చెరువు పనుల్లో.. చిలక్కొట్టుడు | Officers and contractors scams in Mission Kakatiya works | Sakshi
Sakshi News home page

చెరువు పనుల్లో.. చిలక్కొట్టుడు

Published Sun, Feb 4 2018 2:23 AM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM

Officers and contractors scams in Mission Kakatiya works - Sakshi

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెంలో ఉన్న అక్కల దేవమ్మ చెరువు విస్తీర్ణం 22.27 ఎకరాలు. ఇందులో ఐదెకరాలు ఆక్రమణలకు గురైంది. అయినా మొత్తం చెరువుకు పూడికతీత పనులు చేసినట్టు కాంట్రాక్టర్‌ చూపి బిల్లు పొందాడు.

మిషన్‌ కాకతీయ.. చెరువులను పునరుద్ధరించే గొప్ప పథకం. ప్రతి వర్షపు చుక్క నీటిని నిల్వ చేసుకోవడం.. రైతుల మోములో ఆనందం నింపడం దీని లక్ష్యం. కానీ క్షేత్రస్థాయిలో అధికారుల అవినీతి, బాధ్యతా రాహిత్యంతో మిషన్‌ కాకతీయ అభాసుపాలవుతోంది. చాలా చోట్ల చెరువులు ఆక్రమణలకు గురైనా అధికారులు రికార్డుల్లో ఉన్న పూర్తి విస్తీర్ణానికి టెండర్లు పిలుస్తున్నారు. అలా కొద్దిమొత్తంలో పనులకే ఎక్కువ సొమ్ము ముట్టజెబుతున్నారు.. దీనికితోడు సగం సగం పనులే చేసినా.. నాసిరకంగా చేసినా కూడా మొత్తం బిల్లు మంజూరు చేస్తున్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ముడుపులు పుచ్చుకుంటున్నారు. మరోవైపు పలు చోట్ల చేసిన పనులకు కూడా బిల్లులు మంజూరు చేయడం లేదు. అలాంటి చోట్ల కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపేస్తున్నారు. అప్పులు తెచ్చి పనులు చేసినా బిల్లులు రావడం లేదంటూ వాపోతున్నారు. మొత్తంగా చెరువుల పునరుద్ధరణ లక్ష్యం దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మిషన్‌ కాకతీయలో క్షేత్రస్థాయి పరిస్థితిపై ఈ వారం ‘ఫోకస్‌’..    – సాక్షి నెట్‌వర్క్‌  

నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, రైతులకు సాగునీరు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2015లో ‘మిషన్‌ కాకతీయ’పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన సుమారు 45 వేలకుపైగా చెరువులను పునరుద్ధరించి.. కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువులను అనుసంధానించాలని నిర్ణయించింది. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఒక్కో విడతలో సుమారు 9 వేల చెరువుల చొప్పున ఎంపిక చేస్తూ.. పునరుద్ధరణ పనులు చేపట్టింది. ప్రభుత్వ లక్ష్యం ఇంత ఘనంగా ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం విభిన్నంగా ఉన్నాయి. చాలా చోట్ల ఇప్పటికే చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. కానీ రికార్డుల్లో మాత్రం పూర్తి విస్తీర్ణం నమోదై ఉంది. అయితే అధికారులు ఇలా ఆక్రమణలకు గురైన మేర భూమి విస్తీర్ణాన్ని తగ్గించకుండా... పూర్తి విస్తీర్ణాన్ని లెక్కించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. దీంతో కాంట్రాక్టర్లు కొంతమేరకే పనులు చేశారు. అధికారులు వారితో కుమ్మక్కై పూర్తి మొత్తానికి బిల్లులు మంజూరు చేశారు. ఇక ఉన్నమేరౖనా పునరుద్ధరణ పనులు పూర్తి చేయకపోయినా, నాసిరకంగా చేసినా కూడా పట్టించుకోలేదు. దీంతో చాలా చోట్ల చెరువుల తూములకు గండ్లు పడ్డాయి. కట్ట, మత్తడి దెబ్బతిన్నాయి. కాలువలు కనిపించకుండానే పోయాయి. 

