‘సంఘ్’ ప్రోత్సాహంతో ముస్లింలపై దాడులు
సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: సంఘ్ పరివార్ ప్రోత్సాహంతో పథకం ప్రకారం దళితులు, ముస్లింలపై దేశవ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రజల ఆహార అలవాట్లను సైతం మార్చే విధంగా ఒత్తిడి పెంచుతున్నారని విమర్శించారు. నారాయణగూడ వైఎంసీఏ గ్రౌండ్స్‌లో సీపీఐ నగర సమితి కార్యదర్శి ఈటీ నరసింహ నేతృత్వంలో సోమవారం ఏర్పాటు చేసిన జనసేవాదళ్ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గోవధను నిషేధించారని, అయినా అనేక చోట్ల గోరక్షక్‌దళ్ గూండాల దాడులు జరుగుతున్నాయని అన్నారు.
గోరక్షక దళాల దాడుల నుంచి పార్టీని, ప్రజలను రక్షించాలని ప్రజాసేవాదళ్, జనసేవాదళ్ వలంటీర్లను కోరారు. అనంతరం మగ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన పార్టీ ఉపాధ్యాయుల సైద్ధాంతిక శిక్షణ శిబిరాన్ని సురవరం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. స్వార్థ రాజకీయాల కోసం పాలకులు లౌకికవాదం అర్థాన్ని, నిర్వచనాన్ని క్రమంగా ధ్వంసం చేస్తున్నారన్నారు. పాలకులు అనుసరిస్తున్న విధానాలతోపాటు సమకాలీన రాజకీయాలను అధ్యయనం చేస్తూ ప్రజలు, కార్యకర్తలను ఉపాధ్యాయులు చైతన్యవంతులను చేయాలని సూచించారు. పార్టీ నేతలు కె.నారాయణ, పల్లా వెంకటరెడ్డి పాల్గొన్నారు.