మేస్త్రీలా పని చేస్తా: హరీశ్‌ | Harish Rao review of Mahbubnagar district projects | Sakshi
Sakshi News home page

మేస్త్రీలా పని చేస్తా: హరీశ్‌

Published Thu, Jun 14 2018 1:32 AM | Last Updated on Thu, Jun 14 2018 1:32 AM

Harish Rao review of Mahbubnagar district projects - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాగు నీటి ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు మంత్రిలా కాకుండా పెద్ద మేస్త్రీలా పని చేస్తానని సాగు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి అన్ని స్థాయిల్లో కృషి చేద్దామని చెప్పారు. బుధవారం జలసౌధలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి, బీమా, కోయిల్‌ సాగర్, తుమ్మిళ్ల, నెట్టెంపాడు ప్రాజెక్టు పనులపై మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులు, ప్యాకేజీల వారీగా సమీక్షించారు. బీమా, కోయిల్‌ సాగర్, తుమ్మిళ్ల ప్రాజెక్టుల్లో భూ సేకరణ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్లు, ఎస్‌డీసీలు, ప్రాజెక్టు ఇంజనీర్లు కలసి భూ సేకరణలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ప్రతిరోజూ పని తీరు మదింపు చేసుకుని, లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు.  

కార్మికుల సంఖ్య పెంచండి 
బీమా ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని అధికారులను హరీశ్‌ ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ప్యాకేజీ పనులు ఈ సీజన్‌లో పూర్తి చేయాల్సిందేనన్నారు. పనులకు సంబంధించిన చెల్లింపులు ఎక్కడా ఆగకుండా తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, పనులు పూర్తవగానే చెల్లింపులు జరిగేలా జాగ్రత్త పడుతున్నామని చెప్పారు. కోయిల్‌ సాగర్‌ పరిధిలోని ప్యాకేజీ–13లో భూ సేకరణ జరిగిన చోట గుత్తేదారులు పనులు చేయడం లేదని ఇంజనీర్లు మంత్రికి వివరించగా.. వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మిగిలిన భూ సేకరణకు కలెక్టర్లు, ఎస్‌డీసీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్తి చేయాలన్నారు. తుమ్మిళ్ల ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసి ఆగస్టు 15 లోగా ఆర్డీఎస్‌ ఆయకట్టుకు నీరివ్వాలని ఆదేశించారు. కార్మికుల సంఖ్యను పెంచాలని ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. పంపులు, మోటార్లు చైనా నుంచి రావాల్సి ఉందని ఏజెన్సీ ప్రతినిధులు చెప్పగా ఎయిర్‌ కార్గో ద్వారా తెప్పించాలని సూచించారు.  

మహబూబ్‌నగర్‌లో క్షేత్ర స్థాయి పర్యటన
తుమ్మిళ్ల లిఫ్టుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు లిఫ్టుల్లో కొత్తగా నియమితులైన ఎలక్ట్రికల్‌ ఇంజనీర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా చీఫ్‌ ఇంజనీర్‌ ఖగేందర్‌ను ఆదేశించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పనులనూ సమీక్షించిన మంత్రి.. అనుకున్న సమయంలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 90 కిలోమీటర్ల ప్రధాన కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని, 90 నుంచి 130 కిలోమీటర్ల ప్రధాన కాలువ నిర్మాణం పూర్తి కాకున్నా నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీలు పని చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హరీశ్‌ హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టులను రెండ్రోజుల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలిస్తానని, ఈ నెలాఖరులోగా పర్యటనకు వస్తానని చెప్పారు. కార్మికుల కొరతను ఇంజనీర్లు మంత్రికి వివరించగా.. ఈ అంశంపై ఫిర్యాదులొస్తున్నాయని, కాళేశ్వరంలోనూ ఇలాంటి ఇబ్బంది ఎదురైతే తానే స్వయంగా మేస్త్రీలా వ్యవహరించి పని జరగని ఇతర ప్రాజెక్టుల నుంచి కార్మికులను తరలించే ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎస్‌ఈ, సీఈలు కూడా ఇలాగే చొరవ చూపాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement