ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట! | Sakshi Guest Column On Andhra Pradesh Government employees | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!

Published Thu, May 2 2024 12:17 AM | Last Updated on Thu, May 2 2024 12:17 AM

Sakshi Guest Column On Andhra Pradesh Government employees

అభిప్రాయం

ఏపీలో ప్రైవేటీకరణ అభిమాని చంద్రబాబు జాతీయ ప్రైవేటీకరణ అభిమాని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అన్ని ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటు ఏకస్వామ్య కంపెనీలకు అప్పజెప్పాలన్నది వారి ఆలోచన. ఇక్కడ రిజర్వేషన్లు అమలు కావు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ కూటమికి ఓటు వేయడమంటే, ప్రైవేటీకరణకు ఓటు వేయడమే. కానీ నిరుపేదలకు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మొదటి తరంలో చాలా ముఖ్యం. మన దేశ భవిష్య త్తుకు పునాది స్కూలు విద్యను పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి తెచ్చి, ప్రైవేట్‌ స్కూలు విద్యను రద్దు చెయ్యడంలో ఉంది. ఉద్యోగస్థులు మొత్తం సమాజ భవిష్యత్‌ గురించి ఆలోచించకుండా ప్రైవేటీకరణకు, మత తత్వానికి ఓటు వేస్తే ప్రజాస్వామ్యం కాదుకదా, మానవీయ విలువలు కూడా బతకవు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటీకరణ అభిమాని చంద్రబాబు నాయుడు జాతీయ ప్రైవేటీకరణ అభిమాని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. దేశంలోని మొత్తం కేంద్ర ప్రభుత్వ కంపెనీలను, అతి పెద్దదైన రైల్వేతో సహా ప్రైవేట్‌ ‘మోనోపలి’ (ఏకస్వామ్య) కంపెనీలకు అప్పజెప్పి ప్రభుత్వం కేవలం సూపర్‌వైజ్‌ చెయ్యాలనేది ఆరెస్సెస్‌/బీజేపీ సిద్ధాంతం. దేశంలో రిజర్వేషన్‌ వ్యవస్థను కూడా క్రమంగా రద్దు చెయ్యాలన్నది వారి సిద్ధాంతం. 

నరేంద్ర మోదీ ఓబీసీ పేరుతో ప్రధానమంత్రి అయ్యారు కనుక గత పదేండ్ల పాలనలో వాళ్ళు రిజర్వేషన్‌ పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ రిజర్వేషన్‌ వ్యతిరేక విధానం రిజర్వేషన్‌ ద్వారా కాక జనరల్‌ కోటాలో ఉద్యోగాలు తెచ్చుకున్న వారికి నచ్చ వచ్చు కూడా. కానీ విద్యా అసమాన వ్యవస్థ ఉండగా రిజర్వేషన్లు ఎత్తేస్తే దేశంలో అంతర్యుద్ధం జరుగుతుందని చాలామందికి అర్థం కాని విషయం. దేశంలోని ఉత్పత్తి కులాలు రిజర్వేషన్లు రద్దు చెయ్య డాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాయి.

బీజేపీతో పొత్తుతో చంద్రబాబు అధికారంలోకి వస్తే మొట్ట మొదట ప్రైవేట్‌ స్టీల్‌ కంపెనీకి అప్పజెప్పే అతిపెద్ద స్టీల్‌ కంపెనీ ‘విశాఖ ఉక్కు’. ఆ తరువాత బీజేపీ తెలంగాణలోని బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్‌ వంటి అతిపెద్ద కంపెనీలను ప్రైవేట్‌ గుజరాతీ, ముంబై కంపెనీలకు అమ్మకానికి పెడుతుంది. బీజేపీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ చేతుల్లోని సంస్థల్లో దొడ్డిదారిన ఏ సెలక్షన్‌ కమిటీని ఫేస్‌ చెయ్యకుండా అధికారులను, యూనివర్సిటీ ప్రొఫెసర్లను సైతం నియమిస్తోంది.

ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు బీజేపీకి ఓటు వేయడమంటే ప్రైవేటీకరణకు అనుకూలంగా ఓటు వేయడమే. చంద్ర బాబు 2014 నుండి 2019 వరకు చూపిన స్వతంత్రతను కూడా చూపలేడు. ఆయన పూర్తిగా బీజేపీ ఏమి చెబితే అది చెయ్యాల్సిందే. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు ఈ కూటమికి ఓటేస్తే ముందు ప్రైవేటీకరణ సమస్యను కొని తెచ్చుకుంటారు.

