- సర్పంచ్‌లకు కాసులు కురిపిస్తున్న ‘మిషన్ కాకతీయ’
- ఇటుక బట్టీలకు చెరువు మట్టి
- అధికార పార్టీ అండతో వ్యవహారం
- ఇదేమని ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్న వైనం!
‘మిషన్ కాకతీయ’ సర్పంచ్‌ల పాలిట కల్పవృక్షమైంది!. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై చెరువు మట్టిని హైదరాబాద్ శివార్లలోని ఇటుక బట్టీలకు అనధికారికంగా తరలిస్తూ రూ. కోట్లు గడిస్తున్నారు. వాల్టా చట్టం ప్రకారం మట్టి తవ్వకాలపై నిషేధం ఉండడంతో రాత్రికి రాత్రి మట్టి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే కొట్టేంత పని చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం చెరువుల అభివృద్ధిలో భాగంగా మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించింది. జిల్లాలో చాలా వరకు ఎంపిక చేసిన చెరువుల్లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. అయితే పటాన్‌చెరు ప్రాంతంలో మొరంమట్టి లేదా చెరువులోని ఒండ్రు మట్టికి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ శివారులో గల ఇటుక బట్టీలకు మట్టిని ఈ ప్రాంతంలోని చెరువుల నుంచి తరలిస్తున్నారు.
ముఖ్యంగా అధికార బలంతో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు మామూళ్లను ముట్టజెప్పి పలువురు సర్పంచ్‌లో గుట్టుగా రాత్రిళ్లు మట్టిని ఇటుకల బట్టీలకు సరఫరా చేస్తున్నారు. మిషన్ కాకతీయలో భాగంగా మండలంలోని ఐనోలు పెద్ద చెరువును ఎంపిక చేశారు. కానీ ఇంకా అక్కడ కాకతీయ మిషన్ కింద పనులను ప్రారంభించలేదు. అయితే చెరువు మట్టిని మాత్రం సర్పంచ్ తాను కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలకు గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఒక వేళ మిషన్ కాకతీయ పనులు ప్రారంభమైతే.. ఆ తరువాత చెరువులో పనులు జరిగినట్టు చూపించి బిల్లు పొందే కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సర్పంచ్ ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో చెరువు మట్టిని తవ్వి తీసి ఇతరులకు కొంత విక్రయించి సొంత ఇటుక బ ట్టీలకి తరలించారు. ఇదేమని ప్రశ్నించిన మాజీ ఉప సర్పంచ్, టీడీపీ నేత రాజిరెడ్డి, పలువురు గ్రామస్తులు ప్రశ్నించగా.. వారిపై ఏకంగా దాడికి దిగేంత పని చేశాడు ఆ సర్పంచ్. అదేవిధంగా ముత్తంగి పంచాయతీ పరిధిలో రాత్రికి రాత్రి వందలాది లారీల మట్టిని తరలించారు. ఇప్పటి వరకు దానికి కారకులను గుర్తించ లేదు. అలాగే పటాన్‌చెరు శివారులోని తీగల్‌నారం చెరువులో మట్టి తవ్వకాలు జరిగాయి. ఈ సంఘటనలో మట్టి వ్యాపారులతో పోలీసు, రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిళ్లు రావడంతో కేసు పెట్టకుండానే వదిలిపెట్టారని సమాచారం. చెరువు మట్టిని రైతుల పొలాలకు వాడుకునేలా అవకాశం ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.