mission Kakatiya
-
ప్రాజెక్టులకు నిధుల కటకట
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు మళ్లీ నిధుల సమస్య ఎదురైంది. భారీ కేటాయింపులున్నా నిధుల విడుదల నామమాత్రంగా జరుగుతుండటంతో నిర్మాణ పనులన్నీ చతికిలపడుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆరు భారీ, రెండు మధ్యతరహా ప్రాజెక్టులు పూర్తి చేసేలా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినప్పటికీ వివిధ ప్రాజెక్టులకు ఏకంగా రూ. 8,289 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండటం గడువులోగా వాటిని పూర్తి చేయడంపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. ఇచ్చింది రూ. 2 వేల కోట్లే... గతేడాదిలాగానే ఈ ఏడాదీ ప్రభుత్వం సాగునీటిశాఖకు రూ. 25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితోపాటు కాళేశ్వరం కింద గరిష్ట ఆయకట్టు ఇచ్చేలా నిధుల కేటాయింపు చేసింది. అయితే అనుకున్న స్థాయిలో నిధులు విడుదల చేయకపోవడం, బకాయిలు పేరుకుపోవడంతో నిర్మాణ పనులు నెమ్మదించాయి. గత మూడు నెలల వ్యవధిలో ప్రభుత్వం మొత్తంగా సాగునీటి ప్రాజెక్టులపై రూ. 5,793 కోట్లు ఖర్చు చేయగా మరో రూ. 8,289.84 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఖర్చు చేసిన నిధుల్లోనూ కాళేశ్వరానికి రుణాల ద్వారా తీసుకున్న మొత్తాలే రూ. 3,798 కోట్లు ఉన్నాయి. అంటే ఈ లెక్కన ప్రభుత్వం ఖజానా నుంచి విడుదల చేసంది కేవలం రూ. 2 వేల కోట్లుగానే ఉంది. ఒక్క కాళేశ్వరం పరిధిలోనే ఇంకా రూ. 2,590 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇవన్నీ రుణాల రూపేనా తీసుకునే అవకాశం ఉండటంతో పెద్దగా ఇబ్బందులు లేవు. ఇది మినహా మిగతా ప్రాజెక్టులన్నీ నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. నెమ్మదించిన ‘పాలమూరు’ పనులు... పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో రూ. 1,242 కోట్ల మేర నిధులు కేటాయించాల్సి ఉంది. ఇందులో రూ. 350 కోట్ల మేర కేటాయిస్తే భూసేకరణ చేసుకుంటామని అధికారులు కోరుతున్నా అది జరగక పనులన్నీ నెమ్మదించాయి. చాలా ప్యాకేజీల నుంచి కాంట్రాక్టర్లు యంత్ర సామగ్రి, కార్మికులను కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలకు మళ్లించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో నీటిని ఇవ్వాలని నిర్ణయించిన ప్రాజెక్టుల్లో కల్వకుర్తి ఉండగా అక్కడ రూ. 626 కోట్లు, దేవాదులలో రూ. 888 కోట్లు, భీమాకు రూ. 100 కోట్లు, సీతారామకు రూ. 461 కోట్లు, డిండికి రూ. 122 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిధుల విడుదలపై ఆర్ధికశాఖను అడిగినప్పుడల్లా రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్లు విడుదల చేస్తున్నారని, మిగతా నిధుల విడుదలకు ఆగాల్సిందేనన్న సమాధానం వస్తోందని నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో రైతు బంధు పథకం కింద ప్రభుత్వం రూ. 6 వేల కోట్ల మేర కేటాయించడంతో ఇరిగేషన్ బడ్జెట్‌కు కోత పడుతోంది. ‘మిషన్ కాకతీయ’కూ ఆర్థిక కష్టాలే... మిషన్ కాకతీయ పథకం కింద చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ పనులనూ నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటివరకు ఏకంగా రూ. 455 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పడటంతో రెండు, మూడో విడతల్లో చేపట్టిన పనుల్లో ఇంకా 5,500లకుపైగా చెరువుల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని జూలైలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినా అది కష్టంగానే ఉంది. ఇక నాలుగో విడతలో దాదాపు 5 వేల చెరువుల్లో పూడికతీత పనులకు అనుమతినిచ్చినా నిధుల సమస్యతో కేవలం 3 వేల చెరువుల్లోనే పనులు మొదలయ్యాయి. -
నిర్లక్ష్యం చేస్తే చర్యలు
వంగూరు : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న మిషన్ కాకతీయ చెరువు మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేయిస్తానని ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ అన్నారు. మంగళవారం వంగూరు మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మిషన్ కాకతీయ పనులు వంగూరు మండలంలో వేగవంతంగా జరగకపోవడం, ఫేస్–1, ఫేస్–2లో ఐదు చెరువులు పూర్తికాకపోవడం, మూడు, నాలుగు దశల్లో మంజూరైన చెరువుల పనులను పూర్తి చేయకపోవడం కొన్నింటిని ప్రారంభించకపోవడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల కోసం.. గొలుసుకట్టు చెరువుల ద్వారా రైతులకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కోట్ల రూపాయలను కేటాయిస్తుంటే అధికారులు, కాంట్రాక్టర్లు కమీషన్ల కోసం కక్కుర్తిపడి పనులు ఆలస్యం చేస్తున్నారని ఎమ్మెల్యే గువ్వల అన్నారు. అవసరమూతే సంబంధిత అధికారులు చెరువుల వద్దే ఉండి పనులు చేయించాలని ఇరిగేషన్ ఏఈ తిరుపతయ్యను ఆదేశించారు. చర్యలు తీసుకోవాలి అలాగే సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన హార్టికల్చర్, ఆర్టీసీ, ఎక్సైజ్, సోషల్ వెల్ఫేర్, ఆర్అండ్బీ శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎంపీడీఓను ఆదేశించారు. మూడు నెలలకోసారి జరిగే సర్వసభ్య సమావేశానికి కూడా హాజరు కావడానికి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారుల తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవన్నారు. సమస్యలు పరిష్కరించాలి సభలో చౌదర్పల్లి సర్పంచ్ అంజన్‌రెడ్డి, పోతారెడ్డిపల్లి సర్పంచ్ శంకర్, గాజర సర్పంచ్ చంద్రయ్య తదితరులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను అధికారులు అధ్యయనం చేసి త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సర్పంచ్‌లకు సన్మానం ఉమ్మడి వంగూరు మండలంలోని 24 గ్రామపంచాయతీల సర్పంచ్‌లకు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. పదవీ కాలాన్ని పూర్తిచేసుకోవడం, ప్రస్తుత సర్పంచ్‌లకు చివరి సర్వసభ్యసమావేశం ఇదే కావడంతో వారికి శాలువాలు, దండలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు మాట్లాడుతూ ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధి కోసం వారు కష్టపడిన తీరు, గ్రామాభివృద్ధి కోసం ఎమ్మెల్యే, అధికారులు సహకరించిన విధానం తదితర అంశాలను నెమరు వేసుకున్నారు. తమ పదవీకాలం పూర్తయినప్పటికీ గ్రామాల్లో తాము చేపట్టిన అభివృద్ధి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయని వారు పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ భీముడు నాయక్, పీఏసీఎస్ చైర్మన్ రాజశేఖర్‌రెడ్డి, తహసీల్దార్ సుశీల్‌కుమార్, ఎంపీడీఓ హిమబిందు, కోఆప్షన్ సభ్యుడు హమీద్, ఎంఈఓ శంకర్‌నాయక్, వ్యవసాయాధికారిణి తనూజారాజు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మిషన్‌కాకతీయతో సమృద్ధిగా నీరు
ధర్మారం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో మరమ్మతు చేయడంతో చెరువుల్లో నీరు సమృద్ధిగా నిల్వ ఉంటుందని ప్రభుత్వ చీఫ్‌విఫ్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. మండలంలో నాల్గవ విడత మిషన్ కాకతీయలో భాగంగా చామనపల్లి, రచ్చపల్లి, ఖానంపెల్లి గ్రామాల్లో చెరువులు, కుంటల నిర్మాణ పనులను గురువారం ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి విస్మరించగా టీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమానికి కోట్లాది రూపాయలు వెచ్చించిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని దాదాపు అన్ని చెరువులు, కుంటల మరమ్మతులకు నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయిస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం మోహన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు పుస్కూరి జితెందర్‌రావు, పాక వెంకటేశం, ఎండీ. రఫీ, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి ఎండీ. అజాంబాబా, వైస్ ఎంపీపీ నార ప్రభాకర్, చింతల తిరుపతి, మూల మల్లేశం, సర్పంచులు పాలమాకుల ఉపేందర్‌రెడ్డి, ఐత స్వర్ణలత, అరుణ, ఎంపీటీసీలు మూల మంగ, వేల్పుల రేవతి, నాయకులు పాల్గొన్నారు. వికలాంగులకు వీల్‌చైర్ అందజేత మండలం పరిషత్ కార్యాలయంలో దివ్యాంగులకు చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ గురువారం వీల్చైర్లను అందించారు. నర్సింగపూర్‌కు చెందిన బుదారపు నర్సయ్యకు వీల్‌చైర్, వెల్గటూర్ మండలం పాతగూడూరుకు చెందిన జానవేణి తిరుపతికి ట్రైసైకిల్ అందించారు. -
ఎవరి కోసం ఈ నాలుగు వేలు
నిర్మల్అర్బన్ : ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ.4వేలు ప్రకటించిందని ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. మిషన్ భగీరథ పనులు అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారాయని, జిల్లాలో మిషన్ భగీరథ పనులు కమిషన్ భగీరథగా మారాయని విమర్శించారు. దిలావార్పూర్ మండలంలో చోటుచేసుకున్న పైప్‌లైన్ లీకేజీయే దీనికి నిదర్శనమన్నారు. ట్రయల్ రన్లో ఎక్కడ పడితే అక్కడ లీకేజీలు బయటపడుతుండడంతో పనులు ఎలా చేపట్టారో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో చేపడుతున్న రహదారి విస్తరణ పనుల్లోనూ అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. మంత్రి కుటుంబీకులే పనులు చేపడుతుండటంతో అధికారులు నోరుమెదపడం లేదని ఆరోపించారు. మంత్రి వైఫల్యంతోనే నిర్మల్‌లో అల్లర్లు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. మిషన్ భగీరథ, రోడ్ల విస్తరణ పనుల్లో చోటుచేసుకున్న అవినీతి, నిర్మల్‌లో అల్లర్లకు మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు అయిర నారాయణరెడ్డి, పోశెట్టి, రమణారెడ్డి, తదితరులున్నారు. -
నగరానికో నగ..
