జూన్‌లో ‘సీతారామ’ టెండర్లు
- అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
- వ్యాప్కోస్ సర్వేలపై ఉన్నత స్థాయి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: జూన్ మొదటి వారంలోగా ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు టెండర్లు పిలవాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. దీంతో పాటే కిన్నెరసాని-రోళ్లపాడు కాలువ అలైన్‌మెంట్ సర్వే పూర్తి చేసి జూన్ చివరిలోగా టెండర్లు పిలవాలని సూచించారు. బుధవారం జలసౌధలో వ్యాప్కోస్ సంస్థ ప్రతినిధులు, చీఫ్ ఇంజనీర్లతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తమ్మిడిహెట్టి, సీతారామ ప్రాజెక్టు, మల్లన్నసాగర్ నుంచి సింగూ రు, మల్లన్నసాగర్ నుంచి నిజామాబాద్ జిల్లా వరకు సర్వేలు, సుందిళ్ల, అన్నారం, పత్తిపాక రిజర్వాయర్లు, మహబూబ్‌నగర్ జిల్లాలోని నార్లాపూర్-డిండి లింక్ సర్వే పనులను, వరంగల్ జిల్లాలోని దేవాదుల పనులను మంత్రి సమీక్షించారు.
ఈ ప్రాజెక్టుల పరిధిలోని సర్వేల నివేదికలను నెలాఖరులోగా సమర్పించాలని ఆదేశించారు. గోదావరిపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై 20 రోజుల్లో సమగ్ర నివేదికలు అందించాలని కోరారు. దీనికి వ్యాప్కోస్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి పాకాల, రామప్ప, ఘనపురం చెరువులను అనుసంధానం చేసే చర్యలపై దృష్టి పెట్టాలని, దీనివల్ల ఆయా చెరువుల కింద ఆయకట్టు పెరుగుతుందని, రెండో పంటకు నీరందించవచ్చన్నారు. వ్యాప్కోస్ సర్వే నివేదికలపై డాటాబేస్‌ను ఏర్పా టు చేసుకోవాలని, లైడార్ సర్వే వివరాలను విశ్లేషించడానికి ఇంజనీర్లకు, సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.