యుద్ధప్రాతిపదికన మిడ్‌మానేరు పనులు | The prestige of the restoration of the pond | Sakshi
Sakshi News home page

యుద్ధప్రాతిపదికన మిడ్‌మానేరు పనులు

Published Fri, Feb 20 2015 2:42 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

The prestige of the restoration of the pond

ఎల్లంపల్లి చెల్లింపులూ పూర్తి చేస్తాం
ప్రతిష్టాత్మకంగా చెరువుల పునరుద్ధరణ
ఉద్యోగులందరూ రాత్రింబవళ్లు  పనిచేయూలి
భారీ నీటిపారుదల శాఖ మంత్రి  టి.హరీష్‌రావు
ఎల్‌ఎండీలో మిషన్ కాకతీయ సదస్సు  అమరవీరుల స్తూపం ఆవిష్కరణ
జిల్లాకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయండి
మంత్రిని కోరిన ఎమ్మెల్యేలు గంగుల, రసమయి

 
కరీంనగర్ : మిషన్ కాకతీయతోపాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు చెప్పారు. అందులో భాగంగా మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. ఎల్‌ఎండీ కాలనీలోని నీటిపారుదలశాఖ కార్యాలయ ఆవరణలో ఆ శాఖ జిల్లా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని గురువారం హరీష్‌రావు ఆవిష్కరించారు. చిన్నప్పుడు ఇక్కడి సరస్వతి శిశుమందిర్‌లోనే చదువుకున్నా.

ఇప్పుడు నేను మంత్రిగా ఉన్న శాఖ కార్యాలయం ఇక్కడే ఉండటం, ఇదే చోట అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. అనంతరం అదే అవరణలో ఏర్పాటు చేసిన మిషన్ కాకతీయ సదస్సులో మాట్లాడుతూ.. ‘మిడ్‌మానేరు ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. గత పాలకులు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు సరిగా డబ్బులు ఇవ్వలేదు. ఆ చెల్లింపులన్నీ పూర్తి చేస్తాం. వచ్చే ఏడాది నాటికి ఎల్లంపల్లిలో పూర్తిస్థాయిలో నీటిని నింపుతాం. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులనూ చేపడతాం. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందించబోతున్నాం. రైతులంతా చిరునవ్వుతో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే మా ముందున్న లక్ష్యం’ అని పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా ఆసక్తి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పథకం అంతర్జాయంగా అందని దృష్టిని ఆకర్షిస్తోందని హరీష్‌రావు తెలిపారు. అమెరికాలోని మిచ్‌గాన్ వర్శిటీ బృందం మిషన్ కాకతీయపై ప్రత్యేకంగా అధ్యయనం చేసేందుకు లక్ష డాలర్లు ఖర్చు చేస్తోందన్నారు. దేశంలోని పలు వర్శిటీలు సైతం ఈ కార్యక్రమంపట్ల ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. తెలంగాణలో ఈ కార్యక్రమం విజయవంతమైతే మధ్యప్రదేశ్‌లోనూ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అమలు చేస్తామని కేంద్ర మంత్రి ఉమాభారతి చెప్పారన్నారు. నాలుగు నెలల్లో తొమ్మిది వేల చెరువులను పునరుద్దరించడం మామూలు విషయం కాదని, ఉద్యోగులంతా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయాన్ని ఉద్యమరూపంలోకి తెచ్చిన ఘనత టీఎన్జీవోలకు మినహా దేశంలో మరే సంఘానికి లేదని కొనియూడారు. ప్రపంచ చరిత్రలో ఎదురుదాడులు చేసిన ఉద్యమాలెన్నో చూశామని, తెలంగాణ ఉద్యమంలో మాత్రం స్వరాష్ట్రం కోసం సొంతంగా ప్రాణాలు తీసుకున్నారే తప్ప ఎవరిపై దాడులకు దిగలేదని అన్నారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో అదే ఉద్యమస్ఫూర్తితో పనిచేసి నీతిమంతమైన పాలనను అందించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. అమరవీరుల ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ప్రజలంతా అవినీతిలేని పారదర్శకమైన పాలనను కోరుకుంటున్నారని, అట్లాంటి పాలనను అందించేందుకు సీఎం కేసీఆర్ ఒక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు.

