చరిత్రాత్మక ఒప్పందంపై చౌకబారు విమర్శలు
నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల వినియోగంపై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల నడుమ కుదిరిన ఒప్పందంపై కాంగ్రెస్ నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. పదేళ్ల పాటు అధికారం చెలాయించిన కాంగ్రెస్ నేతలు గోదావరి జలాల వినియోగంపై ఉన్న వివాదాలను పరిష్కరించలేకపోయారన్నారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ.. 2012లో కుదుర్చుకున్న ఒప్పందంపై తిరిగి సంతకాలు చేశారని ఆరోపిస్తున్నారన్నారు.
పదేళ్ల క్రితమే ఒప్పందం జరిగి ఉంటే తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. గోదావరిలో తెలంగాణ వాటాను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు తలపెట్టిన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం చరిత్రాత్మకమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం స్థాయిలో జరిగిన ప్రయత్నాల వల్లే ప్రస్తుత ఒప్పందం సాధ్యమైందన్నారు. ఈ చరిత్రాత్మక ఒప్పందాన్ని కాంగ్రెస్ నేతలు బ్లాక్ డేగా అభివర్ణించడం తగదన్నారు. గ్రావిటీ పద్ధతిలో కాకుండా ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టుల డిజైన్ రూపొందిస్తున్నారని కొందరు చేస్తున్న ఆరోపణలు అసంబద్ధమైనవన్నారు.