జలసిరితో కళకళలాడుతున్న సింగభూపాలెం చెరువు
సాక్షి, హైదరాబాద్: ఒక్కొక్క వర్షపు చినుకును పోగేసి చెరువులోకి మళ్లిస్తే... నిండిన చెరువు నీళ్లను పంట పొలానికి మళ్లిస్తే...! పల్లె చిగురిస్తుంది. ఊరు ఊరంతా పచ్చబడుతుంది. అప్పుడెప్పుడో ఎగిరిపోయిన పక్షులు తిరిగొస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగభూపాలెం చెరువులో ఇప్పుడదే ప్రయోగం జరుగుతోంది. ప్రతాపరుద్రుని జమానాలో పది గ్రామాలకు తాగునీరు, వేల ఎకరాలకు సాగునీరు అందించిన ఈ చెరువు కాల గమనంలో విధ్వంసమైంది. ఒకవైపు శిఖం భూమి కబ్జాలు, మరోవైపు పూడికలతో చెరువు ఉనికినే కోల్పోయింది. పశుపక్ష్యాదులకూ నీళ్లు దొరకని దైన్యం వచ్చింది.
అడుగంటిన చెరువు మీద బతకలేక జాలర్లు పట్నం బాట పట్టారు. రైతన్నలు వరిసాగు మానేసి పునాస పంట మీద కాలం నెట్టుకొచ్చారు. జవసత్వాలన్నీ ఉడిగి అంపశయ్య మీదున్న చెరువుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త మొగ్గలు తొడిగింది. నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు పట్టుదలతో చెరువుకు మళ్లీ జలకళ వచ్చింది. ఎండిన బీడు భూములు పచ్చబడ్డాయి. పక్షులు, ప్రాణులు తిరిగొచ్చాయి. చేప పిల్లలు మళ్లీ జీవం పోసుకొని నీళ్లలో ఎగిరి దుంకుతున్న సింగభూపాలెం చెరువుపై ‘సాక్షి’ప్రత్యేక కథనం...
రెవెన్యూ, నీటిపారుదల శాఖ రికార్డుల ప్రకారం జూలూరుపాడు, సుజాతనగర్ మండలాల పరిధిలో ఈ చెరువు విస్త రించి ఉంది. దీని పరిధిలో 2,450 ఎకరాల ఆయకట్టుంది. కానీ తరతరాలుగా చెరువు పూడిపోయి ఉండటంతో 500 ఎకరాలు కూడ పారలేదు. ఈ నేపథ్యంలో నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు చెరువు మరమ్మతుల కోసం మిషన్ కాకతీయ ఫేజ్–1లో రూ.9.26 కోట్లు, 2వ ఫేజ్‌లో రూ.24 కోట్లు కేటాయించారు. కట్ట బలోపేతం చేసి అలుగులు, తూము పునర్నిర్మించారు. కుడి, ఎడమ కాల్వలను ఆధునీకరిస్తున్నారు.
ఎడమ కాల్వ: సుజాతనగర్, సింగభూపాలెం రహదారిలో అంజనాపురం వద్ద మొదలై నర్సింహసాగర్ దాకా పారుతుంది. దీనికింద 11 తూములున్నాయి. 5.1 కిలోమీటర్ల పొడవైన ఈ కాల్వ ఆధునీకరణతో 973 ఎకరాలకు నీరందుతుందని అంచనా.
కుడి కాల్వ: సుజాతనగర్, గొల్లగూడెం, సిరిపురం, వేపలగడ్డ, మంగపేట, చుంచు పల్లి, బృందావనం మీదుగా 1.9 కిలో మీటర్లుంది. 1,630 ఎకరాలకు సాగు నీరందిస్తోంది.
హరీశ్ సరికొత్త ఆలోచన
1,000 ఎకరాల్లో ఉన్న సింగభూపాలెం చెరువును సీతారామ ప్రాజెక్టుతో అనుసంధానించి నింపే ప్రయత్నం చేస్తున్నారు. కట్ట ఎత్తును 1.5 మీటర్లు పెంచుతున్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్లోగా నీళ్లందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. 2,450 ఎకరాల ఆయకట్టును 5,000 ఎకరాలకు పెంచుతామని హరీశ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తోగువాగు వద్ద చెక్‌డ్యాం నిర్మించి కాల్వ ద్వారా ఆ నీటిని చెరువులోకి పంపేలా పను లు జరుగుతున్నాయి. సీతారామ ప్రాజెక్టు నీటినీ చెరువుకు అనుసంధానిస్తారు గనుక రెండు పంటలు పండే అవకాశముంది. ఈ ఏడాది 7.2 లక్షల చేప పిల్లలు, 1.8 లక్షల రొయ్య పిల్లలను చెరువులో వేశారు.
పునరుద్ధరణకు నోచుకోవడం అదృష్టం
గతంలో చెరువును పట్టించుకున్న నాథులే లేరు. కాల్వలు పూడుకుపోయి పొలాలకు నీరందేది కాదు. హరీశ్‌రావు మరమ్మతులు చేపట్టి చెరువును బాగు చేయిస్తున్నారు. ఇప్పుడు రెండు పంటలు పండించవచ్చు.
– కాలంగి పుల్లయ్య, రైతు, సింగభూపాలెం
Comments
Please login to add a commentAdd a comment