లకారం సింగారించుకుంది.. కొంగొత్త అందాలతో మురిసిపోతోంది.. నగర ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు సిద్ధమవుతోంది.. కోట్లాది రూపాయల వ్యయం.. అత్యాధునిక వసతులు.. బండ్ చుట్టూ పచ్చికబయళ్లు.. ఆకట్టుకునే నాలుగు వంతెనలు.. చెరువు చుట్టూ ఫెన్సింగ్.. వాకింగ్ ట్రాక్.. అక్కడక్కడ హట్ల నిర్మాణం.. మినీ హోటళ్లు.. ఒక్కసారి వీక్షిస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.. ఎన్నో సహజ వనరులున్న ఖిల్లా మెడలో మరో నగ వేసేందుకు లకారం చెరువును అందంగా ముస్తాబు చేయడంతోపాటు భూగర్భ జలాలు పెంపొందించేందుకు.. సాగర్ జలాలు మళ్లిస్తూ తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం సాక్షిప్రతినిధి, ఖమ్మం : నగరం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు సుందరీకరణ పనులను మిషన్ కాకతీయ–1లో భాగంగా తొలుత రూ.7.78కోట్లతో చేపట్టారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహాలో సుందరంగా తీర్చిదిద్దాలంటే ఈ నిధులు సరిపోవని.. వీటిని పెంచాలని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరడంతో ఆయన నిధులను రూ.13.59 కోట్లకు పెంచేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. నిత్యం పనులతో సతమతమయ్యే సగటు మనిషి సాయంత్రం వేళ ఇక్కడికొచ్చి సేద తీరాలనే ఉద్దేశంతో వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ చెరువును సుందరంగా తీర్చిదిద్దారు. చుట్టూ పచ్చటి మొక్కలు, చెరువు నిండా నీరు.. వాకింగ్ ట్రాక్, హట్లు తదితర నిర్మాణాలు చేపట్టారు. ఆయా పనులు పూర్తి చేసేందుకు మొత్తం రూ.24కోట్లు వెచ్చించారు. లకారం చెరువు ఆధునికీకరణ, ట్యాంక్ బండ్ నిర్మాణానికి నిధుల కొరత ఏర్పడే పరిస్థితి తొలుత ఉండటంతో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ప్రభుత్వాన్ని ఒప్పించి.. వివిధ పథకాల ద్వారా నిర్మాణాలకు నిధులను సమకూర్చగలిగారు. ఆక్రమణలకు గురవుతున్న చెరువు నగర ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దడం వెనుక అధికారులు, ఎమ్మెల్యే అజయ్ కృషి దాగుంది. సుందరీకరణ ఇలా.. చెరువు చుట్టూ బండ్ నిర్మించి.. పూడికమట్టి తీసి కట్టలను బలపరిచారు. ఫెన్సింగ్‌తోపాటు రివిట్మెంట్ పనులు చేపట్టారు. బండ్‌కు నాలుగు వంతెనలు నిర్మించారు. దీంతోపాటు అలుగు, తూముల పనులు పూర్తి చేశారు. కలెక్టర్ మంజూరు చేసిన రూ.4కోట్లతో చెరువు సుందరీకరణ పనులు చేపట్టారు. చుట్టూ రెయిలింగ్, లాన్, టెయిల్స్, హట్స్ నిర్మాణం చేపట్టారు. మినీ హోటళ్లు, టాయిలెట్లు నిర్మించారు. వీటి మధ్యలో పచ్చదనం పరుచుకున్నట్లుగా మొక్కలు పెంచుతున్నారు. బండ్ చుట్టూ సెంట్రల్ లైటింగ్, ప్రధాన రోడ్డుపై రూ.90లక్షలతో బీటీ రోడ్డు వేస్తున్నారు. దీనికి ప్రధాన ముఖద్వారం మమత రోడ్డు వైపు ఏర్పాటు చేశారు. ఇక్కడ కాకతీయ కళాతోరణం ఆర్చీ తయారు చేశారు. ప్రధాన ద్వారం కాకుండా ట్యాంక్‌బండ్ చుట్టూ నాలుగు ద్వారాలు ఏర్పాటు చేశారు. అలాగే చెరువులో నీటిని నింపేందుకు ఇందిరానగర్ నుంచి ఉన్న మేజర్ కాల్వకు రూ.5కోట్లతో కాంక్రీట్ పనులు చేశారు. సిమెంట్ వాల్స్ వేశారు. చెరువు చుట్టూ తిరిగి చూసేందుకు ఒక బ్యాటరీ కారును ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ తెలంగాణ ప్రముఖ కవులు, ఉమ్మడి జిల్లావాసులు దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ తరహాలో ఆహ్లాదకరమైన వాతావరణంతోపాటు విజ్ఞానాన్ని పెంచే విధంగా పలు నిర్మాణాలు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. భూగర్భ జలాల పెంపు.. లకారం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంతోపాటు భూగర్భ జలాలు పెంచేందుకు అధికారులు ఈ పనులు చేపట్టారు. నగరం కొన్నేళ్లుగా నీటి ఎద్దడి ఎదుర్కొంటుండటం.. ఆ సమస్యను పరిష్కరించేందుకు ఈ చెరువును ఆధునికీకరించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. సాగర్ జలాలతో నీటిని నింపడం వల్ల తాగునీటికి ఉపయోగపడతాయి. 11న ప్రారంభం.. తరలిరానున్న సినీ తారలు లకారం ట్యాంక్‌బండ్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈనెల 11 నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఆరోజు నుంచి సుందర దృశ్యాలను నగర వాసులు ఆస్వాదించనున్నారు. 11న ఉదయం సినీ తారలచే 5కే రన్ ఏర్పాటు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ట్యాంక్‌బండ్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తమవంతు సహకారం అందించేందుకు అంగీకరించింది. ప్రముఖ సినీ తారలు అందరూ ఆరోజు ఉదయం నగర ప్రజలతో కలిసి 5కే రన్లో పాల్గొననున్నారు. సాయంత్రం 3 గంటలకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ట్యాంక్‌బండ్‌ను ప్రారంభిస్తారు. ‘లకారం’తో ఆహ్లాదం అత్యాధునిక వసతులతో లకారం చెరువు వద్ద సుమారు 80 ఎకరాల్లో ట్యాంక్‌బండ్ నిర్మాణం కొనసాగింది. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా నియోజకవర్గానికో ట్యాంక్‌బండ్‌ను ప్రభుత్వం ప్రకటించడం.. ఇదే సమయంలో నగరం నడిబొడ్డున నిర్జీవంగా, గుర్రపుడెక్కతో ఉన్న లకారం చెరువుకు పునరుజ్జీవం కల్పించి.. అందరికీ ఉపయోగపడేలా సుందరీకరణ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నా. మిషన్ కాకతీయలో మంజూరైన రూ.7.78కోట్లు సరిపోయే అవకాశం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన రూ.13 కోట్లకు పెంచేలా చేశారు. ఆ నిధులతో పనులు వేగవంతం కావడంతోపాటు వివిధ శాఖల నుంచి నిధులు సమకూరాయి. రాష్ట్ర, జిల్లా ప్రముఖుల గురించి భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా వారి విగ్రహాలను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నాం. ట్యాంక్‌బండ్ నిర్మాణంలో జిల్లా అధికారులు, మంత్రి తుమ్మల సహకారం మరచిపోలేనిది. – పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే -
దర్జాగా కబ్జా!
ధారూరు : ఆ చెరువులో రూ.40 లక్షలతో మిషన్ కాకతీయ పథకం కింద పునరుద్ధరణ పనులు చేశారు. సాగునీరు అందించేందుకు అభివృద్ధి చేసిన చెరువును కొంతమంది దర్జాగా ఆక్రమించి ఇందులో పంటలను సాగుచేశారు. తూము సమీపంలో నీరు నిల్వ ఉన్న 10 శాతం చెరువు భాగాన్ని మాత్రమే వదిలివేసి మిగిలిన చెరువు విస్తీర్ణంలో వరి, జొన్న పంటలు వేశారు. పూడిక తీసిన చెరువులో ఓ వ్యక్తి పశువుల కొట్టం ఏర్పాటు చేసి పశుగ్రాసం నిల్వ చేశాడు. ఆదివారం గ్రామానికి వెళ్లిన విలేకరుల బృందానికి ఆయకట్టు రైతులు చెరువు కబ్జాపై వివరించారు. వివరాలిలా ఉన్నాయి.. ధారూరు మండలంలోని గురుదోట్ల కొత్త చెరువుకు 14.01 ఎకరాల విస్తీర్ణం ఉంది. 1968లో దీన్ని నిర్మించారు. గత సంవత్సరం మిషన్ కాకతీయ పథకం కింద ప్రభుత్వం రూ.40 లక్షలు కేటాయించింది. ఈ నిధులతో చెరువులో పూడికతీత, తూము నిర్మాణం, కట్ట, కాల్వ పనులను చేశారు. ఇటీవల గురుదోట్ల పంచాయతి పరిధిలోని కొంతమంది చెరువులోని 90 శాతం భూమిని ఆక్రమించారు. ఇందులో వరి పంట సాగుచేసేందుకు పక్క పొలాల్లోని బోర్ల నుంచి పైప్‌లైన్ల్ ద్వారా నీటిని చెరువులోకి మళ్లించారు. సాగునీరు అందించే ఈ చెరువు రూపం మారిపోయి పొలాలుగా కనిపిస్తోంది. చెరువును ఆక్రమించి పంటలను సాగుచేయటం వలన ఆయకట్టు రైతులకు సాగునీరు అందకుండా పోయింది. చెరువు కింద ఉన్న కాల్వను కూడ ఆక్రమణదారులు పాడుచేశారు. వర్షాకాలంలో చెరువులోకి నీరు రాకుండా, చెరువు నిండాకుండా చెరువులోకి వచ్చే వాగు ఆనవాళ్లు లేకుండా చేశారు. దీంతో చెరువు కింద ఉన్న 100 ఎకరాల ఆయకట్టు బీడుగా మారింది. కొంతమంది రైతులు బోర్లు వేసుకుని వాటిద్వారా పంటలు పండించుకుంటున్నారు. చెరువు కబ్జాపై ప్రశ్నించిన ఆయకట్టుదారులను ఆక్రమణదారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. చెరువు చుట్టూ కందకాలు తవ్వించాలి కొంత మంది చెరువును ఆక్రమించి పంటలు వేసుకోవడం అన్యాయం. ఆక్రమణకు గురైన చెరువును కబ్జా నుంచి విడిపించి హద్దురాళ్ల చుట్టూ కందకాలను తవ్వించాలి. చెరువును కబ్జాచేసి పంటలు వేయటం వలన చెరువులోకి వర్షపు నీరు రాకుండా పోయింది. మా పొలాలకు సాగునీరు అందడం లేదు. – కొంకలి వెంకటమ్మ సర్వే చేస్తాం ఆక్రమణకు గురైన చెరువును సర్వే చేయించి వాస్తవాలను గుర్తిస్తాం. ఆక్రమణ బయటపడితే సదరు వ్యక్తులను ఖాళీ చేయించి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. సాగునీటి శాఖ అధికారులతో కలిసి చెరువును పరిశీలించి విచారణ జరుపుతాం. – యాదయ్య, ఆర్ ఆక్రమణపై విచారణ చేస్తాం గురుదోట్ల చెరువును ఆక్రమించిన విషయం మా దృష్టికి రాలేదు. రెవెన్యూ అధికారులతో కలిసి చెరువును పరిశీలిస్తాం. సర్వే నిర్వహించి ఆక్రమణను గుర్తిస్తాం. చెరువును ఆక్రమించి పంటలు సాగుచేసుకోవడానికి వీల్లేదు. అలా చేస్తే చర్యలు తీసుకుంటాం.– సుకుమార్, ఏఈ ఇరిగేషన్, ధారూరు -
‘మిషన్’కు గండి పడింది..!
భీమారం : చిన్న నీటి వనరుల పునరుద్ధరణ, అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట ప్రతిష్టాత్మకంగా పనులు చేపట్టింది. రూ.కోట్లాది రూపాయల తో ఇప్పటి వరకు రెండు విడతల్లో పలు చెరువుల పను లు చేపట్టగా.. నాసిరకం పనులు జరిగాయనే ఆరోపణ లు వెల్లువెత్తిన విషయం విదితమే. ప్రస్తుత వర్షాలతో చెరువుల్లో నీరు నిండగా.. పలు చెరువు కట్టలకు గండి పడుతుండడ ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. రూ.53లక్షలతో పనులు జిల్లాలోని పెగడపల్లి పడమటి చెరువు పూడికతీత, అభివృద్ధి కోసం మిషన్ కాకతీయ కింద రూ.53లక్షలు కేటాయించగా పనులు చేపట్టారు. ఇటీవల వర్షాలకు ఇరవై ఎకరాల విస్తీర్ణంలోని ఈ చెరువులో నాలుగు ఫీట్ల మేర నీరు చేరడంతో ఆయకట్టు రైతులు ఆనందపడ్డారు. అయితే, వారి ఆనందం ఆవిరయ్యేలా చెరువుకు బుధవారం తెల్లవారుజామున గండి పడింది. దీంతో నీరు మొత్తం వృథాగా బయటకు వెళ్లడంతో పాటు వందలా ది ఎకరాల పంట భూములు ముంపునకు గురయ్యా యి. పనుల్లో నాణ్యత లోపించడం, అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ఇలా జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. చెరువు కట్ట నిర్మాణంలో భాగంగా సరిగ్గా రోలింగ్ చేయకపోవడం కూడా గండి పడడానికి కారణంగా తెలుస్తోంది. దేవన్నపేట చెరువు కట్ట... దేవన్నపేటలోని బంధం చెరువు కట్ట పూర్తిగా కోతకు గురైంది. ఈ చెరువు పనులు మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టనప్పటికీ 2014లో నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.8లక్షలతో అభివృద్ధి చేశారు. ఈ చెరువు కింద సుమారు 80ఎకరాల ఆయకట్టు ఉంది. ఉదయం 11గంటల ప్రాంతంలో చెరువు కోతకు గురి కావడంతో స్థానికులు నీటిపారుదలశాఖ అధికారులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం 2గంటల వర కు కూడా అధికారులకు చేరుకోలేదు. ఫలితంగా సుమా రు 40ఎకరాల పంట పొలాలు మునిగిపోయ్యాయి. కాగా, పెగడపల్లి, దేవన్నపేటల్లోని చెరువులను స్థానిక తహసీల్దార్ ఎన్.రవి సందర్శించారు. పెగడపల్లి చెరువు వద్ద తక్షణ సహాయ చర్యలు చేపట్టారు. సమీపంలోని క్వారీ నుంచి రాళ్లను తెప్పించే బుంగ పూడ్పించే పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే దేవన్నపేటలోని బంధం చెరువు వద్ద ఇసుక బస్తాలు వేయిస్తూ నీళ్లు బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. అయితే, భారీ వర్షాల కారణంగా మరో నాలుగు చెరువులు ప్రమాదపు అంచున చేరాయి. పడమటి చెరువు, దేవన్నపేట చెరువులకు గండ్లు పడి అందులోని నీరు సమీప చెరువుల్లోకి చేరడంతో వాటికి ప్రమాదం ఏర్పడింది. -
అభివృద్ధిని అడ్డుకుంటే సహించం
కాంగ్రెస్, టీడీపీలపై హరీశ్‌రావు మండిపాటు ► మీ రాజకీయ మనుగడ కోసం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తారా? ► ఆంధ్రా నాయకుల రాద్ధాంతానికి మద్దతు పలుకుతారా? ► వారికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని వ్యాఖ్య ► మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో రోజు పర్యటన ► పలు చోట్ల మిషన్ కాకతీయ పనుల ప్రారంభం ► పనుల్లో జాప్యంపై అధికారులను నిలదీసిన మంత్రి ► నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరిక సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు ప్రాజెక్టు వంటి ప్రజాహిత కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, టీడీపీలకు రాజకీయాలు కావాలో.. ప్రజల సంక్షేమం కావాలో తేల్చుకోవాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాజకీయ మనుగడ కోసం అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటే సహించబోమని హెచ్చరించారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం నిజాలాపూర్‌లో మిషన్ కాకతీయ రెండో విడత పనులను హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. రాజకీయ మనుగడ కోసం ప్రజాహిత కార్యక్రమాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు రాజకీయ సమాధిచేసే రోజులు ఎంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న రాద్ధాంతానికి ఆ పార్టీల తెలంగాణ నేతలు వత్తాసు పలకడం దారుణమని చెప్పారు. పాలమూరు ప్రజలు కరువుతో మాడినా, దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్నా ఆ పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు.. మహబూబ్‌నగర్ జిల్లాలో మిషన్ కాకతీయ పనుల పురోగతిపై అధికారులను మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. వేదికపైకే పిలిచి వారి డివిజన్లలో కేటాయించిన చెరువుల జాబితా, పనుల తీరును పరిశీలించారు. రెండో విడతలో మంజూరైన చెరువులకు సంబంధించి ఇంకా ఒప్పందాలు పూర్తి కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాకు రెండో విడతలో 1,530 చెరువులకు రూ.420 కోట్లను మంజూరు చేస్తే... కేవలం 570 చెరువుల అగ్రిమెంట్లు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘‘ముఖ్యమంత్రి ఎంతో ప్రేమతో నిధులు మంజూరు చేశారు. అధికారులు పనిచేయకపోతే వ్యవసాయ సీజన్ ప్రారంభంనాటికి పనులు పూర్తికావు. అప్పుడు రైతులు మరో సంవత్సరం నష్టపోవాల్సి వస్తుంది. తెలంగాణ మొత్తానికి రాని నిధులు పాలమూరుకు ఇస్తే మీరు పనిచేయకపోతే ఎలా? ఈ నిర్లక్ష్యాన్ని ఇక ముందు సహించబోం. సస్పెన్షన్ వేటు వేయాల్సి వస్తుంది..’’ అని హరీశ్ హెచ్చరించారు. మే 3న లేదా 4న జిల్లాకు వచ్చేసరికి అన్ని చెరువుల అగ్రిమెంట్లు పూర్తికావాలని, లేకుంటే సంబంధిత డీఈలను సస్పెండ్ చేస్తానని పేర్కొన్నారు. టెండర్లు తెరిచిన వెంటనే ఎమ్మెల్యేల కోసం ఆగకుండా పనులను మొదలుపెట్టాలని ఆదేశించారు. శంకర సముద్రం వద్ద కానాయపల్లివాసులు పరిహారం తీసుకున్నా ఖాళీ చేయడం లేదని... దాన్ని విడిచిపెట్టేది లేదని పేర్కొన్నారు. వెంటనే గేట్లు బిగించి నీళ్లు నింపి పొలాలకు పారిస్తామన్నారు. హరీశ్‌రావు వెంట మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ తదితరులు ఉన్నారు. సుడిగాలి పర్యటన మంత్రి హరీశ్‌రావు రెండో రోజూ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. శుక్రవారం రాత్రి జొన్నలబొగుడ రిజర్వాయర్ వద్ద నిద్రించిన మంత్రి... శనివారం ఉదయం సొరంగం, సర్జిపుల్ పంపు, విద్యుత్ మోటార్ల పనులు పరిశీలించారు. అనంతరం నాగర్‌కర్నూల్‌కు చేరుకున్నారు. అక్కడ మినీ ట్యాంక్‌బండ్, మిషన్ కాకతీయ, నూతన మార్కెట్ యార్డు, గోదాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి అడ్డాకుల మండలం నిజాలాపూర్‌కు చేరుకుని మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. తర్వాత దేవరకద్రకు వెళ్లి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడినుంచి మహబూబ్‌నగర్‌కు చేరుకుని పెద్దచెరువు వద్ద నిర్మించిన ట్యాంక్‌బండ్‌ను పరిశీలించారు. అక్కడ విలేకరులతో మాట్లాడిన అనంతరం హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. -
