శిఖం చుట్టు కుట్ర | Pond Is Under Land Mafia In Karimnagar | Sakshi
Sakshi News home page

శిఖం చుట్టు కుట్ర

Published Thu, Jun 27 2019 3:14 PM | Last Updated on Thu, Jun 27 2019 3:15 PM

Pond Is Under Land Mafia In Karimnagar - Sakshi

కబ్జాకు గురవుతున్న చెరువు శిఖం భూమి

సాక్షి, జగిత్యాల: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మోతె చెరువు శిఖం, ఎఫ్‌టీఎల్‌ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. పదేళ్ల క్రితం వరకు నిండుకుండలా, వెడల్పాటి కాలువలతో చూడముచ్చటగా ఉన్న ఈ  చెరువు క్రమంగా ఆనవాళ్లు కోల్పోతోంది. పెద్దకాలువలు పిల్లకాలువల మాదిరిగా దర్శనమిస్తున్నాయి. కబ్జాలతో చెరువులో నీటి నిలువసామర్థ్యం తగ్గుతోంది. ఒకప్పుడు 8వేల ఎకరాలకు సాగునీరందించిన చెరువు ప్రస్తుతం 3వేల ఎకరాలకు నీరందించలేదని దైన్యస్థితికి చేరింది.

అంతేకాదు.. జగిత్యాల మండ ల పరిధిలోని ముప్పాల, తిమ్మాపూర్, జాబితాపూర్, పొలాస తాళ్ల చెరువులకు ఏకైక నీటి వనరు ఈ చెరువే. చెరువు భూముల్లో కొనసాగుతున్న కబ్జాలతో భవిష్యత్‌లో నీరందించడం అనుమానమేనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందే ఆక్రమణలు కొనసాగుతున్నా అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పటికే మూడు వందలకు పైగా ఇండ్ల నిర్మాణాలు చెరువును కప్పేశాయి.

వాగుతో పాటు ముంపు ప్రాంతాలూ కబ్జా 
మోతె చెరువుకు ప్రవాహం వచ్చే వాగు అంతర్గాం శివారు నుంచి ధరూర్, నర్సింగాపూర్‌ మీదుగా మోతెచెరువులో కలుస్తుంది. ఈ ప్రాంతాలను కూడా ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొనుగోలు చేసి వాగుతో పాటు ముంపు ప్రాంతాలను చదునుచేశారు. దీంతో వర్షాకాలంలో నీరు వాగునుంచి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో పాటు చెరువు నీటిమట్టం తగ్గడంతో ముంపు ప్రాంతాల్లో ఉన్న భూముల్లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు చదునుచేసి ప్లాట్లు సిద్ధంచేశారు.

కబ్జా వంద ఎకరాలపైనే...
మోతె గ్రామంతో పాటు మున్సిపల్‌ పరిధిలోని 10, 16 వార్డులకు ఆనుకుని చెరువు ఉంది. సర్వే నంబరు 406లో ఉన్న చెరువు మొత్తం విస్తీర్ణం 90.23 ఎకరాలు. గత పదేళ్లకాలంలో 40ఎకరాలు కబ్జాకు గురైంది. ప్రస్తుతం 50ఎకరాలకు మించి చెరువు విస్తీర్ణంలేదు. 269 నుంచి 319 సర్వే నంబర్లకు వరకు 790 ఎకరాల శిఖం భూమి, మరో 50ఎకరాల్లో ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ బ్యాంక్‌ లెవల్‌) భూములున్నాయి. ఇందులో 50 ఎకరాల శిఖం, 20 ఎకరాల ఎఫ్‌టీఎల్‌ భూములు కబ్జాకు గురయ్యాయి.

ఆక్రమిత భూముల్లో 300లకు పైగా నివాస గృహాల నిర్మాణాలు జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా జిల్లా ఏర్పాటుకు ముందు అప్పటి సబ్‌కలెక్టర్‌ శశాంక ఈ అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు. శిఖం భూముల్లోని అక్రమాణాలను తొలగించారు. జిల్లా ఏర్పాటు తర్వాత ఆయన బదిలీ అయ్యారు. దీంతో అప్పటి వరకు వేచి ఉన్న ఆక్రమణాదారులు శశాంక బదిలీ అయిన వెంటనే మళ్లీ ఆ భూముల్లో అక్రమ నిర్మాణాలు ప్రారంభించారు. కనీసం ఇప్పటికైనా అధికారులు సంప్రదించి చెరువు భూములను స్వాదీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

జిల్లా కేంద్రం కావడంతోనే...
జిల్లా ఏర్పాటు ప్రకటనతోనే జగిత్యాల, పరిసర ప్రాంతాల్లో భూములకు భలే డిమాండ్‌ పెరిగింది. భూముల ధరలు ఒకేసారి 10 రేట్లు పెరిగాయి. దీంతో సామాన్యులు భూములు కొనలేని స్థితిలో చేరుకున్నారు. ఇదే క్రమంలో చెరువులు, కుంటలపై కన్నేసిన పలువురు వాటిని కబ్జా చేయడం మొదలుపెట్టారు. కబ్జాల పరంపర గత ఐదేళ్లలో నుంచే ఎక్కువైంది. ఇదే క్రమంలో పలువురు చెరువు భూములు ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రామపంచాయతీ, మున్సిపల్‌ అధికారుల అనుమతి లేకుండానే ఇళ్లు నిర్మించుకుంటున్నారు.

సీఎం ఆదేశాలు బేఖాతరు
చెరువులు, వాటి భూముల ఆక్రమణల అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇది వరకే జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. చెరువులను కబ్జా చేసిన వారిపై చర్యల విషయంలో రాజీపడొద్దని, ఆక్రమిత చెరువు భూములను స్వాధీనం చేసుకుని పునరుద్ధరించాలని గతంలో కలెక్టర్ల సదస్సులో సూచించారు. అయినా జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న పెద్ద చెరువే కబ్జా కోరల్లో చిక్కుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓ పక్క ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపడుతుంటే మరో పక్క క్షేత్రస్థాయిలో చెరువుల కబ్జా పరంపర కొనసాగుతుండటం గమనార్హం. 

చెరువును కాపాడాలి
మోతె గ్రామ జగిత్యాల పట్టణానికి ఆనుకునే ఉంది. అయినా మోతె చెరువు భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయి. కాలువలు సైతం కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకుంట్నురు. దీంతో నీరుపారని పరిస్థితి ఉంది. చెరువు భూములు కబ్జాపై అప్పటి సబ్‌కలెక్టర్‌ శశాంక స్పందించి ఆక్రమణలను తొలగించారు. ఆయన బదిలీ తర్వాత మళ్లీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మోతె చెరువు, దాని పరిధిలోన భూములను కాపాడాలి.           
– మునీందర్‌రెడ్డి, రైతు, తిమ్మాపూర్‌

సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తాం
మోతె చెరువు పరిధి భూములను ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో జాయింట్‌గా సర్వే నిర్వహించి హద్దులను ఏర్పాటుచేస్తాం.  ఎవరైనా ఆక్రమించినట్లుగా గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.
– వెంకటేశ్వర్లు, 
ఎమ్మార్వో, జగిత్యాల అర్బన్‌   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement