ఉద్యమ స్ఫూర్తితో ‘మిషన్ కాకతీయ’
షాద్‌నగర్ రూరల్ : మిషన్ కాకతీయలో భాగంగా చేపడుతున్న చెరువుల మరమ్మతు, పూడికతీత పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ టీకే శ్రీదేవీ ఆదేశించారు. ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామశివారులోగల మామిడికుంట చెరువు పనులను ఆదివారం కలెక్టర్ పరిశీలించారు. పనులు ఎందుకు ఆలస్యంగా జరుగుతున్నాయని అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించారు. రానున్న నాలుగు వారాలలో వర్షాలు వచ్చేఅవకాశాలున్నాయని, వర్షాలువస్తే పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు.
ఇచ్చిన గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామంలో ప్రతిఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండేలా చూసుకోవాలని సర్పంచ్ సుమనకు సూచించారు. అనంతరం బిల్లులు రాలేదని లబ్దిదారులు కలెక్టర్‌కు ఫిర్యాదుచేయగా ఫీల్లుఅసిస్టెంట్‌ను ప్రశ్నించారు. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల శిథిలావస్థలో ఉందని, నిధులు మంజూరు చేయించి వచ్చే విద్యాసంవత్సరంలో సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరారు. అనంతరం గ్రామశివారులోని నర్సరీని పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఈ వెంకటస్వామి, ఈఈ నరింసంగరావు, ఏఈ భవానీ, ఇన్‌చార్జీ డీపీఆర్‌ఓ లక్ష్మణ్, డిప్యూటీ తహశీల్దారు శ్రీనివాసులు, వీఆర్‌ఓ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.