో భూసార పరిరక్షణ జరుగుతుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్ని వ్యవ సాయ క్షేత్రాలతో అనుసంధానం చేసే పని మన వద్ద జరగటం లేదు. ఆదర్శ పరిస్థితుల్లో ఒక క్యాలరీ ఆహారోత్పత్తికి ఒక లీటరు నీరు సరిపోతుంది. కానీ, సంప్రదాయక సాగుతో ఒక క్యాలరీ ఆహారోత్పత్తికి వంద లీటర్ల నీరు అవసర మౌతోంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగమౌతున్న నీటిలో సగటున 70 శాతం వ్యవసాయ అవసరాలకై పోతోంది. కాలం చెల్లిన వ్యవసాయ పద్ధతులే ఇందుకు ప్రధాన కారణం. పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం వల్ల పర్యావర ణానికి ముప్పు తప్పదు. నైలు నది ఎగువనున్న దేశాలు విద్యుత్, వ్యవసాయ అవసరాల కోసం ఆనకట్టలు, ప్రాజెక్టులు నిర్మిస్తుండటం వల్ల ఒండ్రు మట్టి దిగువ ప్రాంతాలకు రాక ఆ ప్రాజెక్టుల్లోనే పేరుకుపోతోంది. ఈజిప్ట్ తదితర దేశాలకిది శాపంగా పరిణమిస్తోంది. ఇదే పద్ధతి కొనసాగితే ప్రపంచంలో చాలా జీవనదులు నిర్జీవ నదులుగా మారే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర జల వివాదాలు కొత్తేం కాదు. గోదావరి, కృష్ణా జల వివాదాలు తెలుగు రాష్ట్రాల మధ్య రావణ కాష్టంలా రగలడం నిత్యం చూస్తున్నదే!

 నదీ బోర్డులు, వాతావరణ మార్పు కేంద్రాలు రావాలి
 రాజకీయ వ్యవస్థ సంకుచితంగా ఆలోచించినంత కాలం జల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించదు. అందుకు పూర్తి స్వేచ్ఛ, సర్వాధికారాలు కలి గిన స్వతంత్ర నదీ బోర్డులుండాలని నిపుణులు చాలా కాలంగా చెబుతు న్నారు. తాగునీరు, సాగునీరు, విద్యుదుత్పత్తి అన్న ప్రాధాన్యతా క్రమంలో ఎప్పుడు, ఏ ప్రాజెక్టు నుంచి, ఎవరికెన్ని నీళ్లు విడుదల చేయాలనే నిర్ణయా లను ఈ బోర్డు న్యాయస్థానాల, ట్రిబ్యునళ్ల తీర్పులను బట్టి తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో రాజకీయ జోక్యానికి తావుండరాదు. ఇలాంటి ప్రాధికార సంస్థల నిర్వహణ వల్లే అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. వాతావరణ కాలుష్యాల వల్ల భూతాపం పెరిగి, అది వాతావరణ మార్పులకు కారణమౌతోంది. ఫలితంగా వర్షాలు సరిగ్గా కురవటం లేదు. రుతుక్రమం దెబ్బతిని, అతివృష్టి లేదా అనావృష్టితో వ్యవసాయానికి తీరని భంగం కలు గుతోంది. అక్కడక్కడ కొన్ని నల్లరేగడి భూముల్లో మినహాయిస్తే వర్షాధార పంటలే పండని పరిస్థితి వచ్చేస్తోంది. నిలువ నీటిపై ఆధారపడక తప్పని స్థితి దాపురించింది. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ మునుపెన్నడూ లేనంత ప్రమాదకర స్థాయికి అవి పడిపోయాయి. వేయి, రెండు వేల అడుగుల వరకు బోర్లు వేస్తేగానీ నీరు పడని పరిస్థితి. ఆధు నిక శాస్త్ర సాంకేతికత దృష్ట్యా మన సాగు విధానాలు, పద్ధతులు మారాల్సి ఉంది. తద్వారా వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ‘వెదర్ మాడిఫికేషన్ సెంటర్స్’ (డబ్లూఎంసీ)ను ఏర్పాటు చేయడం అవసరం.  రాజకీయ జోక్యం లేని స్వతంత్ర ప్రతిపత్తి గల ఈ సంస్థలు నిపుణుల నిర్వహణలో నడవాలి. వర్ష రుతువులో ‘మేఘ మథ నం’ ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించాలి. అందుకోసం డబ్లూఎంసీని వైమా నిక దళంతో అనుసంధానించాలి. ఈ పనులను ప్రభుత్వమే చేపట్టాలి తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం చేయరాదు.

 ప్రజలతో, పంచాయతీలతో లంకె పెట్టాలి
 తెలంగాణలో చెరువులకు పునర్ వైభవం తీసుకురావడానికి మిషన్ కాకతీ యను చేపట్టారు. దాదాపు 46 వేల చెరువుల్ని పునరుద్ధరించడం ద్వారా వాటి నీటి నిలువ సామర్థ్యాన్ని 265 శతకోటి ఘనపుటడుగులకు (టీఎంసీలు) పెంచాలని లక్ష్యం. తద్వారా 25 లక్షల ఎకరాల సాగును స్థిరీకరించడమో, పునరుద్ధ్దరించడమో జరుగుతుంది. వచ్చే ఐదేళ్లలో దాదాపు 36 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా, గోదావరి లోతున ప్రవహి స్తుండటంతో కాకతీయుల కాలం నుంచి చెరువులే తెలంగాణలో సాగునీటికి ఆదరువుగా ఉన్నాయి. నదుల నీరు వాడుకోడానికి ఎత్తిపోతల పథకాలే దిక్కు. వాటికి పెద్ద ఎత్తున నిధులు, విద్యుత్తు అవసరం. దీంతో ప్రభుత్వాలు అలాంటి ప్రాజెక్టుల పట్ల ఆసక్తి చూపలేదు. పాలకుల నిర్లక్ష్యం వల్ల చెరువుల కింద సాగు అంతరించే పరిస్థితి దాపురించింది. చెరువుల పూడిక తీయడమే కాకతీయ మిషన్ ప్రధాన ప్రక్రియగా ఉంది. దీనివల్లే పూర్వ వైభవం రాదు. దాదాపు వెయ్యేళ్లు చెరువులు సురక్షితంగా ఉండటానికి ప్రధాన కారణం చెరువు, ఊరు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటమే. చెరువు నీళ్లతో పం టలు పండేవి. చాకలి, కుమ్మరి, మత్స్యకారులు తదితర సకల వృత్తులకు ప్రధాన జీవనాధారం చెరువే. చెరువుకు గ్రామానికి మధ్య ఉన్న విడదీయరాని బంధం నేడు తెగిపోయింది. చెరువుల వల్ల మోట బావులు, ఊట బావులు, చేద బావుల్లో నీరుండేది. భూగర్భజల మట్టాలూ పైనే ఉండేవి. చెరువులపై నిర్లక్ష్యం పెరిగాక, చెరువులోకి నీరొచ్చి చేరేందుకు ఆధారమైన పరీవాహక ప్రాంతాలు చాలా వరకు సాగులోకొచ్చాయి. ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసు కున్నారు. చెరువులు కూడా కబ్జాలకు గురయ్యాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రియల్ మాఫియాల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వీటిని విముక్తం చేయాల్సి ఉంది. అందుకుగాను, ఈ చెరువుల పునరుద్ధరణ, నిర్వహణ తదితరాలన్నింటినీ గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు అప్పగించాలి. వారికి అధికారాలు కల్పించి గ్రామ సభను నిర్ణాయక వేదికగా బలోపేతం చేయాలి. ఊరు-చెరువు మధ్య బంధాన్ని పటిష్టపరచాలి. అప్పుడే చేస్తున్న కృషికి సార్థకత.

 ఏపీ ప్రభుత్వం తలపెట్టిన నీరు-చెట్టు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. చెరువుల్ని పునరుద్ధరించడం, కుంటలు, కాలువల్లో పూడిక తీయడం, మెరుగైన పద్ధతుల్లో చెక్ డ్యాములు, తదితర నీటి నిల్వ వసతుల్ని మెరుగు పరచడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టడం కూడా ఇందులో భాగమే! వచ్చే ఐదేళ్ల కాలంలో యాభై కోట్ల మొక్కలు నాటడం, ఇతర పర్యావరణ అనుకూల చర్యల ద్వారా నీటి లభ్యతను మెరుగుపరచడం నీరు-చెట్టు పథకం లక్ష్యంగా ప్రకటించారు. ఈ ఐదేళ్లలో సుమారు రూ.27 వేల కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. ఇంత పెద్ద మొత్తాల్లో ప్రజాధనం వెచ్చించేటప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ సంకుచిత దృష్టితో కాక విస్తృత జనహితంతో ఆలోచించాలి. పౌరులు, ప్రజా సంఘాలతో పాటు స్థానిక సంస్థల్ని క్రియాశీ లంగా ఇందులో భాగస్వాముల్ని చేస్తూ భవిష్యత్ కార్యక్రమాల్ని రచించాలి.

 ఇలాగే నీటిని నిర్లక్ష్యం చేస్తే భూమిపై జీవమే ఆవిరి కాక తప్పదు
 నిబంధనల్ని గాలికొదిలే కంపెనీలు, కర్మాగారాలు, నిఘా సంస్థలు నీటి కాలు ష్యానికి కారణమౌతున్నాయి. నదీ గర్భం నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఇసుకను తరలిస్తున్న మాఫియాల చర్యలు భూమిపై వ్రణాలు, పుండ్లు పెరగడానికి దోహద పడుతున్నాయి. నిర్లక్ష్యపు ప్రభుత్వాలు నిలకడైన అభివృద్ధిని లక్ష్య పెట్టకుండా తాత్కాలిక కంటితుడుపు చర్యలతో పబ్బం గడుపుతూ పర్యా వరణానికి గండి కొడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనమంతా అప్రమత్తం కావాలి. మన మనుగడ కోసం, భవిష్యత్ అవసరాల కోసం నీటిని కాపాడు కోవాల్సిన ప్రాముఖ్యతను గుర్తించాలి. ప్రభుత్వాలుగా, కార్పొరేట్లుగా, సంస్థ లుగా, పౌరసంఘాలుగా, వ్యక్తులుగా.. అన్ని స్థాయిల్లో స్పందించి ప్రతి నీటి చుక్కను కాపాడి అర్థవంతంగా వాడితే గానీ భూగ్రహానికి రక్షణ లేదు.

 (మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా)

ఆర్. దిలీప్ రెడ్డి  
ఎగ్జిక్యూటివ్ ఎడిటర్

ఈమెయిల్: dileepreddy@sakshi.com      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement