బీజేపీ వెనుక నల్లధనం: సురవరం
పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్న మోదీ
సాక్షి, అమరావతి: భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెనుక నల్లధనం ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. పెద్ద నోట్లు రద్దు చేసి సాధించిందేమీ లేకపోగా.. పేదలు, మధ్యతరగతి ప్రజల్ని మరింత సమస్యల్లోకి నెట్టారని విమర్శించారు. మరో ఆరు నెలలకాలం ఈ నోట్ల సమస్య ఉంటుందన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అహ్మదాబాద్‌లో నోట్ల మార్పిడి జరిగిందని బీజేపీ సీనియర్ నేత ఒకరు ఆరోపిస్తే ప్రధానమంత్రి ఇంతవరకు జవాబు చెప్పలేదన్నారు. నోట్ల రద్దు తర్వాత కొత్తనోట్లు వచ్చాయని, ఇవి వెంటనే నల్లధనంగా ఎలా మారాయని సుప్రీంకోర్టు సర్కారును ప్రశ్నిస్తే జవాబు లేదన్నారు. విజయ్‌మాల్యా, లలిత్‌మోదీ వంటి బడాబాబులు దేశం వదిలి పారిపోతుంటే పట్టించుకోలేదన్నారు. బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నవారు రూ.14 వేల కోట్లు ఎగవేశారన్నారు. నీతిఆయోగ్ ఒక పనికి మాలిన సంస్థ అని సురవరం అన్నారు.
ఆ విరాళాలు ఎలా ఇచ్చారు
సహారా, బిర్లా గ్రూపులవారు ఏ ఆర్థిక లబ్ధీ లేకుండా మోదీకి గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు విరాళాలెలా ఇచ్చారని సురవరం ప్రశ్నించారు.ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధ కలిగించే అంశమన్నారు. దీనిపై తమ పార్టీ నెలక్రితమే ప్రశ్నించిందని, ఇప్పుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారన్నారు. ప్రభుత్వ అవినీతి, సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్న విషయాలపై ప్రచార ఉద్యమాన్ని 15 పార్టీలతో కలసి చేపడుతున్నట్లు సురవరం వివరించారు.