సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలోని 24 వేల మంది గ్రామ రెవెన్యూ సహా యకు(వీఆర్‌ఏ)ల్లో 5,950 మందిని నీటి పారుదల శాఖలో లష్కర్లుగా నియమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం వీరంతా రెవెన్యూ శాఖలో రూ.10,500 గౌరవ వేతనంపై తాత్కాలిక ఉద్యోగు లుగా కొనసాగుతున్నారు. వారి సేవలను అదే శాఖలో క్రమబద్ధీకరించడంతోపాటు కొత్త పేస్కేల్‌ను వర్తింపజే యాలని ప్రభు త్వం నిర్ణయించినట్లు తెలిసింది.
అనంతరం అవసరాన్ని బట్టి వేర్వేరు శాఖల్లో వారిని విలీనం చేయాలని భావిస్తోంది. రూ.19 వేల మూల వేతనంతో కలిపి మొత్తం రూ.23 వేల స్థూల వేతనం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 5,950 మంది వీఆర్‌ఏలతోపాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద నిర్వాసితులుగా మారిన కుటుంబాల నుంచి మరో 200 మందిని లస్కర్లుగా నియమించుకోవడానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ప్రాజెక్టుల కింద నిర్వాసితులుగా మారిన కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడానికి ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవో 98 కింద 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపి లస్కర్ల నియామకంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీఆర్‌ఏలను లస్కర్లుగా నియమిస్తామని ఆయన చాలా ఏళ్ల కిందే ప్రకటించిన విషయం తెలిసిందే.
సాగునీటి ప్రాజెక్టులు, కాల్వలు, తూములకు కాపలా కాస్తూ పంట పొలాలకు నీళ్లు అందేలా లస్కర్లు పనిచేయాల్సి ఉంటుంది. కాల్వల్లో పిచ్చి మొక్కలు తొలగించడం, గండ్లు పడితే ఉన్నతాధికారులకు తక్షణమే సమాచారం ఇవ్వడం వంటి విధులు నిర్వహిస్తారు. తెలంగాణ వచ్చాక కొత్త ప్రాజెక్టులను పెద్ద ఎత్తున నిర్మించినా, నిర్వహణకు అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించలేదు. లస్కర్ల నియామకంతో కొత్త ప్రాజెక్టుల నిర్వహణ మెరుగుపడే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment