‘మిషన్’లో టీఆర్‌ఎస్ నేతల పెత్తనం
గద్వాలన్యూటౌన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులు జరగకుండా నియోజకవర్గంలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అడ్డుకుంటున్నారని, అధికారులను తీవ్రంగా వేధిస్తున్నారని మాజీమంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే మండలంలోని మేలచెర్వు గ్రామంలోని పెద్దమ్మ చెరువు పూడికతీత పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం టెండర్లు వేసి పనులు ప్రారంభించిన చోట్ల కాంట్రాక్టర్లు తమవారుకాదనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ నాయకులు పనులు నిలిపేస్తున్నారని అన్నారు. ఇతర పార్టీలకు చెందిన సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు ఉన్నచోట పనులకు ఆటంకం కలిగిస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేగా తాను పాల్గొనరాదని ఏకంగా అధికారులకే హుకుం జారీచేస్తున్నారని విమర్శించారు.
ఇప్పటికే అధికార పార్టీ నాయకుల వేధింపులకు తాళలేక డీఈ దీర్ఘకాలిక సెలవులో వెళ్లారని, ఏఈలు బదిలీలు కోరుకుంటున్నారని చెప్పారు. గద్వాల నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఉన్న తనకు ప్రొటోకాల్‌కు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సర్పంచ్ వేణుగోపాల్‌రెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, బండల వెంక ట్రాములు, శంకర్, రామాంజనేయులు, నరేందర్‌రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, రామిరెడ్డి పాల్గొన్నారు.