మోదీ, కేసీఆర్ పరస్పర డబ్బా: సురవరం
* కేంద్ర కేబినెట్‌లో చేరికపై సీఎం ఆశలు
* దళితులపై ప్రధానిది ఎన్నికల ప్రేమ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పరస్పర డబ్బా కొట్టుకున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ‘గాడిద గాత్రాన్ని కాకి మెచ్చుకున్నట్లు, కాకి సంగీ తాన్ని గాడిద ప్రశంసించినట్లు’ ఒకరినొకరు పొగుడుకుని ప్రజలను ‘ఫూల్స్’ను చేయలేరని ఘాటుగా స్పందించారు. మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గజ్వేల్ సభలో తెలంగాణలో అభివృద్ధి అంటూ మోదీ ఊదరగొడితే, సాయంత్రం సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అభివృద్ధి బోగస్ అంటూ విమర్శించారని, ఈ రెండింట్లో ఏది కరెక్టో వారే చెప్పాలన్నారు.
కేంద్రంలో అవి నీతిరహిత ప్రభుత్వం ఉందని కేసీఆర్ పొగడటం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిద్వారా కేంద్ర కేబినెట్‌లో తన కుటుంబసభ్యులను చేర్చాలనే ఆశను కేసీఆర్ వదులుకున్నట్లు లేదని వ్యాఖ్యానించారు. ఐపీఎల్‌లో లలిత్‌మోదీ అవినీతి, అదానీ గ్రూపుపై గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన రూ.200 కోట్ల జరిమానాను కేంద్రం మాఫీ చేయడం కేసీఆర్‌కు కనిపించలేదా అని ప్రశ్నించారు. దళితులపై దాడుల విషయంలో మోదీ ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందించారో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. తనపై దాడి చేశాక దళితుల జోలికి వెళ్లాలంటూ ప్రధాని స్పందించిన తీరులో నాటకీయత ఎక్కువగా ఉందన్నారు.
గుజరాత్, యూపీ ఎన్నికల నేపథ్యంలో దళితుల ఓట్ల కోసం ఎత్తుగడగానే ఈ స్పందన ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వ విద్య కాషాయీకరణ ప్రయత్నాలు ఏమాత్రం తగ్గలేదని, ఏబీవీపీ, ఆరెస్సెస్ వర్సిటీల్లో జోక్యం చేసుకోకుండా నియంత్రించాలన్నారు. ఏపీకి హోదా అంశం పై సాంకేతిక కారణంతో పార్లమెంట్‌లో ఓటింగ్‌ను తప్పించుకున్నారన్నారు. హోదాపై 14వ ఆర్థిక సంఘం నిషేధం విధించడం వల్లే దానిని ఇవ్వలేకపోయామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎందుకు అబద్ధం చెప్పా రో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఏ నిషేధం విధించలేదని ఆర్థిక సంఘం అభిజిత్‌సేన్ స్పష్టం చేసిన విషయాన్ని సురవరం గుర్తు చేశారు.