‘మిషన్’కు గండి పడింది..!
‘మిషన్’కు గండి పడింది..!
Published Wed, Jul 27 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
భీమారం : చిన్న నీటి వనరుల పునరుద్ధరణ, అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట ప్రతిష్టాత్మకంగా పనులు చేపట్టింది. రూ.కోట్లాది రూపాయల తో ఇప్పటి వరకు రెండు విడతల్లో పలు చెరువుల పను లు చేపట్టగా.. నాసిరకం పనులు జరిగాయనే ఆరోపణ లు వెల్లువెత్తిన విషయం విదితమే. ప్రస్తుత వర్షాలతో చెరువుల్లో నీరు నిండగా.. పలు చెరువు కట్టలకు గండి పడుతుండడ ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
రూ.53లక్షలతో పనులు
జిల్లాలోని పెగడపల్లి పడమటి చెరువు పూడికతీత, అభివృద్ధి కోసం మిషన్ కాకతీయ కింద రూ.53లక్షలు కేటాయించగా పనులు చేపట్టారు. ఇటీవల వర్షాలకు ఇరవై ఎకరాల విస్తీర్ణంలోని ఈ చెరువులో నాలుగు ఫీట్ల మేర నీరు చేరడంతో ఆయకట్టు రైతులు ఆనందపడ్డారు. అయితే, వారి ఆనందం ఆవిరయ్యేలా చెరువుకు బుధవారం తెల్లవారుజామున గండి పడింది. దీంతో నీరు మొత్తం వృథాగా బయటకు వెళ్లడంతో పాటు వందలా ది ఎకరాల పంట భూములు ముంపునకు గురయ్యా యి. పనుల్లో నాణ్యత లోపించడం, అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ఇలా జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. చెరువు కట్ట నిర్మాణంలో భాగంగా సరిగ్గా రోలింగ్ చేయకపోవడం కూడా గండి పడడానికి కారణంగా తెలుస్తోంది.
దేవన్నపేట చెరువు కట్ట...
దేవన్నపేటలోని బంధం చెరువు కట్ట పూర్తిగా కోతకు గురైంది. ఈ చెరువు పనులు మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టనప్పటికీ 2014లో నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.8లక్షలతో అభివృద్ధి చేశారు. ఈ చెరువు కింద సుమారు 80ఎకరాల ఆయకట్టు ఉంది. ఉదయం 11గంటల ప్రాంతంలో చెరువు కోతకు గురి కావడంతో స్థానికులు నీటిపారుదలశాఖ అధికారులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం 2గంటల వర కు కూడా అధికారులకు చేరుకోలేదు. ఫలితంగా సుమా రు 40ఎకరాల పంట పొలాలు మునిగిపోయ్యాయి. కాగా, పెగడపల్లి, దేవన్నపేటల్లోని చెరువులను స్థానిక తహసీల్దార్ ఎన్.రవి సందర్శించారు.
పెగడపల్లి చెరువు వద్ద తక్షణ సహాయ చర్యలు చేపట్టారు. సమీపంలోని క్వారీ నుంచి రాళ్లను తెప్పించే బుంగ పూడ్పించే పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే దేవన్నపేటలోని బంధం చెరువు వద్ద ఇసుక బస్తాలు వేయిస్తూ నీళ్లు బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. అయితే, భారీ వర్షాల కారణంగా మరో నాలుగు చెరువులు ప్రమాదపు అంచున చేరాయి. పడమటి చెరువు, దేవన్నపేట చెరువులకు గండ్లు పడి అందులోని నీరు సమీప చెరువుల్లోకి చేరడంతో వాటికి ప్రమాదం ఏర్పడింది.
Advertisement