అంతర్జాతీయ వేదికపై మిషన్ కాకతీయ
► సోమవారం నుంచి ఢిల్లీలో ఇండియన్ వాటర్ వీక్, 20 దేశాల నుంచి ప్రతినిధుల హాజరు ► చెరువుల పునరుధ్దరణపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్న రాష్ట్రం ► చివరి రోజు మంత్రి హరీష్‌రావు హాజరయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: దేశంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకునే అవకాశాలను పరిశీలించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రచించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. దేశ వ్యాప్తంగా సుస్థిర నీటి యాజమాన్యానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తతంగా చర్చించేందుకు ‘ఇండియన్ వాటర్ వీక్’ పేరుతో అంతర్జాతీయ సదస్సును ఢిల్లీలో నిర్వహిస్తోంది. ‘సుస్థిరాభివధ్ధికి నీటి యాజమాన్యం’ పేరుతో సోమవారం ప్రారంభం కానున్న సదస్సు ఈ నెల 8వరకు కొనసాగనుంది. ఇందులో అంతర్జాతీయంగా పేరుగాంచిన సంస్థలు, వ్యక్తులతో పాటు జల వనరులతో ముడిపడి ఉన్న అన్ని మంత్రిత్వ శాఖలు, అనుబంధ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని తమతమ అభిప్రాయాలను వివరించనున్నారు. ఈ వేదిక రాష్ట్రంలో చెరువుల పునరుధ్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్ కాకతీయ’పై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. 1500ల ప్రతినిధుల ముందు మిషన్‌పై వివరణ.. కేంద్ర జల వనరుల శాఖ ప్రాధమికంగా వేసిన అంచనా మేరకు..దేశంలో సగానికి పైగా జనాభాకు స్వఛ్చమైన రక్షిత నీటిని పొందలేకపోతున్నారు. సుమారు 8.2కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీరు అందడం లేదు. దేశంలో ఏడాదికి నీటి జనిత రోగాల కారణంగా 73లక్షల పనిదినాలు కోల్పోతోంది. పెరుగుతున్న నీటి డిమాండ్‌కు అనుగుణంగా వనరుల లభ్యత లేకపోవడంతో భవిష్యత్ అవసరాలపై ఇది పెనుప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా నీటి యాజమాన్యంపై ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. చుక్క నీటిని ఒడిసిపట్టేలా, లభ్యత నీటిని పారిశ్రామిక, విద్యుత్, సాగు, తాగునీరు అవసరాలకు సమర్ధంగా వినియోగించే అంశాలు, ఇందులో భాగంగానే వ్యవసాయ, ప్లానింగ్, విద్యుత్, గ్రామీణ, పట్టణాభివృధ్ధి, పర్యావరణ, అటవీ శాఖలు, ఐఐటీ, భారత నీటి, వ్యవసాయ పరిశోధన సంస్థలతో కలిపి సదస్సు నిర్వహిస్తోంది. ఇక్కడ వచ్చే అభిప్రాయాల ఆధారంగా భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా కేంద్రం ప్రణాళికలు రచించనుంది. ఈ సదస్సులో సుమారు దేశాల నుంచి మొత్తంగా 1500ల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సద్సులో పాల్గొనాలని ఇప్పటికే కేంద్ర జల వనరుల శాఖా మంత్రి ఉమాభారతి స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుని ఫోన్ ద్వారా ఆహ్వానించారు. అయితే ఇరతర కార్యాక్రమాల దృష్ట్యా ముఖ్యమంత్రి ఈ సమావేశాలకు వెళ్లే అవకాశం లేదు. అయితే తొలి రోజు నుంచి ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు. 8న ముగింపు సమావేశానికి నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీష్‌రావు హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తంగా గుర్తించిన చెరువులు, వాటిని నిర్ణీత కాలానికి నిర్దేశించకున్న బడ్జెట్లకు అనుగుణంగా చేపట్టిన పునరుధ్దరణ కార్యక్రమాలు, ఇప్పటికే మొదటి విడత ద్వారా సాధించిన ఫలితాలను ప్రత్యేక ప్రజెంటేషన్‌లో రాష్ట్రం వివరించే అవకాశం ఉంది. -
మిషన్‌పై ఫైర్
ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. మిషన్ కాకతీయపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటలయుద్ధం కొనసాగింది. పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్వాకం వల్ల ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోందని ధ్వజమెత్తారు. బుధవారం ఉదయం జడ్పీ సీఈవో మారుపాక నాగేష్ సమావేశాన్ని ప్రారంభించారు. అందరూ సహాయ సహకారాలతో పనిచేయూలని సీఈవోతోపాటు జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత ఆకాంక్షించారు. వచ్చేనెలలో జిల్లాలో రెండు ముఖ్యకార్యక్రమాలు హరితహారం, గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలంబరితి తెలిపారు. హరితహారంలో మూడులక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్‌పై ఏకగ్రీవ తీర్మానం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రతిపాదించారు. ఈ మేరకు సభ ఏకగ్రీవం తీర్మానం చేయాలని సూచించారు. సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలపడంతో చైర్పర్సన్ ఆమోదం తెలిపారు. రిజర్వేషన్ల నిర్ణయం కేంద్రం పరిధిలో ఉంటుందని, ఈ తీర్మానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తుమ్మలకు వివరించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాకతీయ మిషన్ ద్వారా చేపడుతున్న చెరువుల అభివృద్ధి నివేదికను ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్ వివరించారు. పినపాక నియోజకవర్గంలో రాయన్నకుంట చెరువు పనుల్లో అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కై అర్హత గల రైతులకు మట్టి తోలకుండా అర్ధరాత్రి దొంగల్లా మట్టిని రూ.300కు విక్రరుుంచారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సభ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ నిర్ణయం మంచిదైనప్పటికీ అధికారులు, అధికారపార్టీ నేతల నిర్వాకంతో లక్ష్యం దెబ్బతింటోందని పాయం వాపోయూరు. ఏజెన్సీలో చెరువు పనులకు అటవీ అధికారుల నుంచి అనుమతి ఇప్పించాలని కోరారు. స్పందించిన కలెక్టర్ మిషన్ పనులు కొనసాగుతున్న చెరువులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు రికార్డు చేయూలని, ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే రెండుమూడురోజుల్లో రాతపూర్వకంగా ఇవ్వాలని సూచించారు. శాసనసభ్యుల ప్రతిపాదనలను సైతం పక్కనబెట్టారని వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నిర్దేశించిన ప్రణాళికకు అనుగుణంగా చెరువు పనులు సాగటం లేదని ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్ సభ దృష్టికి తెచ్చారు. క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్ కమిటీలు ఎన్ని చెరువులపై విచారణ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. చిమ్మపూడిలో కట్టమీద ఉన్న చెట్లను తొలగించకుండానే మట్టితో పూడ్చి వేస్తుంటే రైతులు అడ్డుకున్నారన్నారు. దీనిపై ప్రశ్నించినందుకు టీఆర్ఎస్ నాయకులు బెదిరించారని అన్నారు. దీనిపై ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ ఆక్షేపణ తెలిపారు. అనేక ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల నుంచి వెళ్లిపోవాలని అటవీ అధికారులు పోడుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రస్తావించారు. ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు..జడ్పీటీసీలకు అవకాశం ఇవ్వరా? అని రఘునాథపాలెం జడ్పీటీసీ వీరూనాయక్ అనడంతో ‘అరుుతే మేము అవసరం లేదా?’ అంటూ ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ బయటకు వె ళ్లబోయూరు. చైర్పర్సన్ జోక్యం చేసుకొని ఆయనకు నచ్చజెప్పారు. ఐటీడీఏ గవర్నింగ్ బాడీకి తీర్మానం.. ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించాలని సభ తీర్మానించింది. మైదాన ప్రాంతలో ఐటీడీఏ ద్వారా ఎక్కడ ఏయే పనులు జరుగుతున్నాయో తెలియని పరిస్థితి ఉందని ఎమ్మల్యేలు మదన్‌లాల్ ,అజయ్‌కుమార్ పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లలో రుణాలకు బ్యాంక్ కాన్సెంట్ ఇవ్వడం లేదని జడ్పీటీసీ ఉన్నం వీరేంధర్ తెలిపారు. స్థానిక సంస్థల 29 అధికారాల్లో ప్రతి అంశం జడ్పీ కిందకు వస్తుందని, వ్యవసాయశాఖ లావాదేవీలన్నీ ఆమోదం తీసుకుంటున్నారా అని జేడీఏని మదన్‌లాల్ ప్రశ్నించారు. ఇక నుంచి అన్ని అంశాలను జడ్పీలో చర్చించి, ఆమోదంతోనే నిర్ణయం తీసుకోవాలని చైర్పర్సన్ సూచించారు. బోనకల్ మండలంలో మూడుగ్రామాలకు ఇన్‌ఫుట్ సబ్సిడీ వచ్చిందని, దానిలో 600 ఎకరాలు బోగస్ అని తేలిందని, అర్హులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఎరువులు ఇవ్వకుండా ఖమ్మంకు తరలించారని జెడ్పీటీసీ, ఎంపీటీలు వివరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ కవిత, జేడీఏ, ఆత్మ పీడీలను ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. -
ఉద్యమ స్ఫూర్తితో ‘మిషన్ కాకతీయ’
షాద్‌నగర్ రూరల్ : మిషన్ కాకతీయలో భాగంగా చేపడుతున్న చెరువుల మరమ్మతు, పూడికతీత పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ టీకే శ్రీదేవీ ఆదేశించారు. ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామశివారులోగల మామిడికుంట చెరువు పనులను ఆదివారం కలెక్టర్ పరిశీలించారు. పనులు ఎందుకు ఆలస్యంగా జరుగుతున్నాయని అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించారు. రానున్న నాలుగు వారాలలో వర్షాలు వచ్చేఅవకాశాలున్నాయని, వర్షాలువస్తే పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామంలో ప్రతిఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండేలా చూసుకోవాలని సర్పంచ్ సుమనకు సూచించారు. అనంతరం బిల్లులు రాలేదని లబ్దిదారులు కలెక్టర్‌కు ఫిర్యాదుచేయగా ఫీల్లుఅసిస్టెంట్ను ప్రశ్నించారు. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల శిథిలావస్థలో ఉందని, నిధులు మంజూరు చేయించి వచ్చే విద్యాసంవత్సరంలో సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరారు. అనంతరం గ్రామశివారులోని నర్సరీని పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఈ వెంకటస్వామి, ఈఈ నరింసంగరావు, ఏఈ భవానీ, ఇన్చార్జీ డీపీఆర్ఓ లక్ష్మణ్, డిప్యూటీ తహశీల్దారు శ్రీనివాసులు, వీఆర్ఓ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘మిషన్’లో టీఆర్ఎస్ నేతల పెత్తనం
గద్వాలన్యూటౌన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులు జరగకుండా నియోజకవర్గంలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అడ్డుకుంటున్నారని, అధికారులను తీవ్రంగా వేధిస్తున్నారని మాజీమంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే మండలంలోని మేలచెర్వు గ్రామంలోని పెద్దమ్మ చెరువు పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం టెండర్లు వేసి పనులు ప్రారంభించిన చోట్ల కాంట్రాక్టర్లు తమవారుకాదనే ఉద్దేశంతో టీఆర్ఎస్ నాయకులు పనులు నిలిపేస్తున్నారని అన్నారు. ఇతర పార్టీలకు చెందిన సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు ఉన్నచోట పనులకు ఆటంకం కలిగిస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేగా తాను పాల్గొనరాదని ఏకంగా అధికారులకే హుకుం జారీచేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే అధికార పార్టీ నాయకుల వేధింపులకు తాళలేక డీఈ దీర్ఘకాలిక సెలవులో వెళ్లారని, ఏఈలు బదిలీలు కోరుకుంటున్నారని చెప్పారు. గద్వాల నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఉన్న తనకు ప్రొటోకాల్‌కు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సర్పంచ్ వేణుగోపాల్‌రెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, బండల వెంక ట్రాములు, శంకర్, రామాంజనేయులు, నరేందర్‌రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, రామిరెడ్డి పాల్గొన్నారు. -
‘కాకతీయ’ అక్రమాలకు అధికారులదే బాధ్యత
రాజకీయ ఒత్తిళ్లకు లొంగితే... అంతే పత్రికల్లో వచ్చే వార్తలకు వెంటనే స్పందించాల్సిందే అధికారులకు మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశం సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మిషన్ కాకతీయ కార్యక్రమంలో అక్రమాలు జరిగితే అధికారులనే బాధ్యులని చేస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధుల ఫోన్ల ఒత్తిడికి లొంగిపోయామని అధికారులు చెబితే ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ కార్యక్రమాల అమలు తీరుపై శనివారం నిర్వహించిన సమీక్షలో ఈటెల మాట్లాడారు. ఎంతో పవిత్ర ఆశయంతో రూపొందించిన మిషన్ కాకతీయ కార్యక్రమం అమలులో కరీంనగర్ జిల్లా బాగా వెనుకబడి ఉందన్నారు. జూన్‌లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇంకా చాలాచోట్ల పనులు ప్రారంభమే కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగత స్వార్ధం, బద్దకంతో వ్యవహరించే అధికారుల తీరుతోనే ఇలా జరుగుతోందన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయకపోతే ఆశించిన ఫలితాలు రావని అభిప్రాయపడ్డారు. మిషన్ కాకతీయ అక్రమాలకు సంబంధించి పత్రికల్లో వచ్చే వార్తలకు ఎప్పటికప్పుడు అధికారులు స్పందించి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణ అంచనాల్లో 35 శాతం వరకు తక్కువగా టెండర్ వేయడం పట్ల సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. ‘అధికారుల అంచనా కంటే 35 శాతం వరకు తక్కువగా టెండర్ వేస్తే పనుల్లో నాణ్యతైనా లోపిస్తుంది... లేదంటే అధికారులే అంచనాలను అమాంతంగా పెంచి ఉండాలి. అంతే తప్ప పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోయే ప్రసక్తే ఉండదు’ అని అన్నారు. దీనిపై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చెరువుల్లోని మట్టిని రైతులకు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ ఒక్కో ట్రాక్టర్‌కు రూ.50 చొప్పున కాంట్రాక్టర్లు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఆర్థికమంత్రి నియోజకవర్గంలోనే ఇది జరుగుతున్నట్లు పత్రికల్లోనూ వార్తలొస్తున్నాయని చెప్పారు. తన నియోజకవర్గంలో మట్టిని అమ్ముకునే పరిస్థితి లేదని, ఇప్పటికే ఇదే అంశంపై పలుమార్లు సమీక్ష జరిపానని ఈటెల తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ ఫారెస్ట్, రెవెన్యూ అధికారులెవరూ చెరువులవైపు ముఖం కూడా చూపడం లేదని, పనులు ప్రారంభించిన తాము మాత్రం ప్రజల దృష్టిలో చులకన అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నుంచి 9 గంటల విద్యుత్ వచ్చే ఏడాది నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు 9 గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కెపాసిటీ పెరిగే అవకాశమున్నందున అందుకు తగినట్లుగా సబ్స్టేషన్లు ఉన్నాయా? అనే అంశంపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, బొడిగె శోభ, నగర మేయర్ రవీందర్‌సింగ్, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, అదనపు జేసీ నాగేంద్ర, అధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం
ప్రజల కోసం పని చేసేదే ప్రభుత్వం అసెంబ్లీలో అంశాలపై స్పీకర్‌దే నిర్ణయం : గవర్నర్ సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ప్రజల కోసం పని చేసేదే ప్రభుత్వం. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. పౌరులుగా అందరం కలిసి కృషి చేయాలి. నేను, మీరు అని కాకుండా.. మనం అనేలా ఉండాలి’ అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. చెరువుల పరిరక్షణకు చేపట్టిన మిషన్ కాకతీయ పథకం పనులు బాగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రెండు రోజుల వరంగల్ పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు వెళ్లే ముందు బుధవారం హన్మకొండలో గవర్నర్ విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీకి సంబంధించి ఎలాం టి అంశమైనా స్పీకర్‌దే తుది నిర్ణయమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘వరంగల్‌తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. 1972లో నేను నర్సంపేట ఏఎస్పీగా పని చేశాను. ఇప్పుడు గవర్నర్‌గా రావడం ఆనందంగా ఉంది. ’ అని చెప్పారు. గవర్నర్ దంపతులు హన్మకొండలోని చారిత్రాత్మక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. -
జల నిర్లక్ష్యంతో జీవం ఆవిరే!
సమకాలీనం ఐరాస పిలుపు మేరకు ‘నీరు-నిలకడైన అభివృద్ధి’ ఈ ఏడాది ప్రాధాన్యతాంశంగా ప్రపంచ దేశాలు కసరత్తు చేస్తుండగా... తెలంగాణలో చెరువుల్ని పునరుద్ధరించే ‘మిషన్ కాకతీయ’ను, ఏపీలో ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేపట్టాయి. భారీ వ్యయంతో చేస్తున్న ఈ కార్యక్రమాలకు శాస్త్రీయ దృక్పథాన్ని జత చేసి, స్థానిక సంస్థలతో అనుసంధానించాలి. మనిషి మనుగడ కోసం, భవిష్యత్ అవసరాల కోసం నీటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తిం చాలి. అన్ని స్థాయిల్లో స్పందించి ప్రతి నీటి చుక్కను అర్థవంతంగా వాడితేనే భూగ్రహానికి రక్ష. మూడో ప్రపంచ యుద్ధమంటూ వస్తే అది నీటి కోసమే జరుగుతుందనే మాట దశాబ్దాలుగా వింటున్నాం. మానవ మనుగడకు నీరు కేంద్ర బిందువైన తీరు దృష్ట్యా నీటి ప్రాధాన్యాన్ని, నీటిని చుట్టుముట్టి వస్తున్న పర్యావరణ మార్పులను, ప్రమాదాల్ని చూస్తుంటే... ఆ యుద్ధం ఇప్పటికే మొదలైందని స్పష్టమౌతోంది. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక, స్థాయిల్లో నీటి యుద్ధాలు ఇప్పటికే సాగుతున్నాయి. ఉదాసీన వైఖరితో ఉపేక్షిస్తే, అవి మరింత తీవ్ర రూపం దాల్చి మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేయగలవని ప్రమాద ఘంటి కలు మోగుతున్నాయి. మితిమీరుతున్న ‘భూతాపం’ సృష్టిస్తున్న అనర్థాలు ‘వాతావరణ మార్పు’ తదితర రూపాల్లో ఇప్పటికే తీరని నష్టాన్ని కలిగిస్తున్నా యి. సహజ వనరైన నీటికి పర్యావరణ పరంగా ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి, నష్టాన్ని తగ్గించడం, నీటి కాలుష్యాన్ని నియంత్రించి సగటు మనిషి జీవన ప్రమాణాల్ని పెంచుకోవడంలో, జల వనరుల పరిరక్షణలో సాధించాల్సింది ఎంతో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ఏటా మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం పాటిస్తున్నారు. 1993 నుంచి జల దినోత్సనం పాటిస్తూనే ఉన్నా సమస్య మరింతగా జటిలమౌతూనే ఉంది. అందుకే ఐరాస ‘నీరు-నిలకడైన అభివృద్ధి’ని ఈ ఏడాది ప్రాధాన్య తాంశంగా ఖరారు చేసింది. ప్రపంచ దేశాలు ఈ అంశంపై కసరత్తు చేస్తుం డగా... రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు ప్రతిష్టాత్మకమైన కార్యక్ర మాలు చేపట్టాయి. తెలంగాణలో చెరువుల్ని పునరుద్ధరించే ‘మిషన్ కాకతీ య’ను మొదలెడితే, ఆంధ్రప్రదేశ్‌లో ‘నీరు-చెట్టు’ కార్యక్రమం చేపట్టింది. ఈ రెండిటికీ కేంద్ర బిందువు నీరే. అయితే, వాటికి శాస్త్రీయ దృక్పథాన్ని అందించి, వాటిని ప్రజలతో, జన సమూహాలతో, గ్రామ పంచాయతీల వంటి స్థానిక సంస్థలతో మరింతగా అనుసంధానించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ముతక విధానాలేనా? ప్రపంచమంతా ఆధునికతవైపు పరుగిడుతుంటే, మనమింకా సంప్రదాయిక ముతక పద్ధతుల్లోనే కొట్టుమిట్టాడుతున్నాం. నదుల్ని అడ్డగించి ఆనకట్టలు, పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు, కాలువలతో మనం అవలంబిస్తున్న పొలాన్ని నీటితో నింపే వరద (ఫ్లడ్) సాగు పురాతన పద్ధతి. దీనివల్ల పలు అనర్థాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అభివృద్ధిచెందిన దేశాల్లో నీటిని పొదుపుగా వాడి పర్యావరణ అనుకూలమైన తేమ, పొగ మంచు, బిందు (డ్రిప్), తుంపర (స్ప్రింక్లర్) వంటి ఆధునిక పద్ధతుల్లో సేద్యం చేస్తున్నారు. ఇజ్రాయెల్, టర్కీ వంటి దేశాలు ఈ పద్ధతులతో గణనీయమైన విజయాలు సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. టర్కీలో నీటి కనిష్ట వినియోగంతో అద్భుతాలు సృష్టించారు. పల్లపు భూములన్నింటినీ చిన్న చిన్న కమతాలుగా సమతలం చేశారు. యూఫ్రిటీస్, టైగ్రిస్ జలాల్ని ఇలా ఒడుపుగా వినియోగిస్తూ ఆహారోత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నారు. పొలాల్లో నీటిని వరదలా పారించడం వల్ల సూక్ష్మ ఖనిజాలు కొట్టుకుపోయి భూసారం చెడుతోంది. తేమ, కనీస తడి వంటి ఆధునిక పద్ధతుల్లో భూసార పరిరక్షణ జరుగుతుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్ని వ్యవ సాయ క్షేత్రాలతో అనుసంధానం చేసే పని మన వద్ద జరగటం లేదు. ఆదర్శ పరిస్థితుల్లో ఒక క్యాలరీ ఆహారోత్పత్తికి ఒక లీటరు నీరు సరిపోతుంది. కానీ, సంప్రదాయక సాగుతో ఒక క్యాలరీ ఆహారోత్పత్తికి వంద లీటర్ల నీరు అవసర మౌతోంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగమౌతున్న నీటిలో సగటున 70 శాతం వ్యవసాయ అవసరాలకై పోతోంది. కాలం చెల్లిన వ్యవసాయ పద్ధతులే ఇందుకు ప్రధాన కారణం. పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం వల్ల పర్యావర ణానికి ముప్పు తప్పదు. నైలు నది ఎగువనున్న దేశాలు విద్యుత్, వ్యవసాయ అవసరాల కోసం ఆనకట్టలు, ప్రాజెక్టులు నిర్మిస్తుండటం వల్ల ఒండ్రు మట్టి దిగువ ప్రాంతాలకు రాక ఆ ప్రాజెక్టుల్లోనే పేరుకుపోతోంది. ఈజిప్ట్ తదితర దేశాలకిది శాపంగా పరిణమిస్తోంది. ఇదే పద్ధతి కొనసాగితే ప్రపంచంలో చాలా జీవనదులు నిర్జీవ నదులుగా మారే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర జల వివాదాలు కొత్తేం కాదు. గోదావరి, కృష్ణా జల వివాదాలు తెలుగు రాష్ట్రాల మధ్య రావణ కాష్టంలా రగలడం నిత్యం చూస్తున్నదే! నదీ బోర్డులు, వాతావరణ మార్పు కేంద్రాలు రావాలి రాజకీయ వ్యవస్థ సంకుచితంగా ఆలోచించినంత కాలం జల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించదు. అందుకు పూర్తి స్వేచ్ఛ, సర్వాధికారాలు కలి గిన స్వతంత్ర నదీ బోర్డులుండాలని నిపుణులు చాలా కాలంగా చెబుతు న్నారు. తాగునీరు, సాగునీరు, విద్యుదుత్పత్తి అన్న ప్రాధాన్యతా క్రమంలో ఎప్పుడు, ఏ ప్రాజెక్టు నుంచి, ఎవరికెన్ని నీళ్లు విడుదల చేయాలనే నిర్ణయా లను ఈ బోర్డు న్యాయస్థానాల, ట్రిబ్యునళ్ల తీర్పులను బట్టి తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో రాజకీయ జోక్యానికి తావుండరాదు. ఇలాంటి ప్రాధికార సంస్థల నిర్వహణ వల్లే అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. వాతావరణ కాలుష్యాల వల్ల భూతాపం పెరిగి, అది వాతావరణ మార్పులకు కారణమౌతోంది. ఫలితంగా వర్షాలు సరిగ్గా కురవటం లేదు. రుతుక్రమం దెబ్బతిని, అతివృష్టి లేదా అనావృష్టితో వ్యవసాయానికి తీరని భంగం కలు గుతోంది. అక్కడక్కడ కొన్ని నల్లరేగడి భూముల్లో మినహాయిస్తే వర్షాధార పంటలే పండని పరిస్థితి వచ్చేస్తోంది. నిలువ నీటిపై ఆధారపడక తప్పని స్థితి దాపురించింది. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ మునుపెన్నడూ లేనంత ప్రమాదకర స్థాయికి అవి పడిపోయాయి. వేయి, రెండు వేల అడుగుల వరకు బోర్లు వేస్తేగానీ నీరు పడని పరిస్థితి. ఆధు నిక శాస్త్ర సాంకేతికత దృష్ట్యా మన సాగు విధానాలు, పద్ధతులు మారాల్సి ఉంది. తద్వారా వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ‘వెదర్ మాడిఫికేషన్ సెంటర్స్’ (డబ్లూఎంసీ)ను ఏర్పాటు చేయడం అవసరం. రాజకీయ జోక్యం లేని స్వతంత్ర ప్రతిపత్తి గల ఈ సంస్థలు నిపుణుల నిర్వహణలో నడవాలి. వర్ష రుతువులో ‘మేఘ మథ నం’ ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించాలి. అందుకోసం డబ్లూఎంసీని వైమా నిక దళంతో అనుసంధానించాలి. ఈ పనులను ప్రభుత్వమే చేపట్టాలి తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం చేయరాదు. ప్రజలతో, పంచాయతీలతో లంకె పెట్టాలి తెలంగాణలో చెరువులకు పునర్ వైభవం తీసుకురావడానికి మిషన్ కాకతీ యను చేపట్టారు. దాదాపు 46 వేల చెరువుల్ని పునరుద్ధరించడం ద్వారా వాటి నీటి నిలువ సామర్థ్యాన్ని 265 శతకోటి ఘనపుటడుగులకు (టీఎంసీలు) పెంచాలని లక్ష్యం. తద్వారా 25 లక్షల ఎకరాల సాగును స్థిరీకరించడమో, పునరుద్ధ్దరించడమో జరుగుతుంది. వచ్చే ఐదేళ్లలో దాదాపు 36 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా, గోదావరి లోతున ప్రవహి స్తుండటంతో కాకతీయుల కాలం నుంచి చెరువులే తెలంగాణలో సాగునీటికి ఆదరువుగా ఉన్నాయి. నదుల నీరు వాడుకోడానికి ఎత్తిపోతల పథకాలే దిక్కు. వాటికి పెద్ద ఎత్తున నిధులు, విద్యుత్తు అవసరం. దీంతో ప్రభుత్వాలు అలాంటి ప్రాజెక్టుల పట్ల ఆసక్తి చూపలేదు. పాలకుల నిర్లక్ష్యం వల్ల చెరువుల కింద సాగు అంతరించే పరిస్థితి దాపురించింది. చెరువుల పూడిక తీయడమే కాకతీయ మిషన్ ప్రధాన ప్రక్రియగా ఉంది. దీనివల్లే పూర్వ వైభవం రాదు. దాదాపు వెయ్యేళ్లు చెరువులు సురక్షితంగా ఉండటానికి ప్రధాన కారణం చెరువు, ఊరు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటమే. చెరువు నీళ్లతో పం టలు పండేవి. చాకలి, కుమ్మరి, మత్స్యకారులు తదితర సకల వృత్తులకు ప్రధాన జీవనాధారం చెరువే. చెరువుకు గ్రామానికి మధ్య ఉన్న విడదీయరాని బంధం నేడు తెగిపోయింది. చెరువుల వల్ల మోట బావులు, ఊట బావులు, చేద బావుల్లో నీరుండేది. భూగర్భజల మట్టాలూ పైనే ఉండేవి. చెరువులపై నిర్లక్ష్యం పెరిగాక, చెరువులోకి నీరొచ్చి చేరేందుకు ఆధారమైన పరీవాహక ప్రాంతాలు చాలా వరకు సాగులోకొచ్చాయి. ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసు కున్నారు. చెరువులు కూడా కబ్జాలకు గురయ్యాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రియల్ మాఫియాల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వీటిని విముక్తం చేయాల్సి ఉంది. అందుకుగాను, ఈ చెరువుల పునరుద్ధరణ, నిర్వహణ తదితరాలన్నింటినీ గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు అప్పగించాలి. వారికి అధికారాలు కల్పించి గ్రామ సభను నిర్ణాయక వేదికగా బలోపేతం చేయాలి. ఊరు-చెరువు మధ్య బంధాన్ని పటిష్టపరచాలి. అప్పుడే చేస్తున్న కృషికి సార్థకత. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన నీరు-చెట్టు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. చెరువుల్ని పునరుద్ధరించడం, కుంటలు, కాలువల్లో పూడిక తీయడం, మెరుగైన పద్ధతుల్లో చెక్ డ్యాములు, తదితర నీటి నిల్వ వసతుల్ని మెరుగు పరచడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టడం కూడా ఇందులో భాగమే! వచ్చే ఐదేళ్ల కాలంలో యాభై కోట్ల మొక్కలు నాటడం, ఇతర పర్యావరణ అనుకూల చర్యల ద్వారా నీటి లభ్యతను మెరుగుపరచడం నీరు-చెట్టు పథకం లక్ష్యంగా ప్రకటించారు. ఈ ఐదేళ్లలో సుమారు రూ.27 వేల కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. ఇంత పెద్ద మొత్తాల్లో ప్రజాధనం వెచ్చించేటప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ సంకుచిత దృష్టితో కాక విస్తృత జనహితంతో ఆలోచించాలి. పౌరులు, ప్రజా సంఘాలతో పాటు స్థానిక సంస్థల్ని క్రియాశీ లంగా ఇందులో భాగస్వాముల్ని చేస్తూ భవిష్యత్ కార్యక్రమాల్ని రచించాలి. ఇలాగే నీటిని నిర్లక్ష్యం చేస్తే భూమిపై జీవమే ఆవిరి కాక తప్పదు నిబంధనల్ని గాలికొదిలే కంపెనీలు, కర్మాగారాలు, నిఘా సంస్థలు నీటి కాలు ష్యానికి కారణమౌతున్నాయి. నదీ గర్భం నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఇసుకను తరలిస్తున్న మాఫియాల చర్యలు భూమిపై వ్రణాలు, పుండ్లు పెరగడానికి దోహద పడుతున్నాయి. నిర్లక్ష్యపు ప్రభుత్వాలు నిలకడైన అభివృద్ధిని లక్ష్య పెట్టకుండా తాత్కాలిక కంటితుడుపు చర్యలతో పబ్బం గడుపుతూ పర్యా వరణానికి గండి కొడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనమంతా అప్రమత్తం కావాలి. మన మనుగడ కోసం, భవిష్యత్ అవసరాల కోసం నీటిని కాపాడు కోవాల్సిన ప్రాముఖ్యతను గుర్తించాలి. ప్రభుత్వాలుగా, కార్పొరేట్లుగా, సంస్థ లుగా, పౌరసంఘాలుగా, వ్యక్తులుగా.. అన్ని స్థాయిల్లో స్పందించి ప్రతి నీటి చుక్కను కాపాడి అర్థవంతంగా వాడితే గానీ భూగ్రహానికి రక్షణ లేదు. (మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా) ఆర్. దిలీప్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
యుద్ధప్రాతిపదికన మిడ్‌మానేరు పనులు
• ఎల్లంపల్లి చెల్లింపులూ పూర్తి చేస్తాం • ప్రతిష్టాత్మకంగా చెరువుల పునరుద్ధరణ • ఉద్యోగులందరూ రాత్రింబవళ్లు పనిచేయూలి • భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు • ఎల్ఎండీలో మిషన్ కాకతీయ సదస్సు అమరవీరుల స్తూపం ఆవిష్కరణ • జిల్లాకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయండి • మంత్రిని కోరిన ఎమ్మెల్యేలు గంగుల, రసమయి కరీంనగర్ : మిషన్ కాకతీయతోపాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు చెప్పారు. అందులో భాగంగా మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. ఎల్ఎండీ కాలనీలోని నీటిపారుదలశాఖ కార్యాలయ ఆవరణలో ఆ శాఖ జిల్లా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని గురువారం హరీష్‌రావు ఆవిష్కరించారు. చిన్నప్పుడు ఇక్కడి సరస్వతి శిశుమందిర్‌లోనే చదువుకున్నా. ఇప్పుడు నేను మంత్రిగా ఉన్న శాఖ కార్యాలయం ఇక్కడే ఉండటం, ఇదే చోట అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. అనంతరం అదే అవరణలో ఏర్పాటు చేసిన మిషన్ కాకతీయ సదస్సులో మాట్లాడుతూ.. ‘మిడ్‌మానేరు ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. గత పాలకులు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు సరిగా డబ్బులు ఇవ్వలేదు. ఆ చెల్లింపులన్నీ పూర్తి చేస్తాం. వచ్చే ఏడాది నాటికి ఎల్లంపల్లిలో పూర్తిస్థాయిలో నీటిని నింపుతాం. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులనూ చేపడతాం. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందించబోతున్నాం. రైతులంతా చిరునవ్వుతో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే మా ముందున్న లక్ష్యం’ అని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పథకం అంతర్జాయంగా అందని దృష్టిని ఆకర్షిస్తోందని హరీష్‌రావు తెలిపారు. అమెరికాలోని మిచ్‌గాన్ వర్శిటీ బృందం మిషన్ కాకతీయపై ప్రత్యేకంగా అధ్యయనం చేసేందుకు లక్ష డాలర్లు ఖర్చు చేస్తోందన్నారు. దేశంలోని పలు వర్శిటీలు సైతం ఈ కార్యక్రమంపట్ల ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. తెలంగాణలో ఈ కార్యక్రమం విజయవంతమైతే మధ్యప్రదేశ్‌లోనూ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అమలు చేస్తామని కేంద్ర మంత్రి ఉమాభారతి చెప్పారన్నారు. నాలుగు నెలల్లో తొమ్మిది వేల చెరువులను పునరుద్దరించడం మామూలు విషయం కాదని, ఉద్యోగులంతా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయాన్ని ఉద్యమరూపంలోకి తెచ్చిన ఘనత టీఎన్జీవోలకు మినహా దేశంలో మరే సంఘానికి లేదని కొనియూడారు. ప్రపంచ చరిత్రలో ఎదురుదాడులు చేసిన ఉద్యమాలెన్నో చూశామని, తెలంగాణ ఉద్యమంలో మాత్రం స్వరాష్ట్రం కోసం సొంతంగా ప్రాణాలు తీసుకున్నారే తప్ప ఎవరిపై దాడులకు దిగలేదని అన్నారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో అదే ఉద్యమస్ఫూర్తితో పనిచేసి నీతిమంతమైన పాలనను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. అమరవీరుల ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ప్రజలంతా అవినీతిలేని పారదర్శకమైన పాలనను కోరుకుంటున్నారని, అట్లాంటి పాలనను అందించేందుకు సీఎం కేసీఆర్ ఒక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అన్నారు. కేసీఆర్ వారసుడు హరీష్ అపర భగీరథుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వారసుడు హరీష్‌రావేనని