కేసీఆర్ వారసుడు హరీష్

అపర భగీరథుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వారసుడు హరీష్‌రావేనని తెలంగాణ సాంస్కృతికి సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. మిషన్ కాకతీయకు అపరభగీరథుడు కేసీఆర్... ఆయనకు వారసుడు హరీష్‌రావు అని పేర్కొన్నారు. తలాపున గోదారి ఉన్నా గొంతెండే పరిస్థితి తన నియోజకవర్గంలోనూ ఉందని, వెంటనే మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని హరీష్‌రావుకు విజ్ఞప్తి చేశారు. ఎల్‌ఎండీలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం తనకు హెచ్చరిక లాంటిదన్నారు. తాను తప్పటడుగులు వేసిన ప్రతిసారి స్థూపం హెచ్చరికలా పనిచేస్తుందన్నారు.

ఉద్యోగంలో చేరితే మీతో పని చేసేవాడిని : గంగుల

తాను ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే వర్క్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం వచ్చినా వెళ్లలేదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు. ఆనాడు ఉద్యోగంలో చేరి ఉంటే మిషన్ కాకతీయలో టీఎన్‌జీవోలతో క లిసి పనిచేసే వాడినన్నారు. కరీంనగర్‌లో నీటి ఎద్దడి మొదలైందని, వెంటనే ఎస్సారెస్పీ నుంచి మూడు, నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేసి ఆదుకోవాలని మంత్రిని కోరారు.

టీఎన్జీవో రాష్ట్ర నాయకుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ గతంలో కాంట్రాక్టర్లు, పాలకుల కోసమే ఉద్యోగులమంతా పనిచేశామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ప్రజలు, రైతుల కోసమే పనిచేస్తూ మంచిపేరు తెచ్చుకుందామని ఉద్యోగులకు సూచించారు. అందులో భాగంగా బిల్లులు, అంచనాల రూపకల్పనకే పరిమితం కాకుండా వారానికి ఒకరోజు శ్రామికులుగా పనిచేయాలన్నారు. ఉద్యోగులను ప్రభుత్వానికి దూరం చేసేందుకు చాలా మంది కుట్ర చేస్తున్నారని, వారి ఆటలు సాగనీయబోమన్నారు.

టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, జిల్లా నాయకులు హమీద్, జగదీష్, నరేందర్ తదితరులు మాట్లాడిన ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మంత్రి ఈటెల రాజేందర్‌తోపాటు  కలెక్టర్ నీతూకుమారిప్రసాద్, ఎమ్మెల్యేలు బొడిగె శోభ, దాసరి మనోహర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, నగర మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, ఉల్లెంగుల పద్మ, ఎస్సారెస్పీ సీఈ అనిల్‌కుమార్, ఎస్‌ఈలు సురేష్‌కుమార్, నర్సింహారావు, రమేష్, ఉద్యోగ సంఘ నేతలు రేచల్, విజయలక్ష్మి, నూనె శ్రీధర్, ఎంఏ.హమీద్, అమరేందర్‌రెడ్డి, గంగారపు రమేష్, పోలు కిషన్, వెంకటేశ్వర్‌రావు, ప్రసాద్, ఎంపీపీ బూడిద ప్రేమలత, సర్పంచులు తోడెంగ పద్మ, ఒంటెల విజయ, నాయకులు ఓరుగంటి ఆనంద్, జీవీ.రాంకిషన్‌రావు, ఉల్లెంగుల ఏకానందం పాల్గొన్నారు.
 
అల్గునూర్‌లో రెండు చెరువుల దత్తత

తిమ్మాపూర్: మిషన్ కాకతీయ పథకంలో మండలంలోని అల్గునూర్‌లోని రెండు చెరువులను పునరుద్ధరణకు గ్రామ సర్పంచ్ చిందం కిష్టయ్యతోపాటు జాప రత్నాకర్‌రెడ్డి ముందుకు రాగా వారిని మంత్రి హరీష్‌రావు అభినందించారు. అల్గునూర్‌లోని బైరేని కుంటను జాప రత్నాకర్‌రెడ్డి తన తండ్రి లకా్ష్మరెడ్డి పేర, అవుసుల కుంటను సర్పంచ్ చిందం కిష్టయ్య తన తండ్రి రామయ్య పేర అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement