సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీయాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) అధికార పరిధిని నిర్వచిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌లోని షెడ్యూల్–2లో పొందుపర్చిన 11 ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంపై తెలుగు రాష్ట్రాలు మళ్లీ పాతపాటే వినిపించాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న ఏకైక ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు మినహా మరే ప్రాజెక్టును అప్పగించే ప్రసక్తేలేదని తెలంగాణ మరోసారి తేల్చి చెప్పింది.
తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులన్నింటినీ స్వాధీనం చేసుకుంటేనే తమ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని ఏపీ పట్టుబట్టింది. దీంతో ప్రాజెక్టుల అప్పగింతపై గోదావరి బోర్డు మెంబర్ కన్వీనర్ అజగేషన్ నేతృ త్వంలో గురువారం జలసౌధలో నిర్వహించిన సబ్ కమిటీ సమావేశం ఫలితం లేకుండానే ముగి సింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈ మోహ న్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రమణ్య ప్రసాద, ఏపీ నుంచి సీఈ పుల్లారావు పాల్గొన్నారు.
ఏపీ తమ పరిధిలోని తోట వెంకటాచలం లిఫ్టు, తాడిపూడి పంప్‌హౌస్, సీలేరు పవర్ కాంప్లెక్స్‌ల అప్పగింతపై బోర్డుకు నోట్‌ను అందించింది. అయితే తెలంగాణ ప్రాజెక్టులను సైతం స్వాధీనం చేసుకుంటేనే తమ ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరిస్తామని షరతు విధించింది. తెలంగాణ లోని ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ఉన్న కాకతీయ క్రాస్ రెగ్యులేటర్, మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్, చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం లోని గంగారం పంప్‌హౌస్, దుమ్ముగూడెం వెయిర్, నావిగేషన్ చానల్, లాక్స్‌లను అప్పగిం చాలని గోదావరి బోర్డు కోరగా, తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది.
సీడ్‌మనీ కింద రూ.200 కోట్లు కోరిన బోర్డు
సీడ్‌మనీ కింద రూ.200 కోట్ల చొప్పున రెండు రాష్ట్రాలు విడుదల చేయాలని బోర్డు కోరగా, ఖర్చుల ప్రతిపాదనలను సమర్పిస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ తెలిపింది. పెద్దవాగు నిర్వహణకు సీడ్‌మనీగా రూ.1.45 కోట్లతోపాటు సిబ్బందిని సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ బదులిచ్చింది. పెద్దవాగు ఆధునీకరణకు రూ.78 కోట్ల వ్యయం కానుందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తే బోర్డుకు నిధులిస్తామని తెలిపింది. ఒక ఎస్‌ఈ, ఇద్దరు ఈఈ, నలుగురు జేఈ, ఇతర ఉద్యోగులను బోర్డుకు కేటాయించేందుకు తెలంగాణ అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment