సాక్షి, నల్లగొండ: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. గుజరాత్‌లో నరేంద్రమోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీలపై విపరీతమైన దాడులు, ఊచకోతలు జరిగాయని, ప్రస్తుతం
గో రక్షణ పేరుతో దళితులపై, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గ సీపీఐ జనరల్ బాడీ సమావేశంలో సురవరం సుధాకరరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఆరెస్సెస్, సంఘ్ పరివార్ ఆగడాలు ఎక్కువయ్యాయని, దళిత, మైనార్టీలపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకొచ్చాక పెట్రోలు, డీజిల్ ధరలు 17 సార్లు ధరలు పెంచారని దుయ్యబట్టారు. పెద్దనోట్లను రద్దుచేసి ప్రజలకు ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. నోట్ల రద్దుతో చిల్లర వ్యాపారాలు కనుమారుగయ్యాయన్నారు.
గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సీపీఐని బలోపేతం దిశగా పయనించి, ప్రజాపోరాటాలు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. వామపక్ష పార్టీలు కలిసి ఐక్య ఉద్యమాలు, వర్గ పోరాటాలు చెయ్యాలన్నారు. సీపీఐ గ్రామస్థాయి నుంచి పుంజుకుంటోందని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో సీపీఐని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment