బడి చదువులు బతికేదెలా? | School Education | Sakshi
Sakshi News home page

బడి చదువులు బతికేదెలా?

Published Fri, Apr 17 2015 12:32 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

దిలీప్ రెడ్డి - Sakshi

దిలీప్ రెడ్డి

 సమకాలీనం
 బట్టీల పుణ్యమా అని దేశవ్యాప్తంగా జరిగే అన్ని పోటీ ప్రవేశ పరీక్షల్లో రికార్డులు సాధించే మన వాళ్లు అకడమిక్స్‌లో, ఉద్యోగాలు పొందడంలో ఉత్తర భారత దేశీయులతో పోటీ పడలేకపోతున్నారు. కారణం సరుకు లేకపోవడమే! పాఠశాల విద్య అనే పునాది బలహీనంగా ఉండటమే! వివిధ అధ్యయనాల ప్రకారం ఇందుకు ప్రధాన కారణం టీచరే! అత్యధిక టీచర్లు సమయానికి బడికి రారు. వచ్చినా పాఠాలు చెప్పరు. ఉపాధ్యాయ సంఘాలు బలమైన శక్తిపీఠాలుగా ఉండి, ఎగవేతలకు దన్నుగా నిలుస్తాయి.

 వారంరోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బడులన్నీ ఈ విద్యా సంవత్సరానికి మూతపడనున్నాయి. ఇప్పుడున్న పద్ధతిలోనే పాఠశాల విద్య కొనసాగితే... తెలుగునాట ప్రాథమిక-సెకండరీ విద్య భవితవ్యమే మూతపడే దుస్థితికి చేరుతుంది. ఒక తరం అంధకారంలో పడే ప్రమాదం ఉంది. సకల విద్యలకు పునాది అయిన ప్రాథమిక విద్య పాతాళానికి కూరుకుపోతోంది. భవిష్యత్తులో అధ్వానమైన సమాజ నిర్మాణానికి భూమికను సిద్ధం చేస్తున్నట్టుంది. ఎవరు బాధితులు అంటే మొత్తంగా ఓ తరం! ఎవరు బాధ్యులు అంటే, అందరూ!! ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వాలు, సమాజం. అంతా కలసి విద్యావ్యవస్థ మూలాల్లో చీడపురుగుల్ని పెంచుతున్నారు. నైపుణ్యాలు లేవు, సృజన లేదు, పదో తరగతి సమీపిస్తున్నా... మెజారిటీ విద్యార్థులకు చదవడం-రాయడం సరిగా రాదు, కూడిక-తీసివేత వంటి గణిత చతుర్విధ ప్రక్రియలే తెలియవు. తెలుగు, ఇంగిష్ మాధ్యమాల్లోనూ, ప్రభుత్వ పాఠశాల ల్లోనే కాకుండా ప్రయివేటు బడుల్లో కూడా ఇదే దుస్థితి.  ప్రపంచమంతా ముందుకు నడిస్తే, మనం వెనక్కి నడుస్తున్నాం. ‘ఏం లాభమొచ్చె నాయనా, అగొ ఆ పిల్లలంతా బడికి వొయిన్రు, అటు సదువు రాకపాయె, ఇటు పనీ రాకపాయె, మా పక్కింటోల్ల పిల్లలు బడీగిడీ లేదు, పనికే పొయిన్రు, ఇప్పుడు గాపని జేసుకొనన్న బతుకుతుండ్రు‘  దేశంలోనే అత్యల్ప అక్షరాస్యత ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండల కేంద్రంలో కూలీ పనిచేసుకునే ఓ తల్లి, చదువుల కోసం బడికి వెళ్లి కూడా పనికిరాకుండా పోయిన పిల్లల పట్ల వ్యక్తం చేసిన ఆవేదన మొత్తం పరిస్థితికి అద్దం పడుతోంది.

 ప్రథమ దోషులు ప్రభుత్వాలే!!
 పాఠశాల విద్యపై ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయి. బడులెలా నడుస్తున్నాయి? ఉపాధ్యాయులున్నారా? పనిచేస్తున్నారా? పిల్లలకు విద్య లభిస్తోందా? ఫలితాలెలా ఉంటున్నాయి? ఇలాంటి విషయాలేవీ సర్కారుకు పట్టవు. అనేక విషయాల్లో దేశంలో తొలి అయిదారు రాష్ట్రాల్లో ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాఠశాల విద్యలో మాత్రం చివరి అయిదారు రాష్ట్రాల్లో ఉంటూ వచ్చింది. విభజన తర్వాత కూడా పరిస్థితి అదే! పాఠశాల విద్యకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రణాళికేతర పద్దు కింద రూ. 12,664 కోట్లు, ప్రణాళిక కింద రూ. 2300 కోట్లు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికేతర పద్దు కింద రూ. 7,976 కోట్లు, ప్రణాళికా పద్దు కింద రూ. 1,078 కోట్లు కేటాయించింది. వెరసి రెండు రాష్ట్రాలూ తమ తాజా బడ్జెట్లలో దాదాపు 24 వేల కోట్ల రూపాయలు పాఠశాల విద్యకు కేటాయించాయి. కానీ, ఏం లాభం! ఫలితాలు అధ్వానంగా ఉన్నాయి. 8, 9 తరగతుల్లో ఉండీ  తెలుగు రాయడం, చదవడం రాని వాళ్లు 52 శాతం ఉన్నారంటే ఏమనుకోవాలి! కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఒక ఆర్టీఐ కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద సేకరించి, విశ్లేషించిన వివరాల ప్రకారం ఈ ప్రభుత్వాలు ప్రతి ఏటా ఒక్కో విద్యార్థిపైన 38,500 రూపాయలు ఉపాధ్యాయుల జీతాలకే వెచ్చిస్తున్నాయి. ఇంకా మౌలిక సదుపాయాలకు, ఇతరేతర నిర్వహణకయ్యే ఖర్చు అదనం. పిల్లలున్న చోట ఉపాధ్యాయులుండరు. అయిదారు తరగతులకు ఒకరిద్దరు పంతుళ్లే ఉంటారు.

పిల్లలు నామమాత్రంగా ఇరవై, ముప్పై ఉన్న చోట అయిదారుగురు టీచర్లుంటారు. చాలా ఖాళీలుంటాయి. ఉన్నవాళ్లలో అత్యధికులు పనిచేయరు. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 1,135 మండలాలుంటే, మండలానికొకరి చొప్పున ఉండాల్సిన విద్యాధికారులు (ఎం.ఇ.ఓ), 110 మందే ఉండేవారు. మిగతా అన్ని మండలాలకు సీనియర్ ప్రధానోపాధ్యాయుల్నే ఎం.ఇ.ఓ. లుగా ప్రకటిస్తే, వారు అటు పాఠశాలకు న్యాయం చేయక, ఇటు మండలంలోని బడులనూ పర్యవేక్షించక పరిస్థితి ఘోరంగా తయారయినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఉన్నత విద్యను సంస్కరించడానికి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ మధ్య ఓ పెద్ద మీటింగ్ పెట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విద్యారంగ మేధావుల్ని రప్పించారు. అంతా విన్న తర్వాత, ముంబాయికి చెందిన ఓ పెద్దమనిషి కఠోర సత్యం చెప్పారు. ‘విద్యావిధానం పిరమిడ్ పద్ధతిలో ఉండాలి. పైనుండే ఉన్నత విద్య గురించి ఆలోచిస్తున్నారు మంచిదే! కానీ, కింద పటిష్టమైన పునాది పాఠశాల విద్య, అదే ఇక్కడ దయనీయంగా ఉంది, దాన్ని సంస్కరించుకోండి ముంద’ని సెలవిచ్చారు.

 చెమట పట్టించే చేదు నిజాలు!
 ప్రథమ్ వాళ్లు జరిపిన మొదటి అధ్యయన ‘అసర్’ నివేదిక, కేంద్ర విద్యా పరిశోధన-శిక్షణ మండలి (ఎన్సీఈయార్టీ), రాష్ట్ర మండలి (ఎస్సీఈయార్టీ) జరిపిన పలు అధ్యయన నివేదికలు చెప్పేదొకటే! ఇక్కడ నిర్లక్ష్యం తారస్థాయిలో ఉంది. ఫలితంగా సర్కారు బడుల్లో చదువు కొండెక్కుతోంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ- 5 జిల్లాల్లో ఓ శాంపిల్ సర్వే జరిపారు. 100 పాఠశాలలు, 150 మంది టీచర్లు, 1000 మంది విద్యార్థులపై అధ్యయనం ఆశ్చర్యకరమైన అంశాలను వెల్లడించింది. 2011 నుంచి కొత్త విద్యా విధానం, కొత్త పాఠ్యపుస్తకాలు వచ్చాయి, అందులో చాలా మార్పులున్నాయన్న విషయం 20 శాతం మంది విద్యార్థులకు కూడా తెలియదు. పాత కొత్త సిలబస్‌లో ఉన్న తేడాలేంటో సగం కన్నా ఎక్కువ మంది ఉపాధ్యాయులకే తెలియదు. 90 శాతం ప్రధానోపాధ్యాయులకు ప్రస్తుతం అమలవుతున్న విద్యార్థి ‘నిరంతర సమగ్ర మూల్యాంకన’(సీసీయీ) పద్ధతి గురించి తెలియదు. పిల్లల్లో ఏయే నైపుణ్యాలు పెంచి, సామర్థ్యాలు వృద్ధి చేయడానికి నూతన విధానం వచ్చిందో తెలిసిన పంతుళ్లు 20 శాతం లోపు. పాఠ్యాంశాల్లో విషయ అమరిక తెలిసిన టీచర్లు 15 శాతం కన్నా తక్కువ.

పాఠ్య ప్రణాళిక అత్యవసరమైన కొత్త పద్ధతిలో, 90 శాతం మంది టీచర్లు ప్రణాళికే లేకుండా పాఠాలు చెబుతున్నారు. పేపర్లు దిద్దరు, దిద్దినా ప్రమాణాలుండవు. విద్యార్థుల్లో సామాన్య, సాంఘిక శాస్త్రాలు, గణితంలో వారి వారి ప్రవేశాన్ని పరీక్షిస్తే సరిగ్గా స్పందించిన వారు 10 శాతం, ఓ మోస్తరుగా స్పందించి సమాధానం చెప్పిన వారు 20 శాతం, సమాధానం చెప్పలేకపోయిన విద్యార్థులు 70 శాతం ఉన్నారు. ఇక ప్రయివేటు బడుల్లోనూ ప్రమాణాలేమీ గొప్పగా లేవు. తెలంగాణలోని 10 జిల్లాలు 442 బడులు, 10,291 ఉపాధ్యాయులు, 78,082 విద్యార్థులపై జరిపిన అధ్యయనంలో వెల్లడయిన నిజాలు భయంకరంగా ఉన్నాయి. తెలుగు మీడియంలో 48 శాతం, ఇంగ్లీషు మీడియంలో 46 శాతం విద్యార్థులకు రాయడం, చదవడం రాదు. 43 శాతం మందికి గుణకారం- భాగహారం కూడా రాదు. ప్రయివేటు బడుల్లో అత్యధిక శాతం టీచర్ల పరిస్థితి ఘోరం. అక్కడ విద్య ఒక్కటే కాదు, అన్నీ పక్కా వ్యాపారం.

 సర్కార్ టీచరే అతి పెద్ద సవాల్!
 పెద్ద పోటీ మధ్య, పటిష్ట వడపోత తర్వాత ఉన్నత అర్హతలు కలిగిన వారే ప్రభుత్వ టీచర్లుగా ఎంపికవుతారు. ఈ లెక్కన, రాష్ట్రాల్లో ఉన్న ఉపాధ్యాయ క్రీమీలేయర్ ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో ఉంది. కానీ, ఏం లాభం. ఫలితాలు మాత్రం నానాటికి తీసికట్టు. గడచిన దశాబ్ద కాలంలో మౌలిక సదుపాయాలు, నిర్వహణా వ్యయం, జీతభత్యాలు, పుస్తకాలు, పాఠ్యాంశాలు ఇలా అన్ని విషయాల్లోనూ సంస్కరణల పరంగా మంచి వైపే అడుగులు పడ్డాయి. కానీ, ఉపాధ్యాయుల చిత్తశుద్ధి, అంకితభావం, విద్యార్థులకు సరైన విద్య అందించడం విషయంలోనే ఆశించిన మార్పులు రావట్లేదు. బట్టీల పుణ్యమా అని దేశ వ్యాప్తంగా జరిగే అన్ని పోటీ ప్రవేశ పరీక్షల్లో రికార్డులు సాధించే మన వాళ్లు అకడమిక్స్‌లో, ఉద్యోగాలు పొందడంలో ఉత్తర భారత దేశీయులతో పోటీ పడలేకపోతున్నారు. కారణం సరుకు లేకపోవడమే! పాఠశాల విద్య అనే పునాది బలహీనంగా ఉండటమే! వివిధ అధ్యయనాల ప్రకారం ప్రధాన కారణం టీచరే! అత్యధిక టీచర్లు సమయానికి బడికి రారు. వచ్చినా పాఠాలు చెప్పరు. ఉపాధ్యాయ సంఘాలు బలమైన శక్తి పీఠాలుగా ఉండి, ఎగవేతలకు దన్నుగా నిలుస్తాయి. 40 వేలు జీతం తీసుకునే ఉపాధ్యాయుడు తనకు బదులు 4 వేల రూపాయలకు ఓ విద్యావాలంటీర్‌ను నియమించి పని కానిస్తాడు. రెండు రాష్ట్రాల్లో ఇలాంటి మా(రీచ)రు టీచర్లు 70 నుంచి 80 వేల మంది ఉంటారు. అసలు టీచర్లు నెలకోమారు సంతకాలు చేస్తారు. నిలదీయాల్సిన అధికారుల్ని  ఏదోరకంగా సంతృప్తి పరుస్తారు.

ఉన్నత విద్యకోసమో, అత్యవసర వైద్య అవసరాల కోసమో ప్రభుత్వం కల్పించిన 5 ఏళ్ల సెలవు సౌకర్యాన్ని అడ్డంగా వాడుకొని కార్పొరేట్ కాలేజీల్లో విద్యాబోధన చేస్తున్న సర్కారు టీచర్లు కూడా వేలలోనే ఉన్నారు. ఇలా ఉంటే, ఇంక ప్రభత్వ బడుల్లోకి ఎవరొస్తారు? మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద ఓ ప్రయివేటు స్కూల్ బస్సును రైలు డీకొని పసిపిల్లలు అసువులు బాసినపుడు, ఓ మహిళ చేసిన ఆర్తనాదం ఇప్పటికీ చాలా మంది చెవుల్లో రింగుమంటూనే ఉంది. ‘మా ఊరి సర్కార్ బడిల మన్నువొయ్య! అది బాగుంటే, నా బిడ్డెను ఈ బస్సుల పొరుగూరికెందుకు పంపుతుంటి, ఎందుకు సస్తుండె! దేవుడో, గీ సర్కారొల్లే చంపిన్రు నా బిడ్డను’ అన్న మాటలు అక్షర సత్యాలు. మధ్యాహ్న భోజన పథకం ఎత్తేస్తే, బడుల్లో విద్యార్థుల సంఖ్య నిలుస్తుందా అన్నది సందేహమే! రెండు ప్రశ్నలకు ఉపాధ్యాయులు సమాధానం చెప్పాలె! వాళ్లు చిత్తశుద్దితో చదువులు చెబితే, 8, 9 తరగతుల పిల్లలకెందుకు కనీసం చదవరాదు? రాయరాదు? టీచర్లు తమ పిల్లల్నెందుకు తాము చదువు చెప్పే బడుల్లో చదివించరు?

 కఠిన నిర్ణయాలు అవసరం
 బడి పునర్నిర్మాణం జరగాలి. పాఠశాల విద్యకు జీవగంజి పోయాలి. విధాన పరమైన కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. నిర్వహణ-నిఘా- నియంత్రణలో భారీ సంస్కరణలు రావాలి. మధ్యాహ్న భోజన పథకాన్నీ సవ్యంగా నిర్వహిం చడానికి పిల్లల హాజరీని వారి ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలి. టీచర్ల హాజరీని బయోమెట్రిక్ విధానంతో రికార్డు చేయాలి. బడి నిర్వహణను ఆన్‌లైన్ పద్దతిన నియంత్రించాలి. పాఠశాలకు-సమాజానికి మధ్య సమన్వ యాన్ని పెంచాలి. విద్యాయాజమాన్య కమిటీకి చట్టబద్దమైన అధికారాలు కల్పించి, వారి ఆద్వర్యంలోనే నెల నెలా ఉపాధ్యాయుల జీతభత్యాలు విడుదలయ్యేలా చూడాలి. ఏం చేసైనా సరే పాఠశాల విద్యను కాపాడాలి. ఈ సమాజపు భవిష్యత్తు విత్తనంలోనే ఒట్టిపోకుండా మొలకెత్తనివ్వాలి.

 ఈమెయిల్:dileepreddy@sakshi.com                                    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement