చెరువును.. పల్లెను విడదీయలేం
►చెరువులపై ‘సాక్షి’ చేపట్టిన చర్చ అమోఘం
►‘మిషన్ కాకతీయ’యజ్ఞంలా సాగాలి
►ఈజీఎస్ కూలీలకు అవకాశం
►ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం
►‘సాక్షి’ ఫోర్త్ ఎస్టేట్‌లో జిల్లా చెరువులను ప్రస్తావించిన మంత్రి హరీష్‌రావు
సంగారెడ్డి క్రైం: ప్రతి పల్లె జీవితం చెరువులతో ముడిపడి ఉందని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు అభిప్రాయపడ్డారు. చెరువుల పునరుద్ధరణపై జనాభిప్రాయం కోసం ‘సాక్షి టీవీ’ శుక్రవారం సాయంత్రం నిర్వహించిన చర్చ అమోఘమని అన్నారు. ఈ చర్చలో మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట, సిద్దిపేట ప్రాంతాలకు సంబంధించిన చెరువుల పరిస్థితిపై మంత్రి మాట్లాడారు. ముఖ్యంగా చెరువుల్లో పూడిక తీసిన మట్టిని రైతులు పంట పొలాల్లో ఎరువుగా వాడుకోవాలని కోరారు.
చెరువుల్లో పూడికను పొలాల్లో చల్లుకుంటే రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదన్నారు. పురుగుల మందులు ఎక్కువగా వాడటం వల్ల పెట్టుబడులు పెరుగుతున్నాయని, పెట్టుబడుల కోసం అప్పులు చేస్తున్న రైతులు.. అవి తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల నుంచి తీసిన మట్టిని వాడినట్లయితే పంట పొలానికి బలం చేకూరుతుందని, ఫలితంగా దిగుబడి బాగా పెరిగి రైతులకు మేలు జరుగుతుందన్నారు. దీంతో చాలా వరకు ఆత్మహత్యలను నివారించవచ్చన్నారు.
చెరువుల పునరుద్ధరణకు ఎంత ఖర్చయితే అంత డబ్బును ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. పూడిక తీతతో పాటు గుర్రపు డెక్క, తామర వంటివి తొలగించి మత్స్యకారులు చేపలు పట్టుకోవడానికి అనుకూలంగా మారుస్తామన్నారు. తహశీల్దార్, వీఆర్‌ఓ, రెవెన్యూ అధికారులు చె రువుల హద్దులను నిర్ణయిస్తారన్నారు. చెరువుల పునరుద్ధరణపై ప్రజల్లో అవగాహన తేవడానికి అక్షర యజ్ఞం అవసరమన్నారు. పార్టీలకతీతంగా పూడిక తీత పనులు చేపడతామని, ప్రతి గ్రామంలో పనులు చేపడతామన్నారు.
పూడిక మట్టిపై ఇక్రిశాట్ సైతం ఒక పుస్తకాన్ని రూపొందించిందన్నారు. జిల్లాలోని జిన్నారం, పటాన్‌చెరు తదితర పారిశ్రామిక ప్రాంతాల్లోని చెరువుల్లోంచి తీసిన మట్టిని పరీక్షలు నిర్వహించి తర్వాత అది పంట పొలాల్లో వేసేందుకు పనికిరాదనుకుంటే ప్రభుత్వమే దాన్ని గ్రామాలకు దూరంగా పారవేయిస్తుందన్నారు. పనుల నాణ్యతపై జిల్లాకో కమిటీని వేయనున్నట్టు చెప్పారు.
ఈజీఎస్ కూలీల భాగస్వామ్యం
పూడిక తీసిన మట్టిని పొలాల గట్ల వద్ద పోయగా, దాన్ని పొలాల్లో చల్లడానికి ఈజీఎస్ కూలీలను వినియోగించనున్నట్టు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. సమయం తక్కువగా ఉన్నందున పూడిక తీత పనులకు ఈజీఎస్ కూలీలను కాకుండా యంత్రాల ద్వారా చేపడుతున్నామని, పొలాల్లో పూడిక మట్టి చల్లడానికి కూలీలకు అవకాశం ఇస్తామని చెప్పారు. చెరువుల సరిహద్దులను నిర్ధారించడానికి అటవీశాఖ సహకారంతో ఈత తదితర మొక్కలు నాటతారన్నారు. చెరువుల పునరుద్ధరణ కోసం యజ్ఞంలా సాగుతున్న మిషన్ కాకతీయకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు.