
‘సంఘ్’తో ప్రజాస్వామ్యానికి భంగం
ప్రజాసంఘాలు పోరాడాలి: సీపీఐ నేత సురవరం
సాక్షి, హైదరాబాద్: మోదీ ప్రభుత్వం అండదండలతో దేశంలో సంఘ్ పరివార్ శక్తుల ఆగడాలు పెరిగిపోయి, దేశ లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం వాటిల్లుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఆరోపించారు. సెక్యులరిజం, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజాసంఘాలు పోరాడాల్సి ఉందని పిలుపునిచ్చారు. గురువారం మఖ్దూంభవన్‌లో జరిగిన వివిధ రాష్ట్రస్థాయి ప్రజాసంఘాల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాల్లో దళితులు, అణగారిన వర్గాలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య, లౌకికశక్తులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ భావస్వేచ్ఛ కోసం దేశవ్యాప్తంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. పేదలకు డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణం, దళితులకు మూడెకరాల భూమి, కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ వంటి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రజాసమస్యల పరిష్కారానికి దశల వారీగా పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈర్ల నర్సింహా, పశ్య పద్మ, ఎం.ఆదిరెడ్డి, ఎన్.బాల మల్లేశ్, టి.శ్రీనివాస్, ఏఐటీయూసీ నాయకులు నర్సింహన్, రత్నాకరరావు, ఏఐవైఎఫ్ నాయకులు ఎం.అనిల్‌కుమార్, టి.రాములు యాదవ్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు వేణు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.