టీఆర్‌ఎస్ సిద్ధాంతాలేమిటో చెప్పాలి
⇒ ప్రజాధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారు: సురవరం
⇒ ట్రంప్ రెచ్చగొట్టడం వల్లే భారతీయులపై దాడులు: నారాయణ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో సిద్ధాంతాలున్న పార్టీ తమది ఒక్కటేనని చెబుతున్న టీఆర్‌ఎస్ నాయకులు అసలు ఆ పార్టీ సిద్ధాం తాలేంటో చెప్పాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కమ్యూనిస్టులు సన్నాసులంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు.
బుధవారం పార్టీ నేతలు కె.నారాయణ, అజీజ్‌పాషా, తెలంగాణ కార్యదర్శి చాడవెంకటరెడ్డి, ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణలతో కలసి విలేకరులతో మాట్లాడుతూ లౌకిక వ్యవస్థలో మతాలకు అతీతంగా ప్రభుత్వాలు నడవాల్సి ఉండగా, రాష్ట్రప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవ హరిస్తోందన్నారు. ప్రజల డబ్బుతో నగలు చేయించి తిరుపతిలో దేవుళ్లకు పెట్టడం అభ్యంతరకరమన్నారు. రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులుండగా, దేవుళ్ల పేరుతో ఇలాంటివి చేయడం గర్హనీయమన్నారు. యూపీ ప్రచారంలో మోదీ ప్రసంగాలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఢిల్లీ వర్సిటీ పరిణామాలపై న్యాయ విచారణకు డిమాండ్
ఢిల్లీ వర్సిటీ విద్యార్థిని గుర్‌మిత్‌కౌర్‌ను రేప్ చేస్తామన్న బెదిరింపులతో పాటు ఇతర వర్సిటీల్లో విద్యార్థులపై ఏబీవీపీ కార్యకర్తలు దాడులకు దిగడంపై విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మత విద్వేషాన్ని ప్రోత్సహించే వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి కిరణ్ రిజుజును కేబినెట్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.