సిద్దిపేట జోన్: ‘ఈ మట్టిలో పుట్టి.. ఈ మట్టిలోనే కలసిపోయేవాళ్లం. మీ గురించి ఆలోచించే బాధ్యత మాపై ఉంది. ఎక్కడో హైదరాబాద్‌లో ఉండేవారు భవిష్యత్తులో మీ గురించి ఆలోచించరు. తెలంగాణను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆస్తులు, భూములు ఇచ్చిన మీరంతా మా ఆత్మీయులే. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాదే. మీ మంచి మనసుకు శిరస్సు వంచి వందనం చేస్తున్నా’అని నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవనంలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామం వేములఘాట్ నిర్వాసితులకు మంత్రి రూ.17.10 కోట్ల పరిహారాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ పరిధిలోని 8 గ్రామాల్లో 7 చోట్ల వందశాతం భూసేకరణ పూర్తయిందన్నారు. వేములఘాట్‌లో ఇప్పటి వరకు 80 శాతం భూసేకరణ జరిగిందని, మిగతా 20 శాతం కొద్ది మంది స్వార్థ రాజకీయాల వల్ల ఆగిందని తెలిపారు. వ్యక్తిగతంగా తమకు ఎవరిపైనా ద్వేషం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాల కోసమే ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని.. త్వరలోనే నీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మల్లన్నసాగర్‌కింద 13 వేల ఎకరాల భూసేకరణ జరిగిందని.. ఇంకా 700 ఎకరాలు చేయాల్సి ఉందని చెప్పారు.
రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఆస్తులు ఇచ్చినవారిని ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు. ప్రతి ఇంటికి రూ.7.50 లక్షల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ప్రాజెక్టులో చేపల ఆదాయంపై వాటా, హక్కులు కల్పిస్తామన్నారు. గజ్వేల్‌లో కొత్తగా ఇల్లు కట్టి ఇచ్చిన తర్వాతే.. పాత ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుందని, పాత ఇంటికి కూడా డబ్బులు చెల్లిస్తామని హరీశ్ భరోసా ఇచ్చారు. ప్రాజెక్ట్‌పై జరుగుతున్న గోబెల్స్ ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పురోగతిని చూడాలన్నారు.
భూసేకరణలో భాగంగా చివరి ప్రయత్నం చేస్తున్నామని, అవసరమైతే ఆ కొద్ది మంది కోసం కోర్టులో డబ్బు డిపాజిట్ చేస్తామని వివరించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ వల్ల నిజాంసాగర్, యాదాద్రిలోని గంధమల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందుతుందని వెల్లడించారు. పరిహారం డబ్బులను వృథా చేయవద్దని, వాటిని భూమిపై పెట్టుబడిగా పెట్టాలని హరీశ్‌రావు సూచించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాదే
Published Sat, Jun 2 2018 2:06 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment