మా ఓట్లు కాంగ్రెస్ కు మేలు చేశాయి!
సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలు కుదేలయ్యాయని సీపీఐ కేంద్ర కార్యవర్గ సమావేశం అభిప్రాయపడింది. రెండురోజులుగా ఢిల్లీలో జరుగుతున్న కేంద్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం ముగిశాయి. ఈ సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాలను పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మీడియాకు విడుదల చేశారు. సామాన్యులకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాల నిధుల్లో కోత వేసి పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని పేర్కొంది. ఈ తీరును నిరసిస్తూ ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించింది.
కులం, మతం పేరిట సమాజాన్ని విడగొట్టేందుకు కేంద్రం విశ్వప్రయత్నం చేస్తోందని, దేశవ్యాప్తంగా బడుగు, బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీలపై దాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించింది. కేరళలో వామపక్ష కూటమి విజయంపై హర్షం వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో ఓటమిపై విస్మయం వ్యక్తం చేసింది. అస్సాం, తమిళనాడులో కనీస ప్రాతినిధ్యం కూడా లేకపోవడాన్ని చర్చించింది. పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష కూటమి ఓట్లు కాంగ్రెస్‌కు మేలు చేశాయని, కాంగ్రెస్ ఓట్లు మాత్రం వామపక్షాలకు పడలేదని విశ్లేషించింది. 2017లో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పరిస్థితిని చర్చించేందుకు జూలై 15,16,17 తేదీల్లో జాతీయ సమితీ సమావేశాలను ఢిల్లీలో నిర్వహించనున్నట్లు సురవరం తెలిపారు.