పూడికే కాదు.. మరమ్మతులూ చేపట్టండి
చెరువు పనులపై అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానలు పడేందుకు మరో నెలా పది రోజుల సమయమే ఉన్నందున పనులు ఆరంభమైన చెరువుల్లో నీళ్లు నిలవడానికి అవసరమైన పనులను గుర్తించి వాటిని తొలుత పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చిన్న నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. పనులు ఆరంభించిన చెరువుల్లో పూడికతీతే కాకుండా, ప్రభుత్వం అనుమతించిన అన్ని రకాల మరమ్మతు పనులను ఏకకాలంలో చేపట్టాలని ఆదేశించారు.
మంగళవారం మిషన్ కాకతీయ పనులపై జిల్లా అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమీక్షలో శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌లు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, నారాయణరెడ్డి, చీఫ్ ఇంజనీర్లు రామకృష్ణారావు, రమేశ్‌లు పాల్గొన్నారు.
మార్కెట్లకు టార్పాలిన్లు...
అకాల వర్షం, తుపాను కారణంగా మార్కెట్లకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెటింగ్ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్లను ఆధునీకరించాలని... కొత్తగా నిర్మించే యార్డులన్నీ ఒకేరకంగా ఉండేలా నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. మార్కెట్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 370 కోట్ల ఆదాయం ఆర్జించేందుకు కృషిచేయాలని అధికారులకు సూచించారు.