బీజేపీ ప్రభుత్వ, ప్రైవేట్‌ సెక్టారు ఎంప్లాయిమెంట్‌ను అమెరికా మోడల్‌లోకి మార్చాలనే ఆలోచనతో ఉన్నట్లు వాళ్ళ ఆర్థికవేత్తల రచనలు చదివితే స్పష్టంగా అర్థమౌతుంది. ఆంధ్రప్రదేష్‌ సుదీర్ఘ తీర ప్రాంతం గల రాష్ట్రం. విశాఖ పోర్టు మాత్రమే కాక క్రమంగా ఇతర సీ–పోర్టులను అక్కడ అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని కొత్త పోర్టుల నిర్మాణం జరుగుతోంది. అయితే బీజేపీ ప్రభుత్వం వాటి నిర్మాణం మాత్రమే కాక వాటి మేనేజ్‌మెంట్‌ మొత్తాన్ని ప్రైవేట్‌ సెక్టా రుకు అప్పజెప్పే ఆలోచనలో ఉన్నది. 

ఈ పని ఇప్పటికే ఎయిర్‌పోర్టుల విషయంలో చేశారు. దేశంలోని పెద్ద, పెద్ద ఎయిర్‌పోర్టులన్నిటినీ ప్రైవేటు మేనేజ్‌మెంట్‌కు – అదీ పెద్ద పెద్ద మోనోపలి కంపెనీలకు అప్పజెప్పారు. ఇక్కడి ఉద్యోగాలన్నీ ప్రైవేట్‌ కంపెనీల చేతిలోనే ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగాలన్ని కాంట్రాక్ట్‌ ఉద్యోగాలే. అక్కడ పెద్ద ఉద్యోగాలన్నీ పెద్ద కంపెనీల బంధువులకు మాత్రమే వస్తాయి. యూపీఎస్సీ పరీక్షల్లో పోటీపడి ఎవరైనా ఉద్యోగం తెచ్చుకునేది అక్కడ ఉండదు. కమ్మ, రెడ్డి కులాలకు కూడా పెద్ద ఉద్యోగాలు రావు.

ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకొని తీరాన్నంతా అభివృద్ధి చేసుకుంటే అది ముంబైకి మించిన నగరమయ్యే అవకాశ ముంది. కోల్‌కతా కూలిపోతున్న నగరం. ఇటు చెన్నై దేశపు చివరి మూలన ఉంది. దానికి ఇంకా అభివృద్ధి అవకాశం తక్కువ. ఇంగ్లిష్‌ విద్యలో ఆదివాసులు, దళితులు, బీసీలు, ఇతర బీద పిల్లలు చదువు కుంటే వైజాగ్‌ నగరాన్ని అత్యాధునిక నగరంగా మార్చే అవకాశం వారికొస్తుంది. 

ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్‌ విద్య నాణ్యంగా కొన సాగితే అడవుల్లోని ఆదివాసులు పక్షులుగా ఎదిగి విమానాలుగా మారుతారు. వారికి ఎంత పోడు భూమి ఇచ్చినా, ఎంత పంట సహాయం చేసినా ఒక్క తరంలో అడవి నుండి విశాఖ నగరంలోకి, అక్కడి నుండి అమెరికాకో, ఆస్ట్రేలియాకో పోలేరు. అయితే ఈ ఆదివాసులకు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మొదటి తరంలో చాలా ముఖ్యం. ప్రైవేట్‌ సెక్టారు వీరికి అవకాశాలివ్వదు. వారిని ఉన్నత ఉద్యోగాల్లోకి రానివ్వదు. 

ఆంధ్రలో జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాణ్యమైన ఇంగ్లిష్‌ విద్య ఈ ఆదివాసుల్లో కొనసాగితే, 20–30 సంవత్సరాల్లో అమెరికాలో నల్లజాతీయులను మించిన మేధా వులు ఆదివాసుల నుండి వచ్చి విశాఖ పట్టణాన్ని ప్రపంచ నగరంగా మారుస్తారు. ఈ ఆదివాసుల నుండి ఎంతోమంది ఎలాన్‌ మస్క్‌లు వచ్చే అవకాశముంది. ఇటువంటి మార్పు భారతదేశపు గుజరాతీ క్యాపిటలిస్టులకు, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, ఆరెస్సెస్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. వీరికి ప్రభుత్వ ఉద్యోగులు ఓటువేసి గెలిపించే ప్రయత్నం చేస్తే వ్యవస్థనంతా గుజరాత్‌–ముంబై క్యాపిటలిస్టులకు అప్పజెప్పడమే.

భారతదేశం అమెరికా కాదు, యూరప్‌ కాదు, ఆస్ట్రేలియా కాదు, కెనడా కాదు. ఇది 140 కోట్ల జనాభా కలిగిన చిన్న దేశం. దీన్ని చిన్న దేశం అని ఎందుకు అంటున్నానంటే భూపరిమాణంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, చైనాతో పోలిస్తే ఇది చాలా చిన్న భూమి కలిగిన దేశం. ఈ దేశ జనాభా ఇంకా ముందు, ముందు పెరుగుతుంది. ఆధునిక సైన్స్‌ను ఇంగ్లిష్‌ భాషతో ముడేసి గొప్ప, గొప్ప శాస్త్ర పరిశోధనల ద్వారానే మనం ఇంతమందికి తిండి, బట్ట, ఇల్లు ప్రపంచంలో తలెత్తుకుని బతికే ఆత్మ గౌరవాన్ని ఇవ్వగలం. 

అందుకు భావితరాలు – ముఖ్యంగా ఆదివాసులు, దళితులు, ఓబీసీలు – ఇంగ్లిష్‌లో చదువుకొని ప్రపంచ జ్ఞానాన్ని సాధించకుండా ఈ దేశానికి మనుగడ ఉండదు. మన దేశ భవిష్యత్తుకు పునాది స్కూలు విద్యను పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి తెచ్చి, ప్రైవేట్‌ స్కూలు విద్యను రద్దు చెయ్యడంలో ఉంది; అన్ని రకాల ఎంట్రన్స్‌లను, కోచింగ్‌లను రద్దు చేసి నేరుగా 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా, విద్యార్థి శ్రమ గౌరవ పనుల్లో పాల్గొన్న సర్టిఫికెట్ల ఆధారంగా ఉన్నత చదువులకు పోవడంలో ఉంది. అమెరికా, యూరప్‌ ఇదే చేస్తాయి. 

బీజేపీ, చంద్రబాబు ఇటువంటి విద్యకు పూర్తిగా వ్యతిరేకం. కనుక ఇప్పుడు ఉద్యోగాలు ఏ కులస్థులైనా మొత్తం సమాజ భవిష్యత్‌ గురించి ఆలో చించకుండా ప్రైవేటీకరణకు, కుల తత్వానికి, మత తత్వానికి, వర్గ తత్వానికి ఓటు వేసుకుంటే సమాజంలో తిరుగుబాటు మొదలైతే దేశం కుప్పకూలుతుంది.

భారతదేశపు ప్రైవేట్‌ రంగం అమెరికాలో, యూరప్‌లో ఉన్నట్టు మానవతా విలువలతో ఏర్పడినది కాదు. గ్రామాల్లో రైతులను, కూలీలను దోచుకొని వారితో బడిలో, గుడిలో ప్రేమతో పెరిగిన మనుషులుగా కాక మేం కులానికి ఎక్కువ, మేం కంచం–మంచం పొత్తును అంగీకరించం అనే వారి చేతిలో పెరిగింది. 

ఈ దేశంలో అతిపెద్ద పెట్టుబడిదారులు కుష్ఠు రోగులకు, కుంటి వారికి, గుడ్డి వారికి ఒక ఆశ్రమం కట్టించి ఆదుకున్నట్టు చూశామా! అమెరికా తెల్లజాతి ధనవంతులు, నల్లజాతి స్త్రీలను తమ ఇంట్లో వంట మనిషిగా పెట్టుకొని వారి పిల్లలను చదివించి మేధావులను చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. నల్లవారికి ప్రత్యేక స్కూళ్ళు, కాలేజీలు పెట్టి ముందు చదివించింది తెల్లజాతి పెట్టుబడిదారులు. ఈ దేశంలో అతిపెద్ద పెట్టుబడిదారులు దళితుల కోసం, ఆదివాసుల కోసం ఒక్క స్కూలు కట్టి చదివించారా!

అందుకే దిక్కులేని రోడ్డుమీద బతికే పిల్లల్ని దగ్గరకు తీసి ‘నిన్ను ఇంగ్లిష్‌ మీడియం బడిలో చదివిస్తాన’ని హామీ ఇచ్చిన వ్యక్తిని దింపేసి నారాయణ స్కూలును వెనుక ఉండి నడిపించే వ్యక్తికి ఓటు వేస్తే, ప్రజాస్వామ్యం కాదు గదా మానవ విలువలే బతకవు. అందరికంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేను చెప్పే ఈ మాట గురించి ఆలోచించండి.


ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement