అంతర్జాతీయ వేదికపై మిషన్ కాకతీయ | mission kakatiya programme in international venue | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ వేదికపై మిషన్ కాకతీయ

Published Sun, Apr 3 2016 7:41 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

mission kakatiya programme in international venue

► సోమవారం నుంచి ఢిల్లీలో ఇండియన్ వాటర్ వీక్, 20 దేశాల నుంచి ప్రతినిధుల హాజరు
► చెరువుల పునరుధ్దరణపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్న రాష్ట్రం
► చివరి రోజు మంత్రి హరీష్‌రావు హాజరయ్యే అవకాశం


సాక్షి, హైదరాబాద్: దేశంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకునే  అవకాశాలను పరిశీలించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రచించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. దేశ వ్యాప్తంగా సుస్థిర నీటి యాజమాన్యానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తతంగా చర్చించేందుకు ‘ఇండియన్ వాటర్ వీక్’ పేరుతో అంతర్జాతీయ సదస్సును ఢిల్లీలో నిర్వహిస్తోంది. ‘సుస్థిరాభివధ్ధికి నీటి యాజమాన్యం’ పేరుతో సోమవారం ప్రారంభం కానున్న సదస్సు ఈ నెల 8వరకు కొనసాగనుంది. ఇందులో అంతర్జాతీయంగా పేరుగాంచిన సంస్థలు, వ్యక్తులతో పాటు జల వనరులతో ముడిపడి ఉన్న అన్ని మంత్రిత్వ శాఖలు, అనుబంధ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని తమతమ అభిప్రాయాలను వివరించనున్నారు. ఈ వేదిక రాష్ట్రంలో చెరువుల పునరుధ్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్ కాకతీయ’పై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది.
 

1500ల ప్రతినిధుల ముందు మిషన్పై వివరణ..
కేంద్ర జల వనరుల శాఖ ప్రాధమికంగా వేసిన అంచనా మేరకు..దేశంలో సగానికి పైగా జనాభాకు స్వఛ్చమైన రక్షిత నీటిని పొందలేకపోతున్నారు. సుమారు 8.2కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీరు అందడం లేదు. దేశంలో ఏడాదికి నీటి జనిత రోగాల కారణంగా 73లక్షల పనిదినాలు కోల్పోతోంది. పెరుగుతున్న నీటి డిమాండ్‌కు అనుగుణంగా వనరుల లభ్యత లేకపోవడంతో భవిష్యత్ అవసరాలపై ఇది పెనుప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా నీటి యాజమాన్యంపై ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. చుక్క నీటిని ఒడిసిపట్టేలా, లభ్యత నీటిని పారిశ్రామిక, విద్యుత్, సాగు, తాగునీరు అవసరాలకు సమర్ధంగా వినియోగించే అంశాలు, ఇందులో భాగంగానే వ్యవసాయ, ప్లానింగ్, విద్యుత్, గ్రామీణ, పట్టణాభివృధ్ధి, పర్యావరణ, అటవీ శాఖలు, ఐఐటీ, భారత నీటి, వ్యవసాయ పరిశోధన సంస్థలతో కలిపి సదస్సు నిర్వహిస్తోంది. ఇక్కడ వచ్చే అభిప్రాయాల ఆధారంగా భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా కేంద్రం ప్రణాళికలు రచించనుంది.

ఈ సదస్సులో సుమారు దేశాల నుంచి మొత్తంగా 1500ల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సద్సులో పాల్గొనాలని ఇప్పటికే కేంద్ర జల వనరుల శాఖా మంత్రి ఉమాభారతి స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుని ఫోన్ ద్వారా ఆహ్వానించారు. అయితే ఇరతర కార్యాక్రమాల దృష్ట్యా  ముఖ్యమంత్రి ఈ సమావేశాలకు వెళ్లే అవకాశం లేదు. అయితే తొలి రోజు నుంచి ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు. 8న ముగింపు సమావేశానికి నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీష్‌రావు హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తంగా గుర్తించిన చెరువులు, వాటిని నిర్ణీత కాలానికి నిర్దేశించకున్న బడ్జెట్‌లకు అనుగుణంగా చేపట్టిన పునరుధ్దరణ కార్యక్రమాలు, ఇప్పటికే మొదటి విడత ద్వారా సాధించిన ఫలితాలను ప్రత్యేక ప్రజెంటేషన్‌లో రాష్ట్రం వివరించే అవకాశం ఉంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement