కొత్తకుంటలో సైబీరియన్ పక్షుల సందడి
సాక్షి, హైదరాబాద్: ఊరికి ఉత్తరాన కర్విరాల చెరువు. తూర్పున కొత్త కుంట. రెండు చెరువుల్లోంచి పునాదులు వేసుకున్న ఊరే కర్విరాల కొత్తగూడెం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని ఓ చిన్న గ్రామమిది. పల్లె తలాపున చిన్న గుట్ట. పొలిమేరలోని చెరువులే జీవనాధారం. ఈడొచ్చిన ఒడ్డోళ్ల పోరగాళ్లు చిన్నగుట్టను పగులగొట్టి కంకర చేసి పొట్టపోసుకుంటారు. ఇతర జాతుల వారికి చెరువుపై ఆధారపడి కుల వృత్తులు, చేతి వృత్తులతో జీవనం. ఊరు పుట్టిన 200 ఏళ్ల చరిత్రలో చెరువులు నిండిన సందర్భాలు చాలా తక్కువే. కాలం కలిసిరానప్పుడు ఒడ్డెర్లు వలసలతో, మిగతా కులాల నాటు సారా పెట్టి కాలం గడిపేవాళ్లట. అలాంటి ఊరు ఇప్పుడు వలసలను, గుడంబాను జయించింది. మిషన్ కాకతీయ కింద నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ఈ చెరువులను పునరుద్దరించారు. వానలతో పని లేకుండా గోదావరి జలాలతో నింపారు. దాంతో వలస పోయిన వాళ్లతో పాటు సుదూరంలోని సైబీరియా నుంచి కూడా పక్షులు వచ్చి కొత్తగూడెంలో సందడి చేస్తున్నాయిప్పుడు.
చెరువే ఆదరువు
కర్విరాల చెరువుకు ఎగువన, కొత్తకుంటకు దిగువన లింగమంతుల గుట్ట, చిన్నగుట్ట, వడ్లు దంచే బండ... ఇవన్నీ నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్నాయి. పరీవాహక ప్రాంతం ఎక్కువగా లేక చెరువులు నిండవు. ఆయకట్టు తక్కువే ఉన్నా చెరువు నీళ్లపై ఆధారపడి బోరు, బావుల కింద సాగు సాగేది. చేతి వృత్తులు బలపడేవి. మిషన్ కాకతీయ తొలి దశలో కొత్తకుంటకు రూ.26 లక్షలు, రెండో దశలో కర్విరాల చెరువుకు రూ.22 లక్షలు ఖర్చు చేసి పూడిక తీశారు. ఉపాధి హామీ పనులతో గ్రామస్థులంతా ఏకమై చెరువు క్యాచ్‌మెంటు ఏరియాను పునరుద్ధరించారు. హరీశ్ చొరవ చూపి శ్రీరాంసాగర్ కాల్వ నుంచి గోదావరి జలాలు తెచ్చి చెరువులు నింపారు. నిండిన చెరువుల్లో చేపలు పెంచారు. భూగర్భ జలాలు పెరిగి కర్విరాల చెరువు కింద 600 ఎకరాలకు, కొత్తకుంట కింద 300 ఎకరాలకు సాగునీరందుతోంది. చెరువులకు జలకళ రావడంతో వలస పోయిన గ్రామస్థులు తిరిగొచ్చారు. చేతి వృత్తులు పూర్తిగా అంతరించాయి గానీ కుల వృత్తులు ఇప్పుడిప్పుడే కొత్త జీవం పోసుకుంటున్నాయి. నాటుసారా పెట్టొద్దని ఊరు తీర్మానం చేసుకుంది. శీతాకాలంలో సైబీరియా నుంచి కొంగ జాతులొచ్చి వేసవి ముగిసే దాకా చెరువు మీదే గడిపి వర్షాకాలం ప్రారంభంలో తిరిగి వెళ్లిపోతున్నాయి.
బోర్లకు నీళ్లు మళ్లినయి
నాకు రెండు ఎకరాలుంది. బోరు నీళ్లే దిక్కు. చెరువుల పూడిక తీసి గోదావరి నీళ్లతో నింపినంక బోర్లళ్లకు నీళ్లు మళ్లినయి. రెండు కార్ల పంట వచ్చింది. కానీ ఈ ఏడాది చెరువుకు గోదావరి నీళ్లు రాలేదు. బోర్లు మళ్లీ మొదటికొచ్చినై. ప్రభుత్వం మళ్లీ గోదావరి నీళ్లొదిలి మా చెరువులు నింపాలె.
– పేర్ల ప్రహ్లాద
చెరువు నిండితే చుట్టాలొస్తరు
చెరువుల్ల నీళ్లున్నప్పుడు మా ఊరికి సైబీరియా కొంగలొస్తయి. ఈ పక్షులు ఒక రకంగా మా చుట్టాలు. ఆర్నెల్ల పాటు చేప పిల్లల తిని బతుకుతై. గట్టు మీద సవారు చింతల తోపు చెట్ల మీద ఉంటై.
–బండి అంతయ్య
Comments
Please login to add a commentAdd a comment