కాంగ్రెస్‌ది అనవసర రాద్ధాంతం
ప్రతి అభివృద్ధి పనిపై బురద చల్లే ప్రయత్నం
- భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సాక్షి, వరంగల్ రూరల్: రైతులు నష్టపోకుండా ఉండే విధంగా ప్రాజెక్ట్‌లు రీ డిజైన్ చేస్తున్నామని, అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు అనవర రాద్ధాంతం చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి పని చేసినా దానిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వరంగల్ రూరల్ జిల్లాలో నర్సంపేట, నెక్కొం డలలో బుధవారం ఆయన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి అజ్మీరా చందూలాల్ తో కలసి పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనం తరం గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లా డుతూ కుల వృత్తులు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఉచితంగా చేపపిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ చేపట్టారని చెప్పారు. పల్లె సీమలే పట్టుకొమ్మలని ఆనాడు గాంధీ చెప్పిన మాటలను ఆదర్శంగా తీసుకుని.. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు గొంగడి కప్పి, గొర్రె పిల్లను ఇచ్చినా పట్టించుకోలేదని, అదే ఇప్పుడు కేసీఆర్.. మీకే ఇస్తాం అన్న ఉద్దేశంతో గొర్రెలను సబ్సిడీ ద్వారా అందిస్తున్నారని చెప్పారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 7.18 లక్షల యాదవులు, గొల్ల కురుమలు 7,800 సొసైటీలలో సభ్యులుగా చేరారని, వీరికి రెండు సంవత్సరాలలో రూ.9వేల కోట్లతో గొర్రెల పంపిణీ జరుగుతుందన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా 510 గురుకుల పాఠ«శాలలు ప్రారంభించామని, అవి కంటికి కనిపించడం లేదా అని ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. మేనిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ, రాష్ట్ర గొర్ల, మేకల పెంపకందారుల సహకార సమాఖ్య చైర్మన్ రాజయ్యయాదవ్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
మంత్రిని అడ్డుకునే యత్నం
మంత్రి హరీశ్‌రావు నర్సంపేట్ వ్యవసాయ మార్కెట్‌లో కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా దడువాయిలకు కనీస వేతనాలు అందించాలని అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులు వచ్చి వారిని బయటకు లాగివేశారు. దీంతో మంత్రులు మార్కెట్ నుంచి నెక్కొండకు బయలుదేరి వెళ్లారు.