పాత రోజులు మళ్లీ రావాలి
మంత్రి హరీష్‌రావు
సాక్షి, మంచిర్యాల: ‘పాత రోజుల్లో చెరువు ఉందో లేదో చూసి ఆ ఊరికి పిల్లనిచ్చేటోళ్లు.. ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణలోని చెరువులు అన్నీ మాయం అయ్యాయి.. కబ్జాలకు గురయ్యాయి.. ప్రతీ ఊరికి జలకళ తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది.. మళ్లీ పాత రోజులు తెచ్చేలా ప్రయత్నిస్తోంది..’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. మిషన్ కాకతీయలో భాగంగా ఆదివారం జిల్లాలో పలు చెరువుల పునరుద్ధరణ పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 46 వేల చెరువులను పునర్ధురించేందుకు రూ. 20 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. చెరువుల్లో 240 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. ప్రభుత్వం పేదలు, రైతన్నల కడుపు నింపేందుకు ఈ బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. తెలంగాణలో మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. మండలానికో 5వేల మెట్రిక్ టన్నుల గోదాంల నిర్మాణానికి సంబంధించి ఎరువుల స్టోరేజీ చేపడుతుందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల ట్రాక్టర్ ట్రిప్పుల పూడికమట్టిని తీయగా, రైతులు పంట పొలాల పుష్టికి వినియోగించుకుంటున్నారని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో చెరువు పూడికల మట్టిని వేలం వేసి.. వచ్చిన ఆదాయాన్ని స్థానిక సంస్థలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. చెరువుల్లో పూడికలు తీయడమే కాదని కట్ట, తూము, అలుగు కూడా చెరువు పునరుద్ధరణ కింద వస్తాయన్నారు. మంత్రి ర్యాలీవాగు ప్రాజెక్ట్, నీల్వాయి ప్రాజెక్ట్, గొల్లవాగు ప్రాజెక్ట్‌లను సందర్శించి.. అధికారులతో సమీక్ష జరిపారు. మంచిర్యాలకు మంత్రి ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా విస్తృతంగా పర్యటించారు. ఆయన వెంట మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, విప్ నల్లాల ఓదెలు ఉన్నారు.