మరోవైపు బిల్లుల జాప్యం.. 
రెండు, మూడు విడతల పనుల్లో కేవలం కట్టను చదును చేయడం, మట్టిని నేర్పడం, తూముల మరమ్మతు వంటి పనులు మాత్రమే జరిగాయి. కొన్నిచోట్ల మొదటి విడతలో మంజూరైన పనులే ఇప్పటివరకు పూర్తికాకపోవడం గమనార్హం. పలుచోట్ల చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు మిగతా పనులను నిలిపివేశారు. బిల్లుల చెల్లింపుల జాప్యంతో ఈసారి పాత కాంట్రాక్టర్లలో చాలా వరకు నాలుగో దశకు టెండర్‌ వేయలేదు కూడా. వాస్తవానికి నిధుల సమస్య కారణంగానే నాలుగో విడతలో ప్రతిపాదించిన చెరువుల సంఖ్యలో ప్రభుత్వం కోత విధించిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

అప్పుల పాలవుతున్నామంటున్న కాంట్రాక్టర్లు 
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని పోమాల్‌పల్లి–కొండారెడ్డిపల్లి గ్రామశివారులో ఉన్న పెద్ద చెరువు 68 ఎకరాల్లో ఉంది. కాంట్రాక్టర్‌ రూ.14.25 లక్షలకు ఈ చెరువు పునరుద్ధరణ పనులు దక్కించుకున్నారు. ఏడాది క్రితమే పనులు పూర్తిచేసినా.. ఇప్పటివరకు రూ.6 లక్షల బిల్లులు మాత్రమే చెల్లించారు. అప్పులు చేసి పనులు పూర్తి చేశానని, బిల్లులు చెల్లించక నానా అవస్థలు పడుతున్నానని కాంట్రాక్టర్‌ వాపోతున్నారు. ఇక కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని నాయిని చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసే పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌దీ ఇదే తరహా పరిస్థితి. రూ.2.4 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ పనుల్లో రూ. కోటికిపైగా విలువైన పనులు పూర్తయినా.. కాంట్రాక్టర్‌కు ఇప్పటివరకు రూ.30 వేల మేర మాత్రమే బిల్లులు చేతికందినట్లు చెబుతున్నారు. ఈ రెండు చోట్ల మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల కూడా పనులు పూర్తయినా బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు.

బిల్లు రాదు పని కాదు 
ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్‌ చెరువును మిషన్‌ కాకతీయ మూడో దశలో ఎంపిక చేశారు. 16 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు పునరుద్ధరణకు రూ.26 లక్షలు మంజూరయ్యాయి. కానీ కాంట్రాక్టర్‌ చెరువు కట్టకు మాత్రమే మరమ్మతు పనులు చేశారు. ఇందుకోసం రెండెకరాల్లో మాత్రమే మట్టిని తీశారు. చెరువు తూము, మత్తడి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. రెండు కాలువల్లో ఒక కాలువ మాత్రమే చేపట్టారు. దీనిపై సంబంధిత కాంట్రాక్టర్‌ను వివరణ కోరగా.. చేసిన పనులకు సంబంధించి గతేడాది సెప్టెంబర్‌ 18న రూ.7 లక్షల బిల్లు పెట్టినప్పటికీ ఇప్పటికీ సొమ్ము రాలేదని, దాంతో పనులు నిలిపేశామని చెప్పారు. చిన్న నీటి పారుదల శాఖ జేఈ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించగా.. బిల్లులు విడుదల కాలేదని, మంజూరైన వెంటనే పనులను పునః ప్రారంభింపజేస్తామని తెలిపారు. 

పనులు చేయకపోయినా బిల్లులు.. 
వికారాబాద్‌ జిల్లాలోని పరిగి మండలం గడిసింగాపూర్‌ శివారులోని రాయిని చెరువు విస్తీర్ణం సుమారు 30 ఎకరాలు. ఈ చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.62 లక్షలు మంజూరు చేసింది. మొత్తం చెరువులో పూడికతీయాల్సి ఉండగా.. కేవలం చెరువు కట్టకు అవసరమైన మేర మాత్రమే మట్టి తవ్వారు. సుమారు 20 శాతం పనులే పూర్తయినా.. 60 శాతం పనులు పూర్తయినట్లుగా రికార్డుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బిల్లులు కూడా మంజూరయ్యాయి. ఇక కాంట్రాక్టర్‌ చెరువు తూములను నాసిరకంగా నిర్మించడంతో గ్రామ రైతులు పలుమార్లు ఆందోళన చేశారు. గతేడాది అప్పటి కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. 

లేని భూమికి టెండర్లు 
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం గూడూరులోని రామయ్య చెరువు 40 ఎకరాల్లో విస్తరించి ఉంది. మిషన్‌ కాకతీయ రెండో విడతలో ఈ చెరువు పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.40.5 లక్షల అంచనాతో టెండర్లు నిర్వహించింది. ఓ కాంట్రాక్టర్‌ 22 శాతం తక్కువ (లెస్‌)కు ఈ పనులను దక్కించుకున్నారు. అయితే చెరువులో సుమారు పదెకరాలకుపైగా ఆక్రమణకు గురైంది. ఈ మేరకు విస్తీర్ణం, టెండర్‌ ధరను తగ్గించాల్సి ఉన్నా అధికారులు చూసీ చూడనట్లు వదిలేశారు. దీంతో కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూరింది. 

పనుల్లో తొండి.. తూముకు గండి
మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట మండలం కొల్లంపల్లిలోని గౌని చెరువును మిషన్‌ కాకతీయ తొలి విడతలో పునరుద్ధరణకు ఎంపిక చేశారు. రికార్డుల ప్రకారం చెరువు విస్తీర్ణం 81.18 ఎకరాలు. కానీ అందులో 21 ఎకరాలకుపైగా ఆక్రమణలకు గురైనట్లు అధికారులే చెబుతున్నారు. కానీ మొత్తం విస్తీర్ణాన్ని లెక్కించి.. రూ.35 లక్షలకు పనులు అప్పగించారు. ఇక కాంట్రాక్టర్‌ ఏదో పైపైన పనులే చేశారు. తూము, కట్ట నిర్మాణం నాసిరకంగా చేశారు. ముళ్ల పొదలను కూడా తొలగించలేదు. ఈ అరకొర పనులకు కూడా అధికారులతో కుమ్మక్కై రూ.10 లక్షలు బిల్లు తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది కురిసిన కొద్దిపాటి వర్షాలకే తూముకు గండిపడింది. ఆయకట్టు రైతులంతా కలసి ఆ తూమును మూసివేశారు. ఇక చెరువంతా ముళ్ల చెట్లతో నిండిపోయింది. ఇక ఉపాధి హామీ పథకం కింద మరో రూ.24 లక్షలు వెచ్చించి చెరువులో ఒండ్రు మట్టి తవ్వకాలు చేపట్టారు. అయినా చెరువు పూడికతీత పూర్తి కాలేదు. 

మొరం పోసి.. కానిచ్చేశారు..! 
జగిత్యాల జిల్లా రాయికల్‌ మండల కేంద్రంలోని పెద్ద చెరువు 125 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మిషన్‌ కాకతీయ తొలివిడతలో ఈ చెరువును పునరుద్ధరణకు ఎంపిక చేశారు. రూ.1.33 కోట్లకు కాంట్రాక్టుకు ఇచ్చారు. పూడికతీతతోపాటు తూముల నిర్మాణం, పంట కాలువ పనులు, మత్తడి నిర్మాణం చేయాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో కాంట్రాక్టర్‌ ఇష్టానుసారంగా పనులు చేసి, బిల్లు తీసేసుకున్నారు. తూముల నిర్మాణం, చెరువుకట్ట, పంట కాల్వల పనుల్లో నాణ్యత లేదని రైతులు మొత్తుకుంటున్నారు. రాయికల్‌ నుంచి చెర్లకొండాపూర్‌కు వెళ్లే ప్రజలు ఈ చెరువు మత్తడిపై నుంచే ప్రయాణిస్తారు. ఈ మేరకు మత్తడిని పటిష్టం చేయాల్సి ఉండగా.. కాంట్రాక్టర్‌ గతంలో ఉన్న మత్తడిపైనే కాస్త మొరం పోసి వదిలేశారు. 
     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement