రాజకీయ ఒత్తిళ్లకు లొంగితే... అంతే
పత్రికల్లో వచ్చే వార్తలకు వెంటనే స్పందించాల్సిందే
అధికారులకు మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మిషన్ కాకతీయ కార్యక్రమంలో అక్రమాలు జరిగితే అధికారులనే బాధ్యులని చేస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధుల ఫోన్ల ఒత్తిడికి లొంగిపోయామని అధికారులు చెబితే ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ కార్యక్రమాల అమలు తీరుపై శనివారం నిర్వహించిన సమీక్షలో ఈటెల మాట్లాడారు.
ఎంతో పవిత్ర ఆశయంతో రూపొందించిన మిషన్ కాకతీయ కార్యక్రమం అమలులో కరీంనగర్ జిల్లా బాగా వెనుకబడి ఉందన్నారు. జూన్‌లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇంకా చాలాచోట్ల పనులు ప్రారంభమే కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగత స్వార్ధం, బద్దకంతో వ్యవహరించే అధికారుల తీరుతోనే ఇలా జరుగుతోందన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయకపోతే ఆశించిన ఫలితాలు రావని అభిప్రాయపడ్డారు.
మిషన్ కాకతీయ అక్రమాలకు సంబంధించి పత్రికల్లో వచ్చే వార్తలకు ఎప్పటికప్పుడు అధికారులు స్పందించి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణ అంచనాల్లో 35 శాతం వరకు తక్కువగా టెండర్ వేయడం పట్ల సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. ‘అధికారుల అంచనా కంటే 35 శాతం వరకు తక్కువగా టెండర్ వేస్తే పనుల్లో నాణ్యతైనా లోపిస్తుంది... లేదంటే అధికారులే అంచనాలను అమాంతంగా పెంచి ఉండాలి.
అంతే తప్ప పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోయే ప్రసక్తే ఉండదు’ అని అన్నారు. దీనిపై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చెరువుల్లోని మట్టిని రైతులకు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ ఒక్కో ట్రాక్టర్‌కు రూ.50 చొప్పున కాంట్రాక్టర్లు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఆర్థికమంత్రి నియోజకవర్గంలోనే ఇది జరుగుతున్నట్లు పత్రికల్లోనూ వార్తలొస్తున్నాయని చెప్పారు.
తన నియోజకవర్గంలో మట్టిని అమ్ముకునే పరిస్థితి లేదని, ఇప్పటికే ఇదే అంశంపై పలుమార్లు సమీక్ష జరిపానని ఈటెల తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ ఫారెస్ట్, రెవెన్యూ అధికారులెవరూ చెరువులవైపు ముఖం కూడా చూపడం లేదని, పనులు ప్రారంభించిన తాము మాత్రం ప్రజల దృష్టిలో చులకన అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వచ్చే ఏడాది నుంచి 9 గంటల విద్యుత్
వచ్చే ఏడాది నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు 9 గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కెపాసిటీ పెరిగే అవకాశమున్నందున అందుకు తగినట్లుగా సబ్‌స్టేషన్లు ఉన్నాయా? అనే అంశంపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, బొడిగె శోభ, నగర మేయర్ రవీందర్‌సింగ్, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, అదనపు జేసీ నాగేంద్ర, అధికారులు పాల్గొన్నారు.
‘కాకతీయ’ అక్రమాలకు అధికారులదే బాధ్యత
Published Sun, Apr 26 2015 4:47 AM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM
Advertisement