తెలంగాణ సాంస్కృతికి సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. మిషన్ కాకతీయకు అపరభగీరథుడు కేసీఆర్... ఆయనకు వారసుడు హరీష్‌రావు అని పేర్కొన్నారు. తలాపున గోదారి ఉన్నా గొంతెండే పరిస్థితి తన నియోజకవర్గంలోనూ ఉందని, వెంటనే మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని హరీష్‌రావుకు విజ్ఞప్తి చేశారు. ఎల్ఎండీలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం తనకు హెచ్చరిక లాంటిదన్నారు. తాను తప్పటడుగులు వేసిన ప్రతిసారి స్థూపం హెచ్చరికలా పనిచేస్తుందన్నారు. ఉద్యోగంలో చేరితే మీతో పని చేసేవాడిని : గంగుల తాను ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే వర్క్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చినా వెళ్లలేదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు. ఆనాడు ఉద్యోగంలో చేరి ఉంటే మిషన్ కాకతీయలో టీఎన్జీవోలతో క లిసి పనిచేసే వాడినన్నారు. కరీంనగర్లో నీటి ఎద్దడి మొదలైందని, వెంటనే ఎస్సారెస్పీ నుంచి మూడు, నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేసి ఆదుకోవాలని మంత్రిని కోరారు. టీఎన్జీవో రాష్ట్ర నాయకుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ గతంలో కాంట్రాక్టర్లు, పాలకుల కోసమే ఉద్యోగులమంతా పనిచేశామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ప్రజలు, రైతుల కోసమే పనిచేస్తూ మంచిపేరు తెచ్చుకుందామని ఉద్యోగులకు సూచించారు. అందులో భాగంగా బిల్లులు, అంచనాల రూపకల్పనకే పరిమితం కాకుండా వారానికి ఒకరోజు శ్రామికులుగా పనిచేయాలన్నారు. ఉద్యోగులను ప్రభుత్వానికి దూరం చేసేందుకు చాలా మంది కుట్ర చేస్తున్నారని, వారి ఆటలు సాగనీయబోమన్నారు. టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, జిల్లా నాయకులు హమీద్, జగదీష్, నరేందర్ తదితరులు మాట్లాడిన ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మంత్రి ఈటెల రాజేందర్‌తోపాటు కలెక్టర్ నీతూకుమారిప్రసాద్, ఎమ్మెల్యేలు బొడిగె శోభ, దాసరి మనోహర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, నగర మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, ఉల్లెంగుల పద్మ, ఎస్సారెస్పీ సీఈ అనిల్‌కుమార్, ఎస్ఈలు సురేష్‌కుమార్, నర్సింహారావు, రమేష్, ఉద్యోగ సంఘ నేతలు రేచల్, విజయలక్ష్మి, నూనె శ్రీధర్, ఎంఏ.హమీద్, అమరేందర్‌రెడ్డి, గంగారపు రమేష్, పోలు కిషన్, వెంకటేశ్వర్రావు, ప్రసాద్, ఎంపీపీ బూడిద ప్రేమలత, సర్పంచులు తోడెంగ పద్మ, ఒంటెల విజయ, నాయకులు ఓరుగంటి ఆనంద్, జీవీ.రాంకిషన్‌రావు, ఉల్లెంగుల ఏకానందం పాల్గొన్నారు. అల్గునూర్‌లో రెండు చెరువుల దత్తత తిమ్మాపూర్: మిషన్ కాకతీయ పథకంలో మండలంలోని అల్గునూర్‌లోని రెండు చెరువులను పునరుద్ధరణకు గ్రామ సర్పంచ్ చిందం కిష్టయ్యతోపాటు జాప రత్నాకర్‌రెడ్డి ముందుకు రాగా వారిని మంత్రి హరీష్‌రావు అభినందించారు. అల్గునూర్‌లోని బైరేని కుంటను జాప రత్నాకర్‌రెడ్డి తన తండ్రి లకా్ష్మరెడ్డి పేర, అవుసుల కుంటను సర్పంచ్ చిందం కిష్టయ్య తన తండ్రి రామయ్య పేర అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చారు. -
చెరువులకు నిధుల వరద!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మిషన్ ‘కాకతీయ’గా నామకరణం చేసిన చెరువుల పునరుద్ధరణకు వచ్చే వర్షాకాలం నాటికీ పూర్తి చేసేలా నీటిపారుదల శాఖ ప్రణాళిక రూపొందించింది. నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకొ ని చెరువుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఆయకట్టు విస్తీర్ణం, చెరువు సామర్థ్యం, ఫీడర్ ఛానళ్ల నిర్వహణ, చెరువుకట్ట పటిష్టత, డిస్ట్రిబ్యూటరీ ఛానళ్లను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అంతేకాకుండా భూగర్భజలాలు దారుణంగా పడిపోయిన ప్రాంతాల్లోని చెరువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తద్వారా భూగర్భనీటి మట్టా న్ని రీచార్జి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వరద నీరు ప్రవహించేలా కాల్వలు ఉన్నా యా? వివాదరహితంగా ఉన్నాయా? అనే అంశాలను కూడా గమనంలోకి తీసుకుంటున్నారు. తొలిదశలో గుర్తించిన వాటిలో ఇప్పటివరకు 164 చెరువులకు సంబంధించిన ప్రతి పాదనలను ఇరిగేషన్ ఇంజినీర్లు తయారు చేశారు. వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందు కు చర్యలు తీసుకుంటున్నారు. పనులు ఆలస్యం కాకుండా టెండర్ల నిర్వహణలో ప్రభుత్వం కూడా వెసులుబాటు ఇవ్వడంతో రూ.50 లక్షలలోపు పనులకు డివిజన్ స్థాయిలో ఈఈ కనుసన్నల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అపై పనులకు ఎస్ఈ అనుమతి త ప్పనిసరి. కాగా, పూడికతీత విషయంలో మాత్రం పరిమితి విధించింది. వంద ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న చిన్ననీటిపారుదల కమతాల్లో పూడికతీతను 30వేల క్యూబిక్ మీటర్ల వరకు, అపై విస్తీర్ణంలోని చెరువులకు 60వేల క్యూబిక్ మీటర్ల వరకు పరిమితి పెట్టింది. తద్వారా చెరువుల మరమ్మతుల్లో అక్రమాలకు అడ్డుకట్టవేయవచ్చని ప్రభుత్వం అంచనా. ఇదిలావుండగా, కేవలం సాగునీటి అవసరాలకే కాకుండా నియోజకవర్గానికో మినీ ట్యాంక్‌బండ్‌ను నిర్మించాలనే ప్రతిపాదనలనూ ఇరిగేషన్ శాఖ సిద్ధం చేస్తోంది. -
నాణ్యతలో రాజీవద్దు
సాక్షి, సంగారెడ్డి: ‘మిషన్ కాకతీయ’ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ పనులు పక్కాగా సాగాలని, నాణ్యతలో రాజీపడవద్దని ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఇన్‌చీఫ్ మురళీధర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ నుంచి చెరువుల మరమ్మతు పనులపై జిల్లా అధికారులతో సమీక్షించారు. వాస్తవానికి ఈ సమావేశాన్ని మంత్రి హరీష్‌రావు నిర్వహించాల్సి ఉన్నా, అసెంబ్లీ సమావేశాలున్నందున ఆయన కార్యక్రమానికి రాలేకపోయారు. దీంతో ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఇన్‌చీఫ్ మురళీధర్‌రావు జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో మొదటి దశలో ఎన్ని చెరువుల మరమ్మతు పనులు చేపడుతున్నా రు, సర్వే ఎలా సాగుతోం ది?, ప్రతిపాదనల రూపకల్పన తదితర వివరాలను ఎస్ఈ సురేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొదటి దశలో ఎంపిక చేసిన 1,580 చెరువుల మరమ్మతు పనులకు టెండర్లు సత్వరం పూర్తి చేసి డిసెంబర్‌లోగా పనులు ప్రారంభించాలని సూచించారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం సాయంతో మూడవ దశలో చెరువుల మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. మార్చిలోగా మూడవ దశ చెరువు మరమ్మతు పనులను సైతం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా ఇరిగేషన్ అధికారులకు మురళీధర్‌రావు సూచించారు. సమావేశంలో పాల్గొన్న ఎస్ఈ సురేందర్ మాట్లాడుతూ, జిల్లాలో 1,580 చెరువుల మరమ్మతు పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 300 చెరువుల సర్వే పూర్తి కావటంతోపాటు 150పైగా చెరువుల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. త్వరలో అన్ని చెరువుల ప్రతిపాదనలు పూర్తి చేసి టెండర్లు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం నిర్దేశించినడిసెంబర్ మాసంలో చెరువుల మరమ్మతు పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సమావేశంలో ఇరిగేషన్ ఈఈలు, డీఈఓలు పాల్గొన్నారు. చెరువుల మరమ్మతు పనులకు సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుతో త్వరలోనే సమావే శం నిర్వహించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.